NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. నేడు కాకినాడకు సీఎం.. మళ్లీ గెలిస్తే రూ.4వేల పెన్షన్‌..
గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ ఏడాది పెన్షన్‌ పెంచుతూ వస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ఉంటూ పెన్షన్‌ వచ్చారు.. ఇప్పటి వరకు పెన్షన్‌ రూ.2,750గా వస్తుండగా.. ఇవాళ్టి నుంచి అది రూ.3 వేలకు పెరగనుంది.. నేడు కాకినాడలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, కాకినాడ పర్యటన కోసం ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. 1వ తేదీ జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా రూ.23,556 కోట్లు ఖర్చుచేయనుంది ఏపీ ప్రభుత్వం.. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి రూ. 83,526 కోట్ల పైగానే ఉంది.. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేస్తున్న విషయం విదితమే.. ఇక, పెన్షన్ పెంపు ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి చేకూరనుంది. అసలు వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత పెన్షన్‌ ఎలా పెంచుతూ పోయారన్న వివరాల్లోకి వెళ్తే.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250కు పెంచారు.. జనవరి 2022న రూ.2,500కు జనవరి 2023న రూ. 2,750కు.. ఇప్పుడు రూ.3వేలకు పెంచేశారు సీఎం వైఎస్‌ జన్‌. అయితే, త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. పెన్షన్‌ పెంచనున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. మరోసారి అధికారం ఇస్తే.. ఈ సారి పెన్షన్‌ రూ.4వేలకు పెంచుతామని కాకినాడ వేదికగా జగన్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేటి నుంచి ‘రా కదలి రా!’
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్‌ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు.. సైకిల్ – గాజు గ్లాసు తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించిన విషయం విదితమే.. ఈ రోజు పంచాయితీల సమస్యలపైసర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తారు.. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది.. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు జగరనున్న పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు.. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుండగా.. వివిధ రాజకీయ పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొంటారు.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల నిధులు, అధికారాలను దొంగిలించి 3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోందనే అంశంపై చర్చించనున్నారు.. రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేయనున్నారు.

మరోసారి కాకినాడకు జనసేనాని.. మూడు రోజులు అక్కడే మకాం..
జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. కాకినాడపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి మూడు రోజులపాటు కాకినాడలో ఉండనున్నారు.. అమలాపురం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు.. గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్‌.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు.. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు.. ఇక, గతంలో వారాహి యాత్ర సమయంలో పవన్ కల్యాణ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి.. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ కు సవాల్ చేస్తే.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని ద్వారంపూడికి ప్రతిసవాల్ చేశారు పవన్.. స్థానిక నేతలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ను కాకినాడ సిటీ నుంచి పోటీ చేయమని కోరుతున్నారు.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు.. టార్గెట్ కాకినాడ సిటీగా స్ట్రాటజీ అమలు చేస్తున్నారు కల్యాణ్‌. మరోవైపు తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ జనసేనకు రానుంది.. దానికి తగ్గట్టుగా పార్లమెంట్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేనాని.. ఇక, కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానంపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. పవన్‌ వరుస పర్యటనలతో.. అక్కడే ఎందుకు? వారం రోజుల్లో రెండుసార్లు పర్యటన వెనుక మర్మం ఏంటి? ఆయన అక్కడే నుంచి బరిలో దిగుతారా?అందుకే అక్కడ టార్గెట్ పెట్టారా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. గుర్రంపై ఫుడ్ డెలివరీ
భారతదేశ వ్యాప్తంగా హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల ట్రక్, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా నగరంలో భారీగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పాడింది. దీంతో ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ పై పడింది. ఫుడ్ డెలివరీ బాయ్ దాదాపు మూడు గంటల పాటు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి పెట్రోల్ దొరకకపోవడంతో విసుగు చెంది.. ఓ గుర్రం తీసుకుని దానిపై ఫుడ్ ఆర్డర్ లను డెలివరీ చేశాడు. అయితే, ఈ ఘటన మన హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏం ఐడియా గురు అంటూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరో పక్క ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేసిన డెలివరి బాయ్స్ మాత్రం ఏం చక్కా ఫుడ్ ను డెలివరీ చేసేందుకు పరుగులు తీశారు. కాగా రాత్రి కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో డ్రైవర్లు నిరసనను విరమించుకుని ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు చేరుకుంటున్నాయి. ఈరోజు తెల్లవారుజాము కల్లా హైదరాబాద్ నగరంలోని అన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు ఫుల్ లోడ్ తో చేరుకున్నాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.

విపక్షపాలిత రాష్ట్రాలకు ధీటుగా బీజేపీ రాయితీలు.. ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి..
ప్రజలకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ‘ఉచితాలు’ ఇవ్వడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఉచితాలు కాకుండా ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. గతేడాది కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఉచితాల రాష్ట్రాలు అప్పులపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..2018-23 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సబ్సిడీల పెరుగుదల విపక్షరాష్ట్రాల కన్నా ధీటుగా ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో తెలిపింది. ఈ ఐదేళ్లలో రాష్ట్రాలు సమర్పించిన బడ్జెట్‌ని పరిశీలించి ఆర్బీఐ ఈ నివేదికను రూపొందించింది. 2029-24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా కేటాయించిన సబ్సిడీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల వాటా 34 శాతం ఉండగా.. ఆప్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సబ్సిడీ వాటా 20 శాతం ఉంది. గుజరాత్ రాష్ట్రంలో 2018-19 నాటికి రూ. 17 వేల కోట్లు ఉన్న సబ్సిడీ 2023 నాటికి రూ. 30 వేల కోట్లకు చేరుకుందని, హర్యానాలో రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లకు, కర్ణాటకలో రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు, యూపీలో రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్లకు, మధ్యప్రదేశ్ లో రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు సబ్సిడీలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా గత మూడేళ్లుగా సబ్సిడీలను పెంచుతూనే ఉంది. 2018-19లో బడ్జెట్ లో కేంద్రం రూ. 2.92 లక్షల కోట్లను సబ్సిడీలకు కేటాయిస్తే.. 2019-20లో రూ. 2.95 లక్షలకు పెంచింది.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆరో తరగతి వరకు స్కూల్స్ బంద్
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల దృష్ట్యా, నోయిడాలోని పాఠశాలలు జనవరి 3 నుండి 6 వరకు 8వ తరగతి వరకు విద్యార్థులకు మూసివేయబడతాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. చల్లని వాతావరణం కారణంగా డిసెంబర్ 29 , 30 తేదీలలో నగరంలోని అన్ని తరగతులకు పాఠశాలలు మూసివేయబడ్డాయి. డిసెంబర్ చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. కొత్త సంవత్సరం తొలి రెండు రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. జనవరి 3 నుంచి పశ్చిమ యూపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ వాసులు ఉదయం బలమైన గాలిని ఎదుర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2023 దేశ రాజధానిలో ఆరేళ్లలో అత్యంత వేడిగా ఉంది. ఈ నెలలో నగరంలో ఒక్క ‘చల్లని అలల రోజు’ కూడా నమోదు కాలేదు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇండియన్ రైల్వేస్ ప్రకారం, పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చే 26 రైళ్లు ఒకటి నుండి ఆరు గంటలు ఆలస్యంగా నడిచాయి.

భూగర్భ బంకర్‌ను మార్క్ జుకర్‌బర్గ్.. 270 మిలియన్ డాలర్లు ఖర్చు
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ గురించి చాలా విచిత్రమైన చర్చ వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యజమానులు తమ కోసం భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారు. ఈ 5000 చదరపు అడుగుల బంకర్ హవాయిలోని అతని 1400 ఎకరాల పొలంలో ఉంటుంది. ఈ భూగర్భ బంకర్ ఖరీదు దాదాపు 27 కోట్ల డాలర్లు, ఇందులో భూమి ఖరీదు కూడా ఉంది. దీంతోపాటు అక్కడ పనిచేసే వారిచే నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్స్ (ఎన్‌డీఏ)పై కూడా సంతకాలు చేశారు. ఈ వింత నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ, హవాయి లాంటి అందమైన ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ బంకర్‌కి బయటి ప్రపంచం నుంచి ఏమీ అవసరం ఉండదు. ఇది దాని స్వంత శక్తి అవసరాలు, ఆహార సరఫరాతో అమర్చబడుతుంది. ఈ బంకర్ గేట్ లోహంతో తయారు చేయబడుతుంది. కాంక్రీటుతో నింపబడుతుంది. ఈ రకమైన డిజైన్ బంకర్లు, బాంబు షెల్టర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మార్క్, ప్రిస్సిల్లా ఈ ఆస్తి కాయై ద్వీపంలో ఉంది. దీనిని కోలౌ రాంచ్ అని పిలుస్తారు. ఇందులో అండర్ గ్రౌండ్ షెల్టర్ కాకుండా డజనుకు పైగా భవనాలు నిర్మిస్తున్నారు. 30 బెడ్‌రూమ్‌లు, 30 బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, రెండు బంగ్లాలు కూడా నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతం బ్లూ ప్రింట్‌లో 11 ట్రీ హౌస్‌లు, ఫిట్‌నెస్ సెంటర్, గెస్ట్ హౌస్, అనేక ఇతర నిర్మాణాలు ఉన్నాయి.

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టెస్టు.. సమం చేస్తారా.. సమర్పించుకుంటారా..?
తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా పోటీ పడబోతున్నాయి. భారత్‌ మ్యాచ్‌ ఓడినా, ‘డ్రా’ అయినా సిరీస్‌ను కోల్పోతుంది. కాబట్టి సమం చేయాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే.. అయితే, తొలి టెస్టులో ఒక్కో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, సెకండ్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి ప్రదర్శన మినహా చెప్పుకోవడానికేమీ ఇంకా ఏమి లేదు.. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్‌ అయ్యర్ ల బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ పరాజయంలో ఒక కారణంగా చెప్పవచ్చు.. కెప్టెన్ రోహిత్‌ కూడా విఫలం కావడం టీమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్‌ రికార్డు చాలా పేలవంగా ఉంది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 128 పరుగులే చేశాడు. కాగా, గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడటం జట్టుకు కలిసొచ్చే అంశం. జడేజా కోసం అశ్విన్ న్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.. అయితే ఆల్‌రౌండర్‌గా శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.