NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి ప్రజాగళం.. సొంత జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం..
ఓవైపు వేసవిలో ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి.. మరోవైపు ఎన్నికలు హీట్‌ కూడా హీర్‌ పెంచుతున్నాయి.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశాయి. ఇక ప్రచారం ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజాగళం పేరుతో రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌ షోలు నిర్వహించనుంది తెలుగుదేశం పార్టీ.. అందులో భాగంగా ముందుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు.. తనకు లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని కేడర్‌కు దిశ నిర్దేశం చేయానున్నారు బాబు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ ప్రాంతంలో బాబు ప్రచారం ఉంటుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో ప్రచారం చేస్తారు. 29న శైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం కొనసాగుతుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తీలో ప్రచారం చేస్తారు. 31వ కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.

అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం..!
కృష్ణా జిల్లా అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు శ్రీనివాస్‌.. యువకునిపై కత్తులతో దాడి చేసి సంఘటన స్థలం నుంచి దుండగులు పారిపోగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన అవనిగడ్డ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అసలు యువకుడిపై దాడి చేసింది ఎవరు? కారణం ఏమై ఉంటుంది? అనే కోణంలో విచారణ చేపట్టారు అవనిగడ్డ పోలీసులు.

ఆ నియోజకవర్గం టీడీపీలో కుంపటి.. ఇండిపెండెంట్‌గా బరిలోకి..!
విజయనగర జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజుకుంది. ఈ టికెట్‌ కోసం కోళ్ల లలిత కుమారి, గొంప కృష్ణ పోటీపడ్డారు. దీంతో మొదటి రెండు జాబితాల్లో ఈ నియోజకవర్గం పక్కన పెట్టింది అధినాయకత్వం. ఎట్టకేలకు కోళ్ల లలితకుమారికి టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో, టికెట్‌ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ వర్గం ఆగ్రహానికి లోనైంది. అయితే, శోభా హైమావతి పార్టీని వీడాక.. ఎస్‌-కోటలో టీడీపీని ని నిద్రాణ దశకు చేరింది. ఇలాంటి సమయంలో క్యాడర్‌ని ఉత్తేజపర్చారు గొంప కృష్ణ. పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి.. ముఖ్యంగా యువతను ఆకట్టుకోడానికి చర్యలు చేపట్టారు. యువజన సంఘాలకు క్రికెట్లను అందజేశారాయన. అయితే, కృష్ణను అడ్డుకోడానికి కోళ్ల ఫ్యామిలీ ప్రయత్నించినా.. చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహించారని టాక్‌. ఇది కాస్త నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడేలా చేసింది. పోటీపోటీ కార్యక్రమాలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ల లలితను నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్రకటించి… గొంప కృష్ణను రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. కానీ, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదరలేదు. చివరికి కోళ్ల లలితకు టికెట్‌ ఇవ్వడంతో గొంప కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు.

నగరంలో ఘనంగా హోలీ సంబరాలు..
రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. నగరంలో ఎక్కడ చూసినా అదే రంగులు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీ జరుపుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో మాత్రం తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి. యువతరం ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లుల్లో ఆటలతో ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా మంది ఒకరికొకరు రంగులు వేసుకుని సెల్ఫీలు దిగుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఫోటోలు తీయడం యువతకు అలవాటుగా మారింది. మరోవైపు కామ దహన వేడుకలను నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ ముందురోజు కముదిని కాల్చడం ఆనవాయితీ. ఇందులో భాగంగా జిల్లాలోని ఎన్నెస్టి రోడ్డులో సామూహిక దహనం చేశారు.

జైల్లో కంప్యూటర్, పేపర్ లేదు.. మరి కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ?
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, ఆయన జైలుకు వెళ్లినా.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని పార్టీ చెబుతోంది. ఈ క్రమంలో ఆయన కస్టడీ నుంచి ఢిల్లీకి తొలి ఉత్తర్వు జారీ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నిరంతరాయంగా నీటి సరఫరా చేయాలని ఢిల్లీ జలమండలి మంత్రి అతిషిని ఆదేశించారు. ఈ విషయాన్ని అతిషీ స్వయంగా ఆదివారం తెలిపారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ విషయంపై కన్నేసింది. ED అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా ఏ పేపర్‌ను అందించలేదు. ఈ పరిస్థితిలో కేజ్రీవాల్ సంతకం చేసిన ఆర్డర్ కాగితాలు ED కస్టడీ నుండి ఎలా బయటపడ్డాయి? ఈ మొత్తం వ్యవహారాన్ని ఇడి సీరియస్‌గా తీసుకుందని, కేజ్రీవాల్‌కు పేపర్లు, కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలని కోరినట్లు ఎన్‌డిటివి వర్గాలు పేర్కొన్నాయి. మీడియాలో వచ్చిన ఆర్డర్ కాపీని కంప్యూటర్‌లో టైప్ చేసి పేపర్‌పై ముద్రించారు. ఈడీ అందించని కంప్యూటర్, పేపర్ కేజ్రీవాల్‌కు ఎలా చేరాయనే ప్రశ్న తలెత్తుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు కంప్యూటర్, పేపర్ ఎలా చేరిందో ED కనుగొందని వర్గాలు పేర్కొన్నాయి. ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారనే దానిపై ఇప్పటికే చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త వివాదం దానికి మరింత ఆజ్యం పోస్తుంది.

సునీతా కేజ్రీవాల్ ద్వారా ఆర్డర్ వచ్చిందా?
అంతకుముందు ఆదివారం, మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ ఆర్డర్ గురించి మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉత్తర్వు శనివారం అందిందని తెలిపారు. ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలపై అతనికి ఎలాంటి ఆందోళన ఉంది. ఢిల్లీ ప్రజల నీటి, మురుగునీటి సమస్యల గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే దీన్ని చేయగలరని అతిషి అన్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికే స్క్రిప్ట్ చేసినట్లు బీజేపీ వివరించింది. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ శనివారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. తిరిగి వస్తుండగా చేతిలో కాగితం కనిపించింది. ఈ నోట్ ఈ మాధ్యమం ద్వారా అతిషికి చేరింది.

రీల్ కోసం వీడియోకు ఫోజులిచ్చిన మహిళ.. చైన్ లాక్కెళ్లిన దొంగ
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ తో రీల్స్ చేస్తుంటారు. అలా చేస్తుండగా అనేక సందర్భల్లో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ, ఈ రీల్స్ చేసే పిచ్చి ముదిరిపోవడంతో అలాంటి ఏమీ పట్టనట్లు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన వీడియోలు చేస్తూ.. ఆ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేసి లైక్స్, కామెంట్స్, షేర్ అంటారు. కానీ, తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో రీల్ కోసం ఓ మహిళ వీడియోకు ఫోజులిస్తున్న సమయంలో ఓ దొంగ బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఘజియాబాద్ నగరంలోని ఇంద్రపురానికి చెందిన సుష్మ ఇన్ స్టాగ్రామ్ రీల్ షూటింగ్ కోసం నవ్వుతూ రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వస్తుంది. కరెక్ట్ అదే సమయంలో బైక్ పై హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి సుష్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. చైన్ ను లాక్కెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఇంద్రపురం ఏసీపీ స్వతంత్ర కుమార్ పేర్కొన్నారు.

చైనా ఆయిల్‌ నౌకపై హౌతీ రెబల్స్ దాడి..
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్‌ 23) యెమెన్‌ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ఎంవీ హంగ్‌ పూ పై బాలిస్టిక్‌ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం (మార్చ్‌ 24) నాడు ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ వాటిని కేవలం 30 నిమిషాల్లో ఆర్పి వేశారు అని పేర్కొన్నారు. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించింది. ఇక, చైనా- భారత్‌ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీ రెబల్స్ తాజా దాడితో మాట తప్పారు అని డ్రాగన్ కంట్రీ మండిపడింది. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంత కాలంగా దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్‌ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు పెరిగిపోతుంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తునే ఉంది.

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
బంగారం కొనాలని అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా దిగొచ్చాయి.. ఈరోజు తులం బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది.. అలాగే కిలో వెండి ధర పై రూ. 100 రూపాయలు తగ్గింది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర రూ. 80,400 ఉంది.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడిచింది.. చెన్నై లో 80,400, ముంబైలో 77,400, ఢిల్లీలో 77,400, బెంగుళూరు లో 75,900,అదే విధంగా హైదరాబాద్ లో 80,400 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఇవాళ (సోమవారం) బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా.. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్‌ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌.. దీంతో దానికి అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇక, పంజాబ్ కింగ్స్ టీమ్ తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో మంచి ఊపుమీద కనిపిస్తుంది. ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావన్ చూస్తున్నారు. అయితే, పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయకుండానే మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ జట్టులో స్వల్ప మార్పులను చేయాలని అనుకుంటే మాత్రం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కి బదులు శశాంక్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.. అలాగే మరోక ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

హోలీ స్పెషల్ తెలుగు సాంగ్స్ విన్నారా?
హోలీ పండగ అంటే చిన్నా, పెద్ద అందరికి సరదానే.. దేశ వ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.. జనాలంతా రంగులతో మునిగితేలుతున్నారు.. ఈ పండుగకు గొప్ప చరిత్ర ఉంది..సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.. అందరిలో ఫుల్ జోష్ ను నింపే ఈ పండుగ రోజున మరింత జోష్ నింపే తెలుగు హోలీ పాటలను ఒక్కసారి వినేద్దామా.. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హాసన్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే హోలీ పాట ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.. ఇప్పటికి ఆ పాట స్పెషల్ గానే వినిపిస్తుంది.. జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి నటించిన ఎమోషనల్ మూవీ రాఖీ.. ఈ సినిమా రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్​సే’ అంటూ హోలీ సాంగ్‌తో తారక్‌ దుమ్మురేపాడు.. ఆ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఇప్పటికి హోలీ స్పెషల్ సాంగ్ గా వినిపిస్తుంది… నాగార్జున హీరోగా వచ్చిన మాస్‌ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్‌ హోలీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. ఇప్పటికి హైలెట్ గా ఈ పాట వినిపిస్తుంది… నమిత, వెంకటేష్ జంటగా నటించిన జెమిని సినిమాలోని దిల్‌ దివానా.. మై హసీనా..’ పాట లో కూడా హోలీ పండగ గురించే ఉంది.. ఆ పాట ఇప్పటికి ఎవరిగ్రీన్ హోలీ పాటే.. చిరంజీవి, ప్రభాస్ సినిమాల్లో కూడా హోలీ పాటలు ఉన్నాయి..  ఎన్నో తెలుగు పాటలు హోలీ ప్రత్యేకతను తెలుపుతున్నాయి.. ఇక హోలీ సందర్బంగా ఈ పాటను ఒక్కసారి వినేయ్యండి..

‘ఓం భీం బుష్ ‘లో సంపంగి పాత్రలో నటించింది ఎవరో తెలుసా?
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఓ పాత్ర బాగా నచ్చేసింది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించింది ఎవరో ఇప్పటివరకూ టీమ్ ఎక్కడా చెప్పలేదు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ దెయ్యం ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సినిమాలో హీరోల పాత్రలకంటే దెయ్యం పాత్రం హైలెట్ గా నిలిచింది.. కాసేపు పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తే, కాసేపు తన వికృత చేష్టలతో కడుపుబ్బా నవ్వించింది.. అలానే చివరిలో ఎమోషనతో ఏడిపించింది కూడా. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో మెప్పించింది డ్యాన్సర్ మనీష్ కుమార్ అని తెలిసింది.. ఆయన ఒక క్లాసికల్ డ్యాన్సర్.. దెయ్యం పాత్రలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్ అందరిని బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమా అతని యాక్టింగ్ బాగుంది దాంతో ఆ దెయ్యం ఎవరని జనాలు తెగ గుగూల్ చేస్తున్నారు.. ఈ సినిమా హిట్ టాక్ దూసుకుపోతుంది.. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఇక కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ కనిపించేది కాసేపే అయినా గ్లామర్ షో కురిపించారు.. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది.. అలాగే సన్నీ ఎమ్ ఆర్ చక్కటి సంగీతాన్ని అందించారు..

Show comments