NTV Telugu Site icon

Top Headlines @ 9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్‌ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్‌ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేయనున్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రభుత్వం అలంకరించింది. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో బుధవారం సాయంత్రం సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు.. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, మంత్రుల సమావేశం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం.. రాత్రికి తిరుమలలో కుటుంబంతో కలిసి బస చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ దుర్గగుడికి చేరుకోనున్నారు. దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు..

 

తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. బుధవారం సాయంత్రం నూతన మంత్రులతో సమావేశం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన చంద్రబాబు.. రాత్రి అక్కడ బస చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ దుర్గగుడిలో అమ్మవారికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నరాు. తిరుమల నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చి నేరుగా దుర్గమ్మ దర్శనానికి రానున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనం చేసుకుని ఉండవల్లిలో ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.

 

ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ గతంలో చెప్పారు. ఈ క్రమంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, విద్యా కానుకను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 62,023 స్కూల్స్ ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమా­న్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలు నేడు ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి.

 

తెలంగాణకు వ్యాపించిన రుతుపవనాలు.. నేడు, రేపు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షం కురిసే సమయానికి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల పాటు గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కీ..
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేడు విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈరోజు వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంచబడుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 17 వరకు స్వీకరిస్తారు.ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వ‌చ్చే అభ్యంత‌రాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని టీజీపీఎస్సీ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన తర్వాత, మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తామని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి. ఇవాళ ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లో హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఉదయం గం. 11 గంటలకు శాస్త్రి భవన్ లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఛార్జ్ తీసుకోవడానికి ముందు తెలంగాణ భవన్ లో అమరవీరుల స్తూపం వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు గురువారం లేదా శుక్రవారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులుగా పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.

అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. నేడే ప్రమాణ స్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు పెమా ఖండూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో జరిగిన సమావేశంలో పెమా ఖండూను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. సాయంత్రం పెమా ఖండూ, తరుణ్ చుగ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేటి పరానాయక్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఇక, ప్రమాణ స్వీకారానికి పెమా ఖండూ, ఆయన మంత్రులను గవర్నర్ ఆహ్వానించారు. కాగా, పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, ఖండూకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశంసించారు. బీజేపీపై విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం ఖండూ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు లోక్‌సభ ఎంపీలతో సహా పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలను ఆయన అభినందించారు. కొత్త ప్రభుత్వం అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా చూస్తామని రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇచ్చానని ఖండూ చెప్పుకొచ్చారు.

నేడు ఇటలీకి ప్రధాని మోడీ.. జీ-7 దేశాల సదస్సుకు హాజరు
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్‌లో జూన్‌ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌, జపాన్‌ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. అలాగే, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా సంఘర్షణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఓ సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుదల గురించిన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, జీ-7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం జీ-20 ఫలితాలను అనుసరించేందుకు ఉపకరిస్తుందని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వత్రా పేర్కొన్నారు. ఇక, స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. అయితే భారత్‌ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను క్వత్రా వెల్లడించలేదు. కాగా, నేటి నుంచి ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో బుధవారం నాడు మహాత్మగాంధీ విగ్రహాన్ని ఖలిస్థానీ మద్దతు దారులు ధ్వంసం చేశారు.

 

కాంగోలో పడవ బోల్తా.. 86 మంది మృతి
కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్‌షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంజిన్​ ఫెయిల్యూర్​ కావడం వల్లే పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 86 మంది మరణించారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద పడవ ప్రమాదమని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. కాగా, దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదు. జనం పడవ ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. పడవ ప్రమాదాలు ఆ దేశంలో సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి 24 మందికి పైగా చనిపోయారు. అలాగే, సోమాలియా, ఇథియోపియాలకు చెందిన వలసదారుల 260 మంది వలసదారులతో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ మంగళవారం యెమెన్‌ తీరంలో మునిగిపోవడంతో 49 మంది చనిపోయారు. మరో 140 మంది గల్లంతైపోయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయం మంగళవారం వెల్లడించింది.

అమెరికాపై చెమటోడ్చి నెగ్గిన భారత్‌.. సూపర్‌-8కు రోహిత్ సేన!
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని అందుకుని సూపర్‌-8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. 3 వికెట్లు కోల్పోయి కానీ.. 18.2 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్‌ యాదవ్ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్‌ దూబే (31 నాటౌట్‌; 35 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. నితీశ్‌ కుమార్‌ (27; 23 బంతుల్లో 2×4, 1×6), స్టీవెన్‌ టేలర్‌ (24; 30 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించారు. జహంగీర్‌ (0), గౌస్‌ (2), ఆరోన్‌ జోన్స్‌ (11), కోరీ అండర్సన్‌ (15), హర్మీత్‌ (10), షాడ్లీ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/9) 4 వికెట్స్ తీయగా.. హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. మోనాంక్‌ పటేల్ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏకు జోన్స్‌ నాయకత్వం వహించాడు. ఛేదనలో భారత కుర్రాడే అయిన సౌరబ్ నేత్రావల్కర్‌ టీమిండియాను ఆరంభంలోనే దెబ్బ కొట్టాడు. రెండో బంతికే విరాట్ కోహ్లీ (0)ని ఔట్‌ చేసిన నేత్రావల్కర్‌.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ శర్మ (3)నూ పెవిలియన్‌ చేర్చాడు. ఈ సమయంలో రిషబ్ పంత్‌ (18) ధాటిగా ఆడి యుఎస్‌ బౌలర్లపై పైచేయి సాధించాలని చూశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ క్రీజులో నిలదొక్కుకోవడానికి తంటాలు పడ్డాడు. భారత్‌ కుదురుకుంటున్న దశలో పంత్‌ను అలీ ఖాన్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం సూర్యకు జత కలిసిన శివమ్‌ దూబె ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడంతో.. తన శైలిలో షాట్లు ఆడడానికి ఇబ్బంది పడ్డాడు. 13 ఓవర్లకు భారత్‌ 60/3 కాగా.. లక్షాన్ని ఛేదించడం చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్య, దూబె సరైన సమయంలో బ్యాట్లు ఝళిపించడంతో లక్ష్యంను భారత్ చేరుకుంది.