NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కురుపాంలో సీఎం పర్యటన.. నేడే వారి ఖాతాల్లో రూ.13 వేలు జమ
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు.. ఈ రోజు పార్వ­తీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ఆయన అమ్మ ఒడి పథకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, కురుపాం పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు.. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.. కాగా, తమ పిల్లలను స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదివిస్తోన్న తల్లుల ఖాతాల్లో జూన్‌ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది ఏపీ సర్కార్‌.. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారులకు ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులైన విషయం విదితమే..

బక్రీద్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాకు వెళ్లొద్దు
బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని రేపు మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ నుంచి ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్‌ రోడ్డు మీదుగా రావాలని తెలిపారు. వీరు తమ వాహనాలను జూపార్కు ఏరియాలో, ఓపెన్‌ స్పేస్‌ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్‌ వద్ద పార్క్‌ చేసుకోవాలని సూచించారు. ఈ టైంలో సాధారణ వాహనాల రాకపోకలకు పర్మిషన్ లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురానాపూల్‌ వైపు దారి మళ్లించామని అని చెప్పారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్‌ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతి ఉంటుంది. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌తో పాటు మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం బెడ్‌ పక్కన ఖాళీ ప్లేస్ లో, కార్లను, యాదవ్‌ పార్కింగ్‌ పక్కన పార్క్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ టైంలో ఇతర వాహనాల రాకపోకలను ఈద్గా వైపు పర్మిషన్ లేదన్నారు.

1.78 లక్షల టీచర్ పోస్టులు.. దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
సాధారణంగా ఉపాధ్యాయ(టీచర్) పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారితోనే భర్తీ చేస్తారు. టీచర్‌ పోస్టు జిల్లాస్థాయి పోస్టు. కాబట్టి సొంత రాష్ట్రంలోని వారితో భర్తీ చేస్తారు. రాష్ట్ర చరిత్రను బోధించాల్సి ఉంటుంది.. అలాగే తమ సొంత రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా రాష్ట్రాలు 100 శాతం వారి రాష్ట్రం వారితో భర్తీ చేస్తారు. భర్తీకి సంబంధించి జారీ చేసే నోటిఫికేషన్‌లో స్థానికతపై స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇపుడు బీహార్‌లో భర్తీ చేయబోయే 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు ఈ ప్రకటనపై ఆసక్తి చూపుతున్నారు. అయితే బీహార్‌లో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఇతర రాష్ట్రాల వారు ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పెద్ద శుభవార్త చెప్పారు. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయబోయే ఉపాధ్యాయ పోస్టులకు స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు బిహార్ క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ అడిషినల్ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.సిద్దార్థ్‌ తెలిపారు. గతంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్థానికులను మాత్రమే నియమించుకొనేవారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్‌ ఏమీ ఉండబోదని సిద్ధార్థ్‌ వెల్లడించారు. రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో అర్హత కలిగిన భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారులు తెలిపారు.

‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!
విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించాలని మణిపుర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పరిపాలన శాఖకు ఉత్తర్వులు అందాయి. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆ శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ తెలిపారు. రాష్ట్ర పరిపాలనా శాఖ నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే.. వారి జీతంలో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పరిపాలన శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ వెల్లడించారు. జూన్‌ 12న సీఎం బీరేన్‌ సింగ్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాని, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న హింస కారణంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిబంధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనేది వెల్లడించలేదు.

జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది జూన్‌లో వానలు కురవలేదు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం తగ్గినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వానలు కురవాల్సినంతగా కురవలేదు. ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే జూన్‌ 24 నాటికి 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయని.. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక ప్రకటించింది. జూన్‌ 22 నాటికి దక్షిణాదిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం 26 శాతానికి చేరుకున్నాయని నివేదికలో పేర్కొంది. ఇది గడిచిన నాలుగేండ్లలో కనిష్ఠమని తెలిపింది. బిపర్జాయ్‌ తుఫాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైందని నివేదిక పేర్కొంది. దీని కారణంగా వాయవ్యం మినహా దేశమంతటా సాధారణం కంటే తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయని తెలిపింది. దక్షిణాదిలో సాధారణం కంటే 51 శాతం తక్కువగా వర్షపాతం నమోదవ్వగా.. మధ్య భారత్‌లో 51 శాతం, పశ్చిమ, ఈశాన్య రీజియన్లలో 19 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం పడాల్సిన వర్షపాతంలో జూన్‌లో అతితక్కువగా 19 శాతం వర్షపాతం నమోదవ్వనుండగా.. జులైలో మూడింట ఒక వంతు, ఆగస్టులో 29 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.

‘టమాటా’ బాటలోనే ‘ఉల్లి’.. ఆర్బీఐ ఏం చేయబోతుంది?
ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు దేశంలోకి రానేవచ్చాయి. ఢిల్లీ, ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలో కూడా విస్తరించాయి. దీంతో రైతులు తమ పొలాల్లో పంటలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆకాశం నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏ కూరగాయలు కిలో రూ.50కి తగ్గడం లేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో రూ.100 టమాట ధర దాటింది. కూరగాయలు పెరిగినందుకు మూడు కారణాలు చెబుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండా వేడికి పంటలు దెబ్బతినడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కూరగాయలు అంత ఎక్కువగా సాగు చేయకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. టమాటా బాటలోనే ఉల్లిపాయలు పయనిస్తున్నాయి. రానున్న ఒకటిన్నర, రెండు నెలల్లో వీరి ధరలు సెంచరీ కొట్టే అవకాశం ఉంది. అంటే ఉల్లి ధర కూడా కిలోకు రూ. 100 లేదా అంతకు మించి ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినే అవకాశం ఉంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో టోకు, రిటైల్ ధరలపై చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారుల నిల్వ కూడా ఇప్పటి నుంచే మొదలైంది.

4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్
దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి జాతీయ ఎంట్రన్స్ ను నిర్వహించనున్నారు. ఈ ఎంట్రన్స్ ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ఈ ఏడాది నుంచి ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు రాష్ట్రాలకు చెందిన డిగ్రీ కాలేజీల్లోనూ అమలు చేయనున్నారు. అయితే వాటిలో ప్రవేశాల కోసం మాత్రం జాతీయ స్థాయిలోనే ప్రవేశ పరీక్షను నిర్వహించి అడ్మిషన్లను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించి ప్రవేశ పరక్ష షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును దేశ వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో ప్రవేశాల కోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సీఈటీ)-2023 ను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియను జులై 19 వరకు కొనసాగించనున్నారు. జులై 21, 22 తేదిల్లో దరఖాస్తు చేసిన వాటిలో తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా 178 నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం ప్రాంతీయ భాషలతో కలిపి 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులను పరీక్షకు మూడు రోజుల ముందునుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేది, సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ) పేరుతో కొనసాగనుంది.

వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తుంది!
ఒకప్పుడు ‘గ్యాస్ సిలిండర్‌’ బుక్ చేయాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. టెక్నాలజీ పెరిగాక ఆ పరిస్థితుల నుంచి ఉపశమనం లభించింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక గ్యాస్ సిలిండర్‌ బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా మారింది. గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు కాల్ చేసినా లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేసినా సిలిండర్‌ బుక్ అయ్యేది. అయితే గ్యాస్ కంపెనీలు సిలిండర్‌ బుక్ చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేశాయి. వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ఇక నుంచి వాట్సప్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీలు తాజాగా ఈ పద్ధతిని ప్రవేశ పెట్టాయి. హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌ వంటి కంపెనీల గ్యాస్‌ సిలిండర్లను వాట్సప్‌ ద్వారా బుకింగ్ చేసుకునే వెలుసుబాటు కల్పించాయి. మీకు కావాల్సిన కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్‌ పెట్టి.. సిలిండర్‌ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్‌ కూడా వాట్సాప్‌ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో కొత్త కనెక్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు. హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు 9222201122 నంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ పెట్టాలి. వాట్సప్‌లో Hi అని టైప్‌చేసి సెండ్‌ చేయాలి. ఆ త్వరాత వచ్చే మెనూలో పలు రకాల సేవలు వస్తాయి. అందులో మీకు అవసరమైన ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అయితే ముందుగా మీ ఫోన్లో ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్‌కు, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 లేదా 7718955555 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలి.

టీమిండియాకు కలిసిరాని రౌండ్ రాబిన్ ఫార్మాట్.. ఆందోళనలో ఫాన్స్!
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-4‌లో నిలిచిన 4 జట్లు నాకౌట్‌కు (సెమీ ఫైనల్) అర్హత సాధిస్తాయి. పాయింట్స్ టేబుల్లో 1,4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రౌండ్ రాబిన్ పద్దతిలో టోర్నీ జరగడం ఇది మూడోసారి మాత్రమే. 1992, 2019లో మాత్రమే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఈ రెండుసార్లు భారత్ విజేతగా నిలవలేకపోయింది. 1992లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడినప్పుడు భారత్ నాకౌట్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక 2019లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడి సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. 2019లో టైటిల్ ఫెవరెట్ అయినా.. న్యూజిలాండ్ చేతిలో ఓడి అభిమానులను నిరాశపరిచింది. గత రికార్డులే ఇప్పుడు టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 1992, 2019 రికార్డ్స్ చూసి అభిమానులను ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్స్ వచ్చే అయితే ప్రపంచకప్ ఆడుతారో లేదో తెలియదు. అందుకే ఫాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నాకౌట్‌కు చేరేందుకు ప్రతీ జట్టుకు మంచి అవకాశాలు ఉంటాయి. 1,2 మ్యాచ్‌లో ఓడినా.. మిగతా మ్యాచ్‌లో పుంజుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చూడాలి మరి ఈసారి భారత్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌ భయాలను తొలగిస్తుందో.

ప్రతిరోజు ఆ పని గంట చేస్తానంటేనే పెళ్లికి ఒప్పుకున్న కాజల్ భర్త.. సీక్రెట్ రివీల్
కాజల్ అగర్వాల్ పెళ్లి సమయంలో కూడా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఓ కండిషన్ పెట్టాడట. ఆ షరతుకు అంగీకరించిన తర్వాతే ఆమె భర్త కాజల్‌ను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లయ్యాక కాజల్ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ ఒక గంట కాజల్ తనతో ఉండాలని, ఒక్క గంట తన కోసం కేటాయిస్తే ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుందని కండిషన్ పెట్టాడట. కాజల్ సినిమాల్లో బిజీగా ఉన్నందున, ఇది సాధ్యమవుతుందా అని కొన్ని రోజులు ఆలోచించి, ఆ షరతుకు అంగీకరించి గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కొన్ని రోజులు గౌతమ్ కి ఫుల్ టైమ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె సినిమాలకు దూరమైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయి బాబు పుట్టిన త‌ర్వాత కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తోంది.

సురేఖ వాణి కెరీర్ పాడు చేసింది ఆ స్టార్ హీరోనా?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు కారణం నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు వినిపించడమే. ఆ నిర్మాత డ్రగ్స్ కేసులో దొరికిన దగ్గరనుంచి వాటితో సంబంధం ఉందంటూ అషు రెడ్డి, జ్యోతి వంటి వాళ్ల పేర్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సురేఖ వాణి కేపీ చౌదరితో ఒక పబ్లిక్ ఏరియాలో కిస్ చేసుకుంటున్న ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆమెను నిజంగానే డ్రగ్స్ తీసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల్లో సురేఖ వాణి చాలా హోమ్లీ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రల్లో నటించింది. సురేఖ వాణికి ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో తన కూతురితో పోటీపడి కురచ దుస్తులు ధరించి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తూ ఉన్న మంచి ఇమేజ్ ను కాస్త పాడు చేసుకుందంటూ పలు విమర్శలు వచ్చాయి. సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్లతో పాజిటివ్ నెస్ ఏర్పరచుకున్న సురేఖ తన మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం నెగిటివ్ గా మార్చేసుకుంది. సురేఖవాణి కి అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం మాస్ మహారాజ్ రవితేజ అని ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక రవితేజ నటించిన సినిమాల తోనే సురేఖ వాణి ఎక్కువగా ఫేమస్ అయింది. రవితేజ సినిమాల్లో సురేఖ వాణి చేసిన సంగతి తెలిసిందే. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా టైంలో సురేఖ వాణి కి రవితేజకి మధ్య గొడవలు జరిగాయని అప్పటినుండి సురేఖ వాణి కి అవకాశాలు రావడం లేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం రవితేజేనని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అయితే ఇందులో అసలు నిజం ఏంటో తెలియదు కానీ సురేఖ వాణికి అవకాశాలు తగ్గాయనడంలో సందేహం అయితే లేదు.