NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు అరకు, అమలాపురంలో చంద్రబాబు పర్యటన.. పోలీసుల ఆంక్షలు..
‘రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ స ఈఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అందులో భాగంగా నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ నాయకత్వం. ఇక, మండపేటలో రా.. కదలిరా సభలో పాల్గొంటారు చంద్రబాబు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు మండపేట చేరుకుంటారు.. మండపేట బైపాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు గంటన్నర సేపు జరుగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.. అనంతరం 5 గంటలకు మండపేట నుండి బయల్దేరి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు చంద్రబాబు.

నేడు ఇడుపులపాయకు షర్మిల.. రేపు పీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.. దానికంటే ముందుగా.. ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించి, ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.. హైదరాబాద్‌ నుంచి బయల్దేరి నేడు ఇడుపులపాయకు చేరుకోనున్నారు వైఎస్‌ షర్మిల.. రేపు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల.. సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ ఘాట్‌ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ఇక, ఇవాళ రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్న షర్మిల, రేపు కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు.. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఆహ్వానం కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టనున్నారు వైఎస్‌ షర్మిల.

థేమ్స్ తరహాలో మూసి నది.. లండన్ టూర్‌లో రేవంత్ కీలక ఒప్పదం
హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ రివర్ అథారిటీ అధికారులు, నిపుణులతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వారితో చర్చించారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలకమండలి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. థేమ్స్ నది ప్రక్షాళన తనను లండన్ వెళ్లేలా ప్రేరేపించిందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారంతో ముందుకు సాగుతుందని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సాధ్యమయ్యే అనేక సహకార అంశాలపై మరింత సమగ్ర చర్చ జరిగింది. మూసీని పునరుద్ధరణ, సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్‌ నగరంలోని చెరువులకు, ప్రజలకు నీటి సరఫరా సులువవుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మూసీ నది పరివాహక ప్రాంతమంతా ఉపాధి, ఆర్థికాభివృద్ధి జోన్‌గా మార్చాలని కొద్దిరోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో సీఎం రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఈరోజు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తామని రేవంత్ రెడ్డికి అధికారులు హామీ ఇచ్చారు. భూమిపై ఉన్న చాలా నగరాలు చారిత్రాత్మకంగా నదులు, సరస్సులు లేదా సముద్రాల వెంట అభివృద్ధి చెందాయి. పట్టణ మానవ నివాసాలకు నీటి వనరులు జీవనాధారం. హైదరాబాద్ మూసీ నదితో అభివృద్ధి చెందింది. కానీ హుస్సేన్‌సాగర్ సరస్సు మరియు ఉస్మాన్‌సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న అభివృద్ధి ప్రత్యేకమైనది. మూసీని పునరుజ్జీవింపజేసి పూర్తి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత.. నదులు, సరస్సుల ద్వారా హైదరాబాద్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

అయోధ్యలో విధ్వంసం సృష్టస్తాం.. సీఎంను చంపేస్తాం..
ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తాం.. అలాగే, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే, అయోధ్యలో ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను శుక్రవారం యూపీ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ మేరకు పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అధినేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఇక, ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్టు చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను భద్రతా ఏజెన్సీలు వేధింపులకు గురి చేయొద్దని గురుపత్వంత్ సింగ్ పన్నూ పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ నంబర్ నుంచి ఈ రికార్డింగ్‌ మెసేజ్‌ వచ్చినట్లు యూపీ ఏటీఎస్ అధికారులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఖలిస్థానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ యాంటి టెర్రరిస్ట్ విభాగం అరెస్టు చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరు రాజస్థాన్‌కు చెందిన సీకర్‌ వాసి ధరమ్‌వీర్‌గా గుర్తించారు. అయితే, ఇటివలే గణతంత్ర దినోత్సవం రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను సైతం హత్య చేస్తానని బెదిరిస్తూ ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

రైల్వేలో భారీ రిక్రూట్మెంట్.. 5 వేలకు పై ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా 5 వేలకు పై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్ట్ లకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి. దాంతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థల నుండి ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ తో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి..

పాకిస్థాన్- ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య..
బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్- ఇరాన్ అంగీకరించాయి. తీవ్రవాద లక్ష్యాలపై ఇటీవలి ఘోరమైన వైమానిక దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పటికే ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంతో తీవ్ర సంక్షోభం ఎదురౌతుంది. కాగా, మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ‘ఉగ్రవాద’ లక్ష్యాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ గురువారం ఇరాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను మూసివేయడంతో స్థానిక జనాభాపై దాని ప్రభావం చూపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇక, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. అయితే, చైనా మాత్రం పాక్- ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చింది. కానీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీతో పాటు ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్- అబ్దుల్లాహియాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పరిస్థితిని తగ్గించడానికి ఇరు దేశాలకు మార్గం సుగమం చేసింది. అయితే, తీవ్రవాద వ్యతిరేకత, ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఇరాన్- పాకిస్థాన్ ఒప్పందాన్ని చేసుకున్నాయని ఇస్లామాబాద్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పాకిస్తాన్- ఇరాన్ మధ్య ఉన్న బలూచిస్తాన్ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది.

మూడు నెలల్లో రూ.19 వేల కోట్లకు పైగా లాభం సాధించిన రిలయన్స్ సంస్థ
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో నికర లాభం 10.9 శాతం పెరిగి రూ. 19,641 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు కాలంలో ఇది రూ.15,792 కోట్లు. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఎనర్జీ టు టెలికాం గ్రూప్ నిర్వహణ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.227,970 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.220,165 కోట్లుగా ఉంది. రిలయన్స్ గ్రూప్ డిజిటల్ వెంచర్ జియో ప్లాట్‌ఫారమ్‌లు మూడవ త్రైమాసికంలో భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం రూ.32,510 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.4 శాతం ఎక్కువ. ఈ సమయంలో కంపెనీ కూడా రూ. 1,878 కోట్ల పన్ను చెల్లించి రూ. 5,445 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత త్రైమాసికంలో రూ. 5,297 కోట్లు, మొదటి త్రైమాసికంలో రూ. 4,881 కోట్ల కంటే ఎక్కువ.

రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ రోజు స్టాక్ మార్కెట్ కు హాలిడే ?
ఇన్వెస్టర్ల గందరగోళాన్ని తొలగిస్తూ జనవరి 22, 2024న స్టాక్ మార్కెట్లు మూసివేయబడతాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. జనవరి 22న స్టాక్‌ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్‌ ఉండదని ఎన్‌ఎస్‌ఈ అర్థరాత్రి సర్క్యులర్‌ జారీ చేసింది. జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించింది. అంతకుముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జనవరి 22 న స్టాక్ మార్కెట్ సగం రోజుల పాటు తెరిచి ఉంటుందని ప్రకటించింది. ఆర్‌బిఐ ప్రకటన ప్రకారం, కరెన్సీ మార్కెట్లు జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయబడతాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు బదులు మధ్యాహ్నం 2:30 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 3:30కి బదులు సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ జరుగుతుంది. ఈ నిర్ణయంతో కాల్/నోటీస్/టర్మ్ మనీ, ప్రభుత్వ బాండ్‌లు, కార్పొరేట్ బాండ్‌లు, ఆర్‌బిఐ నియంత్రణలో ఉన్న విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన ట్రేడింగ్ సగం రోజులలో మాత్రమే జరుగుతుంది. సోమవారం మార్కెట్‌కు సెలవు ఉంటే, శనివారం స్టాక్‌ మార్కెట్‌లో పూర్తి ట్రేడింగ్‌ ఉంటుందా? దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఈ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, డిజాస్టర్ రికవరీ సైట్‌కు మారడానికి శనివారం స్టాక్ మార్కెట్‌లో రెండు ప్రత్యేక లైవ్ సెషన్‌లు తెరవబడతాయి. జనవరి 20, 2024న, మొదటి సెషన్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. రెండో సెషన్ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది.

వరుస ఫెయిల్యూర్స్.. కీలక నిర్ణయం తీసుకున్న శ్రీలీల..?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గత కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది..తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌ తో అదరగొడుతుంది ఈ బ్యూటీ..దీంతో ఆమెకు వరుస మూవీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్‌ లలో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీకి కూడా ముందు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.. అయితే, ఈ తరుణం లో శ్రీలీల ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.శ్రీలీల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని తన చదువుపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గుంటూరు కారం చిత్రం కోసం ఆమె కొన్ని పరీక్షలకు కూడా డుమ్మా కొట్టినట్లు సమాచారం.. దీంతో ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని.. చదువుపై దృష్టి సారించాలని శ్రీలీల అనుకుంటున్నట్లు సమాచారం.అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేసేందుకు శ్రీలీల అంగీకరించారు. ప్రస్తుతం ఆ మూవీ ఇంకా మొదలుకాలేదు. అలాగే, పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది.దీనితో గత నెల రోజులుగా ఏ సినిమాకు శ్రీలీల ఓకే చెప్పలేదు.దీంతో, సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మెడిసిన్ పరీక్షలకు సిద్ధం అవ్వాలని శ్రీలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు ఓకే చెప్పనున్నట్లు సమాచారం.