NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. కర్రలు, రాళ్లతో దాడి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎన్నికల కోడ్ ముగియడంతో టీడీపీ వర్గీయులు బాణాసంచా కాల్చుతుండగా.. కర్రలు, రాళ్లతో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేసినట్టు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులు విజయులురెడ్డి, రాకేష్‌రెడ్డిలపై వైసీపీ నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు గ్రామానికి చెందిన విజయులురెడ్డి, రాకేష్‌రెడ్డిలు ఎన్నికలలో టీడీపీకి ఓట్లు వేయించారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో కలిసి అర్ధరాత్రి సమయంలో గ్రామంలో విజయులురెడ్డిని కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక, అడ్డుకోబోయిన ఆయన కుమారుడు రాకేష్‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, అర్భన్‌ సీఐ జగన్‌మోహన్‌రావు, ఎస్‌ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన విజయులురెడ్డి, రాకేష్‌లను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్‌పై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. గెలుపు సంగతి తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా రాబట్టలేకపోయింది.. అయితే, రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు.. కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదు.. మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీడబ్ల్యూసీ మెంబర్లు.. ఇలా కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని పదవులు అనుభవించిన నాయకులు వెళ్లిపోయారని విమర్శించారు పద్మశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పనిచేశాం.. సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పార్టీ కోసం పనిచేశామన్నారు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనుకున్నా.. నేను కేడర్ కి న్యాయం చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు సుంకర పద్మశ్రీ.. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం, ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.. కానీ, తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేయడం.. ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఏపీ ఎన్నికల ఫలితాలు.. పందెం రాయుళ్లకు ఊహించని ఝలక్..!
పందాలకు కేరాఫ్ గా ఉంటే భీమవరంలో ఈసారి పందెం రాయుళ్లకు ఊహించని ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాలపై కోట్లను సంపాదిద్దామనుకొని బెట్టింగ్ రాయుళ్లు పెద్ద స్థాయిలో పందాలు కాసారు. పందాల కాసే ఇరువురు వ్యక్తులు డబ్బులు మధ్యవర్తి వద్ద ఉంచడం అనేది సహజం. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన బెట్టింగ్ రాయుళ్ళు పెద్ద మొత్తంలో అనేకమంది మధ్యవర్తుల వద్ద డబ్బులు కలిపారు. ఇదే తరహాలో భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందం రాయుళ్ళ పెద్ద మనిషిగా ఉంచారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన పందెం రాయుళ్ళు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత 5 పర్సెంట్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇలా మొత్తం సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగితేలారు.. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్తే ఆ మీడియేటర్ కాస్త అడ్రస్ లేకుండా పోయాడు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆరా తీశారు. కానీ, అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు. మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పందెం రాయుళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు
హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.జిహెచ్ఎంసీ పరిధిలో ఏసీ బస్సు పాస్ ఛార్జీలను టీజీఎస్ ఆర్టీసీ తగ్గించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌ పాస్‌ ధర 2530 రూపాయలు ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.1900 కే అందిస్తుంది. అంటే రూ.630 కు బస్‌ పాస్‌ను ఆర్టీసీ సంస్థ తగ్గించింది. కాగా.. సికింద్రాబాద్ – పటాన్‌ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించినుంది. ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

రేపు సీడబ్ల్యూసీ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు ( శనివారం) సమావేశం కాబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్‌ 8వ తేదీన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11:30 గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీడబ్ల్యూసీ తొలిసారి సమావేశం కానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన, పార్టీ నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక, మరికొన్ని రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈనెల 9వ తేదీన మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మోడీ ఈ సారి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి పరిస్థితి ఏర్పాడింది. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను అందుకోలేకపోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను దక్కించుకుంది. ఎన్డీయే కూటమి నేతల సపోర్టుతోనే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీయేకి ఇండియా కూటమి స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 234 స్థానాల్లో విజయం సాధించింది.

నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కూలీలు విఫలమయ్యారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారి ప్రయత్నాలను విఫలం చేశారు. ముగ్గురు కూలీలను అరెస్టు చేశారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులు చూపించి హై సెక్యూరిటీ పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముగ్గురు కూలీలు షోయబ్, మోనిస్ గా గుర్తించారు. వీరిని గుర్తించి నిందితులపై ఐపీసీలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన జూన్ 4 మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్ 3 వద్ద జరిగింది. ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అతని ఆధార్ కార్డును తనిఖీ చేయగా, వారికి అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆధార్ కార్డు నకిలీదని తేలింది. అనంతరం ముగ్గురు కూలీలను వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌ హౌస్‌ భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణ పనుల కోసం ముగ్గురు కూలీలను నియమించినట్లు సమాచారం.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్కు తాత్కాలిక సభ్యత్వం..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్‌లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి. 193 సభ్య దేశాలు గల ఐరాస జనరల్‌ అసెంబ్లీ ఈ అయిదు దేశాలను ఎంపిక చేయడం లాంఛనమే అయింది. భద్రతా మండలిలో మొత్తం 15 సీట్లు ఉండగా.. వాటిలో అయిదు వీటో అధికారం గల శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. మిగతా 10 దేశాలను రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యులుగా ఎన్నిక చేయనున్నారు. ఈ సీట్లను ప్రాంతాల వారీగా కేటాయిస్తారు. ఇక, ఈసారి ఆఫ్రికా బృందం సోమాలియాను ప్రతిపాదించగా.. ఆసియా-పసిఫిక్‌ దేశాల తరఫున పాకిస్థాన్‌ను ఎంపిక చేశారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించగా.. డెన్మార్క్, గ్రీస్‌లు ఐరోపా తరఫున నామినేట్‌ అయ్యాయి. ఈ కొత్త తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం 2025 జనవరి 1వ లేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాగా, ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్‌ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ముగియనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని 21వ శతాబ్ది అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తరించాలని భారత్‌తో సహా అన్ని సమితి సభ్య దేశాలు కోరుతున్నా ఇంత వరకు అడుగు ముందుకు మాత్రం పడటం లేదు.

అమెరికా మా కంటే మెరుగ్గా ఆడింది: బాబర్‌ ఆజామ్
అమెరికా తనమా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ ఆజామ్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమని దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలో తమ పేసర్లు రాణించలేదని, స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని బాబర్‌ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌ ఎలో భాగంగా డల్లాస్‌ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో పాక్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం బాబర్‌ ఆజామ్ మాట్లాడుతూ… ‘మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. మ్యాచ్‌లో గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మేము అది చేయలేకపోయాం. మొదటి 6 ఓవర్లలో మా బౌలింగ్ కూడా పేలవంగా ఉంది. స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవడం కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అమెరికా చాలా కష్టపడింది. ఈ విజయం క్రెడిట్ వారిదే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మా కంటే యూఎస్ మెరుగ్గా ఆడింది. పిచ్‌లో కొద్దిగా తేమ ఉంది. ఓ ప్రొఫెషనల్‌ ప్లేయర్ పరిస్థితులను త్వరగా అంచనా వేయాలి’ అని అన్నాడు.

ఎట్టకేలకు “గేమ్ ఛేంజర్” షూటింగ్ పూర్తి కాబోతుందిగా..
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ తన ఫోకస్ అంతా కూడా “గేమ్ ఛేంజర్ ” షూటింగ్ పై పెడుతున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూతురు ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు .

‘సత్యభామ’ లో ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డా..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో స్టార్ హీరోల అందరి సరస న నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తెలుగులో తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో మంచి విజయం అందుకుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించారు.ఇదిలా ఉంటే ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను అవురమ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క ,శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన్న ఈ సినిమా జూన్ 7 గ్రాండ్ గా రిలీజ్ అయింది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో కాజల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనింది.గతంలో విజయ్ దళపతి ‘జిల్లా’ సినిమాలో పోలీస్ గా నటించిన అది సీరియస్ పాత్ర కాదు.సత్యభామ లో మాత్రం ఎమోషన్ ,యాక్షన్ ఉన్న ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాను అని కాజల్ తెలిపింది.ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంతగానో కాస్తపడ్డాను.ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ,యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి.ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తున్నా అని కాజల్ తెలిపింది.