Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

హైదరాబాద్ లో అమ్మోనియం గ్యాస్ లీక్.. 10 మందికి అస్వస్థత
హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ నాలా ప్రక్కన పడిఉన్న అమ్మోనియం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే, గ్యాస్ పీల్చిన 10 మందికి అస్వస్థతకు గురి కావడంతో వారిని బీబీఆర్ హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాంలో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురైన వారిని చికిత్స అనంతరం డిచార్చ్ చేశారు. మిగతా వారికి మెరుగైన చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. నాలా ప్రక్కన పడివున్న సిలెండర్స్ ఇత్తడి వాల్వ్ ను తీయడానికి దుండగుడు ప్రయత్నించడంతో గ్యాస్ లీక్ అయింది. అయితే.. ఈ తుప్పు పట్టిన అమ్మోనియం సిలెండర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయని సవన్ నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫతేనగర్ పైప్‌లైన్‌ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో చాలా కాలం నుంచి రెండు అమ్మోనియా గ్యాస్‌ సిలిండర్లు పడి ఉన్నాయి. అయితే.. ఈ సిలిండర్లను గమనించిన ఓ దొంగ.. గ్యాస్‌ సిలిండర్లకున్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు అని పోలీసులు తెలిపారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యయత్నం కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు అల్తాప్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ తలపై పెట్టుకుని చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియోను విడుదల చేశాడు. నా హత్యకు కుట్ర చేశారు.. సొంత పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడారు అని ఆయన అన్నారు. దాడి, హత్యాయత్నానికి పాల్పడటం వల్లే పోలీసులు నిందితులను జైలుకు పంపారు అని ఎమ్మెల్యే తెలిపారు. జైలులో ఉన్న ఇద్దరు ఎంఐఎం యువకులకు నేర చరిత్ర ఉంది.. సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నాడు. సొంత పార్టీ కౌన్సిలర్లు శరత్ రెడ్డి, మీర్ నజీర్, షరీఫ్ తో ఎంఐఎం నేతలు అల్తాప్, నవీద్ లతో చేతులు కలిపారు ప్లాన్ ప్రకారం నా హత్యకు కుట్ర చేశారు. వారిపై పిడీ యాక్ట్ నమోదు చేయాలి.. అసదుద్దున్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నాడు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయట పెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు లేరు.. దమ్ముంటే ముందు నుంచి కొట్లాడండి.. వెనక నుంచి కాదు.. ఈ సారి ఎన్నికల్లో తేల్చుకుందాం.. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అని ఎమ్మెల్యే షకీల్ అన్నారు.

కేరళ డీజీపీగా ఏపీ వాసి..
ఆంధ్రప్రదేశ్‌ వాసి కేరళలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్‌ కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. కేరళ పోలీస్‌ బాస్‌గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు షేక్ దర్వేష్ సాహెబ్‌.. జిల్లాలోని పోరుమామిళ్ల బెస్తవీధికి చెందిన మహబూబ్‌సాహెబ్‌, గౌసియాబేగం దంపతుల కుమారుడైన షేక్ దర్వేష్ సాహెబ్‌.. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌.. కేరళ కేడర్‌లో విధులు నిర్వహిస్తూ వస్తున్న ఆయనను ఇప్పుడు పోలీస్‌ బాస్‌ పోస్ట్‌ వరించింది.. ఈ ఐపీఎస్‌ అధికారి పుట్టి పెరిగిన ఊరు పోరుమామిళ్ల. ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ బెస్తవీధిలో నివాసం ఉండేవారు. ఇక, దర్వేష్ సాహెబ్‌.. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పోరుమామిళ్ల OLF పాఠశాలలో చదివారు. ఆరు నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్‌లో, ఇంటర్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అభ్యసించారు.. ఆ తర్వాత డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. పట్టుదలకుండా కష్టపడ్డాడు.. తొలిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సెలెక్ట్ అయ్యారు.. కానీ, ఆయన టార్గెట్‌ ఐఏఎస్‌ కావడంతో.. ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను వదిలేసి.. మరోసారి ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్ కేరళ క్యాడర్‌కు సెలెక్ట్ అయ్యారు.. దీంతో.. కేరళలో ఉద్యోగాన్ని మొదలు పెట్టారు. నెడుమంగడ్‌లో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా తన సేవను ప్రారంభించిన షేక్, వయనాడ్, కాసరగోడ్, కన్నూర్ మరియు పాలక్కాడ్ జిల్లాల్లో జిల్లా పోలీసు చీఫ్‌గా పనిచేశాడు. రాష్ట్ర రైల్వే పోలీస్ మరియు స్టేట్ స్పెషల్ బ్రాంచ్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అతను సాయుధ బెటాలియన్‌లో కూడా పనిచేశాడు. కొసోవాలోని యూఎన్‌ శాంతి పరిరక్షక మిషన్‌లో భాగంగా ఉన్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు.. పదోన్నతి పొందిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్, నార్త్ జోన్‌లో ఏడీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం, షేక్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌లో డైరెక్టర్ జనరల్‌గా ఉండగా.. ఇప్పుడు కేరళ డీజీపీగా బాధ్యలు స్వీకరించబోతున్నారు.. అయితే, ప్రస్తుత పోలీస్ చీఫ్ అనిల్ కాంత్. ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు.

మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన 2019 ప్రయోగం విఫలమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం అన్నారు. నవంబర్ 23, 2019న అజిత్ పవార్ డిప్యూటీగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫడ్నవీస్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదని రౌత్ అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ 2019లో ‘డబుల్‌ గేమ్‌’ ఆడారని బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందు ఒప్పుకున్న పవార్‌ 3-4 రోజుల్లోనే మాట మార్చేశారని ఆరోపించారు. ఫడణవీస్‌ ఓ ఇంగ్లిషు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్‌పై ధ్వజమెత్తారు. ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్‌ స్పందించారు. శరద్‌ పవార్‌ ఏదైనా చేసి ఉంటే పరవాలేదని.. అందులో కొత్తేమీ కాదన్నారు. బీజేపీ ప్రయోగాలు చేసి విఫలమైందని, ఎదురుదెబ్బ తగిలిందన్నారు. డబుల్‌ గేమ్ గురించి మర్చిపోవాలన్నారు. తదనంతరం శరద్‌ పవార్‌ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని.. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం జూన్ 30తో ఏడాది పూర్తి చేసుకోనుంది. మహారాష్ట్రలో 2022 రాజకీయ సంక్షోభం, అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అతని ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోతుందని సంజయ్ రౌత్ అన్నారు.

సెల్ఫీ తెచ్చిన కష్టాలు.. బదిలీ అయిన పోలీసు అధికారి
ఓ పోలీసు అధికారి భార్య, పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోకు .. అతడ్ని బదిలీ చేసి .. ఆ అతనిపై విచారణకు ఆదేశించారు. రూ.500 నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ పోలీసు అధికారి బదలీ కావల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని సబ్-ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నారు.ఇటీవల ఆ అధికారి భార్య, అతని పిల్లలు నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ వైరల్ కావడంతో ఆ అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో ఆ అధికారిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలో రూ. 14 లక్షల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన పోలీసు అధికారి భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫోజు ఇవ్వడం ఆ ఫోటోలో చూడవచ్చు.నోట్ల కట్టల ఫోటో వైరల్ కావడంతో, వెంటనే పోలీసు అధికారిపై దర్యాప్తుకు ఆదేశించారు. స్టేషన్‌ ఇన్‌చార్జి రమేష్‌ చంద్ర సహాని బదిలీ అయ్యారు. బదలీ అయిన రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకుంటూ.. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో తీసుకున్నదని చెప్పాడు.

ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఎలాంటి పరిమితి లేదు. ఓ వ్యక్తి ఒకటికి మించి ఖాతాలు తెరవొచ్చు. బ్యాంకు అకౌంట్ సంఖ్యపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎలాంటి పరిమితిని విధించలేదు. దాంతో ఓ వ్యక్తి కావాల్సినన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం.. కరెంట్ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌, సాలరీ అకౌంట్‌ లేదా జాయింట్ అకౌంట్లను మీరు హాయిగా తెరవవచ్చు. అయితే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ కలిగి ఉన్న వారు అన్ని ఖాతాల్లో లావాదేవీలను నిత్యం నిర్వహిస్తుండాలి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ మినహా.. సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వను (మినిమమ్ బ్యాలెన్స్) ఉంచడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలో ఎల్లప్పుడూ మినిమమ్ బ్యాలెన్స్ మెయిటైన్ చేయాలి. ఆయా బ్యాంక్స్ రూల్స్ ప్రకారం మీ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. పెనాల్టీ విధిస్తుంది. దీంతో మీరు డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ ఖాతాలు ఉన్న సందర్బాలలో బ్యాంకులే లాభపడతాయి. ప్రతి బ్యాంకు మెసేజ్‌లు పంపడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ నిర్వహణకు కూడా మీరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారు మీరు వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అవసరం లేని ఖాతాలను మూసివేయడం మంచిది.

రామ్ చరణ్ కూతురుకు.. తన రేంజ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. తమ ఇంటి మ‌హాల‌క్ష్మి పుట్టింద‌ని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు శుక్రవారం మెగా ప్రిన్సెస్‌కు బార‌సాల కార్యక్రమం నిర్వహించబోతున్నారట. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని మెగా ఫ్యామిలీ యోచిస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఒక‌టి.. వారి పాప‌కు వ‌చ్చింది. అది పంపింది మరెవరో కాదు భారతదేశ కుబేరుడు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇంత‌కీ మెగా కుటుంబమే అవాక్కయ్యే పెద్ద గిఫ్ట్ ఏమొచ్చిందా! అంటే ముఖేష్ అంబానీ దంప‌తులు ఏకంగా బంగారంతో ఊయల చేపించి పాప కోసం బహుమతిగా పంపారట. ఈ ఊయ‌ల‌లోనే పాప‌కు బార‌సాల వేడుక‌ నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లు పంపించిన ఊయలను దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అలా దీనికోసం అంబానీ రూ. 1.20 కోట్ల వరకూ ఖర్చు చేశారని అంటున్నారు.

బాలయ్య.. మజాకా.. సుమకు ఫ్యూజులు అవుట్..
తెలుగు నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 7 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య హుషారెత్తించే ప్రసంగం చేశారు. ఇక బాలయ్య మైక్ అందుకోగానే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ ఫ్యాన్స్ గోల చేయడం ప్రారంభించారు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. నేను సెక్సీ ఏంటి.. ఇక్కడ సుమ, మమతా మోహన్ దాస్, విమలారామన్ లాంటి వాళ్లంతా ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవుతారు.. అంటూ పంచుల వర్షం కురిపించారు.. ఆ తర్వాత యాంకర్ సుమపై జోకులు వేస్తూ ఆమెని బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. పోరి హుషారుగుంది రోయ్ అంటూ సుమపై బాలయ్య పాట కూడా పాడారు. జోకులు ముగిసిన తర్వాత రుద్రంగి చిత్రం గురించి మాట్లాడుతూ.. జగపతిబాబు పై ప్రశంసలు కురిపించారు.. అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ.. బాలయ్య బిజీగా ఉంటారని తెలుసు. రాజకీయాలు, సినిమాలు, తన ఆసుపత్రి పనులు ఇలా చాలా బిజీ. అయినా కూడా నేను ఇన్వైట్ చేస్తే కాదు అని అనరు. అందుకే రుద్రంగి ప్రీరిలీజ్ కి ఆహ్వానించా. నా కోసం వచ్చారు. లెజెండ్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇప్పుడు కూడా బాలయ్య ఆశీస్సులతో రుద్రంగి చిత్రంతో మూడవ ఇన్నింగ్స్ మొదలవుతుంది అని జగపతి బాబు అన్నారు.. మొత్తానికి ఆ ఈవెంట్ కు బాలయ్య హైలెట్ అయ్యాడు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం బాలయ్య అనిల్ రావీపూడి తో ఓ సినిమా చేస్తున్నారు..

Exit mobile version