Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది.. అయితే, దీనిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభంకానుంది. లేపాక్షి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు మోడీ. ఇక, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.55 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధానిన మోడీ.. సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు లేపాక్షి దగ్గర హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 1.30 గంటలకు వీరభద్రస్వామి టెంపుల్‌కు చేరుకుంటారు.. 1.30 నుంచి 2.30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక, 2.45కి లేపాక్షి హెలిప్యాడ్‌ నుంచి బయల్దేరి 3.05 గంటలకు పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ కేంద్రానికి చేరుకుంటారు.. సాయంత్రం 5 గంటల వరకు నాసిక్‌ లో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇక, 5.15 గంటలకు నాసిక్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి 5.35 గంటలకు పుట్టపర్తి చేరుకోనున్న ప్రధాని మోడీ.. సాయంత్రం 5.40కి పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.45 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుకోనున్నరు ప్రధాని మోడీ.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు..
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసింది.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయినా.. ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. దీంతో.. నేడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.

నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు బాణా సంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. కొత్తపేట ప్రభల ఉత్సవాలు మాత్రం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. సుమారు 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభల ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పెద్దలు చెబుతుంటారు. ఇక, నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే ప్రభల ఉత్సవానికి ప్రాధాన్యత ఉంది.. ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలి రానున్నారు భక్తులు.. జగన్నతోటలో కొలువు కానున్న ఏకాదశ రుద్రులను దర్శించు కునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ఇక్కడి ప్రత్యేకత. ఎగువ కౌశిక నదిలో నుండి పీకల లోతు నీటిలో మునిగి ప్రభలను భుజాలపై మోసుకుని వచ్చే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.. ఏ విధమైన ఆలయం లేకుండా కేవలం కొబ్బరి తోటలోకి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే ఉత్సవం ఈ ప్రభల ఉత్సవం.

రికార్డు బద్దలు కొట్టిన టీఎస్‌ ఆర్టీసీ.. ఆ ఒక్క రోజే రూ. 12 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండుగకు సౌంతుళ్లకు వెళ్లారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఈసారి చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జారీ చేసిన జీరో టిక్కెట్లు 9 కోట్లు దాటాయి. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, ఈ నెల 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పండుగ సమయంలో మహిళల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని ఆర్టీసీ అంచనా వేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12, 13 తేదీల్లో 4,400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులను నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ ముగియడంతో ప్రయాణికులు నగరానికి తిరుగు ప్రయాణమవుతున్నారు.

అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం
అయోధ్య రామ‌మందిరంలో బాల‌రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది. అలాగే, ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గుర్భగుడిలోకి చేర్చనున్నారు. ఆ రోజు తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్ పూజలు చేయనున్నారు. అలాగే, 19వ తేదీన ఔషధదివాస్, కేసరిదివాస్, గ్రితదివాస్, ధాన్యదివాస్ పేరుతో పూజలు జరుగనున్నాయి. ఇక, 20వ తేదీన షర్కారదివాస్, ఫలదివాస్, పుష్కదివాస్.. 21న మధ్యదివాస్, శయ్యదివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక, 22వ తేదీ మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల‌కు రాంలాలా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. రామ‌మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మ‌తాచారాలు ఇవాళ్టి నుంచే ఆరంభం కాబోతున్నాయని రామ‌జ‌న్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంప‌త్ రాయ్ పేర్కొన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ మధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పూర్తయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. రాముడి విగ్రహం బ‌రువు 150 నుంచి 200 కిలోల వ‌ర‌కు ఉంటుంద‌ని పేర్కొన్నారు. 121 మంది ఆచార్యులు ఈ మ‌త‌ప‌ర‌మైన క్రతువును నిర్వహించనున్నారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని న‌రేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ ప‌టేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇత‌ర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి సాధార‌ణ భ‌క్తులు ద‌ర్శించుకునేందుకు ఛాన్స్ క‌ల్పిస్తామ‌ని చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి శ్రీరాముడి దర్శనం కల్పించి.. రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని చంప‌త్ రాయ్ వెల్లడించారు.

కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొచ్చికి చేరుకోనున్నారు. ఇక, పోర్ట్ సిటీలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇక, రేపు ప్రధాని మోడీ త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో నటుడు కమ్ పొలిటీషియన్ సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ప్రధానమంత్రి కొచ్చికి తిరిగి వస్తారు.. అక్కడ రెండు-మూడు బూత్-స్థాయి నేతలతో ‘శక్తి కేంద్రాల్లో’ దాదాపు 6,000 మంది ఇన్‌ఛార్జ్‌లు పార్టీ సమావేశానికి హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనున్నారు. ఇక, ఈ సమావేశం తర్వాత సాయంత్రానికి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

ఢిల్లీని క‌మ్మేసిన పొగమంచు.. విమాన స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. ఇక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు తీవ్రంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొనింది. అంతే కాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమై చల్లని గాలులు వీస్తున్నాయి. అయితే, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ లో 3.3 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 రూపాయలు పెరిగి రూ. 58,150 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం పై రూ. 170 పెరిగింది.. రూ. 63,440 గా ఉంది.. ఇక వెండి ధర కిలో పై రూ. 300 పెరిగి రూ. 76,800 గా కొనసాగుతుంది.. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 58,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,040 కి చేరింది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,440 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 58,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,590 గా నమోదైంది.బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.58,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,440 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,150 , 24 క్యారెట్ల బంగారం ధర రూ 63,440 గా ఉంది.. వెండి ధరలను చూస్తే.. ఈరోజు కూడా వెండి ధరలు బంగారం బాటలోనే నడిచాయి.. వెండి ధరలు కూడా పెరిగాయి .. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,800 ఉంది.. హైదరాబాద్, చెన్నై, ముంబై ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

ఓటీటీలో ప్రభాస్ సలార్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ సలార్.. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను అందుకుంది.. కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్‌ 22న విడుదలైన సలార్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను కొల్లగొట్టింది.. ఈ సినిమా దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూల్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. బాహుబలి తర్వాత ప్రభాస్ కు మంచి హిట్ టాక్ ను అందించింది.. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే సినిమా ఓటీటిలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ప్రభాస్‌ నెట్‌ఫ్లిక్స్‌ కోసం భారీగానే చెల్లించిందని సమాచారం. ఈనేపథ్యంలో సలార్‌ ను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. నెట్‌ఫ్లిక్స్‌ తన సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదలను ప్రకటించింది.. ఖాన్సార్ ప్రజలు తమ మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది’ అని రాసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌పై ఎలాంటి అధికారిక సమచారం ఇవ్వలేదు.. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేస్తుందేమో అని తెలుస్తుంది..

ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్‌ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు సినిమాల మెయిన్ పాయింట్ ఒకటే కావడంతో పరంపోరుల్ మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. 2021లోనే పరంపొరుల్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ డిలే అయ్యింది. రెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజైంది.పరంపోరుల్ మూవీలో కశ్మీరా పరదేశీతో పాటు బాలాజీ శక్తివేల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిన్న సినిమాకు యువర్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. పరుంపొరుల్ మూవీకి సీ అరవింద్‌రాజ్ దర్శకత్వం వహించాడు.దర్శకుడిగా ఇదే అతడికి తొలి సినిమా కావడం. విశేషం.పరంపోరుల్ హీరో అమితాశ్ ప్రధాన్ తెలుగులో రామ్ చరణ్ బ్రూస్ లీ ది ఫైటర్‌తో పాటు నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. పరంపోరుల్ సినిమాతోనే కెరీర్‌లో హీరోగా ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వచ్చేస్తోంది.థియేటర్ల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జనవరి 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆది (అమితాశ్ ప్రధాన్‌) నిజాయితీపరుడైన యువకుడు. డబ్బు అత్యవసరం కావడంతో పురాతన విగ్రహాల దొంగతనం చేసే ముఠాతో చేతులు కలుపుతాడు. పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్‌తో (శరత్‌కుమార్‌) కలిసి పనిచేయడానికి అంగీకరిస్తారు. ఆ డీల్ ఆది జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే పరంపోరుల్ మూవీ కథ.

‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. గురూజీ మిస్ అయ్యాడే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం.. ఇక మరి కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.. ఈ వారం కలెక్షన్స్ భారీగా పెరగనున్నాయి.. ఈ సినిమా సక్సెస్ ను అందుకున్న సందర్భంగాగుంటూరు కారం టీమ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు..అయితే కేవలం కొంతమంది మాత్రమే ప్రైవేట్ పార్టీలా చేసుకున్నారు. నిన్న సంక్రాంతి కూడా కావడంతో చిత్రయూనిట్ మహేష్ ఇంట్లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీ, నాగవంశీ ఫ్యామిలీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మహేష్, శ్రీలీల, నమ్రత ఈ సక్సెస్ పార్టీ కి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఈ ఫోటోలలో ఎక్కడా త్రివిక్రమ్ కనిపించలేదు.. దాంతో నెటిజన్లు గురూజీ ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు..డైరెక్టర్ లేకుండా పార్టీ చేసేసుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ పార్టీకి రాకపోవడం గమనార్హం.. మొత్తానికి ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..

Exit mobile version