NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్‌ సహా టీడీపీ నేతల సంతాపం..
ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించాను. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని తీవ్ర ఆవేదిన వ్యక్తం చేశారు చంద్రబాబు.. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు రామోజీరావు అని పేర్కొన్నారు చంద్రబాబు.. సమాజ హితం కోసం అనుక్షణం పని చేసిన రామోజీ కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి.. ఎక్కడా తలవంచకుండా విలువలతో రామోజీ తన సంస్థలను నడిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తన ప్రకటనలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, రామోజీరావు మృతికి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో రామోజీ పని చేశారు. రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు అని పేర్కొన్నారు నారా లోకేష్‌. మరోవైపు.. రామోజీరావు మృతికి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, కేశినేని చిన్ని, పయ్యావుల, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.

తెలుగు భాషకు రామోజీ చేసిన సేవలు మరువలేనివి..
తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్‌ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.. పాత్రికేయ రంగం పై చెరగని ముద్ర వేసిన ఈనాడు అధినేత రామోజీ రావు లేరనే వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందన్నారు.. సినీరంగంలో కూడా ఎంతోమంది సామాన్య కళాకారులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు..ఈ విధంగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీ రావు లేరన్న దుర్వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచి వేసిందన్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని గుర్తుచేసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రముఖలు రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రేవంత్ ట్వీట్ చేశారు. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

నేటి నుంచే టీచర్ల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ కూడా..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ నేటి నుంచి ప్రారంభించనుంది. మల్టీజోన్-1లో ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్-2లో నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వేర్వేరు షెడ్యూల్‌లను విడుదల చేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంతకుముందు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్లీ ప్రక్రియ కొనసాగుతుంది. టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తారు. మూడేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈసారి 12,472 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరగనుండగా, మరో 18,495 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అనుమతించింది. మొత్తంగా ఈ ప్రక్రియ 23 రోజుల్లో పూర్తవుతుంది.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని స్పీకర్ క్వాటర్స్ వద్ద నాయకులు సమావేశమయ్యి అక్కడ నుంచి నాంపల్లి కి బయలుదేరుతారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేపప్రసాదాన్ని ఆస్తమా రోగులకు అందించేందుకు నేడు, రేపు అనగా 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ లో సిద్దం చేశారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నిన్నటి నుంచే నాంపల్లి గ్రౌండ్ కు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం నిన్న రాత్రి నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?
కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌గాంధీని ఎన్నుకొనే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ పని చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ నాయకత్వంలో తిరిగి పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కూడా రాహుల్‌ గాంధీ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా ఉంటారు. మోడీ సర్కారు ఏడాదిలోపు పడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఇండియా కూటమి తమ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ని సిద్ధంగా ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు ఢిల్లీలో జరగబోతుంది. అశోకా హోటల్‌లో ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌ సహా కాంగ్రెస్‌ సీఎంలు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా రాహుల్‌ను ప్రతిపాదిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. దాన్ని అనుసరించి, సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సీపీపీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో రాహుల్‌ను లాంఛనప్రాయంగా సీపీపీ నేతగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం.. భారీగా పార్టీలు మారనున్న ఎమ్మెల్యేలు
రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కనిపించవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్‌ బలం పుంజుకున్న తర్వాత ఇప్పుడు అజిత్‌ పవార్‌ శిబిరం వెనకడుగు వేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజల మూడ్‌ను పసిగట్టిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలని, సీనియర్ పవార్ వైపు తిరిగి వస్తారని భావిస్తున్నారు. మరోవైపు పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటయ్యే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, అజిత్ పవార్ ఖచ్చితంగా ఎన్డీఏ తో నిలబడతారని ప్రకటించారు. అయితే ఎన్నికలకు ముందు, మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు విస్తృత చిత్రాన్ని అందించాయని ఎన్సీపీ పవార్ వర్గానికి చెందిన నాయకుడు ఒకరు అన్నారు. అజిత్ పవార్ పార్టీ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. దీంతో ఆయనపై పలు వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ కార్యకలాపాలు అనేక రకాలుగా మారుతాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పవార్ కుటుంబంలో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నానని కీరవాణి వెల్లడించారు. అప్పుడు అయన మాట్లడుతూ ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఏమీ ఎగ్జయిట్‌మెంట్ లేదని.. వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతో ఉన్నానని తెలిపారు. ఎన్నో విపత్కర పరిస్థితులను జీవితంలో అనుభవించిన తనకు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద ఎగ్జయిట్‌మెంట్‌ను ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు.

రామోజీరావు మృతి.. నన్ను టాలీవుడ్కి పరిచయం చేసింది మీరే అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
రామోజీ రావు మృతితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.