Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు..! నేడు సస్పెన్స్‌కు తెర
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చారు.. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట.. ఇక, నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. అయితే, ఆ చర్చల వివరాలను నేడు ఏపీ బీజేపీ నేతలతో చర్చించనున్నారు పార్టీ పెద్దలు.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు. మొత్తంగా ఏపీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న పొత్తులకు నేడు తెరపడనుంది.. ఢిల్లీలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్.. ఈ భేటీల్లో ఏపీలో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చాయి టీడీపీ-జనసేన-బీజేపీ.. కాళహస్తి, జమ్ములమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, బీజేపీకి ఐదు లోకసభ స్థానాలు కేటాయించడంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారట.. తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్‌సభ స్థానాల నుంచి బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుండగా.. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్‌ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రోజు పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల వ్యవహారం తేలబోతోంది అంటున్నారు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండబోతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

పథకాలు కొనసాగాలంటే వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవల్సిందే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూడాల్సిందే.. ఇక్కడ మేం ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అన్నారు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి శాసనసభ వైసీపీ అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ ని గెలిపించుకోవల్సిన బాధ్యత మీదే అన్నారు.. గరివిడి మండలం దువ్వాం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. దేవాడ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హత కలిగిన అందరికీ అందుతున్నాయి.. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవల్సిందే.. అక్కడ సీఎంగా జగన్ ను చూడాల్సిందే.. ఇక్కడ మేం గెలవాల్సిందే అని వ్యాఖ్యానించారు.. జగన్‌ పోవాలంటూ రకరకాల శాపనార్థాలు పెడుతున్నారు.. జగన్ పాలన పోవాలని అంటున్నారు. కానీ, అది జరగడానికి వీలు లేదన్నారు. సీఎంగా జగన్‌ ఉండాల్సిందే.. జగన్‌ను సీఎంగా ఉండాలంటే.. మేం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.

నేటి నుంచి ఏడు పాయల జాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉన్న ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత జరిగే రెండో అతిపెద్ద వనజాతర కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. మంజీరా నదిలో పుణ్యాస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏడూ ఉప నదులు కలిసి గోదావరి నదికి ఉపనది అయినా మంజీరా నదిలో కలుస్తాయి. అందుకే దీనికి ఏడుపాయల అనే పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకోదగినది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంజీరా నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి శివరాత్రి సందర్భంగా 03 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. నేడు మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు తిరుగుట,10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.

నేడే కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్, శశిథరూర్ లతో కలిపి 40 మంది అభ్యర్థుల పేర్లు
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 195 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయనుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం (7 మార్చి 2024) అర్థరాత్రి వరకు జరిగింది. ఇందులో చాలా మంది పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ రోజు (8 మార్చి 2024) కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేయవచ్చు. బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ తొలిజాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా చేరనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేరు ఉంటుందని, ఆయన వాయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా వాయనాడ్ ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు తొలి జాబితాలో దాదాపు 40 మంది పేర్లను పార్టీ ఆమోదించింది. కాంగ్రెస్ తొలి జాబితాలో చేరే 40 మంది అభ్యర్థుల్లో తిరువనంతపురం నుంచి శశి థరూర్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఈ ఇద్దరు అనుభవజ్ఞుల పేర్లను కూడా మొదటి జాబితాలో చేర్చవచ్చు. కేరళలోని ఎంపీలందరికీ కాంగ్రెస్ మళ్లీ టిక్కెట్లు ఇవ్వవచ్చు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరు స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా సీఈసీ సమావేశంలో ఖరారు చేశారు.

నువ్వు, నేను అంటూ.. అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య చర్చ! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదాగా చర్చ జరిగింది. టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచేందుకు ఇద్దరు నిరాకరించారు. చివరికి కుల్దీప్‌ను అశ్విన్‌ ఒప్పించాడు. దాంతో కుల్దీప్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ అశ్విన్‌ వందో టెస్ట్‌ ఆడుతున్న​ విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేయడంలో కుల్దీప్‌ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ బ్యాటర్లను కోలుకోనీయలేదు. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసిన అనంతరం పెవిలియన్‌కు వెళ్తుండగా.. వందో టెస్ట్‌ ఆడుతున్న​ అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే కుల్దీప్‌ 5 వికెట్లు తీయడంతో అశ్విన్‌ సహచరుల మాటను ఒప్పుకోలేదు. కుల్దీపే లీడ్ చేయాల్సిందిగా కోరాడు. బంతిని కూడా అతడికి ఇచ్చాడు. ఆ బంతిని కుల్దీప్‌ యాదవ్ మరలా.. ఆర్ అశ్విన్‌కే విసిరాడు. ఇలా నువ్వు నేను అంటూ అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి కుల్దీప్‌ను అశ్విన్‌ ఒప్పించాడు. దాంతో కుల్దీప్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 100 టెస్ట్‌ ఆడుతూ, పైగా 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్‌ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి అంటూ ఫాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

బిస్కెట్స్ తో కేదార్‌నాథ్ ఆలయం.. అద్భుతమే..
నేడు మహాశివరాత్రి సందర్బంగా శివనామ స్మరణతో ప్రపంచం మొత్తం మారుమ్మోగిపోతుంది.. శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శివ భక్తిని చాటుకుంటున్నారు.. తాజాగా కొందరు బిస్కెట్స్ తో అద్భుతాన్ని సృష్టించారు.. శివయ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని తయారు చేశారు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు.. సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయ నమూనాను ఐదు వేల బిస్కెట్లతో తయారు చేశారు. అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అజయ్ గుప్తా మరియు అతని విద్యార్థులు కొందరు కలిసి బిస్కెట్స్ తో ఈ ఆలయాన్ని నిర్మించారు.. దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఈ ఆలయాన్ని చూసిన వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు.. అలాగే ఆ ఆలయంతో సెల్ఫీలు తీసుకున్నారు.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. మహాశివరాత్రి సందర్బంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు వారు చెబుతున్నారు..

ఓటీటీలోకి వచ్చిన మూడు హిట్ సినిమాలు.. అవేంటంటే?
మహాశివరాత్రి సందర్భంగా నేడు విభిన్న కథలతో తెరకెక్కిన గామి, భీమా సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో కూడా మూడు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఊరి పేరు భైరవకోన, మేరీ క్రిస్‌మస్, అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. హిట్ సినిమా ‘హనుమాన్’ కూడా స్ట్రీమింగ్‌కు వస్తోందని అన్నారు కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఓటీటీల్లోకి వచ్చిన మూడు సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన హారర్ సినిమా ‘ఊరి పేరు భైరవకోన’. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 16న రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్లు మాత్రం రాలేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరిలో రిలీజైన మలయాళ హిట్ సినిమా ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఇది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘మేరీ క్రిస్‌మస్’. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. హిందీ, తమిళంలో మాత్రమే విడుదల అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనూ హిందీ, తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

‘భీమా’ హిట్ టాక్ అందుకున్నట్లేనా? సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన కొత్త సినిమా భీమా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.. శివరాత్రి కానుకగా ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.. యాక్షన్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు. పరశురామ క్షేత్రానికి సంబంధించిన డివోషనల్ పాయింట్‌ను కూడా దర్శకుడు బాగా రాసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నీవేశాలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు సినిమాలో కంటెంట్ కూడా బావుందని చెబుతున్నారు. ‘భీమా’తో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సినిమాలోని యాక్షన్ హైలెట్ అని చెబుతున్నారు.. గోపీచంద్ అభిమానులకు ‘భీమా’ డబుల్ ట్రీట్ అందిస్తుందని ప్రీమియర్ షోస్, ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ‘భీమా’లో గోపీచంద్ డ్యూయల్ లుక్ ఆల్రెడీ ట్రైలర్లలో రివీల్ అయ్యింది.. గోపిచంద్ యాక్షన్ లో విజ్రూంభించాడని మరో ఫ్యాన్ ట్వీట్ చేశారు.. భీమా’ సినిమాలో పోలీస్ రోల్ వాటికి భిన్నంగా, చాలా కొత్తగా ఉంటుందని నెటిజనులతో పాటు సినిమా చూసిన ప్రముఖులు చెబుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఉగ్రరూపాన్ని చూడవచ్చు అని చెబుతున్నారు.. పబ్లిక్ మాటల్లో వింటుంటే సినిమా హిట్ టాక్ ను అందుకున్నట్లే అని తెలుస్తుంది.. గోపీచంద్ ఖాతాలో హిట్ పడినట్లే.. ఇక కలెక్షన్స్ ఏ మాత్రం ఉంటాయో చూడాలి..

Exit mobile version