NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు వైఎస్సార్‌ చేయూత నిధుల విడుదల.. అనకాపల్లిలో ట్రాఫిక్‌ ఆంక్షలు
ఇవాళ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్‌ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్‌ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే.. మొత్తం 31 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. అయితే, ఈ సారి అనకాపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో.. అనకాపల్లిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వాహనాలు మళ్లించినట్టు పోలీసులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలని సూచించారు. ఇక, తుని నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – ఎలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలని స్పష్టం చేశారు పోలీసు అధికారులు. ఇక, అనకాపల్లి పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్‌ జగన్.. ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి.. 10.45 గంటలకు కశింకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.15 గంటలకు పిసినికాడ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీ సీఎం.. 11.40 గంటల నుంచి సుమారు గంటసేపు ప్రసంగించిన అనంతరం.. అదే వేదిక నుంచి బటన్‌ నొక్కి వైఎస్సార్‌ చేయూత చివరి విడత నిధుల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 1.05 నుంచి 2.05 గంటల వరకు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమాశం కానున్నారు.. 2.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ హస్తిన బాట..! పొత్తులపై కొనసాగుతోన్న సస్పెన్స్‌..!
నేడు ఢిల్లీ బీజేపీ పెద్దల్ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులపై మంతనాలు జరుపనున్నారు. ఏపీలో పొత్లులపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతోంది. టీడీపీ-జనసేనతో పొత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేనలు తొలి జాబితాను ప్రకటించడమే కాకుండా ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్తున్నాయి. ఎన్డీఏలో ఉన్న జనసేన మరోవైపు టీడీపీ సైతం కచ్చితంగా బీజేపీతో పొత్తు ఉంటుందని పదేపదే చెబుతున్నాయి. కానీ ఢిల్లీలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.ఈ విషయంలో మరోసారి అగ్రనేతలతో పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోమువీర్రాజులు సమావేశం కాబోతున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఇవాళ ఢిల్లీ పెద్దలతో పొత్తులపై చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి..!
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి.. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. ముద్రగడతో సమావేశం కానున్నారు.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం.. మరోవైపు.. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ విషయాన్నే స్వయంగా ముద్రగడకు వివరించనున్నారట మిథున్‌రెడ్డి.. అయితే, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతోంది ముద్రగడ కుటుంబం.. ఇక, ఎన్నికల ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్‌ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఇక, ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నమాట.

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 140 కిలోమీటర్ల వేగంతో ప్లై ఓవర్ ప్రయాణిస్తూ సమయంలో ఎదురగా వచ్చిన మలుపు అంచాన వేయకపోవడంతో ప్లై ఓవర్ గోడను ఢీకొట్టి.. ఎదురుగా వెలుతున్న మరో కారును ఢీకోట్టి బోల్తా పడింది ఓ కారు.. ఈ ఘటనలో నలుగురు యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు సీటు బెల్ట్ తో పాటు ఎయిర్ బెలూన్‌ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రుయా హాస్పిటల్ కి తరలించారు. ఫ్లై ఓవర్ పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, గతంలోనూ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ పై ప్రమాదాలు జరిగాయి.. ఏడాది క్రితం కూడా ఫ్లైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఓ కారు ఫ్లైఓవర్ పైనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. ఎలివేటేడ్ కారిడార్‌కు నేడు భూమిపూజ
హైదరాబాద్‌ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్‌ రహదారిపై రూ.2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి అల్వాల్‌లోని టిమ్స్‌ సమీపంలో నేడు భూమిపూజ చేయనున్నారు. ఈ భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పుతో జరగనుంది. దీంతో సికింద్రాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్ వైపు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో భాగంగానే హైదరాబాద్‌, రామగుండం రహదారికి మహర్ధశ పట్టనుంది. ఇటీవల కేంద్రం రక్షణశాఖ భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా మొదలు రాజీవ్‌ రహదారిపై ప్యారడైజ్‌ నుంచి హకీంపేట్‌ వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున కారిడార్‌ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 5న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి డిఫెన్స్‌ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు.

కాళేశ్వరంలో నేటి‌ నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి‌ నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాల‌ను నిర్వహించనున్నారు. ఈ రోజు దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించనున్నారు. రేపు ధనిష్ట నక్షత్రయుక్త కర్కాటకలగ్నమందు సాయంత్రం 4.35 గంటలకు శ్రీ‌ ముక్తీశ్వర శుభానందల కళ్యాణ మహోత్సవం జరగనుంది. హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం లింగోధ్బవ పూజ నిర్వహించనున్నారు. ఎల్లుండి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూర్ణాహుతి, విశేష పూజలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు శ్రీ‌ ఆదిముక్తీశ్వర స్వామి కల్యాణం జరగనుంది. సుమారు లక్ష మంది‌ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 50 వేల లడ్డూలు, 20 వేల పులిహోర ప్యాకెట్లు తయారీ చేయించారు. 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

చిట్టీల పేరుతో చీటింగ్.. తూప్రాన్‌లో ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో ట్విస్ట్
మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ కుటుంబం కనిపించకుండా పోయింది. ఇందులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. తూప్రాన్‌కు చెందిన బిజిలిపురం యాదగిరి(37) తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం పెద్దగుట్టకు వెళ్తున్నామని చెప్పి వెళ్లాడు. అయితే, మంగళవారం సాయంత్రం వరకు తిరిగిరాలేదు. ఫోన్ ​చేస్తే స్విచ్ఛాఫ్​ వచ్చింది. కుటుంబ సభ్యులు పెద్దగుట్టకు వెళ్లి వెతికినా ఆచూకీ దొరకలేదు. యాదగిరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. తూప్రాన్‌లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్‌ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యాదగిరిపై ఫిర్యాదు చేసేందుకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు బాధితుల క్యూ కట్టారు. సుమారు 70 మంది బాధితులు యాదగిరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

బీజేపీ రెండో జాబితా ఫైనల్.. కోర్ కమిటీ సమావేశంలో 150 లోక్‌సభ స్థానాలపై మేధోమథనం
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం నడిచింది. బిజెపి రెండవ జాబితా 150 సీట్లపై చర్చ జరిగింది. మార్చి 8 లేదా 10న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాను ఆమోదించనున్నారు. మొత్తం 8 రాష్ట్రాల కోర్ గ్రూప్ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని 10 సీట్లపైనా చర్చ జరిగింది. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. మహారాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో సీట్లపై చర్చ జరిగింది. పీయూష్ గోయల్ ఉత్తర ముంబై స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒడిశా కోర్ గ్రూపు సమావేశంలో సంభాల్‌పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రాపై చర్చ జరిగింది.

ఉమెన్స్ డే స్పెషల్.. గిఫ్టింగ్ స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్!
‘మార్చి 8’ ప్రతి మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు, సహోద్యోగినులకు చాలామంది బహుమతులు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్‌ను ఆరంభించింది. అమెజాన్ గిఫ్టింగ్ స్టోర్‌లో ధరలు రూ. 199 నుంచి ప్రారంభమవుతున్నాయి. మహిళలకు అవసరం అయ్యే ఎన్నో రకాల వస్తువులను స్టోర్‌లో అమెజాన్ అందుబాటులో ఉంచింది. కిరాణా, హ్యాంపర్‌లు, గౌర్మెట్ బహుమతులు, వ్యక్తిగత సంరక్షణ, ఎలక్ట్రానిక్స్, గృహ మరియు వంటగది ఉపకరణాలు, ఫర్నిషింగ్ మరియు డెకర్ వంటి విభాగాలలో ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. చిరు వ్యాపారులకు, పెద్ద ఎత్తున బహుమతులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ స్టోర్‌ బాగా ఉపయోగపడనుంది. టెలివిజన్, స్పీకర్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 75% వరకు అమెజాన్ తగ్గింపు అందిస్తోంది. రూ. 4,848కే ఫుట్ మసాజర్ మెషిన్ అందుబాటులో ఉంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటిపై 65% వరకు తగ్గింపు లభిస్తోంది. రూ. 2996కే కేరీన్‌హాన్స్ టెక్నాలజీతో ఫిలిప్స్ హెయిర్ స్ట్రెయిట్‌నర్ బ్రష్‌ను, హీట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో హావెల్స్ ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్‌ను రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. హెయిర్ కర్లర్‌లు రూ. 902 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1199కే కొనుగోలు చేయొచ్చు. ఇలా మరెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్ ఐదో టెస్టు.. అశ్విన్‌, బెయిర్‌స్టోకు ప్రత్యేకం!
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఆరంభం కానుంది. స్వదేశంలో వరుసగా 17వ టెస్టు సిరీస్‌ గెలిచి జోరుమీదున్న భారత్.. గెలుపుతో ఈ సిరీస్‌ను 4-1తో ముగించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను 2-3తో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. భారత గడ్డపై ఇంగ్లండ్‌ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లను భారత్ 4-0, 3-1తో గెలుచుకుంది. ఈసారి మొదటి టెస్టులో ఓడినా.. పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ మరోసారి చేరేగాలని చూస్తున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ పరుగులు చేస్తున్నారు. రజత్‌ పటీదార్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 63 పరుగులే చేసిన అతడికి ఇదే చివరి అవకాశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవ్‌దత్‌కు టెస్టు అరంగేట్ర అవకాశాలు తక్కువే. సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జూరెల్‌ ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టాలని చూస్తున్నారు. భారత్‌ ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశాలు ఉన్నాయి. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి వస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ పేస్ కోటాలో ఆడనున్నారు. మూడో పేసర్‌ను తీసుకుంటే.. కుల్దీప్‌పై వేటు పడుతుంది. స్పిన్నర్లుగా ఆర్ అశ్విన్‌, ఆర్ జడేజా ఉంటారు. తన వందో టెస్టులో అశ్విన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌కు మంచి విజయం అందించాలని రోహిత్ సేన చూస్తోంది.

సినిమాలకు గుడ్ బై చెప్పిన ఇలియానా?
గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ ను అందుకున్నాయి.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. దేవదాస్ నుంచి మొదలైన ఈమె సినిమాల జోరు .. పోకిరి నుంచి పీక్స్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది.. తెలుగులో తొలి కోటి రూపాయల పారితోషికం అందుకున్న బ్యూటీ కూడా ఇలియానే. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలియానా… ఆ తర్వాత ప్రేమలో పడి కేరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది.. అయితే ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లై హాయిగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు .. ఇక సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.. ఇకపోతే మార్చిలో విడుదల కానున్న డూ ఔర్ డూ ప్యార్, తేరే క్యా హోగా లవ్లీ లు ఎప్పుడో సైన్ చేసినవే. తాజాగా లకు గుడ్ బై చెప్పేసి.. డల్లాస్‌లో సెటిల్ అయిపోయారని ఓ వార్త షికారు చేస్తుంది.. ఇక సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తెగేసి చెప్పేసింది.. మొత్తానికి ఇలియానా సినిమాలకు శుభం కార్డు పడి పోయింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..