NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేటి సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి మోడీ 3.0 సర్కార్ కొలువుదీరింది. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రెండో ప్రధానమంత్రిగా మోడీ రికార్ట్ సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా పని చేసిన చరిత్ర కేవలం పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకే ఉంది. ఇప్పుడు మోడీ ఆ రికార్డును సమం చేసేశాడు. ఇక, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోడీ 3.0 సర్కార్ లో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా.. వీరికి తొందరలోనే శాఖలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ( సోమవారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరుగనుంది. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణం చేశారు.

 

*జేపీ నడ్డా, శివరాజ్‌సింగ్‌లు మంత్రులు అయ్యారు.. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు ఎవరు?
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్‌సభ ఎన్నికల వరకు పొడిగించారు. కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపై అనేక చర్చలు జరిగాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా మారారు కాబట్టి ఇప్పుడు కొత్త పేర్లపై చర్చ మొదలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినందున ఆ రాష్ట్రం నుంచి కొత్త జాతీయ అధ్యక్షుడు రావచ్చని చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బలహీనపడిందని కూడా చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ నేత పేరు కూడా ప్రచారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మ్యాజిక్ నంబర్ 272కి చేరువ కాలేదు. దీని తరువాత, ఇప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థపై మరింత శ్రద్ధ చూపుతుందని, కొత్త అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా దాని పూర్తి సమ్మతితో మాత్రమే చేస్తారని నమ్ముతారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న చాలా మందికి ఈసారి ప్రభుత్వంలో చోటు దక్కలేదు. వారికి బీజేపీ బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రి మండలిలో చోటు దక్కకపోవడంతో ఆయనకు ఆ స్థానం కల్పించవచ్చు. ఆయన ఇప్పటికే బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా, స్మృతి ఇరానీతో సహా చాలా మంది నాయకులు ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నారు. ఈ పదవికి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్ అనే ఇద్దరి పేర్లపై ఊహాగానాలు పెరిగిపోయాయి. మహారాష్ట్రకు చెందిన వినోద్ తావ్డే జాతీయ రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీహార్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల సమయంలో అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. పార్టీ నిర్వహించే ప్రత్యేక ప్రచారాలు, ప్రజాసంబంధాల కార్యక్రమాలను అమలు చేస్తూ తక్కువ కాలంలోనే తావ్డే ప్రాధాన్యతను సంతరించుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థ)గా యూపీలో కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చిన మరో నాయకుడు సునీల్ బన్సాల్. యూపీ తరువాత, బన్సల్‌కు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీగా జాతీయ పనిని అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, బన్సాల్ దేశవ్యాప్తంగా కాల్ సెంటర్‌లను కూడా నిర్వహించాడు, అభిప్రాయాన్ని సేకరించాడు. అట్టడుగు స్థాయి పార్టీ కార్యకర్తలను ప్రేరేపించాడు. బన్సాల్ బీజేపీ అగ్రనాయకత్వం నమ్మకాన్ని గెలుచుకున్నారు. కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ పూర్తయ్యే వరకు పార్టీ అధ్యక్ష పదవిలో నడ్డాను కొంతకాలం కొనసాగించే అవకాశం కూడా ఉంది.

 

*తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
తెలంగాణలో పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. రాబోయ్ ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇక ఆంధ్రపరదేశ్ విషయానికి వస్తే నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం అధికారులుకు తగిన జాగరత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది..

 

*గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు అయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా.. అభ్యర్థులు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది మాత్రమే హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అంటే 74 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ 1 కింద 536 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు 536 మంది పోటీ పడనున్నట్లు తెలిపారు. దీంతో.. పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. కాగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. గణిత నేపథ్యం ఉన్నవారు వీటికి సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. సర్వేలు, నివేదికల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈసారి సాధారణ కటాఫ్ 75-80 మార్కుల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కూనారం రైలు గేటు పడిపోవడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. అధికారులు అనుమతించకపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మంథన్‌కు చెందిన ప్రసన్య పొరపాటున మరో స్నేహితురాలి హాల్‌టికెట్‌ తీసుకురాగా, అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.

 

*నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా.. వరుస ఎన్నికల కోడ్‌లతో స్తంభించిన పాలనకు గండి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాయి. రైతు రుణమాఫీ వంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు హామీల అమలుతో పాటు సాధారణ పాలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే.. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన, ఆదాయ వనరుల పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షలు ప్రారంభించగా, నేటి నుంచి మంత్రులందరూ అన్ని శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆయా శాఖల పనితీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రులందరూ వారి వారి నియోజకవర్గాలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలు, బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలిస్తారు.

 

*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. అమిత్‌ షాతో భేటీ అనంతరం ప్రకటించే చాన్స్‌..
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం తనకు అత్యంత సన్నిహితులైన అస్సాం సీఎం, హైకమిషనర్ హిమంత బిస్వాతో ఈటల భేటీలో జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటల ఫోన్ లో మాట్లాడి ఈ అంశాలను వివరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకున్నదని.. పార్టీ శ్రేణులను పూర్తిగా కలుపుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వారిద్దరూ సూచించినట్లు సమాచారం. ఈటల రాజేందర్ మొదట కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయితే పార్టీ అగ్రనాయకత్వంతో ఒప్పించి రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ కేబినెట్‌లో నంబర్‌ టూగా గుర్తింపు పొందిన సందర్భంలోనూ, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈటలకి ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతమైన నేతగా ఆయనకున్న ఇమేజ్‌ రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని అంటున్నారు. పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈటలకు గుర్తింపు రావడంతోపాటు వివిధ సామాజికవర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, వర్గాలతో సత్సంబంధాలు ఉండడం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.

 

*మోడీ మంత్రివర్గంలో ఏడుగురు మహిళలు..
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోడీతో పాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసేశారు. అయితే, మోడీ3.0 మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. కానీ, గతంలో కేబినేట్ లో 10 మంది మహిళలకు స్థానం దక్కింది. గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన స్మృతి ఇరానీ, డాక్టర్ భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, దర్శన జర్దోష్, మీనాక్షి లేఖి, ప్రతిమా భూమిక్ లకు అవకాశం ఇచ్చారు. ఇక, రాజ్యసభ ఎంపీ నిర్మలా సీతారామన్ మరోసారి మంత్రి మండలిలో ఛాన్స్ దొరికింది. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆమె పని చేసింది. ఇక, తాజా మంత్రివర్గంలోకి ఝార్ఖండ్ కు చెందిన ఓబీసీ నాయకురాలు, బీజేపీ నేత అన్నపూర్ణాదేవి, మధ్యప్రదేశ్ కు చెందిన గిరిజన నాయకురాలు సావిత్రి ఠాకూర్, గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకురాలు నిముబెన్ బంభానియా, మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే, కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజే, అప్నాదళ్ నాయకురాలు, కుర్మీ కమ్యూనిటీకి చెందిన నేత అనుప్రియా పటేల్ కేబినేట్ లో స్థానం దక్కించుకున్నారు.

 

*ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 11 మంది
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలోని రెండంతస్తుల ఇంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని రూపం చాలా భయంకరంగా ఉంది. కొద్దిసేపటికే అంతా కాలిపోయింది. కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంట్లో 200 లీటర్ల కిరోసిన్‌ ఉంచడంతో మంటలు రెండంతస్తుల ఇంటికి వ్యాపించాయి. అగ్నిప్రమాదం కారణంగా ఒకే ఇంట్లోని 11 మంది జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయి. మంటలు చెలరేగడంతో ఇల్లంతా అరుపులు వినిపించాయి. అందరూ మంటల్లో కాలిపోవడం ప్రారంభించారు. ఇంట్లో మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నారు. 48 ఏళ్ల ప్రకాష్ సోనీ తన కుటుంబంతో దేవ్‌పురాలోని పారాలో నివసిస్తున్నాడు. అతని కుటుంబానికి ఆదివారం ఆఖరి రోజు అయింది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రకాష్ ఇంట్లో మంటలు చెలరేగాయి. బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగగా, కొద్దిసేపటికే రెండో అంతస్తులోని గదుల్లోకి మంటలు వ్యాపించాయి. మంటలకు గదిలో ఉన్నవారు ప్రాణాలు కోల్పోవడంతో కేకలు వచ్చాయి. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగడంతో గాయపడిన వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రధాన ద్వారం వద్దనే మంటలు వేగంగా ఎగసిపడటం ప్రారంభించాయి. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు గంటలపాటు శ్రమించి ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. ఇంట్లో పెంపుడు జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి, వాటిని బయటకు తీశారు. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

*నలుగురు బందీల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి..!
సెంట్రల్‌ గాజాలో శనివారం ఇజ్రాయేల్ నలుగురు బందీల విడుదల కోసం చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మరణించగా.. దాదాపు 700 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు భారీగా ఉన్నారని ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది మరణించినట్లు ఇజ్రాయేల్ తెలపగా.. అయితే, ఈ సంఖ్య ప్రస్తుతం 274కు చేరుకుంది. బాధితుల ఆర్తనాధాలతో అల్‌-అఖ్సా ఆస్పత్రి ఫుల్ అయిందని ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పుకొచ్చింది. ఆదివారం సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్‌ దగ్గర ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయల్‌ ప్రత్యేక దళాలు రక్షించాయి. అయితే, ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకోవడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బందీలను రక్షించే టైంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ వెల్లడించారు.. ఆ ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇక, నుసీరాత్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో బందీలను ఉంచినట్లు సమాచారం వచ్చింది.. రెండు బిల్డింగుల్లోకి మా బలగాలు ఒకేసారి ప్రవేశించడంతో.. వారిపై పెద్ద ఎత్తున దాడులు చేశారు.. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతి చర్యలు తీసుకున్నామని ఇజ్రాయేల్ వెల్లడించింది. ఇక, గత ఏడాది అక్టోబర్లో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మాత్ గా దాడి చేసి.. దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తీసుకుపోయాయి. దీంతో, నవంబరులో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ టైంలో కొంత మందిని వదిలిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ చెప్పు్కొస్తుంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు తెలుస్తుంది.