ఎంపీ కేశినేని నానికి షాక్.. ఇక మీ సేవలు చాలు..!
బెజవాడ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. తన సోదరుడు కేశినేని చిన్నికి, ఎంపీ కేశినేని నానికి ఏ విషయంలో పొసగకుండా అయిపోయింది.. ఆస్తుల గొడవగా తెరపైకి వచ్చిన వివాదం.. అది రాజకీయ విమర్శలకు దారితీసింది.. ఇద్దరికీ సర్దిచెప్పలేక టీడీపీ అధినాయకత్వం మౌనంగా ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు.. అయితే, కొద్ది నెలలుగా నెలకొన్న ఈ సందిగ్ధతకు చంద్రబాబు నాయుడు ముగింపు పలికేశారు.. విజయవాడ పార్లమెంటు బాధ్యతల నుంచి కేశినేని నానిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా, తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన పోస్టును గమనిస్తే.. అందరికీ నమస్కారం ”నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నన్ను కలిసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంఛార్జీగా చంద్రబాబు నియమించారు.. కాబట్టి ఆ విషయంలో కన్ను కలగచేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని నేను హామీ ఇచ్చాను.” అంటూ రాసుకొచ్చారు ఎంపీ కేశినేని నాని.
రోడ్డుప్రమాదం ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు, పీఏ మృతి.. జానీ మాస్టర్ కారులో ఆస్పత్రికి ఎమ్మెల్సీ..
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నెల్లూరు జిల్లా కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదంలో.. అక్కడిక్కడే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పీఏ వెంకటేశ్వరరావు మృతిచెందారు.. జాతీయ రహదారి వద్ద కంటైనర్ టైర్ పగిలి సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. వెనుక నుంచి వేగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెళ్తుండగా.. కంటైనర్ టైర్ పగలడం.. సడన్ బ్రేక్ వేయడంతో.. ఆ కంటైనర్‌ను కారు వెనక నుంచి ఢీ కొట్టింది.. ఆ తర్వాత బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. అయితే, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు.. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్.. ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో.. తలకి కట్టుకట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి తన మంచి మనసు చాటుకున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.
కాపు నేతలు, వ్యాపారవేత్తలతో నాగబాబు రహస్య భేటీ..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్‌గా ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నారు. సభలు, సమావేశాలు, రహస్య భేటీలు ఇలా ముందుకు సాగుతున్నారు నేతలు.. ఇక, తాజాగా మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారట.. విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట.. ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి పదవిపై నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.. పదవులపై పవన్ కల్యాణ్, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. తప్ప మిగిలిన నాయకులను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారట నాగబాబు.. రెండు సామాజిక వర్గాలకే ఇంత కాలం అవకాశం లభించినందున ఇప్పుడు మార్పు రావాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. అభ్యర్థి ఎవరనే దాని కంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ విజయం లక్ష్యంగా పని చేయాలని కాపు నేతలకు, వ్యాపారప్రముఖులను నాగబాబు కోరినట్టుగా తెలుస్తోంది. కాగా, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, బీజేపీతో పొత్తు వ్యవహారం తెలాల్సి ఉండగా.. ఇప్పుడు ఏపీలో మారిన రాజకీయ పరిణాలు ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
నేడు జేఎన్టీయూ స్నాతకోత్సవం.. ఇస్రో చీఫ్ కు డాక్టరేట్ ప్రదానం
ఇటీవల కాలంలో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్‌కు తెలంగాణ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా దీన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ.కట్టా నరసింహా రెడ్డి తెలిపారు. నేడు నిర్వహించనున్న స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, JNTU ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారు అనంతరం డాక్టర్ సోమనాథ్ స్నాతక ప్రసంగం చేస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, డిగ్రీ పూర్తి చేసిన 88,226 మంది ఇంజినీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు. జేఎన్ టీయూలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఐదేళ్లలోపు డ్యూయల్ డిగ్రీ పొందేలా అమెరికా సహా ఇతర దేశాల్లోని పది యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.
సంక్రాంతికి TSRTC మరో శుభవార్త.. పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి (జనవరి 6 నుంచి 15 వరకు) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడపాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దులు. టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బీ నగర్, అరమ్‌గఢ్, కేపీహెచ్‌బీ, తాగునీరు, మొబైల్ బయో టాయిలెట్‌లు తదితర సాధారణ రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.బస్‌భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేలా టోల్‌ప్లాజాల వద్ద టిఎస్‌ఆర్‌టిసి బస్సులకు ప్రత్యేక లేన్‌లు ఏర్పాటు చేశామని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని, పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు కోరారు.
రామమందిర ఆహ్వానపత్రిక ప్రత్యేకతలు ఇవే.. 7000 మందికి అతిథులకు ఆహ్వానం.
అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవనానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 22న శ్రీరామమందిర ప్రతిష్టాపన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపబడుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలను కూడా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ప్రతీ ఆహ్వన పత్రికపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామమందిర ఉద్యమానికి సంబంధించి ముఖ్య సంఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన బుక్ లెట్ ఉంది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారి వివరాలు ఉన్నాయి. ప్రధాన ఆహ్వాన పత్రికపై రామ మందిర చిత్రం ఉంది. ఇన్విటేషన్ కార్డ్ దిగువన ‘శ్రీరామ్ ధామ్’ దానికింద అయోధ్య అని ముద్రించబడి ఉంది. విల్లు, బాణాలు ధరించిన బాల రాముడి చిత్రాలు ఆహ్వాన పత్రికలో ఉన్నాయి. జనవరి 22వ తేదీ ఉదయం 11:30 గంటలకు ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ పూజ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కార్యక్రమానికి సంబంధించిన ప్రముఖ అతిథులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని అందులో పేర్కొన్నారు. ఆహ్వానం ప్రకారం.. అతిథులు బయలుదేరిన తర్వాత సాధువులు రామ్ లల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం ప్రారంభిస్తారు.
92కి చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య.. ఇంకా 240 మంది మిస్సింగ్..
జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు అక్కడి రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. అయితే సహాయక చర్యలకు సమయం మించిపోతుండటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ భారీ భూకంపం సునామీని ప్రేరిపించింది. తీరంలో ఒక మీటర్ ఎత్తుతో అలలు ఎగిసిపడ్డాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భూకంపం 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీని గుర్తుకు తెచ్చింది. తాజాగా సంభవించిన విపత్తులో కేవలం రోజు వ్యవధిలోనే 150కి పైగా భూకంపాలు సంభవించాయి.
అమెరికా హెచ్చరికలను పట్టించుకోని హౌతీ రెబెల్స్.. వాణిజ్య నౌకలపై మరోసారి దాడి
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది. మానవరహిత ఉపరితల డ్రోన్‌ను ప్రయోగించి ఈ దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయోల్- గాజా యుద్ధం తర్వాత హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేయడం పెరిగింది. కాగా, హౌతీ రెబల్స్ మరోసారి వాణిజ్య నౌకలపై దాడి చేశాయని అమెరియా నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక (యుఎస్‌వి) యెమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్‌లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో ఎటాక్ చేసిందని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, యుఎస్‌వి (USV) ఏ నౌకను లక్ష్యంగా చేసుకుంటుందనే దాని గురించి అతడు స్పష్టంగా చెప్పలేదు.
దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి భారత్!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏకంగా ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు చేరింది. భారత జట్టు పాయింట్ల శాతం 54.16గా ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను అధిగమించి భారత్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. తొలి టెస్టులో ఓటమి భారత్‌ను ఆరో స్థానానికి చేర్చగా.. రెండో టెస్ట్ విజయం అగ్రస్థానానికి తీసుకొచ్చింది. మరోవైపు ఘోర ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. న్యూజిలాండ్ (50.0), ఆస్ట్రేలియా (50.0), బంగ్లాదేశ్ (50.0), పాకిస్తాన్ (45.83) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ (ఏడో), ఇంగ్లండ్ (ఎనిమిదో), శ్రీలంక (తొమ్మిదో) స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు టెస్టులను ఆసీస్ గెలిచింది. మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటుచేసుకోన్నాయి. ఒకవేళ మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే అవకాశం ఉంది. అప్పుడు భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది.
ఇకనైనా నోరుపారేసుకోవడం ఆపితే మంచిది.. విమర్శకులకు గట్టి కౌంటరిచ్చిన రోహిత్!
భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్ టెస్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. కేప్‌టౌన్ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా సారథి రోహిత్ శర్మ గట్టి కౌంటరిచ్చాడు. ‘ఇది కూడా క్రికెట్ పిచే, ఆడింది మ్యాచే. మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందో తెలుసనుకుంటున్నా. మరి ఈ పిచ్‌కు ఏ రేటింగ్ ఇస్తారు?. భారత్‌లో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేశాడు. అయినా దానికి యావరేజ్ రేటింగ్ ఇస్తారు. ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలి’ అని రోహిత్ అన్నాడు.
