NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. నేడు, రేపు పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ టీమ్‌ పర్యటన కొనసాగనుంది.. సోమవారం రాత్రే విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం సమీక్షిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ప్రకటించామని వెల్లడించారు. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది.. ఏపీ సీఎస్‌, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ­ఐ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. 10వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది.. దీంతో.. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది.. కాగా, ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు కూడా జరగనున్న విషయం విదితమే.. అయితే, ఓటర్ లిస్టులో అవకతవకలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు పలుమార్లు పోటాపోటీగా ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర ఎన్నికల కమిషన్‌.. రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.

ఒంగోలు ఎంపీ సీటుపై తొలగిన అనిశ్చితి..! ఆయనకు లైన్‌ క్లియర్‌..!
ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది.. ఇప్పటికే రెండు లిస్ట్‌లు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితా కూడా సిద్ధం చేసింది.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రెండు జాబితాలతో ఇప్పటికే ఈ సారి నో టికెట్‌ అని తేల్చేసింది.. మరికొందరి స్థానాలు మార్చేసింది.. ఇదే సమయంలో.. ఒంగోలు ఎంపీ సీటుపై ఎవరికి? అనే చర్చ సాగుతూ వచ్చింది.. ఈ సారికి సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు ఇచ్చే అవకాశం లేదనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఆయన టీడీపీవైపు చూస్తున్నారని.. వైసీపీ టికెట్‌ రాకుంటే.. ఫ్యాన్‌ కింద నుంచి జరిగి.. సైకిల్‌ ఎక్కడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగింది.. అయితే, ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అనిశ్చితి తొలగినట్లు సమాచారం.. విజయవాడలో సోమవారం అర్ధరాత్రి వరకు ఎంపీ మాగుంట, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధి సమావేశం అయ్యారు.. రెండు గంటల పాటు మాగుంట, బాలినేనితో ఐ ప్యాక్ సుదీర్ఘ మంతనాలు సాగించింది. చర్చల్లో పలు కీలక అంశాలు కొలిక్కివచ్చాయట.. మొత్తంగా ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. మాగుంట విషయంలో ఆదినుంచి పట్టుపడుతూ వచ్చిన బాలినేని.. మొత్తంగా అందరినీ ఒప్పించగలిగారట.. పలువురు నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, చేర్పుల విషయంలో కూడా పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం.. అన్నీ పూర్తయితే ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండేపి, అద్దంకి మార్పులు పూర్తి కాగా.. మరో రెండు నియోజకవర్గాల్లో కసరత్తులు పూర్తి చేసింది వైసీపీ అధిష్టానం.. మిగతా చోట్ల కూడా ఓ క్లారిటీకి వచ్చారట వైసీపీ అధిష్టానం పెద్దలు.. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమావేశం కానుండగా.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు.

కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడకు చేరుకున్న విషయం విదితమే.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగనుంది.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అందులో భాగంగా.. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌… రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక, తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను భారీ ఎత్తున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనుంది టీడీపీ, జనసేన.. అంతేకాదు.. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈవో ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శిస్తోంది టీడీపీ.. ఈ వ్యవహారాన్ని కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సీఈసీకి ఇచ్చే రిప్రజెంటేషన్‌లో ప్రధానంగా టీడీపీ – జనసేన ప్రస్తావించేందుకు సిద్ధమైంది. మరోవైపు.. సచివాలయ సిబ్బంది వైసీపీ తరఫున ‘జగనే ఎందుకు కావాలనే’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేయనున్నారు. అధికారులు, పోలీసుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పట్టిమచుకోవడం లేదని కంప్లైంట్ ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ సిద్ధమయ్యారు.

ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ఇస్తున్నట్లు పేర్కొనింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని ప్రకటించారు.. కానీ ఆ తరువాత మార్పులు చేసిన సర్కార్.. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పది రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. ఇక, ఈసారి జనవరి 13 రెండవ శనివారం, 14వ తేదీ భోగి పండుగ, జనవరి 15న సంక్రాంతి పండుగలున్నాయి. రెండ్రోజులు సాధారణ పబ్లిక్ సెలవులు రావడంతో 18వ తేదీ వరకూ సెలవులు పొడిగించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక కాలేజీలకు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అలాగే, మరోవైపు తెలంగాణలో కూడా జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లకు హాలీడేస్ ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాలేజీలకు మాత్రం 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ సెలవులను తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డ్ ప్రకటించింది.

RTC బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్‌.. మండి పడుతున్న స్థానికులు..
ఒకప్పుడు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిళ్లు జరిగేవి. కాలక్రమేణా ఆట్రెండ్ మారింది. ఇప్పుడు బంధువులు, స్నేహితులు జీవితాతం గుర్తుంచుకోవడానికి వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకరి తరువాత మరొకరు కాలానికి అనుగుణంగా పెళ్లికి కొత్త కొత్త కార్యక్రమాలు జోడిస్తున్నారు. అయితే అందరూ ఫాలో అయ్యేది ప్రీ వెడ్డింగ్ షూట్. పెళ్లికి ముందు.. ప్రీ వెడ్డింగ్ షూట్లతో వధూవరులతో సినిమా రేంజ్ లో పాటలు షూట్ చేస్తున్నారు. యువత కూడా ఈ ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కేవలం వధూవరులిద్దరి చిత్రాలను తీయడమే కాదు.. రకరకాల థీమ్స్, తగిన లొకేషన్లు… సినిమా రేంజ్ సెటప్‌లు, పాటల గెటప్‌లు ఉంటాయి. ఒకటి పొలాల దగ్గర రైతుల ఇతివృత్తంతో, మరొకటి బీచ్ థీమ్‌తో, మరొకటి కొండలు, గుట్టల థీమ్‌లతో చిత్రీకరిస్తున్నారు. మరికొందరు తమకు ఇష్టమైన ప్రేమగీతాలను రీక్రియేట్ చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. కొత్త ట్రెండ్ సెట్ చేయాలని ఎక్కడపడితే అక్కడ షూటింగ్స్ చేస్తున్నారు. అయితే కొందరు చేస్తున్న ఫ్రీ వెడ్డింగ్ షూట్ పై స్థానికులు మండిపడుతున్నారు. ఇదేం పైత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లోని రద్దీ రోడ్లపై ఓ జంట తీసిన ప్రీ వెడ్డింగ్ వీడియో.. ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

మొదటి సారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ నాయకత్వం..
జీ20 తర్వాత భారత్ మరో విజయాన్ని సాధించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం మొదటి సారి అధ్యక్షత వహించి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాచారాన్ని ఇస్తూ, యునెస్కోలో భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ మాట్లాడుతూ.. 2024 జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారతదేశం మొదటి సారి అధ్యక్షత వహించి ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం సంవత్సరానికి ఒకసారి జరుగుతుందన్నారు. ఈ కమిటీ ప్రపంచ వారసత్వ సదస్సు అమలు చేస్తుంది. అయితే, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీకి దేశం నాయకత్వం వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాల పరిరక్షణతో పాటు గుర్తింపు కోసం భారతదేశం చురుకుగా సహకరించడంతో ఈ అవకాశం వచ్చిందని విశాల్ వి శర్మ పేర్కొన్నారు. ఇక, యునెస్కో 16 నవంబర్ 1945న ఏర్పడింది.. ప్రపంచంలోని కళలు, విద్య, సైన్స్ తో పాటు సంస్కృతిలో అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతి, భద్రత కోసం ప్రయత్నించడం యునెస్కో యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. ఇక, యునెస్కోలో 193 సభ్య దేశాలు, 11 అసోసియేట్ సభ్యులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌లో ఉంది. దాని గ్లోబల్ చార్టర్‌ను అమలు చేసే 199 దేశాలలో 53 ప్రాంతీయ కార్యాలయాలు, జాతీయ కమీషన్‌లు ఉన్నాయి.

నేడు మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చ.. మహావికాస్ అఘాడీ నేతల కీలక భేటీ
లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి నుంచి మహారాష్ట్రలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనే విషయం నేడు కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్‌సీపీ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, మహారాష్ట్రకు సంబంధించి భారత (I.N.D.I.A.) కూటమి సమావేశం జరగనుంది. ఇందులో కాంగ్రెస్, శివసేనతో పాటు ఎస్పీ నాయకులు పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై భారత కూటమిలోని పార్టీలు చర్చించనున్నారు. మహారాష్ట్రలో పొత్తుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. త్వరలో ఢిల్లీలో మహావికాస్ అఘాడీ నేతల భారీ సమావేశం జరగనుంది.. అలాగే, అందులో సీట్ల పంపకంపై కూడా చర్చ జరుగుతుందని ఇండియా కూటమి నుంచి సమాచారం. జనవరి 14-15 మధ్య ఢిల్లీలో మహావికాస్ అఘాడీ సమావేశం జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారు. ఇందులో సీట్ల పంపకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక, ఆదివారం బీహార్‌లో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు ఆర్‌జెడీ నాయకులు వర్చువల్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల పంపకాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య నిన్న (సోమవారం) చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై లోతైన కొనసాగింది. అయితే, సిట్ల పంపకాలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో ఆప్ 4 సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. అయితే, పంజాబ్ తో పాటు చండీగఢ్‌లలో ఆప్ 50-50 ఫార్ములాపై అంగీకరించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు గుజరాత్‌లో ఒక సీటు, హర్యానాలో మూడు, గోవాలో ఒక సీటును ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, జనవరి 11 లేదా 12వ తేదీల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్‌ స్కేల్‌పై 6.7 తీవ్రత!
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఈ భూకంపం 80 కి.మీ లోతులో సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు వస్తాయన్న విషయం తెలిసిందే. గత వారం జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. గత ఎనిమిదేళ్లలో జపాన్‌లో సంభవించిన ఘోరమైన భూకంపం ఇది. ఈ భూకంప ధాటికి దాదాపుగా 100 మంది మరణించారు. 200 మందికి పైగా ప్రజల ఆచూకి ఇంకా తెలియరాలేదు. హోకురికు ప్రాంతంలో 23,000 గృహాలకు ఇప్పటికీ విద్యుత్ లేదు. జపాన్ పశ్చిమ తీరంలో వచ్చిన ఈ భూకంపం మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.

బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రెజిల్‌లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రి వేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొనింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.

నేడే భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20.. తొలి సిరీస్‌ సాధించేనా!
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు టీ20లో చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ పోరులో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి ఆస్ట్రేలియాపై స్వదేశంలో సిరీస్‌ పట్టేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది. రెండో టీ20లో గెలిచి ఊపుమీదున్న ఆసీస్ కూడా సిరీస్ గెలవాలని చూస్తోంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి టీ20లో అద్భుత విజయం సాధించి జోరు మీద కనిపించిన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్‌లో తడబడింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఈ రెండు విభాగాల్లో పుంజుకోవాల్సి ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ వైఫల్యం జట్టును వేధిస్తోంది. షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడ లేమి జట్టును కలవరపరిచే అంశమే. దీప్తిశర్మ వేగంగా ఆడలేకపోతోంది. బౌలింగ్‌లోనూ దీప్తి రాణిస్తున్నా.. మిగిలిన బౌలర్లు తేలిపోతున్నారు. సరైన సమయాల్లో వికెట్లు తీయకపోవడం భారత జట్టును ఇబ్బందిపెడుతోంది. రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్‌ రాణించాల్సిన అవసరం ఉంది.

ఏంటి..మహేష్ బాబుకి నిజంగానే ఆ లోపం ఉందా?
తెలుగు సూపర్ ప్రిన్స్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమ్మాయిలకు అతని పేరు వినగానే ఏదో తెలియని వైబ్రేషన్స్.. వయస్సు పెరుగుతున్నా కూడా అందం ఏ మాత్రం తగ్గలేదు.. అలాంటి మహేష్ బాబులో కూడా ఒక లోపం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. మహేష్ బాబుకు ఎడమ కన్ను కనిపించదట.. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు.. నిజంగానే మహేష్ బాబుకి ఎడమ కన్ను కనిపించిదా..ఇన్ని రోజులు ఆ విషయాన్ని ఎలా మేనేజ్ చేశారా అని భావిస్తున్నారు.. అస్సలు విషయం ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ.. మహేష్ బాబుకి ఎడమ కన్ను కనిపించదు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అయితే ఈ వార్త వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.. ఇక సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తుంది.. అయితే ఈ ట్రైలర్ లో మహేష్ ఊర మాస్ లుక్ కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు.. ఇకపోతే మరోసారి ఈ సినిమాతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నారు అని ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొంతమంది నెటిజెన్లు మహేష్ బాబుకి ఈ సినిమాలో ఎడమ కన్ను కనిపించదా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మహేష్ బాబు కంట్లో నిప్పు రవ్వ పడటం వంటివి గమనించే ఉంటారు. అయితే చాలామంది నెటిజన్స్ ఈ ట్రైలర్ చూసి మహేష్ బాబుకి ఈ సినిమాలో ఎడమ కన్ను కనిపించదని,అలాగే మహేష్ బాబుకి మోనోక్యులర్ విజన్ అంటే రెండు కండ్లకు వేరు వేరు విజన్లు ఉంటాయి అని కామెంట్లు పెడుతున్నారు.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Show comments