NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

గణతంత్ర దినోత్సవ పరేడ్‌.. ఏపీ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి
పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. బహుమతిని సొందం చేసుకుంది.. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొనగా పీపుల్స్ ఛాయిస్ విభాగంలో రాష్ట్ర విద్యాశాఖ శకటానికి ఈ అవార్డు లభించింది. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రాగా.. మూడో బహుమతిని కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శకటం.

చంద్రబాబుకు ఎంపీ భరత్‌ సవాల్‌.. ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలు వదిలేస్తా..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఎంపీ మార్గాని భరత్ రామ్.. ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలు వదిలేస్తాను అటూ సవాల్‌ చేసిన ఆయన.. నీకు దమ్ముంటే నీ కొడుకును నాపై పోటీకి దింపు అని చాలెంజ్‌ చేశారు.. స్కీమ్ ల పేరుతో భారీ స్కామ్ ల చేసి అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి జైలులో ఉన్న నువ్వా చంద్రబాబూ నన్ను విమర్శించేది.. నువ్వు రాజమండ్రి రూరల్ కాతేరులో నాపై చేసిన‌ ఆరోపణలలో ఒక్కటైనా నిరూపించగలవా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నీతి, నిజాయితీగా రాజకీయ సేవ చేయడానికి వచ్చానే కానీ.. నీకులా, ఇక్కడ నీ పార్టీ వాళ్ళలా రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడానికి రాల్లేదన్నారు. నా ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నా.. పేరు కోసం, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించడం కోసమని అన్నారు. రాజమండ్రిలో మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లా వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైలులో ఉండి వచ్చారు.. వారిని పక్కన పెట్టుకుని నన్ను విమర్శించడం దొంగే దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్‌ రామ్‌.. ఆవ భూముల్లో నా వాటా రూ.150 కోట్లు ఎవరిచ్చారు.. నిజంగా నువ్వు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎంపీ భరత్ చాలెంజ్ విసిరారు. మా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా పథకం‌ కింద రాష్ట్రంలో 80 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్లు ఇచ్చారు.. నువ్వు ఇవ్వగలవా అని ప్రశ్నించారు. మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లు అంటున్నావు.. ఆ స్కీమ్ జన్మభూమి కమిటీలకు, మీ కార్యకర్తలకు తప్పిస్తే రాష్ట్రంలోని అర్హులైన వారికి కాదనే సంగతి అందరికీ తెలుసు. నేను చాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రంలో 80 లక్షల మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తావా అని ఎంపీ ప్రశ్నించారు. ఒక వేలు అవతలి వారిని చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనల్ని చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, పైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్సైడర్ ట్రేడింగ్.. పోలవరం ప్రాజెక్టు నిధులు స్వాహా.. ఇలా ప్రజాధనాన్ని లూటీ చేసిన నువ్వు నన్ను విమర్శిస్తావా అని ప్రశ్నించారు.

టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా కృషి చేయాలి..
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ – జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు. టీడీపీ-జనసేన మధ్య చిన్న లోపాలు ఉన్నా.. ఇతర పార్టీల వారు వాటిని ఆగాదాలుగా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. వాటిని లెక్క చేయకుండా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ మిత్రపక్షంగా ఏర్పడి ఇచ్చిన పిలు మేరకు జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తి కాబోతోంది.. కరోనా సమయంలోనూ ఎక్కడా ఖాళీగా లేను అన్నారు బోడే ప్రసాద్.. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కరోనా సమయంలోనూ అందరికీ అందుబాటులో ఉన్నానని తెలిపారు.. ఇక్కడ అపార్టమెంట్‌లలో ఉన్న వారి సమాచారం సేకరించి.. దాదాపు 10 వేల మందితో మాట్లాడడం జరిగింది.. ఎన్నికల సమయంలో టీడీపీకి అండగా ఉండాలని కోరినట్టు పేర్కొన్నారు. కరోనా తర్వాత నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ ఉదయం, సాయత్రం ఇలా ట్‌ చేశాను.. ఉదయం 7 గంటలకే బయల్దేరి 10 గంటల వరకు.. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు వీలైనంత ఎక్కువ మందిని కలిసే వాడనని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో టీడీపీ పటిష్టతకు కష్టపడి పనిచేసినట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఇంతకన్న పెద్ద సంక్షోభం రాదని భావించాం.. ఆ సమయంలో స్వచ్ఛందంగా రాజమండ్రి జైలుకు వెళ్లి.. టీడీపీకి మద్దతుగా ఉంటాను అని.. పార్టీకి మద్దతు తెలియజేసి.. చంద్రబాబుకు ధైర్యం కలిగించిన ఏకైక వ్యక్తం పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ బోడే ప్రసాద్. ఆ సమయంలో ఇంకా బోడే ప్రసాద్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్.. కేటుగాళ్లు అరెస్ట్..!
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఇక, కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు సోదాలు చేశారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఒడిస్సా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు ఈ చాక్లెట్స్ విక్రయించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ఒడిస్సాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ను కేటుగాళ్లు అలవాటు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అదేశాల మేరకు ఈ దాడులు చేశారు. గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుంచి కొనసాగిస్తున్నారు? ఎవరెవరికి విక్రయించారు? అనే సమాచారాన్ని అధికారులు కూపీ లాగుతున్నారు.

నేడు ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం..
నేడు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి ఉదయం 9. 30 గంటలకు శాసనసభ మండలి ఛైర్మన్ కార్యాలయంలో జరుగనుంది. అయితే, నిన్న (సోమవారం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలికి వెళ్లిన ప్రొఫెసర్​ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. చివరకు ప్రమాణం చేయకుండానే వీరు ఇరువురు వెనుదిరిగి వెళ్లిపోయారు. మండలి చైర్మన్ ​కు సమాచారం ఇవ్వకుండా రావడం వల్ల ఇలా జరిగిందన్నారు. అయితే, శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డితో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లు ఫోన్​లో సంప్రదించినా ఆయన టచ్​లోకి రాలేదని చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.. ఈ క్రమంలోనే మండలి చైర్మన్​ అందుబాటులో లేరని టాక్. దీంతో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామనే విషయాన్ని చైర్మన్ కు చేరవేయాలని మండలి సెక్రటరీకి ఎమ్మెల్సీలు వెల్లడించారు. అయితే, గురువారం ప్రమాణానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అధికారులకు సూచించినట్లు సమాచారం.

భారత్‌తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలి..
సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్- నేపాల్ దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్‌పి సౌద్ తెలిపారు. సరిహద్దు సమస్యను రాజకీయ ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలి.. నేపాల్‌-ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించి జాయింట్‌ టెక్నికల్‌ కమిటీ కూడా ఉందన్నారు. దీంతో రెండు దేశాల నాయకులు వాస్తవాల ఆధారంగా దౌత్యపరంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి అని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మనం మరింత జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు. భారతదేశం- బంగ్లాదేశ్‌తో విద్యుత్ వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.. నేపాల్- భారతదేశం ఇటీవల ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.. దీని కింద వచ్చే పదేళ్లలో నేపాల్ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. నేపాల్- భారతదేశం మధ్య సరిహద్దు సమస్యను రెండు దేశాల మధ్య పెద్ద రాజకీయ సమస్యగా మార్చకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తొందరలోనే గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు పరిష్కారం..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26 వేల మందికి పైగా మరణించారు. గాజా- ఇజ్రాయేల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ మధ్యవర్త్వం వహిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణకు సానుకూల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నారు. ఇక, వాషింగ్టన్ డీసీలోని అట్లాంటిక్ కౌన్సిల్‌లో ఖతార్ ప్రధాని మాట్లాడుతూ.. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు గాజాలో శాశ్వత కాల్పుల విరమణను నెలకొల్పడానికి చర్చలలో పురోగతి సాధించామన్నారు. ఆదివారం జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పకున్నట్లు సమాచారం. ఇక, గాజాలో బందీలుగా ఉన్న 136 మందిని విడిచిపెట్టి యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలకడంపై దృష్టి సారించిన ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఆదివారం ముఖ్యమైన సమావేశం జరిగింది. CIA చీఫ్ విలియం బర్న్స్, మొస్సాద్ చీఫ్ డేవిడ్ బర్నియా, షిన్ బెట్ చీఫ్ రోనెన్ బార్ మరియు ఈజిప్షియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ వంటి ప్రముఖులు కూడా క్లోజ్డ్ డోర్ చర్చల్లో పాల్గొన్నారు. అయితే, అదే సమయంలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి కుదుర్చుకోవాల్సిన ఒప్పందానికి సంబంధించి ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపింది. ఈ వారంలో మళ్లీ చర్చలు మరోసారి కొనసాగుతాయని తెలిపింది. ఈ యుద్ధానికి ముగింపు పలికాలని ప్రపంచం మొత్తం చూస్తుందని ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహూ అన్నారు.

కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా! దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015లో కోహ్లీ తనపై ఉమ్మివేసాడని, తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బ్యాట్‌తో కొడతానని బెదిరించా అని తెలిపాడు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇద్దరం కలిసి పార్టీ కూడా చేసుకున్నామని ఎల్గర్‌ చెప్పాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ అనంతరం ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండో టెస్ట్ అనంతరం ఎల్గర్‌ దగ్గరకు వెళ్లిన కోహ్లీ.. అతడిని హత్తుకుని వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఎల్గర్‌ 2015లో తన మొదటి భారత పర్యటనను గుర్తుచేసుకున్నాడు. ‘2015లో తొలిసారి భారత పర్యటనకు వెళ్లాను. మొహాలీ టెస్టులో నేను బ్యాటింగ్‌కు దిగాను. ఆ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సవాలుగా నిలిచింది. బ్యాటింగ్ చేస్తున్న నాపై రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు స్లెడ్జింగ్‌కు దిగారు. వారికి నేను ధీటుగా బదులిచ్చాను. ఆ సమయంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని నాపై ఉమ్మేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేను బూతులు తిడుతూ.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఏబీ డివిలియర్స్ ఆడుతుండటంతో నేను వాడిన బూతును విరాట్ అర్థం చేసుకున్నాడు. కోహ్లీ కూడా అదే బూతు మాటను నాపై ఉపయోగించాడు. మేము భారత్‌ ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేనే వెనక్కి తగ్గా’ అని డీన్ ఎల్గర్ తెలిపాడు.

జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ షాక్!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓలీ పోప్‌ పరుగు తీస్తుండగా.. బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడిని అడ్డుకున్నట్లు మ్యాచ్‌ రిఫరీ నిర్ధారించాడు. దాంతో బుమ్రాను ఐసీసీ మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ (196) తృటిలో సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. పోప్‌ భారీ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ గట్టెక్కింది. పోప్‌ కొరకరాని కొయ్యగా మారడంతో టీమిండియా బౌలర్లు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో 81వ ఓవర్లో పోప్‌ వికెట్ల మధ్య పరుగు తీస్తున్నపుడు.. జస్ప్రీత్‌ బుమ్రా కావాలనే అతడికి అడ్డంగా వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం ఢీకొన్నారు. బుమ్రా ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను అడ్డుకున్నట్లు మ్యాచ్‌ రిఫరీ నిర్ధారించాడు.

రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ అదిరిపోయే ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ ఫీచర్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫ్రీ సేల్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్‌లో 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 ఎస్ఓసీలో రన్ అవుతుంది. ఇక లైనప్‌లో సరసమైన ఆప్షన్ అయిన రియల్‌మి 12 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.. 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే పీ3 కలర్ 100 శాతం కవరేజీని కలిగి ఉంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4 ఇన్ 1-పిక్సెల్ ఫ్యూజన్ టెక్నాలజీ తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 సెన్సార్ హెడ్‌లైన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. కెమెరా సెటప్‌లో ఓఐఎస్, ఓవీ64బీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి…రియల్‌మి 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి 48 నిమిషాల్లో బ్యాటరీని 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. చాలా బాగా పనిచేస్తుంది..

బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?
హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గత ఏడాది వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలయ్యకు జోడీగా నటించి టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయింది. వీర సింహారెడ్డి ఘన విజయం సాధించడంతో హనీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది.. షాపింగ్ మాల్‌ ఓపెనింగ్స్ లో తప్పితే వీరసింహారెడ్డి తర్వాత హనీ రోజ్ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ, మొత్తానికి ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో విశ్వంభర ఒకటి. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు.. ఇటీవలే టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో చిరుకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్.. అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూల్‌, తమన్నా, నయనతార వంటి తారల పేర్లు తెరపైకి కూడా వచ్చాయి. తాజాగా హనీ రోజ్ విశ్వంభరలో నటించబోతోందని ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా హనీ రోజ్ కనిపించనుందని.. ఇప్పటికే కథ విని ఒకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం తెగ షికారు చేస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి..