Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు..
తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో పోరాటం కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీలకు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.. అయితే, ఎస్మా ప్రయోగించి బలవంతంగా విధుల్లో చేరాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. అయినా వారు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తు్న్నారు. అందులో భాగంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట ఈ రోజు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం వైఎస్‌ జగన్‌కు ఇచ్చేందుకు వస్తున్నామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు.. మరోవైపు ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంగన్వాడీలు ప్రకటించారు.. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. అంగన్వాడీలతో పాటు.. వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు, ప్రజాసంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు..

నేటి నుంచి విశాఖలో ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు
ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు ఆథిత్యం ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది.. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు-2024లు ఈ రోజు నుంచి విశాఖలో ప్రారంభం కానున్నాయి.. ముఖ్యఅతిథిగా ఏపీ హోం మంత్రి తానేటి వనిత హాజరుకానున్నారు.. పలు రాష్ట్రాలు నుంచి కేంద్ర పోలీసు బలగాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 కు ఆంధ్ర ప్రదేశ్ తరపునా గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తుంది.. 14వ ఏఐపిసిసి-2024 పోటీల్లో 23 జట్లు పాల్గొనున్నాయి.. 23 జట్టుల్లో, 16 రాష్ట్రాల పోలీసులు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయి.. పోటీల్లో సుమారుగా 750 నుంచి 800 మంది వరకు పాల్గొంటారు.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పోటీసులు జరగనున్నాయి.. ఇక, ముగింపు వేడుకలకు ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతారు.

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. హైదరాబాద్‌లో హైఅలర్ట్..
ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్‌పీ), పోలీసు సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే, పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP), గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. అయితే, గత వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయిలో వరుస శాంతి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులు బాస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. హైదరాబాద్‌లో స్థానిక పోలీసులకు సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కమిషనర్ టాస్క్ ఫోర్స్, TSSP అండ్ మౌంటెడ్ పోలీసులు మద్దతు ఇస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.

అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిపోతుంది. అయితే, బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే, అయోధ్యలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రామ మందిరానికు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్‌ కారిడర్‌లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్‌ లా అండ్‌ ఆర్డర్‌ స్పెషల్‌ డీజీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది అని పేర్కొన్నారు. ఫైజాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని లాండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్న రామభక్తులు.. ఎందుకో తెలుసా..?
అయోధ్య రామ మందిరలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అయోధ్య నగరం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. దీంతో అయోధలో జై శ్రీరామ్ నినాదాలో మార్మోగిపోతుంది. ఇప్పటికే రామ భక్తులూ పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ సందర్బంగా రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు. అక్కడ రామాయణంలో పేర్కొన్న నీలకంఠ పక్షిని చూసి వెనక్కి మరలి వస్తున్నారు. రాముడు ఈ పక్షిని చూసిన తర్వాతే లంకాధీశుడిని చంపేసి లంకను తన అదుపులోకి తెచ్చుకున్నట్లు రామాయణంలో ఉంది. ఇక, నీలకంఠ పక్షిని చూడాలనే సంస్కృతి చాలా ఏళ్ల నుంచి వస్తుంది. అచ్చం ఇలాంటి విషయంలో తెలంగాణలోనూ దసరా రోజున పాలపిట్ట చూడాలని ప్రజలు అంటారు. ఇలాంటిదే.. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున ఈ నీలకంఠ పక్షిని చూడాలనే విషయం వెలుగులోకి వచ్చింది. రావణుడిని చంపడానికి ముందు రాముడు ఒక శమీ చెట్టును తాకి.. ఆ తర్వాత నీలకంఠ పక్షిని చూశాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ నీలకంఠ పక్షిని శివుడి అవతారంగానూ భక్తులు చూస్తారు.

పాకిస్థాన్ లో ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్..
పాకిస్థాన్ లో దేశవ్యాప్త ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మెహర్ ముహమ్మద్ వాసిం పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్‌కు అనుకూలంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 8న జరగనున్న ఓటింగ్‌కు ముందు అన్ని పార్టీలు ఆకర్షణీయమైన మేనిఫెస్టోలు, వాగ్దానాలతో దేశవ్యాప్తంగా ప్రచారంలో జోరు పెంచాయి. PML-N, PPP పార్టీలు ప్రధాని పదివిపై దృష్టి పెట్టాయి. తమను అధికారంలోకి తీసుకురావడానికి ఓటర్లను తీవ్రంగా ఆకర్షిస్తున్నారు. పీటీఐ అభ్యర్థి మర్యమ్‌ను కలిసి PML-Nలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సెనేటర్ పర్వేజ్ రషీద్, మరియం ఔరంగజేబ్, అలీ పర్వేజ్ మాలిక్, ఖవాజా ఇమ్రాన్ నజీర్ తో పాటు ఇతర PML-N కేంద్ర నాయకులు కూడా హాజరయ్యారు. కాగా, జనవరి 25న మరియం నేతృత్వంలో జరిగే ఎన్నికల ర్యాలీలో నవాజ్ నేతృత్వంలోని పార్టీతో తన అనుబంధాన్ని మెహర్ అధికారికంగా ప్రకటించనున్నారు. PML-N చీఫ్ ఆర్గనైజర్ మెహర్ మరియు అతని సహచరులను తన పార్టీలో చేరమని స్వాగతించారు. దీంతో పాటు లాహోర్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి కూడా ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి, జకాత్ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అధిపతితో సహా స్థానిక అధికారులు ఈరోజు నవాజ్ నేతృత్వంలోని పార్టీలో చేరారు. ఈ సమావేశంలో, మరియం మాట్లాడుతూ.. 2018 నుండి 2022 వరకు అసమర్థ పాలకుల కారణంగా దేశం తీవ్రమైన పరిణామాలను చవిచూసిన తరువాత పాకిస్తాన్ పురోగతి, శ్రేయస్సు కోసం ప్రజలు PML-N పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్.. సూపర్ ఫామ్‌ ప్లేయర్ దూరం!
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. కీలకమైన మిడిలార్డర్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరమవుతున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదివారం తెలిపింది. బ్రూక్‌ స్థానంలో డాన్‌ లారెన్స్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. బ్రూక్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్ జట్టుకు దూరమవడం ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. హ్యారీ బ్రూక్‌ స్థానంలో ఎంపికయిన డాన్‌ లారెన్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 11 టెస్టులు ఆడి 551 పరుగులు చేశాడు. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ టెస్టు కోసం ఆదివారం ఇంగ్లండ్‌ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. విశ్రాంతి అనంతరం నేడు ఉప్పల్ మైదానంలో ఇంగ్లీష్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇంగ్లండ్‌కి ఇది రెండో టెస్ట్ సిరీస్. 2023 యాషెస్‌లో ఆస్ట్రేలియాపై 2-2తో డ్రా చేసుకుంది. దాంతో ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ జట్టుకు కీలకం కానుంది. భారత్‌లో తమ చివరి రెండు టెస్ట్ సిరీస్‌లను ఇంగ్లండ్ కోల్పోయింది. 2020/21లో 1-3తో ఓడిపోయిన ఇంగ్లండ్.. 2016/17లో 0-4తో కోల్పోయింది. అంతకుముందు 2012/13లో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టును 2-1 తేడాతో ఓడించింది.

అయోధ్యకు చేరుకున్న విరాట్ కోహ్లీ.. ఎయిర్ పోర్టులో కనిపించిన కుంబ్లే
అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను కూడా ఆహ్వానించారు. కోహ్లి అయోధ్యకు చేరుకున్నాడని ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే కూడా అయోధ్య చేరుకున్నట్లు సమాచారం. కుంబ్లే కూడా విమానాశ్రయంలో కనిపించినట్లు సమాచారం. నిజానికి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దీనికి సంబంధించి కోహ్లి అయోధ్య చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అయోధ్య చేరుకున్నారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెంకటేష్ ప్రసాద్ కూడా వచ్చారు. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్‌లను కూడా దీక్షా కార్యక్రమానికి ఆహ్వానించారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం అని అన్నారు. చాలా ఏళ్ల తర్వాత జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం రామ్‌లాలాను చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

చెతేశ్వర్‌ పుజారా అరుదైన మైలురాయి!
టీమిండియా ‘నయా వాల్‌’ చతేశ్వర్‌ పుజారా అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు.. దేశవాలీ టోర్నీలు కలిపి 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. మొత్తంగా 260 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల పుజారా.. 61 శతకాలు, 77 అర్ధ శతకాలు చేశాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసే క్రమంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని దాటాడు. పుజారాకు ముందు సునీల్‌ గవాస్కర్‌ (25,834), సచిన్‌ టెండూల్కర్‌ (25,396), రాహుల్‌ ద్రవిడ్‌ (23,794) మాత్రమే భారత్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 20000 పరుగుల మార్కును అందుకున్నారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జాక్‌ హాబ్స్‌ పేరిట ఉంది. హాబ్స్‌ 1905-34 మధ్యలో 61,760 పరుగులు చేశాడు.

శ్రీరామ నామంతో జిల్ జిగేల్ మంటున్న ముఖేష్ అంబానీ ఇల్లు
అయోధ్యలో రామమందిర శంకుస్థాపనపై దేశమంతా రాముడి రంగుల్లో తడిసి ముద్దయింది. ఈ శుభ ముహూర్తానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటిలియా’కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరాముని ప్రతిష్ఠాపనకు ముందు ‘యాంటిలియా’ పెళ్లికూతురులా అలంకరించబడిందని చూడవచ్చు. రామనామంతో ‘యాంటిలియా’ అలంకరించబడింది. అలంకరణలు చూస్తుంటే దీపావళి పండగలా అనిపిస్తోంది. అయితే, జనవరి 22న అంటే దీపావళి వంటి రామ మందిర ప్రతిష్ఠాపన దినాన్ని జరుపుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. రామ మందిరంపై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కొందరు సినీ ప్రముఖులు కూడా అయోధ్య చేరుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కుటుంబ సమేతంగా ఆహ్వానించారు.

గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతుండటం విశేషం.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,800కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 63,050కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తుంది.. కిలో పై రూ. 75,600 గా ఉంది.. ఈరోజు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.75,600కి చేరింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,600.. బెంగళూరులో రూ. 72,900గా ఉంది.. ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

సెట్లో ఉన్నంత సేపు అదే పనిమీద ఉంటాను.. నిజం చెప్పేసిన శ్రీలీలా…
టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి వెళ్లింది.. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ కెరీర్ ను మాంచి స్వింగ్ లో తీసుకెళ్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. రీసెంట్ గా మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపిస్తోంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు తన గురించి నమ్మలేని నిజాన్ని బయట పెట్టింది.. ఈ అమ్మడు మాట్లాడుతూ.. నేనెప్పుడూ స్విచ్చాన్, స్విచ్చాఫ్ పర్సన్ లా ఉంటాను. అది నా బలంగా ఫీలవుతున్నాను. ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్ నుంచి బయటకొచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాల్లోనే కాదు, చదవు విషయంలోనూ ఇలాగే ఉంటాను.. బుక్ పట్టుకుంటే నేను ఖచ్చితంగా చదవాలి అనే ఆలోచనతో ఉంటాను అని చెప్పింది.. ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తుంది.. త్వరలోనే వాటి గురించి ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది..

Exit mobile version