NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్‌దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీని ఏర్పాటు చేశారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలు వస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రాంగణం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై ట్రాఫిక్‌జామ్‌ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేపైకి అనుమతిస్తారు. పాస్‌లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసులు తెలిపారు. సభకు వచ్చేవారు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని కోరారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి అమరావతికి రానున్నారు. చంద్రబాబు  24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు.  మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.

 

*ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.
మంత్రుల జాబితా ఇదే..
1. నారా చంద్రబాబు నాయుడు
2. నారా లోకేష్,
3. కొణిదెల పవన్ కళ్యాణ్
4. కింజరాపు అచ్చెన్నాయుడు
5. కొల్లు రవీంద్ర
6. నాదెండ్ల మనోహర్
7. నారాయణ
8. వంగలపూడి అనిత
9. సత్యకుమార్ యాదవ్
10. నిమ్మల రామానాయుడు
11. ఎన్.ఎమ్.డి.ఫరూక్
12. ఆనం రామనారాయణరెడ్డి
13. పయ్యావుల కేశవ్
14. అనగాని సత్యప్రసాద్
15. కొలుసు పార్థసారధి
16. డోలా బాలవీరాంజనేయస్వామి
17. గొట్టిపాటి రవి
18. కందుల దుర్గేష్
19. గుమ్మడి సంధ్యారాణి
20. బీసీ జనార్థన్ రెడ్డి,
21. టీజీ భరత్,
22. ఎస్.సవిత
23. వాసంశెట్టి సుభాష్
24. కొండపల్లి శ్రీనివాస్
25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

 

*ఏపీ కేబినెట్‌లో 17 మంది కొత్తవారే..
చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. ఇదిలా ఉండగా.. కేబినెట్‌లో 17 మంది కొత్తవారే ఉండడం గమనార్హం. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. మంత్రి వర్గ జాబితాలో 8 మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరిని , వైశ్యుల నుంచి ఒకరిని పదవి వరించింది.
తొలిసారి కేబినెట్‌లో అడుగుపెట్టేది వీరే..
01. కొణిదెల పవన్ కళ్యాణ్.
02. వంగలపూడి అనిత
03. సత్యకుమార్ యాదవ్
04. నిమ్మల రామానాయుడు
05. పయ్యావుల కేశవ్
06. అనగాని సత్యప్రసాద్
07. డోలా బాల వీరాంజనేయస్వామి
08. గొట్టిపాటి రవి
09. కందుల దుర్గేష్.
10. గుమ్మడి సంధ్యారాణి
11. బీసీ జనార్థన్ రెడ్డి
12. టీజీ భరత్
13. ఎస్.సవిత
14. వాసంశెట్టి సుభాష్
15. కొండపల్లి శ్రీనివాస్
16. మండిపల్లి రామ్ ప్రసాద్
17. నాదెండ్ల మనోహర్.

 

*ముగిసిన వేసవి సెలవులు.. నేటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..
నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించే కొత్త ట్రెండ్‌ను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫారాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ యూనిఫారాల కుట్టు బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ సంకల్పం నెరవేర్చి గడువులోగా కుట్టుపనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులు, మహిళా సంఘాలను సమన్వయం చేస్తూ గడువులోగా యూనిఫారాలు పాఠశాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యార్థినుల యూనిఫాం కుట్టించే పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పనులు చేసిన మహిళా సంఘాలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, పీఆర్‌ఆర్‌డీ, సీఈవో సర్ప్‌, కలెక్టర్లు, సర్ప్‌ అధికారులు, డీఆర్‌డీవో, అడిషనల్‌ డీఆర్‌డీవో, డీపీఓలు ఏపీఎం, సీసీ తదితర అధికారులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పరిమిత సంఖ్యలో టైలర్లకు కుట్టించే పనిని అప్పగించడంతో సకాలంలో యూనిఫారాలు అందడం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, టైలర్ల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల ప్రారంభమై మూడు, నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాం అందడం లేదన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించి కుట్టు ఖర్చును 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘం సభ్యులు, 18 వేల గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి 15 లక్షల 30 వేల 603 (ఒక జత) యూనిఫాంలు కుట్టించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటి వరకు 90 శాతం యూనిఫాంలు సిద్ధమైన సంగతి తెలిసిందే. రూ. కుట్టుపనితో మహిళా సంఘాలకు ఏటా 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భవిష్యత్తులో కూడా మహిళా సంక్షేమ కార్యక్రమాలను అందజేసి మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

*బిగ్‌ అలర్ట్.. నేడు టెట్ ఫలితాలు విడుదల..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టీజీపీఎస్సీ మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా.. పేపర్ పార్ట్-1కి 85,996 మంది, పేపర్ పార్ట్-2కు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TET పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు I నుండి V తరగతి వరకు బోధించే STG పోస్టులకు అర్హులు. పేపర్-2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా.. tstet2024.aptonline అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా టీఎస్‌ టెట్‌ ర్యాంక్‌ కార్డును ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ టెట్ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో టెట్ పరీక్షకు మంచి డిమాండ్ ఉంది. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే B.D., D.Ed పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రతిసారీ పెద్ద సంఖ్యలో పోటీపడతారు. మరోవైపు ఎన్నికలకు ముందు టెట్ పరీక్షను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఫలితాలను ప్రకటించలేదు.

*తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాలు ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు, రేపు (బుధ, గురువారా)ల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

*నేడే ఒడిశా సీఎంగా మోహన్‌ మాఝీ ప్రమాణస్వీకారం..
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్‌ చరణ్‌ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రవతీ పరిడా, కేవీ సింగ్‌దేవ్‌లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాఝీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం సీఎంగా మోహన్ చరణ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వాన తొలి పత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథస్వామికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఇక, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ను సైతం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం హాజరుకాబోతున్నారు. 147 సీట్లున్న ఒడిశాలో ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టబోతుంది. కాగా, ఒడిశా బీజేపీ సీనియర్‌ నేతల్లో ఒకరైన మోహన్ చరణ్ మాఝీ.. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా, అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్‌ స్థానం నుంచి ఆయన గెలిచారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1997-2000 వరకు సర్పంచ్‌గా పని చేసిన ఆయన.. 2000వ సంవత్సరంలో తొలిసారి ఒడిశా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా మాఝూ ఎదిగారు.

*జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ పోస్ట్‌పై మరోసారి దాడి.. మూడు రోజుల్లో మూడోసారి..!
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. అయితే, ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు తెలుస్తుంది. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ఉగ్రదాడి జరిగింది. అలాగే, మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో డ్రైవర్ వారి నుంచి తప్పించడంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఆ దాడిలో 9 మంది ప్రయాణికులు చనిపోగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, మంగళవారం సాయంత్రం కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలోని ఒక గ్రామంపై దాడి చేసి ఒక పౌరుడిని గాయపరిచిన దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టారు. కతువా ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. కథువా జిల్లాలోని చత్రగల ఏరియాలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు వెల్లడించారు.

 

*నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్‌ గురి!
టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్‌-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.విజయాలు సాధించినా బ్యాటింగ్‌లో భారత్‌ మెరుగుపడాల్సి ఉంది. పాక్ మ్యాచ్‌లో పరుగుల కోసం చెమటోడ్చిన టీమిండియా.. 27 పరుగులకే చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. ఆ తడబాటును అధిగమిస్తూ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబే సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. రిషబ్‌ పంత్‌ ఆట జట్టుకు సంతోషాన్నిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్‌ దళంతో పాటు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే. పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా వరుసగా రెండు విజయాలతో సూపర్‌-8 రేసులో నిలిచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు షాకిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. కెనడాతో మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ను సూపర్‌ ఓవర్‌ దాకా లాక్కొచ్చి గెలిచింది. ఆరోన్‌ జోన్స్‌ ఫామ్‌లో ఉండడం అమెరికాకు సానుకూలాంశం. కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్, అలీ ఖాన్‌లు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అందుకే అమెరికాను భారత్‌ తేలికగా తీసుకుంటే పొరపాటే అవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. న్యూయార్క్‌ పిచ్‌లో ఏ మార్పు లేదు. మరోసారి తక్కువ స్కోరే నమోదు కానుంది. ఇక్కడ చిన్న లక్ష్యాలను ఛేదించడం కూడా కఠిన సవాలుగా మారుతోంది. అయితే గత మ్యాచ్‌ల్లోలా బంతి అనూహ్యంగా బౌన్స్‌ కాదని భావిస్తున్నారు. చేజింగ్‌ కష్టం కావడంతో టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకోనుంది. ఈ మ్యాచ్‌కు వర్షంతో పూర్తిగా ముప్పయితే లేకపోయినా అంతరాయం తప్పదు.
తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్‌ దూబే/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.
అమెరికా: స్టీవెన్‌ టేలర్, మోనాంక్‌ పటేల్, ఆంద్రీస్‌ గౌస్, ఆరోన్‌ జోన్స్, నితీశ్‌ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్‌ సింగ్, జస్‌దీప్‌ సింగ్, కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్, అలీ ఖాన్‌.