Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*మేదరమెట్లలో వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’.. సీఎం ప్రసంగంపై ఉత్కంఠ

బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార వైసీపీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని ముఖ్యమంత్రి జగన్ వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్‌గా బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతోంది బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేసింది. మేదరమెట్లలో సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నట్లు సమాచారం. సభకు 15 లక్షల మంది ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉందని అంచనా.ఈ నేపథ్యంలో 4500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నారు.

 

*ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. తాడేపల్లిలో సీఎం సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓ సారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో ఉన్నారు ముద్రగడ. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముద్రగడ తనయుడికి నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందే ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

 

*నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. సీఎంవో నుంచి టీఎన్జీవో, టీజీవోలతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల్లోని నేతలకు ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న 4డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌), ఉద్యోగుల మెడికల్‌ బిల్స్‌, సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. వచ్చే వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్‌లో పెండింగ్ డీఏలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

*ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని గొర్రెల కాపరి, 80 గొర్రెలు మృతి
రైలు ఢీకొని 80 గొర్రెలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన హన్మకొండలోని శాయంపేట రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. శాతవాహన రైలు వస్తున్న క్రమంలో గేటు వేయగా.. కాపరి గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టగా గొర్రెలతో పాటు గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టాలపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

*రెట్టింపు ధరలు, కఠిన నిబంధనలు.. బెంగుళూరులో నీటి సంక్షోభం
చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, వార్తాపత్రికల్లో, కవితల్లో చదువుతున్న నీటి సంక్షోభం మెల్లమెల్లగా రెక్కలు విప్పుతోంది. ప్రపంచం మొత్తం నీటి కరువుతో పోరాడుతోంది. నిమ్మది నెమ్మదిగా భారతదేశం కూడా దాని బారిన పడుతోంది. భారతదేశంలో ఇంకా వేసవికాలం ప్రారంభం కాలేదు కానీ అప్పుడే నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే బెంగళూరు ఎక్కువగా ప్రభావితమైంది. ప్రస్తుతం నగరంలో పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు ‘నీళ్లు అయిపోయాయి’ అంటూ పిల్లలను ఇంటి నుంచే క్లాసులు తీసుకునేలా తయారైంది. నీటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసిన దాని ఆధారంగా మీరు నీటి సంక్షోభాన్ని అంచనా వేయవచ్చు. తాగునీటి కొరతతో సతమతమవుతున్న బెంగళూరులో ప్రభుత్వం అనేక కీలకమైన, పెద్ద నిర్ణయాలను తీసుకుంది. దీంతో సామాన్య ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. కర్నాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు కార్ వాషింగ్, గార్డెనింగ్, ఇంటి నిర్మాణం, రోడ్ల నిర్మాణం, దాని నిర్వహణ కోసం ఉపయోగించే నీటిని తాత్కాలికంగా నిషేధించింది. దీంతో పాటు నిబంధనలు పాటించని వారిపై రూ.5000 వరకు జరిమానా విధిస్తామని బోర్డు ఆదేశించింది. కొంతమందికి స్నానానికి తక్కువ నీటిని వాడాలని కూడా ఆదేశాలు వచ్చాయి. బహుళ అంతస్తుల భవనాల తోటల్లో నీరు చల్లడం నిలిపివేశారు. ఒక వస్తువు కొరతగా మారిన కొద్దీ దాని ధర పెరుగుతుందని ఆర్థిక శాస్త్ర నియమం ఉంది. ఇప్పుడు బెంగళూరులో సరిగ్గా అదే జరుగుతోంది. నీటి సరఫరా ధర రెండు రెట్లు పెరిగింది. ఉదాహరణకు గతంలో రూ.700 ఉన్న వాటర్ ట్యాంక్ ఇప్పుడు రూ.1500 నుంచి రూ.1800 చెల్లించాల్సి వస్తోంది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఇంట్లో వేసిన బోర్‌వెల్‌ ఎండిపోయిందని, దీంతో ఆయన ఇంట్లో కూడా నీటి సమస్య ఉందని బెంగళూరు నీటి ఎద్దడి తీవ్రతను ఇప్పుడు అర్థం చేసుకోండి. నీటి సరఫరా కోసం నీటి ట్యాంకులు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. 1.5 కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న ఈ ఐటీ హబ్‌కు కావేరీ నది నుంచి నీటి సరఫరా జరుగుతుంది. దీని కోసం దాదాపు 145 కోట్ల లీటర్ల నీరు సరఫరా అవుతుంది. బెంగళూరు నివాసితులు బోర్‌వెల్‌ల ద్వారా మిగిలిన 60 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిపోవడంతో బోరుబావి నుంచి కూడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. నీటి సంక్షోభానికి మరొక కారణం తక్కువ వర్షపాతం. రుతుపవనాలు బలహీనపడటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఈ సమస్య తెరపైకి వచ్చింది. ఈ సంక్షోభం వల్ల గ్రామాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. బెంగళూరు 2007లో కూడా ఇలాంటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న బెంగళూరుపై వాటర్ బోర్డు, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయి. నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు నీటి ట్యాంకర్లను పంపిస్తున్నారు. దీని సరఫరా కోసం పాలను తరలించే ట్రక్కుల్లో నీటిని నింపి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు భారీ వర్షాలు, కనీస నీటి వినియోగం బెంగళూరు ఈ సంక్షోభం నుండి బయటపడటానికి సహాయపడుతుందని నమ్ముతారు.

 

*స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు కూడా ధరలు స్థిరంగా ఉన్నాయని తెలుస్తుంది.. నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్లు రూ.65,740, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,060, 24 క్యారెట్ల ధర రూ.66,610, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,410 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,890 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రా బంగారం ధర రూ.60,260 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది.. వెండి ధరల విషయానికొస్తే.. ఈరోజు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000గా ఉంది. ముంబైలో రూ.75,000 ఉండగా.. చెన్నైలో రూ.78,500గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, ధర రూ.78,500లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,600గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

 

*మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రిస్టినా పిజ్కోవా
ఎట్టకేలకు ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ అందాల పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ ఫైనల్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. అక్కడ క్రిస్టినా పేరు విజేతగా ప్రకటించారు. ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ ఏడాది 120 మంది ఈ అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. అందరినీ వెనక్కి నెట్టి క్రిస్టినా పిజ్కోవా టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి ఈ పోటీలో పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా గెలిచారు. క్రిస్టినా పిజ్కోవాకు పట్టాభిషేకం చేసింది ఆమె. ఈ పోటీలో భారతదేశం తరపున సినీ శెట్టి పాల్గొన్నారు. కానీ ఆమె ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఆమె టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. కానీ టాప్ 4 కంటెస్టెంట్స్ ఎంపికైనప్పుడు, ఆమె అందులో చేరలేకపోయింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుండి నిష్క్రమించింది. ఆమెది కర్నాటక. తన విద్యాభ్యాసం ముంబైలో పూర్తయింది. ఆమె 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌కు హోస్టుగా వ్యవహరించారు. 2013లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మేగన్ యంగ్ అతనికి మద్దతుగా నిలిచారు. నేహా కక్కర్, ఆమె సోదరుడు టోనీ కక్కర్, షాన్ వంటి ప్రముఖ గాయనీమణులు తమ అభినయం, గాత్రంతో అందాల ప్రదర్శనను అలరించారు. 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్‌ వరల్డ్‌ నిర్వహించడం జరిగింది. అంతకుముందు 1996 సంవత్సరంలో46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించబడింది. ఈసారి ముంబై నగరం అందుకు వేదిక కాగా, 28 ఏళ్ల క్రితం బెంగళూరులో జరిగింది.

Exit mobile version