NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కేశినేని నాని సంచలన నిర్ణయం.. టీడీపీకి, ఎంపీ పదవికి గుడ్‌బై..!?
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే..”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.. ఇక, తన ట్వీట్‌కు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను షేర్‌ చేశారు కేశినేని నాని.

నేను సీటు, పదవులకోసం వెంపర్లాడే వాడిని కాను.. ఎన్నో చూశా..
నాపై వస్తున్నవి అన్నీ దుష్పచారాలే.. తప్ప వాటిలో వాస్తవాలు లేవని కొట్టిపారేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా గుడ్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి కందుకూరు అసెంబ్లీ సీటు నాకు లేదని.. రాదని కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. నా సీటు ఎక్కడికీ పోలేదు.. నా సీటులో టవలేసి మరీ ఇక్కడే ఉంది అంటూ చమత్కరించారు.. నేను సీట్ల కోసం, పదవులకోసం వెంపర్లాడే వాడిని కాదని స్పష్టం చేశారు. ఇలాంటి సీట్లు, కుర్చీలు ఎన్నో చూశాను.. నన్ను నమ్ముకుని ఉన్న ప్రజల సంక్షేమం కోసం ముక్కుసూటిగా వెల్లే మనిషిని అని పేర్కొన్నాడు. మా ఆలోచన అంతా సీఎం జగన్‌కి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే.. కుర్చీ మీద కాదు అన్నారు. అంతేకాదు.. పార్టీలో సీటు ఇచ్చినా లేకున్నా మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తా.. కొంత మంది పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు.. ప్రజలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు.. ఇక, మెరుగైన పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ని అంతా ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పొత్తులు లేకుండా రావాలని ప్రతిపక్షాలకు సవాల్‌ చేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.

రెండు పీఎస్‌లలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై యాడికి, తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు పోలీసులు.. యాడికి మండలం రాయల చెరువు, తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఇసుక ట్రాక్టర్ల టైర్లకు గాలి తీసి.. డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.. అయితే, యాడికి మండలం రాయలచెరువు గ్రామం వద్ద ఇసుక టిప్పర్ కు అడ్డుగా వచ్చి ఇనుప చువ్వతో టైర్లు పంచర్ చేశారని.. డ్రైవర్ ను భయభ్రాంతులకు గురిచేశాడని గుంతకల్ కు చెందిన చాకలి నరసింహులు ఫిర్యాదు చేశారు.. దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు మరికొందరిపై 341, 427, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్ కు గాలి తీసి తనపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేశారని భాస్కర్ అనే వ్యక్థి ఫిర్యాదు చేశారు.. దీంతో, తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్‌ పోలీస్ స్టేషన్‌లో 341, 324, 506, 354, 427, R/w 34 IPC అండ్‌ Sec.3 (1) (r ) (s) of SC/ST (POA) Amendment Act సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా.. ఒకేసారి రెండు పోలీస్‌ స్టేషన్లలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.

అలర్ట్‌.. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పరిపాలన హామీ దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు హామీలను అమలు చేయాల్సి ఉండగా.. పబ్లిక్ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే ఆరు హామీ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రజాపరిపాలనలో భాగంగా 10 రోజులుగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తు చేసుకోని సామాన్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు గడువును పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తేల్చేశారు.

డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసి 10 మంది ప్రాణాలు తీసిన నర్సు..
అమెరికాలో ఓ విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నర్స్ చేసిన పని వల్ల దాదాపు పది మంది వరకు అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూఎస్ లోని ఒరెగాన్‌లోని ఒక ఆసుపత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో 10 మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. గత నెల ప్రారంభంలో ఒక మాజీ ఎంప్లయ్ మందులను దొంగిలించాడని ఆసుపత్రి అధికారులు పోలీసులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఎల్‌ఐసీపై మళ్లీ జీఎస్టీ దాడి.. ప్రభుత్వ బీమా కంపెనీకి రూ.663 కోట్ల నోటీసు
గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి GST నుండి మరో నోటీసు అందింది. ఎల్‌ఐసికి అందిన ఈ నోటీసు డిమాండ్ నోటీసు, ఇందులో జిఎస్‌టి శాఖ రూ.663 కోట్ల డిమాండ్ చేసింది. గత వారంలో ఎల్‌ఐసీకి ఇది రెండో జీఎస్టీ నోటీసు. LICకి CGST, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుండి చెన్నై నార్త్ కమిషనరేట్ నుండి ఈ నోటీసు అందింది. జనవరి 1న ఎల్‌ఐసీకి ఈ నోటీసు వచ్చింది. ఆ తర్వాత కంపెనీ కూడా జనవరి 3న నోటీసును స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. వస్తువులు, సేవల పన్ను చెల్లింపులో లోటు కారణంగా దాదాపు రూ.663.45 కోట్ల డిమాండ్ నోటీసును ఎల్‌ఐసి అందుకుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కంపెనీ తప్పుగా ఉపయోగించుకుందని డిమాండ్ నోటీసులో పేర్కొంది. అంతే కాకుండా, 2017-18, 2018-19లో GSTR-1లో టర్నోవర్‌ని GST యేతర సరఫరాగా కంపెనీ ప్రకటించింది, అయితే దానిపై పన్ను చెల్లించాలి. నోటీసులో, నిర్ణీత గడువులోగా అప్పీల్ దాఖలు చేయడానికి ఎల్‌ఐసికి అవకాశం ఇవ్వబడింది. నోటీసుపై కంపెనీ అప్పీల్ కమిషనర్, చెన్నైకి అప్పీల్ చేయవచ్చు.

నేడు ఎల్-1 పాయింట్‌కి చేరుకోనున్న ఆదిత్య..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ ‘ఆదిత్య’ను పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని ఇస్రో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఈ రోజు నిలిపేందుకు అన్ని సన్నాహాలు చేసింది. L పాయింట్ భూమి, సూర్యుని మధ్య ఉన్న మొత్తం దూరంలో దాదాపు ఒక శాతం. ఆదిత్య సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపింది. భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సున్నాగా మారే లేదా నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఆదిత్య హాలో కక్ష్యకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించి దానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని హాలో పాయింట్ నుండి బాగా అంచనా వేయవచ్చని ఇస్రో తెలిపింది.

వార్నర్ ఆఖరి పంచ్.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం! సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన డేవిడ్‌ వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 రన్స్ చేశాడు. వార్నర్ సహా మార్నస్‌ లబుషేన్‌ (62) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. దాంతో వార్నర్‌కు ఆస్ట్రేలియా ఘన వీడ్కోలు పలికింది. 68/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే ఆలౌట్ అయింది.అరంగేట్రం ఆటగాడు సైమ్ అయూబ్ (33) టాప్ స్కోరర్. రిజ్వాన్ (28), జమాల్ (18) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌ వుడ్‌ 4 వికెట్లతో చెలరేగగా.. నాథన్ లయోన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని.. ఆసీస్‌ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ నిలిపింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.

నా టోపీలు దొరికాయి.. సాయపడ్డ అందరికీ రుణపడి ఉంటా!
నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రెండు బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను పోగొట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వస్తుండగా ఈ క్యాప్‌లు మిస్ అయ్యాయి. 2011లో వార్నర్ తన అరంగేట్రం టెస్టులో ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్.. సిడ్నీలోని టీమ్ హోటల్‌లో దొరికింది. అయితే అది ఎలా హోటల్‌కు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌లు దొరికినందుకు దేవ్ భాయ్ ఆనందం వ్యక్తం చేశాడు. రెండు బ్యాగీ గ్రీన్‌ టోపీలున్న ఓ బ్యాగు సిడ్నీలోని హోటల్లోనే డేవిడ్ వార్నర్‌కు కనిపించింది. బ్యాగు తీసుకున్న వార్నర్‌.. తన టోపీలు దొరికిన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘నా బ్యాగీ గ్రీన్‌ టోపీలు దొరికాయి. ఈ విషయాన్ని మీకు చెప్పేందుకు చాలా సంతోషంగా, ఎంతో ఉపశమనంగానూ ఉంది. ఆ టోపీ ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. టోపీలు నా వరకూ చేరడానికి సాయపడ్డ అందరికీ రుణపడి ఉంటా. రవాణా సంస్థ క్వాంటస్‌కు, హోటల్‌కు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.