ఎన్నికలకు టీడీపీ సిద్ధం.. అభ్యర్థులతో నేడు చంద్రబాబు వర్క్‌షాప్
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. ఈ సారి జనసేన-బీజేపీతో కలిసి బరిలోకి దిగుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే మూడు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించింది.. మరికొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతోంది టీడీపీ. అందులో భాగంగా ఈ రోజు తమ పార్టీ అభ్యర్థులతో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. మిగతా స్థానాలపై ఆ పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. తమ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.. అందులో భాగంగా.. ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు.. ఎంపీ అభ్యర్థులతో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.. ప్రచారంలో దూకుడు పెంచిన విషయం విదితమే.. వైనాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
ఇంకా కొలిక్కిరాని టీడీపీ టికెట్ల పంచాయితీ.. ఆ మూడు పెండింగ్‌లోనే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ సీట్ల పంచాయతీ ఇంకా తేలడం లేదు. ఫస్ట్ లిస్ట్‌లో 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా మూడో జాబితా కూడా వచ్చింది. కానీ అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అనంతపురంలో జనసేన పోటీ చేస్తుందని అంతా భావించారు. అయితే.. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీకి టికెట్ లేదని కన్‌ఫామ్ అయింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. అయినా కూడా అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు.
హైదరాబాద్‌లో ఎర్త్ అవర్.. నేడు గంటపాటు కరెంట్ బంద్..
ఎర్త్ అవర్ అనేది వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే, ఈ సంవత్సరం కూడా మార్చి 23 రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఎర్త్ అవర్ 2024 సందర్భంగా ఆ సమయంలో, ప్రజలు, సంస్థలు ఒక గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయమని కోరింది. భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా ఒక గంట పాటు. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఒక గంట పాటు లైట్లు ఆర్పాలని ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. కాగా.. 2007లో, సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ.. గ్లోబల్ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోనూ ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. అయితే.. ఈ ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ భవనాలన్నీ చీకటిగా మారనున్నాయి.
రష్యాకు భారత్ సంఘీభావం.. మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ..
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి మరియు ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఈ దారుణ ఘటన సంభవించింది. రష్యా రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మాస్కో దాడిలో 60 మంది మరణించిగా.. 140 మంది గాయపడినట్లు సమాచారం. దాడిలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగులు ఆర్మీ యూనిఫాంలో వచ్చారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు క్రోకస్ సిటీ హాల్‌పై గ్రెనేడ్ విసిరారు. దీంతో మాల్‌లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సోషల్ మీడియాలో అనుబంధ ఛానెల్‌లలో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొంది.మాస్కోలో జరిగిన ఉగ్రదాడి గురించి అమెరికా స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ దాడిపై 15 రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. మాస్కోపై 48 గంటల్లో పెద్ద దాడి జరగబోతోందని అమెరికా చెప్పినప్పటికీ, ఆ సమయంలో దాడి జరగలేదు. 15 రోజుల తర్వాత దాడి జరిగింది.
మాస్కోలో భీకర ఉగ్రదాడి.. 60మంది మృతి, 140మందికి గాయాలు
రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. ఇక్కడ ఓ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మంది మరణించగా, 140 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దాడిలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం మాల్‌లో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఆర్మీ యూనిఫాంలో వచ్చారు. దాడి చేసిన వ్యక్తులు క్రోకస్ సిటీ హాల్‌పై కూడా గ్రెనేడ్ విసిరారు. దీంతో మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వందలాది మంది ఇప్పటికీ మాల్‌లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమయ్యాయి. రష్యన్ రెస్క్యూ సర్వీస్ క్రోకస్ సిటీ హాల్ కచేరీ వేదిక బేస్మెంట్ నుండి సుమారు 100 మందిని ఖాళీ చేయించింది.
లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి.. ఈ మొబైల్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా లావా నుంచి అదిరిపోయే మొబైల్ లాంచ్ అయింది.. లావా o2 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు… ఈ ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లావా ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.. అలాగే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది.. ఈ కొత్త ఫీచర్స్ విషయానికొస్తే.. 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసోక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.. ఇక సెల్ఫీ ప్రియులకు అదిరిపోయేలా 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది.. అలాగే 8ఎంపీతో ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది..
16,000 కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి..
దేశీయ అగ్రశ్రేణి కార్ మేకర్ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూయల్ పంప్ లోపం కారణంగా 16,000 యూనిట్లకు పైగా కార్లను రీకాల్ చేసింది. జూలై-నవంబర్ మధ్య అమ్ముడైన రెండు మోడళ్ల కార్లను రీకాల్ చేసింది. కార్లలో లోపాల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 11,851 యూనిట్ల బాలెనో మరియు 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్ మోడల్‌లను రీకాల్ చేయనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఫ్యూయల్ పంప్ మోటార్‌లో ఒక భాగంలో లోపం ఉన్నట్లు మారుతి సుజుకి భావిస్తోంది. దీని వల్ల ఇంజన్ ఆగిపోవడానికి లేదా ఇంజన్ స్టార్టింగ్ సమస్యకు దారి తీయొచ్చని మారుతి చెప్పింది. దేశీయంగా కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి అగ్రగామి ఉంది. తక్కవ ధర, ఎక్కవ ఫీచర్ల విషయంలో ఈ సంస్థకు పేరుంది.
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. అదే విధంగా వెండి ధరలు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తుంది.. 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గింది.. అలాగే వెండి కిలోపై 100 రూపాయలు తగ్గింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,920కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,340 వద్ద కొనసాగుతోంది.. ఇక వెండి కిలో ధర ఈరోజు రూ. 79,400కు చేరింది… ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,410 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 61,800గా కొనసాగుతోంది.. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,420 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ. 61,800గా కొనసాగుతోంది.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం విలువ రూ. 68,020 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350గా కొనసాగుతోంది.. మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.67,420 అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,800 వద్ద కొనసాగుతుంది… ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. మార్కెట్ లో స్వల్పంగా పెరిగింది.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,600 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 76,000, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 79,500 కొనసాగుతోంది.. మిగిలిన నగరాల్లో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ-20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్ కోహ్లీ.. టీ-20 ఫార్మాట్‌లో ఇంత వరకూ 376 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ.. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, IPL 2024 సీజన్లో చెన్నై బోణీ కొట్టింది. బెంగళూరుపై ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK… కేవలం 4 వికెట్లు కోల్పోయి…. 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. IPLలో తొలి సారిగా ఆడుతున్న CSK ఆటగాడు రచిన్ రవీంద్ర చెలరేగాడు. 15 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అలాగే, శివమ్ దూబే 27 బంతుల్లో 34 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. CSK కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు మాత్రమే చేశాడు. RCB బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు తీయగా, యశ్ దయాల్, కర్ణ్ శర్మ తలో వికెట్ చేశారు. అయితే, ఐపీఎల్ లో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్ మరియు కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలను అధిగమించి టీ20ల్లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ పోరులో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇక, రోహిత్ శర్మ 426 మ్యాచ్‌ల్లో 11156 పరుగులతో.. 329 మ్యాచ్‌ల్లో 9645 పరుగులు చేసిన శిఖర్ ధావన్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
