NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సీఆర్‌డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం.. 50 వేలకు పైగా ఇళ్లకు నేడే శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.. 50,793 ఇళ్ల నిర్మాణాలకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు.. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1,829.57 కోట్లు వెచ్చించనున్నంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వ్యయంతో అన్ని మౌలిక వసతులతో 50,793 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.. సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్‌లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. 71, 811 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు కూడా చేయించనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా అందజేశారు.. ఇక, ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. మరోవైపు.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో 28,000 మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే.. మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతున్నారు సీఎం జగన్‌.. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్‌ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలు నిర్మించనున్నారు..

శ్రీవారి భక్తులకు శుభవార్త..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకుంటున్నారా? శ్రీ వేంకటేశ్వరుడి సేవలో తరించాలనుకుంటున్నారా? ఏడు కొండలు ఎక్కాలనుకుంటున్నారా? ఇప్పుడు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). దర్శన టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానుకండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, వసతి టికెట్లు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. ఆయా టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకుంటున్న భక్తులు.. అలర్ట్‌గా ఉండి టికెట్లు బుక్‌ చేసుకోవాలి.. ఇక, రేపు ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. ఆగస్టు నెలతో పాటు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన అదనపు కోటా టికెట్లు విడుదల కానున్నాయి.. రోజుకి 4 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఏదేమైనా తిరుమల శ్రీవారికి సంబంధించిన ఏ టికెట్లకైనా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది.. ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తియిన సందర్భాలు అనేకం. కావున.. భక్తులు అలర్ట్‌గా ఉండి టికెట్లు బుక్‌ చేసుకుంటే తప్ప.. దొరకని పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 87,792 మంది భక్తులు దర్శించుకున్నారు.. వారిలో 29,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.2 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.

కూలిపోయిన జిమ్‌ పైకప్పు.. 10 మంది దుర్మరణం
ఈశాన్య చైనాలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో 10 మంది మరణించగా, ఒకరు చిక్కుకుపోయారని రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని నెం. 34 మిడిల్ స్కూల్‌లోని జిమ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పకూలిందని తెలిసింది. సోమవారం ఉదయం 5:30 నాటికి, శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీ ద్వారా ప్రసారం చేయబడిన ఫుటేజీలో మొత్తం పైకప్పు జిమ్‌పై కూలిపోయిందని, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తు్న్నట్లు కనిపించింది. దాదాపు 160 అగ్నిమాపక సిబ్బంది, 39 అగ్నిమాపక ట్రక్కులతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నిర్మాణ సంస్థకు బాధ్యత వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరిగా అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణం. 2015లో టియాంజిన్‌లో ఇలాంటి ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడులో కనీసం 165 మంది మరణించారు.

నేటి నుంచి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్‌ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్‌ఐ అధికారులు మసీదు వద్దకు చేరుకోగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివలింగం ఉన్నట్టుగా హిందూ ప్రతినిధులు చెబుతున్న ‘వాజుఖానా’ మినహా మసీదులో అంతటా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా సర్వే చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. మసీదు హిందూ దేవాలయంపై నిర్మించబడిందని పేర్కొంటూ కొంతమంది మహిళల పిటిషన్‌పై ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మసీదు లోపల పురాతన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని, శాస్త్రీయ సర్వే మాత్రమే నిజాన్ని వెల్లడిస్తుందని మహిళలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు 4లోపు జిల్లా కోర్టుకు నివేదికను సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కనుమరుగుకానున్న ట్విట్టర్ పిట్ట.. కొత్త లోగో ‘ఎక్స్’!
ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్‌ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లోగోనుంచి పక్షి మాయమవుతుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ట్విట్టర్‌కు ఆ పక్షి లోగో ప్రధాన చిహ్నంగా ఉన్న సంగతి తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని మస్క్ ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ట్విట్టర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన‘ ఎక్స్‌కార్ప్’లో విలీనం చేయనున్నట్లు కొన్నాళ్ల క్రితం మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.‘ త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం.” అని ఎలాన్‌ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే ట్విట్టర్ పక్షి కనుమరుగవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత లోగో, బ్లూ బర్డ్ తమ గుర్తింపు అసెట్ అని, అందుకే దీనిని మేము కాపాడుకుంటామని ట్విట్టర్ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ‘ఎక్స్’ పేరు విషయం కొంతకాలంగా ఎలాన్ మస్క్ మనసులో ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా ఎలాన్ మస్క్ గతేడాది ఏకంగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఎక్స్ కార్ప్ కంపెనీలో దీనిని విలీనం చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత యజమాని ఎలాన్‌ మస్క్ దానిపై అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ట్విట్టర్‌కి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా బాగా పాపులరిటీ తెచ్చిపెట్టిన లోగోనే మార్చాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా సింబాలిక్‌గా ఉన్న పిట్ట బొమ్మను తొలగించి దాని స్థానంలో ఎక్స్ (x) అనే అక్షరాన్ని చేర్చుతున్నట్లుగా ప్రకటించారు.

జియో నుంచి అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్.. ఫీచర్స్?
గత ఏడాది అక్టోబర్ 2022లో, జియో భారతదేశంలో తన మొదటి ల్యాప్‌టాప్ జియోబుక్‌ను ప్రారంభించింది, దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో, ఇప్పుడు జియో రెండవ ల్యాప్‌టాప్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ తన కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల చేయబోతోంది. కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్ టీజర్ అమెజాన్ ద్వారా విడుదలైంది. దీని ద్వారా కొన్ని స్పెసిఫేకషన్స్ , ఫీచర్లు కూడా తెలిశాయి.. అవేంటంటే.. ఈ కొత్త ల్యాప్‌టాప్ భారతదేశంలో జూలై 31, 2023న ప్రారంభం కానుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ అమెజాన్‌లో లిస్ట్ అయ్యింది., ఇది వినోదం , ఆటల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని చూపిస్తుంది. ఈ సరసమైన ల్యాప్‌టాప్ Jio, Amazon అధికారిక సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది..కొత్త JioBook ల్యాప్‌టాప్ ప్రయాణంలో 4G కనెక్టివిటీని అందిస్తుంది. పరికరంతో పాటు Wi-Fiకి కూడా మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. JioBook , మునుపటి దానిలా కాకుండా, రాబోయే ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది.. Jio కు సంబందించిన పలు యాప్ లు కూడా ఇందులో ఉండనున్నాయి..

ప్రధాన నగరాల్లో పడిపోయిన చిన్న ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో మరీ దారుణం..!
ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అంటే.. ఈ రెండు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నవి.. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న పనికూడా.. అయితే, బ్యాంక్‌ లోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇళ్ల విక్రయాలు పెరిగిపోయాయి.. నెలసరి వాయిదాలతో కట్టుకునే వెసులుబాటు ఉండడంతో.. వారికి వచ్చే జీతాన్ని, ఇతర ఆదాయాలను బట్టి ఇళ్లు కొనేస్తున్నారు.. కానీ, ఈ ఏడాది ప్రథమార్ధం అంటే జనవరి-జూన్‌ మధ్య దేశంలోని ఏడు ప్రధాన సిటీల్లో ఇళ్ల విక్రయాలు మందగించాయి.. ముఖ్యంగా రూ.40 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 18 శాతం తగ్గి 46,650 యూనిట్లకు పరిమితమైనట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ పేర్కొంది. ఇక, సమయంలో హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ భారీగా తగ్గిపోయాయి ఇళ్ల విక్రయాలు.. సగానికి పైగా తగ్గి 720 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి సిటీలో ఈ విభాగ ఇళ్ల అమ్మకాలు 1,460 యూనిట్లుగా నమోదు కాగా.. ఈ సారి అవి 720తో ఆగిపోయాయి.. అయితే, ఇళ్ల విక్రయాలు పడిపోవడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది అనరాక్‌.. అందుబాటు ధరల్లో లభించే గృహాల సరఫరా తగ్గడంతో పాటు ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడమే ప్రధాన కారణంగా అనరాక్‌ తెలిపింది.. గత ఏడాది ప్రథమార్థం అంటే జనవరి-జూన్‌ మధ్య దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల అమ్మకాలు 57,600 యూనిట్లు. అంటే, అన్ని విభాగాల హౌసింగ్‌ సేల్స్‌లో వీటి వాటా 31 శాతంగా నమోదైంది. కానీ, ఈ ఏడాదిలో అందుబాటు ధరల ఇళ్ల విక్రయాల వాటా 20 శాతానికి పడిపోయింది..

పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంత ఉందంటే?
ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు ;ఏడూ. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా నమోదైంది.

ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన వరణుడు.. ఆస్ట్రేలియాదే ‘యాషెస్‌’ సిరీస్‌!
‘బజ్‌బాల్‌’ ఆటతో సొంతగడ్డపై యాషెస్‌ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్‌ సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌, ఆ్రస్టేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియగా.. ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశ మిగిలింది. బజ్‌బాల్‌ ఆట ఇంగ్లీష్ జట్టును దెబ్బకొట్టిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆస్ట్రేలియా చేతిలో తొలి రెండు టెస్టులు ఓడినా.. మూడో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్‌ ఆశలు నిలబెట్టుకున్న ఇంగ్లండ్‌కు నాలుగో టెస్టు కీలకంగా మారింది. గెలిచే స్థితిలో ఉన్న ఇంగ్లండ్‌ జోరును చివరి రోజు వరుణుడు అడ్డుకున్నాడు. నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 214/5తో నిలిచింది. చివరి రోజు ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేసి.. విజయంపై ఇంగ్లండ్‌ కన్నేసింది. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా.. వరుణుడు ఇంగ్లండ్‌ను ఆడేసుకున్నాడు.