శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.. శ్రీస్వామివారి యగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు.. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు రుద్ర, చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేస్తున్నట్టు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. శ్రీశైలంలో పంచాహ్నిక దీక్షతో 7 రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తారు.. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలతోపాటు ప్రత్యేక పూజాధికాలు ఉంటాయి.. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉండనున్నాయి.. మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి.. కాగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు భక్తులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు.
బల ప్రదర్శనకు సిద్ధమైన ఎమ్మెల్యే దొరబాబు.. రాజకీయ నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు చిచ్చు రేపుతున్నాయి.. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ముఖ్యంగా సీట్లు దక్కని సిట్టింగ్‌ల్లో కొందరు రగిలిపోతున్నారు.. ఏదో రకంగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ రోజు పిఠాపురంలో బల ప్రదర్శనకి సిద్ధమయ్యారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.. తన నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, మార్పులు చేర్పులలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ఎంపీ వంగా గీతకు కేటాయించింది వైసీపీ అధిష్టానం.. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్న దొరబాబు.. తన బర్త్‌డే సాక్షిగా బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సమావేశంలో పొలిటికల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. కాగా, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ్‌గా ఎంపీ వంగా గీతను నియమించింది వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం నుంచి బరిలో దిగుతారన్నమాట.. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పనిలో పనిగా ఇతర పార్టీల నేతలను కూడా కలిశారనే ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారనే చర్చ సాగింది.. కానీ, ఆయన తోసిపుచ్చారు.. మొత్తంగా టికెట్ రాలేదని రగిలిపోతున్న పిఠాపురం ఎమ్మెల్యే.. ఇప్పుడు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంతో.. పొలిటికల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది చర్చగా మారింది.
సంక్రాంతికి వెళ్లే వారు తప్పకుండా గమనించండి.. బస్సు స్టాపులు మారాయి
సంక్రాంతి పండుగకు జనం సిద్దమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో ప్రజలు ఇళ్లకు వెళ్తున్నారు. నిన్న (గురువారం) నుంచి హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని చోట్ల రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య విషయం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూరు/తొర్రూరు వైపు వెళ్లే బస్సుల నిలుపుదల ప్రదేశాలను తెలంగాణ ఆర్టీసీ మార్చింది. హన్మకొండ వైపు వెళ్లే బస్సులు యథావిధిగా ఆగుతుండగా యాదగిరిగుట్ట, తొర్రూరు బస్టాప్‌లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి మార్చారు. ఒక్కో బస్టాప్‌కు 300 మీటర్ల గ్యాప్‌తో ఏర్పాటు చేశామని అన్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. కావున అన్ని సాధారణ మరియు ప్రత్యేక బస్సులు ఈ సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్ సమీపంలోని బస్టాప్‌ల నుండి బయలుదేరుతాయి. ప్రయాణికులందరూ దీనిని దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈలోగా ఇళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పందాలు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరంగర్ వంటి ప్రధాన ట్రాఫిక్ పాయింట్లలో కొత్తగా 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ సీసీ కెమెరాలన్నింటినీ బస్‌భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికుల రాకపోకలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని ట్వీట్ చేశారు.
బీజేపీకి జయసుధ గుడ్ బై.. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ..!
లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా.. ఇప్పుడు ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండగా ఆయన బాటలోనే జయసుధ కూడా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జయసుధ తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పంపారు. అయితే జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. జయసుధ చాలా చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ గెలవలేకపోయారు. జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసుధకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జయసుధ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నో డౌట్…మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే.. గందరగోళం లేదు
బడ్జెట్‌కి సంబంధించి వివిధ రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ 2024 తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఇదే చివరి బడ్జెట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మూలాల ప్రకారం.. ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు చేయవచ్చు. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే జనవరి 31న దేశ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు.. అతని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే జనవరి 31న సమర్పించబడుతుంది. ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనవరి చివరి తేదీన పార్లమెంటు ముందు ఉంచబడుతుంది. మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికల సంవత్సరంలో దేశ ఖర్చులకు ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులు వెచ్చిస్తుందో, దానిని ఎలా వినియోగించాలో చర్చ జరుగుతుండగా దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. మోడీ ప్రభుత్వం రెండో దఫా పాలన ముగియడానికి కొద్ది నెలల ముందు ఈ బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, అంతకంటే ముందు దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పేందుకు ఇదొక కీలక పత్రం. ఎన్నికల సంవత్సరంలో దేశంలో రెండు బడ్జెట్‌లు ప్రవేశపెడతారు. అందులో మొదటి బడ్జెట్‌ను ప్రస్తుత ప్రభుత్వం, రెండో బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమర్పిస్తారు.
వచ్చే వారం నుంచి.. పంచాయతీ స్థాయిలో వాతావరణ సమాచారం: ఐఎండీ
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే వారం నుంచి పంచాయతీ స్థాయి వరకు వాతావరణ సూచనలను అందజేయనుంది. అంటే.. ఇక నుంచి ప్రతి గ్రామ ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనవరి 15 నుంచి వాతావరణ సమాచారాన్ని బ్లాక్ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరిస్తున్నట్టు ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ సమాచారం మేలు చేస్తుందని ఐఎండీ చీఫ్ పేర్కొన్నారు. ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ… ‘వాతావరణ సూచనల్ని మండలాల స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైంది. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం 5మంది రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. వాతావరణ హెచ్చరికలతో పాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. గాలిలో తేమశాతం.. గాలుల వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందవచ్చు. ఏడాది పాటు జరిగే ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవను అదేరోజు ప్రారంభిస్తున్నాం’ అని తెలిపారు.
హౌతీ రెబల్స్ దాడులపై భారత్- అమెరికా మధ్య కీలక చర్చ..
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఎర్ర సముద్రంలో సవాలుగా మారతుతున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ వేదికగా (‘X’) ఇలా వ్రాశాడు.. నా స్నేహితుడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్‌తో నేను సంభాషణ చేసాను.. మా చర్చలు ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లపై దృష్టి సారించాం.. గాజాతో సహా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించామని పేర్కొన్నారు. కాగా, అలాగే, జైశంకర్ తో ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. అయితే, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జె. బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌తో మాట్లాడారు.. ఈ సంభాషణలో, మంత్రులిద్దరూ దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.. దీంతో పాటు భవిష్యత్తులో ఈ దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు అని పేర్కొన్నారు.
సామ్ ఆల్ట్‌మాన్ గురించి నమ్మలేని నిజం.. ఎవర్ని పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు అవుటే..
OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. తన గురించి మరో నిజం బయటకు వచ్చింది.. సామ్ ఆల్ట్‌మాన్ తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. బుధవారం హవాయిలో జరిగింది. వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, అలెగ్జాండర్ వాంగ్, షెర్విన్ పిషెవర్, జేన్ మతోషి, అడ్రియన్ ఔన్ ఉన్నారు.. ఆల్ట్‌మాన్ జీవిత భాగస్వామి ఆలివర్ ముల్హెరిన్‌ను ఒల్లీ అని కూడా పిలుస్తారు. సామ్,ఆలివర్ ల స్నేహం చాలా పాతదే. ఆలివర్ ముల్హెరిన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.. ఆ రోజుల్లోనే ఎన్నో ప్రాజెక్ట్స్ ను చేశారు..
సోషల్ మీడియాలో మిల్లర్ టాక్ మాములుగా లేదుగా…
ధనుష్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ ఖాతాలో మూడో అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్స్ లో చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తగిలితే ఎలా ఉంటుందో కెప్టెన్ మిల్లర్ సినిమా చూస్తే తెలుస్తుంది అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ క్రిటిక్స్ కూడా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ కి లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇచ్చాడు. సరైన కథ పడితే ధనుష్ ఆన్ స్క్రీన్ వండర్స్ క్రియేట్ చేయగలడు అనే విషయం అందరికీ తెలిసిందే. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని ధనుష్ అద్భుతంగా పోట్రె చేసాడని టాక్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొలీవూడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తనకి ఒక గొప్ప సినిమా ఇస్తే, గొప్ప క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఇంకా గొప్పగా ప్రెజెంట్ చేసే ధనుష్ ఇప్పుడు ఇదే నిజం చేసి చూపిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్, అన్ని భాషల్లో పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు.
ఆ సినిమా అవ్వకుంటే చాలు దేవుడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చింది గుంటూరు కారం. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా పాజిటివ్ బజ్ జనరేట్ చేయడంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికి గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో షోస్ పడిపోయాయి, కొన్ని సెంటర్స్ లో మాత్రం అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం షోస్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే కొన్ని చోట్ల షోస్ కంప్లీట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఘట్టమనేని అభిమానులు సందడి చేస్తున్నారు. హీరో ఇంట్రో, ఇంటర్వెల్, డాన్స్ అంటూ థియేటర్స్ నుంచి గుంటూరు కారం వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి గుంటూరు కారం సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది, మహేష్ మస్త్ ఉన్నాడు అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో గుంటూరు కారం ఫైనల్ రివ్యూ బయటకి వచ్చేస్తది కాబట్టి ప్రతి మహేష్ ఫ్యాన్ బలంగా కోరుకునేది ఒక్కటే… గుంటూరు కారం సినిమా మరో అజ్ఞాతవాసి అవ్వకుంటే చాలు అని. సాంగ్స్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో గుంటూరు కారం, అజ్ఞాతవాసి సినిమాల మధ్య కోయిన్సిడెన్స్ కనిపిస్తోంది. సెంటిమెంట్ దెబ్బ కొట్టి అదే రిజల్ట్ రిపీట్ అవ్వకుంటే చాలు అని మహేష్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి గుంటూరు కారం సినిమా రిజల్ట్ ఏమవుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని క్షణాలు వెయిట్ చేయాల్సిందే.
లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…
చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ పడిపోవడంతో హనుమాన్ సినిమా మౌత్ టాక్ రిలీజ్ కన్నా ముందే బయటకి వచ్చేసింది. సెన్సేషనల్ హిట్, నార్త్ బెల్ట్ లో రచ్చ చేస్తది, టెర్రిఫిక్ విజువల్స్, అంత తక్కువ బడ్జట్ లో ఇలాంటి విజువల్స్ ఎలా అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. హనుమాన్ రిలీజ్ కి ముందు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో ఉండడంతో థియేటర్స్ దొరకడం కూడా కష్టం అయ్యింది. ముఖ్యంగా గత వారం రోజులుగా హనుమాన్ సినిమా థియేటర్స్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా వాయిదా వేసుకోకుండా స్ట్రాంగ్ గా నిలబడిన మేకర్స్ అందుకు తగ్గ రిజల్ట్ ని ఈరోజు అందుకున్నారు. యునానిమస్ గా హిట్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హనుమాన్ సినిమా ఇకపై థియేటర్స్ లెక్కని పూర్తిగా మార్చేయడం గ్యారెంటీ. హనుమాన్ సినిమా హిట్ అనే మాట సాలిడ్ గా వినిపిస్తున్న టైమ్ లో “జై హనుమాన్” మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2025లో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది అని హనుమాన్ మూవీ ఎండ్ లో రివీల్ చేసాడు ప్రశాంత్ వర్మ.
