NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే.. మూడో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది.. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్‌.. ఈ రోజు ఉదయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక, ఈ రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది.. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకోనున్నారు.. ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరు వరకు బస్సు యాత్ర సాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సభ ముగించుకుని.. అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్‌ ఫంక్షన్ హాల్‌కి చేరుకోనున్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. మరోవైపు.. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ.. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు..

పిఠాపురంలో ప్రచారానికి సిద్ధమైన జనసేనాని.. అభ్యర్థిగా తొలిసారి పర్యటన
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తాను ఎన్నికల బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పిఠాపురంలో పర్యటించబోతున్నారు.. తొలి రోజు శ్రీ పురుహూతిక దేవి అమ్మవారి ఆలచాన్ని దర్శించుకోనున్నారు పవన్‌.. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా తొలిరోజు బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లోనూ పాల్గొనబోతున్నారు.. తొలిరోజు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు ఆ పార్టీ శ్రేణులు.. ఇక, ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్.. కూటమి నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.. జనసేనలో చేరికలు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది.. నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ మూడు రోజులు పవన్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనలో కూటమి నేతల ఇళ్లకు వెళ్లనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్‌కల్యాణ్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజికవర్గం నేత కావడంతో తమకు కలిసివస్తుందనే భావనలో వైసీపీ ఉంది.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరగా.. ఆయనకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్‌ జగన్‌.. దీంతో ముద్రగడ వరుసగా పిఠాపురంలో కాపునేతలతో సమావేశాలు అవుతూ వస్తున్నారు.. మొత్తంగా పిఠాపురంలో పోరు ఆసక్తికరంగా సాగుతోంది.

ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్‌ దక్కకపోవడంతో..!
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అనపర్తి టికెట్ వ్యవహారం అసంతృప్తి జ్వాలలకు కారణం అవుతోంది.. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ స్థానం వెళ్లిపోవడంతో.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను కూడా దగ్ధం చేశారు.. అయితే, నేటి నుండి అనపర్తి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల ముందుకు వెళ్లనున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. అనపర్తి టిక్కెట్ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెబుతున్నారు. అనపర్తి, రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. రోజుకు ఒక్కొక్క మండలంలో పర్యటించేలా ప్లాన్‌ చేసుకున్నారు.. ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తే.. టిక్కెట్ విషయంలో టీడీపీ అధిష్టానం అన్యాయం చేసిందని ఆవేదనతో ఉన్నారు నల్లమిల్లి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి బీజేపీ తనకు టిక్కెట్ రాకుండా కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు.. ఇక, నాలుగు రోజుల పర్యటన అనంతరం కార్యకర్తలతో సమావేశం కానున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ప్రజల అధిష్టానం మేరకు నిర్ణయం ఉంటుందని అంటున్నారు.. అయితే, టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలంటూ ఆయన అనుచరుల నుంచి రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెరుగుతోందట.. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేశారట.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారట.. కానీ, తాను నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించానని చెబుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనపర్తి మండలం మహేంద్రవాడ నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటన ప్రారంభం కానుంది.. ఈ పరిణామాలు అనపర్తిలో ఎలాంటి వాతావరణన్ని సృష్టిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.

వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విపరీతమైన వర్షాలు, అధిక వేడిమితో కూడిన ఎల్ నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అంటే వచ్చే రెండు నెలలు ఎండలు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. అధిక ఉష్ణోగ్రతలతో తేమశాతం పెరగడంతో జనం వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులు మరింత ఇబ్బందిగా మారాయని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి వెళ్లకూడదని, ఆరు బయట భారీ శారీరక శ్రమ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువ నీరు తాగాలని, శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వివరించారు. జిమ్‌లు మరియు అవుట్‌డోర్‌లలో వ్యాయామం చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ మరియు ఇతర పరిస్థితులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదు.. ఇక నెట్‌ స్కోర్‌ తోనే పిహెచ్‌డి ప్రవేశాలన్న యూజీసీ..!
భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అలాగే ఉన్నత విద్యా సంస్థలలో పిహెచ్‌డి కోసం ప్రవేశాలకు గాను యుజిసి నెట్ స్కోర్ సరిపోతుందని తాజాగా యుజిసి స్పష్టం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పిహెచ్‌డి ప్రవేశాలను వేరువేరుగా నిర్వహించే ప్రవేశాల పరీక్షల అవసరం లేకుండా రాబోయే విద్య సంవత్సరం నుండి పిహెచ్‌డి ప్రవేశాలకు కేవలం నెట్ స్కోర్ లను ఉపయోగించనున్నట్లు కమిషన్ తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది. మొదటిసారి జూన్ నెలలో నిర్వహిస్తుండగా.. మరోసారి డిసెంబర్ నెలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలలో సాధించే స్కోరును అనుసరించి ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF ఇవ్వడానికి అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడానికి ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా యూజీసీ పరీక్షల నిబంధనలను మరోసారి సమీక్షించడానికి కమిషన్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వీరి సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి పిహెచ్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాంలో ప్రవేశానికి గాను ఆయా సబ్జెక్టులలో నెట్ లో సాధించిన స్కోరును ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈడీ, సీబీఐతో మా పార్టీకి సంబంధం లేదు..
ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED),సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేష్‌న్‌(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతిపరుడని దేశంలో ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు అని ఆయన తెలిపారు. ఇక, 2013లో ఢిల్లీ సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనన్నారు.. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదన్నారు. ప్రతి రోజు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తారు.. వాళ్లు మోడీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇక, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.. ఎందుకు హాజరు కాలేదు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మళ్లీ విలువల గురించి వాళ్లు మాట్లాడతారు.. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరు కాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి పోయింది.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేదు.. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్క సీటు గెలుచుకోదు.. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్‌ విలువల గురించి మాట్లాడటం దారుణం అన్నారు. ఇక, ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..
యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన నాలుగు మానవ రహిత డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం గురువారం నాడు వెల్లడించింది. కాగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా (X)లో డ్రోన్లు ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, U.S. నౌకాదళ నౌకలకు దగ్గరగా వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆ డ్రోన్‌లను యుఎస్ సైన్యం ధ్వంసం చేసిందని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అని యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి ఒక ప్రకటన వెల్లడైంది. యూఎస్ నౌకలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఇక, నవంబర్ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు హౌతీ తిరుగుబాటు దారులు దాడులు చేశారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన గాజాలో గాజాలో బెంజమన్ నెతన్యూహు సృష్టి్స్తున్న ఆరాచకానికి ప్రతీకారంగా హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ఈ దాడులకు దిగింది. అయితే, క్షిపణులు, డ్రోన్‌లను క్షిపణులు మరియు డ్రోన్‌లను కాల్చడానికి హౌతీ మిలిటెంట్లు ఉపయోగించిన యెమెన్‌లోని సైట్‌లపై అమెరికా సైనికులు దాడులు చేసింది.

లోయలో పడ్డ బస్సు.. 45మంది దుర్మరణం
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది. వంతన పై నుంచి అదుపు తప్పి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం బస్సులో 46 మంది ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడిన తర్వాత మంటలు చెలరేగాయి. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. 46 మందితో కూడి బస్సు బోట్స్‌ వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఈ క్రమంలోనే కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. బస్సు డ్రైవర్‌ కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు వంతెనపై నుంచి 165 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా 45 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే.. బస్సు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బస్సు లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు.

మహిళల ఆసియా కప్.. జూలై 21న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్
ఈ ఏడాది మహిళల ఆసియా కప్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతుంది. జూలై 18 నుంచి 28వ తేదీ వరకు దంబుల్లాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. అయితే, 2022లో చివరిసారి బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ఏడో సారి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఇక, క్రితం సారి ఏడు టీమ్స్ పాల్గొనగా.. ఈసారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయని జైషా వెల్లడించారు. ఇక, గ్రూప్‌ ‘A’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌.. ఇక, గ్రూప్‌ ‘B’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్‌ జట్లు ఉండనున్నాయి. భారత్‌ తమ మూడు లీగ్‌ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్‌ (జూలై 21న), నేపాల్‌ (జూలై 23న) జట్లతో ఆడనుంది. జూలై 26వ తేదీన సెమీ ఫైనల్స్‌.. జూలై 28న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

తన విగ్రహంతో అల్లు అర్జున్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. గత ఏడాది మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి కొలతలు తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని దుబాయ్ లోని మ్యూజియం లో ఏర్పాటు చేసారు. నిన్న ఈ విగ్రహాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు అల్లు అర్జున్.. ఆ విగ్రహం అచ్చం అల్లు అర్జున్ మాదిరిగా పుష్ప మ్యానరిజంతో ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పటికే ఆ మ్యూజియంలో పలువురు హీరోల విగ్రహాలు ఉన్నాయి.. ఇక అల్లు అర్జున్ తన మైనపు విగ్రహంతో సెల్ఫీలు దిగాడు.. ఆ విగ్రహం వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. తగ్గేదేలే అంటూ ట్యాగ్ చేశాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా వచ్చి పదేళ్లను పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకను నిర్వహించారు.. ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. ఆయన ప్రతిరూపంగా నిలిపిన నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం.. ని ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే సినిమాలో పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..

టిల్లు అన్న మ్యాజిక్ రిపీటా? సినిమా హిట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.. డిజే టిల్లు సినిమాతో గతంలో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చింది.. ఒకవైపు విమర్శలు వస్తున్న సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అందడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఆ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందు బెంగళూరులో ఒక షో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అమెరికాలో కూడా ముందుగానే షోలు పడ్డాయి.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై పాజిటివ్ మరియు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. మరి సినిమా హిట్టు కొట్టిందా? లేదా బోల్తా కొట్టిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జనాల స్పందన ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.. ఈ సినిమా ఒక విన్నర్, పాజిటివ్ టాక్ ను అందుకుంది.. విపరీతంగా నవ్వించే సన్నివేశాలు ఉన్నాయి. టిల్లు మేజిక్ సినిమా అంతా రిపీట్ అయ్యింది.. టిల్లన్న మంచి ఫన్ ను క్రియేట్ చేశారు.. సినిమా సూపర్ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు.. అలాగే డీజే టిల్లు’ హిట్ కావడం, సీక్వెల్ సాంగ్స్ & ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడంతో సూపర్బ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు రీ రికార్డింగ్ చేసిన భీమ్స్ ఆ అంచనాలను మరింత పెంచారు.. మ్యాడ్ సినిమాకు తాత లాగా ఉందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.. ఇక ట్రైలర్ కట్ చేయడం వల్ల ఎలాంటి అంచనాలు లేకుండా పోయింది.. నచ్చింది కానీ.. చాలా సీక్వెన్స్‌లు పేలాయి.. సరైన కామెడీ.. ఫస్ట్ పార్ట్ కంటే బెటర్..స్క్రీన్ ప్లే బాగుందని మరో యూజర్ రాసుకొచ్చాడు..

Show comments