NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన..!
ఎన్నికల షెడ్యూల్‌ కూడా వచ్చేసిన నేపథ్యంలో.. ఇప్పటికే పార్లమెంట్‌ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ బీజేపీ.. ఇక, ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థులపై ఫోకస్‌ పెట్టింది.. అందులో భాగంగా నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు.. సమావేశంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శలు, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఇక, ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేయనుంది.. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది.. విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ నేతలు కోరే అవకాశం ఉందట.. రాజంపేట లోక్‌సభ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి సుమారు లక్ష ఓట్లు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) ఇవ్వాలని డిమాండ్ ఉంది.. టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు, బీజేపీ అయితే చెంగల్ రాజు కు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాజమండ్రి-రూరల్‌ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి-అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీచేయాలని ప్రతిపాదన ఉందట.. తద్వారా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు జరిగే కీలక సమావేశంలో పోటీ చేసే స్థానాలతో పాటు.. అభ్యర్థులపై క్లారిటీకి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

పుంగనూరులో వైసీపీకి షాక్‌..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్‌ పెరుగుతోన్న తరుణంలో.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ నేత వెంకటరమణ రాజు.. ఈయన గతంలో పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. ఆ తర్వాత వైసీపీలో చేరాఉ.. అయితే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్ధి చల్లా బాబు గెలుపుకోసం పనిచేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు వెంకటరమణ రాజు.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి కోసం కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు. కాగా, చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. తన నియోజకవర్గం కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవకపోతే రాష్ట్రం అదోగతిపాలవుతుందని హెచ్చరించారు. ఇక, కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. నేడు డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు చంద్రబాబు.. రాజుపేట హాంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలించనున్నారు.. అనంతరం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు.

నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు
రాష్ట్రంలో భానుడు భగభగ ఇంకా మూడ్రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజూ వారి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రగ ఎక్కవగా ఉంటుందని వెల్లడించింది. ఎండలు పెరుగుతున్న కారణంగా తెలుగు రాష్ర్టాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాదలో దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో ఉక్కపోత పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఈనెల 28 నుంచి మూడ్రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎండలు తీవ్రత మరింత పెంగుతుందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తల తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని తెలిపారు. ఒక వేళ మధ్యాహ్న సమయంలో బయటకు రావల్సి వస్తే.. మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటివి తాగలని సూచించారు. శరీరానికి డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఎండలు విపరీతంగా పెరిగాయి. మార్చిలో అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. మార్చినెలలో ఎండ వేడి, ఉక్కపోత ఎక్కవగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 5రోజులు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు ప్రధాని నివాసంపై నేడు ఆందోళన చేపట్టనుంది. అలాగే, కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో శాంతిభద్రతల దృష్ట్యా నేడు ( మంగళవారం ) ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ మళ్లీంపు చేపట్టారు. తుగ్లక్ రోడ్, సఫ్దర్‌జంగ్ రోడ్, కమల్ అతాతుర్క్ మార్గ్‌లలో ఎక్కడా ఏ వాహనం ఆపడానికి లేదా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. అలాగే, కమల్ అటా టర్క్ మార్గ్, సఫ్దర్‌జంగ్ రోడ్, అక్బర్ రోడ్, తీన్ మూర్తి మార్గ్ రూట్ లో ప్రయాణికులు వెళ్లొద్దని వారు సూచించారు.

దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!
ఐపీఎల్‌ 2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్‌సీబీకి అద్బుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఫినిషర్‌గా డీకే మరోసారి నిరూపించుకున్నాడు. అయితే చివరి ఓవర్లో డీకే కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 17 ఓవర్‌లో అనూజ్ రావ‌త్ అవుట్ అయిన అనంతరం దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే తన బ్యాట్‌కు పని చెప్పాడు. సామ్‌ కర్రన్‌ వేసిన 17 ఓవర్‌ను ఫోర్‌ బాది బాదాడు. చివరి రెండు ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. డీకే చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్‌ బాదాడు. 20 ఓవర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌ వేయగా. తొలి బంతినే డీకే స్కూప్ షాట్ ఆడాడు. బంతి వెళ్లి స్టాండ్స్ లో పడింది. దాంతో విజయానికి చేరువైన ఆనందంలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కుర్చీ లోంచి లేచి గంతులేశాడు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 20 ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన దినేష్ కార్తీక్.. మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు ఎదుర్కొన్న డీకే.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్‌ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6), మహిపాల్ లొమ్రార్‌ (17 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.

స్కూల్లోనే ఆ పనిచేసి తల్లికి దొరికిపోయిన సుప్రీత.. ఓపెన్ కామెంట్స్..
తెలుగు నటి సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ తో ఓ సినిమా చెయ్యబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.. ఈ సినిమాను విడుదలకు ముందే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ సందర్బంగా అమర్ దీప్, సుప్రీతలు దావత్ అనే అడల్ట్ షోకి గెస్ట్‌లుగా వచ్చారు.. ఆ షోకు యాంకర్ రీతూ చౌదరి వ్యవహారిస్తున్నారు.. ఈ షో ఎన్నో తెలియని విషయాలు బయటకు వచ్చాయి..మీ లైఫ్‌లో కిక్ చేసే పనులు కొన్ని ఉంటాయి. క్రాక్‌తో చేసే పనులు కొన్ని ఉంటాయి. బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి..అలాంటి పనులు మీ ఇద్దరు ఏం చేశారో చెప్పాలని రీతూ కోరింది.. ఆ ప్రశ్నకు ముందుగా సుప్రీత సమాధానం చెప్పింది.. తాను 16 ఏటలోనే లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని అది నాకు బాగా కిక్ ఇచ్చిందని చెప్పింది.. అలాగే టెన్త్ క్లాసులో తన తాగుడు యవ్వారాన్ని బయటపెట్టింది. ‘నేను కూడా అలాంటివి చేశాను కానీ చెప్పలేను. నా టెన్త్ క్లాస్‌లో నా తీట పని ఏంటంటే.. నాకు ఓ గ్యాంగ్ ఉండేది.. వారందరికీ నేను నేను మందు తాగించాను.. అది అమ్మకు తెలిసి నన్ను పిచ్చకొట్టుడు కొట్టిందని చెప్పింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయిని తన్నేదాన్ని అంటూ ఈ షోలో ఎన్ని సీక్రెట్స్ ను రీవిల్ చేసింది సుప్రీత.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..

మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, దానికి ఒక్క రోజు తర్వాత మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‍ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ భాషల వెర్షన్‍లలో మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ అందుబాటులోకి రానుంది. హనుమాన్ సినిమా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనున్నాయి. ఆ మూడు భాషల్లో ఏప్రిల్ 5వ తేదీన హాట్‍స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‍స్టార్  మార్చి 25 న  అధికారికంగా ప్రకటించింది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని హాట్‍స్టార్ నేడు వెల్లడించింది. అలాగే, మలయాళం, కన్నడ, వెర్షన్‍లలోనూ రానుందని కన్ఫర్మ్ చేసింది.ఒక సినిమా మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవడం అంటే అది చాలా అరుదు. అయితే, హనుమాన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ‘జియోసినిమా’ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇక తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఏప్రిల్ 5న డిస్నీ+ హాట్‍స్టార్‌లోకి రానుంది. ఇలా.. ఏకంగా మూడు ప్లాట్‍ఫామ్‍ల్లో హనుమాన్ స్ట్రీమింగ్‍ అవుతుంది.