కేశినేని నాని మరో కీలక ప్రకటన.. ఇప్పుడు కేశినేని శ్వేత వంతు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు బెజవాడ ఎంపీ కేశినేని నాని.. ముందుగా లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. ఇక, తండ్రి బాటలోనే కుమార్తె నడుస్తోంది.. టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. తనకు కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించినందుకు ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత.. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు.. ఇక, కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేయనున్నారట శ్వేత. ఇక, విజయవాడ ఎంపీ స్థానానికి మరొకరిని ఇంఛార్జ్‌గా పెట్టేందుకు టీడీపీ సిద్ధమైన తర్వాత.. వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. తన కార్యాచరణ ప్రకటిస్తూ వస్తున్న ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె రాజీనామా వ్యవహారంపై కూడా ట్వీట్ చేశారు.. ”అందరికీ నమస్కారం 🙏🏼.. ఈ రోజు శ్వేతా ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది.” అని తన ఎక్స్ ‘(ట్వీట్)లో పేర్కొన్నారు కేశినేని నాని. అంతే కాదు.. ఏ ట్వీట్ చేసినా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. లేదా చంద్రబాబు ఫోటోలను జత చేస్తూ వచ్చిన ఆయన.. తాజా ట్వీట్‌కు చంద్రబాబుతో తన కుమార్తె మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేవారు బెజవాడ ఎంపీ కేశినేని నాని.
నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్.. మూడు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పర్యటనకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఏపీలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీకి కూడా పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశాయి.. దీంతో.. రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది సీఈసీ.. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఈ రాత్రికి విజయవాడ చేరుకోనుంది ఎన్నికల అధికారుల బృందం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల పర్యటన కొనసాగనుంది.. ఇక, ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానుంది.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష చేయనుంది సీఈసీ.. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మరోవైపు.. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 10న ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఈవో.. ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఈసీ భేటీ కానుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించనుండగా.. అదే రోజు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది కేంద్ర ఎన్నికల బృందం.
మరోసారి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు జగన్‌ని ముంచేస్తారు..!
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎప్పుడూ ఏదో విషయంలో సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టికెట్ ఇచ్చేటప్పుడు సీఎం వైఎస్ జగన్ జాగ్రత్తగా ఇవ్వాలని సూచించారు. టీడీపీ నుండి వచ్చే పనికిరాని వాళ్లకి టికెట్ ఇస్తున్నారు.. టీడీపీ నుండి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ ఇవ్వాలన్నారు.. అలా కాకుండా ఇస్తే.. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు అందుకే పార్టీ వదిలివెళ్లారన్నారు. ఇక, ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుండి కోవర్టులుగా వచ్చి టికెట్ అడుగుతున్నారని మండిపడ్డారు నారాయణస్వామి.. జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాళ్లు సీఎం వైఎస్ జగన్ ను ముంచేస్తారని హెచ్చరించారు. మరోవైపుమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లు పట్టుకున్నానని విమర్శలు చేస్తారా..? టికెట్ రికమెండేషన్ కోసం ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి కదా? అని ప్రశ్నించారు. ఎస్సీలం మేం ఏమి చేయాలి ఇంకా..? నేను కూడా టికెట్ కోసం వైఎస్ జగన్ కాళ్లు పట్టుకున్నాను అని పేర్కొన్నారు. అయితే, తనకు సపోర్టుగా ఉండాలని ఉద్దేశంతో అడుకుంటామని.. రాజకీయాల్లో ఇవే సర్వసాధారణమైన వ్యవహారంగా చెప్పుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కాగా, ఏపీలో ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కాకరేపుతోన్న విషయం విదితమే.. ఇప్పటికే రెండు దఫాలుగా కీలక మార్పుకు సంబంధించిన జాబితా విడుదల కాగా.. ఇప్పుడే మూడో జాబితాపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీసు కేసు.. ఎందుకంటే..?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీసు కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారంటూ గోషామహల్ ఎమ్మెల్యేపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై కూడా పోలీసు కేసు నమోదైంది. గత శనివారం షోలాపూర్‌లోని రాజేంద్ర చౌక్ నుండి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్ రాణే, రాజాసింగ్‌తో పాటు హిందూ సమాజ్ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదులు అందడంతో పాటు జైల్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు రాజాసింగ్, నితీష్ రాణే, హిందూ సమాజ్ నేతలందరిపై ఐపీసీ 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లవ్ జిహాద్‌పై రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. జిహాదీలు, ముస్లింల ప్రార్థనా స్థలాలైన మసీదుల కూల్చివేతపై మరో ఎమ్మెల్యే నితీశ్ రాణే మాట్లాడారు. మతాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసినట్లు షోలాపూర్ పోలీసు అధికారులు తెలిపారు.
ప్రజాపాలనలో ‘శివయ్య’ పేరుతో దరఖాస్తు.. ఆలయం కోసం ఇందిరమ్మ ఇల్లు కావాలని అర్జీ
గత 9 రోజులుగా తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజాపరిపాలన దరఖాస్తు కార్యక్రమం జాతరలా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద ప్రకటించిన 6 హామీల కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వార్డులు, గ్రామ సభలు జనంతో కిక్కిరిసిపోయాయి. జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు కూడా రద్దీగా కనిపించాయి. ఇదిలా ఉంటే ఈ కోట్ల దరఖాస్తుల్లో ‘శివయ్య’ పేరుతో ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది. భార్య పేరు పార్వతీదేవి, కొడుకుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో నింపారు. హాట్ టాపిక్ గా మారిన ఈ అప్లికేషన్ వెనుక కదిలే కారణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర విమర్శలకు చెక్ పెట్టింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ‘శివుడి’ పేరిట ఈ దరఖాస్తును దాఖలు చేశారు. గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించబడిందని విశ్వసించే ఈ పురాతన, అరుదైన మరియు అద్భుతమైన దేవాలయం అభివృద్ధి చెందకుండానే ఉంది. ఇది సురేందర్ రెడ్డితో పాటు గ్రామస్తులను బాధిస్తోంది. అయితే సురేందర్ రెడ్డి మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. 6 హామీల పథకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. దేవతల పేర్లు వివరాల్లో వ్రాయబడ్డాయి. ఫోటో అతికించాల్సిన చోట శివ ఫోటో కూడా పెట్టారు. ఆలయంలో పూజారికి చోటు లేదని, ఆ గది కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లుకు కావాల్సిన ‘గృహజ్యోతి’ని టిక్ చేశామన్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు.. నాగపట్నంలో 16.7 సెంమీ వర్షపాతం! స్కూల్స్‌కు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు (9.3 సెం.మీ.), ఎన్నూర్ (9.2 సెం.మీ.)లో భారీ వర్షపాతం నమోదైంది. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. నేడు కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో చెంగల్ పట్టు, కన్యకూమారి, తిరవళ్ళూరు సహా ఆరు జిల్లాలో నేడు స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మాల్దీవులపై భారత్ ఆగ్రహం.. విమాన బుకింగ్‌లు నిలిపివేత
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యల తర్వాత మాల్దీవులపై భారత్ ఆగ్రహం తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్య ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా మాల్దీవులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్‌లను క్యాన్సిల్ చేసింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిశాంత్ పిట్టి స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ఈ సమాచారాన్ని అందించారు. ప్రధానికి సంఘీభావంగా ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించిందని నిశాంత్ పిట్టి చెప్పుకొచ్చారు. కాగా, మాల్దీవుల మహిళా మంత్రి షియునా ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అయితే, సదరు మంత్రి చేసిన కామెంట్స్ మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని అవి ఆమె వ్యక్తిగత కామెంట్స్ అంటూ చెప్పుకొచ్చారు.. ఇక, మంత్రి వ్యాఖ్యలపై మాలేలోని భారత హైకమిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన ముగ్గురు మంత్రులు షియునాతో పాటు మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్‌లను తక్షణమే వారి పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వ అధికార ప్రతినిధి, మంత్రి ఇబ్రహీం ఖలీల్ చెప్పుకొచ్చారు.
వెస్ట్ బ్యాంక్‌లో వైమానిక దాడి.. ఆరుగురు పాలస్తీనియన్లు, ఒక ఇజ్రాయెల్ పోలీసు మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో తమ సైనికులపై దాడి చేసిన పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆదివారం కాల్పులు జరిపింది. ఈ వైమానిక దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్‌లో జరిగిన ఆపరేషన్‌లో పేలుడు పదార్థంతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసు అధికారి మరణించారు. ఇతరులు గాయపడ్డారని సైన్యం, పోలీసులు తెలిపారు. కవరింగ్ ఫైర్‌ని అందించడం ద్వారా వారిని రక్షించడంలో హెలికాప్టర్ సహాయపడిందని, పేలుడు పదార్థాలను విసిరి మన బలగాలను ప్రమాదంలో పడేసిన ఉగ్రవాద స్క్వాడ్‌పై ఒక విమానం కూడా కాల్పులు జరిపిందని ఆర్మీ తెలిపింది. చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సైట్ వద్ద గుమిగూడిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు చెప్పారు. మృతుల్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మూడు నెలల క్రితం హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి, 240 మంది బందీలుగా పట్టుకున్న తర్వాత హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుండి పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఆయన తన వారం రోజుల పర్యటనను శనివారం ప్రారంభించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు. గతేడాది ఏఐ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలలో నిలిచిపోయింది. OpenAI ChatGPT తర్వాత, ఇప్పుడు AI పరిధి చాలా విస్తృతమైంది. మరోవైపు, చాలా పెద్ద కంపెనీలు, చాలామంది ధనవంతులు AI పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ జాబితాలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు జెఫ్ బెజోస్ అతడి కంపెనీ చిప్ కంపెనీ ఎన్విడియా. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్ AI స్టార్టప్‌లో భారీ పెట్టుబడి పెట్టారు. జెఫ్ బెజోస్ సెర్చింగ్ పై దృష్టి సారించిన స్టార్టప్ కంపెనీ పెర్‌ప్లెక్సిటీ ఏఐలో పెట్టుబడి పెట్టారు. ఏఐ ఆధారిత సెర్చింజన్ విషయంలో ఈ కంపెనీ Googleతో పోటీపడగలదు. జెఫ్ బెజోస్‌తో పాటు చిప్ కంపెనీ ఎన్విడియా, ఇతర ఇన్వెస్టర్లు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు.
బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్ ఓటమి!
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది. భారత్ నిర్ధేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆసీస్ మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం ముంబైలోనే జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులే చేసింది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలి వర్మ (1), జెమీమా రోడ్రిగ్స్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఆసీస్ పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి.. భారత్‌ను ఒత్తిడిలో నెట్టింది. ఈ సమయంలో ఈ స్థితిలో స్మృతి మంధాన (23) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. కాసేపటికే హర్మన్‌ప్రీత్ కౌర్ (6) కూడా వెనుదిరగడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థితిలో దీప్తిశర్మ (30; 27 బంతుల్లో 5×4).. రిచా ఘోష్ (23; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టింది. రిచా ఔట్ అయ్యాక ఇన్నింగ్స్ వేగం తగ్గిపోయింది. దీప్తి క్రీజులో ధాటిగా ఆడలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో.. భారత్ 130 పరుగులు చేసింది. కిమ్ గార్త్ (2/27), జార్జియా వేర్‌హామ్ (2/17), అనాబెల్ సదర్లాండ్ (2/18) తలో రెండు వికెట్స్ తీశారు.
ముంబైలో మంచు లక్ష్మీ ఇల్లు ఎంత బాగుందో చూశారా?.. వీడియో వైరల్..
మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ గురించి అందరికీ తెలుసు.. నటిగా అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా తాను ముంబై కి షిఫ్ట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. అంతేకాదు అక్కడ కొన్న సొంత ఇల్లు గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.. తాజాగా ఆ ఇల్లు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా అందంగా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. చివరికి తనకు నచ్చిన ప్లాట్ ను కొన్నట్లు చెప్పింది.. అయితే అక్కడ ఉన్న వస్తువులు అన్ని కూడా హైదరాబాద్ నుంచి తెచ్చినవే అని చెప్పుకొచ్చింది..
