Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఢిల్లీలో చంద్రబాబు.. అర్ధరాత్రి అమిత్‌షాతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. నిన్న సాయంత్రం 6.30 గంటలకు హస్తిన చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, రఘురామకృష్ణరాజు.. ఇక, ఆ తర్వాత హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఎంపీ గల్లా జయదేవ్‌ ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడి రావడం చర్చగా మారింది.. ఇటీవలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు.. మొదట రాత్రి 7 గంటల తర్వాతే ఈ భేటీ జరుగుతుందనే ప్రచారం జరిగినా.. చివరకు బుధవారం రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు.. సుమారు గంటపాటు చర్చలు సాగాయి.. అయితే, ఈ సమావేశం నుంచి 10 నిముషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా… ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల సిద్ధమైన వేళ.. ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. ఇక, త్వరలోనే ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ప్రయాణం కానుండగా.. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు హస్తినకు వెళ్లనున్నారు.

నేటితో ముగియన్న అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి.. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన విషయం విదితమే కాగా.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అదే రోజు ప్రసంగించారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది సభ.. ఇక, ఈ నెల 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది.. చర్చ అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు.. ఇక, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు -2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024ను సభ ముందుకు రానున్నాయి. ఇక, శాసన మండలి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి.. చివరి రోజు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది శాసన మండలి.. పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మండలిలో చర్చ సాగనుండగా.. ఆ చర్చ అనంతరం మండలిలో కూడా సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన.. మరోవైపు.. మండలిలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. నిన్న అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను ఈ రోజు శాసన మండలిలో పెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. మొత్తంగా ఇవాళ్టితో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ.. భవిష్యత్‌పై క్లారిటీ..!
అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేపై స్పీకర్‌ తమ్మినేని సీతారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.. ఇప్పటికే రాతపూర్వకంగా స్పీకర్‌కు వివరణ ఇచ్చిన రెబల్‌ ఎమ్మెల్యేలు.. ఈ రోజు స్పీకర్‌ ఎదుట హాజరుకావాల్సి ఉంది. మరోవైపు.. ఈ రోజే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారు.. స్పీకర్‌ ఎలాంటి చర్యలకు దిగనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇవాళ స్వయంగా స్పీకర్‌ ముందు హాజరుకానున్నారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. దీంతో, ఇవాళో.. రేపో ఫైనల్‌గా స్పీకర్‌ ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.. నలుగరు రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు.. ప్రభుత్వ విప్‌ నుంచి అంటే.. మొత్తం ఐదుగురి నుంచి అనర్హత పిటిషన్లపై ఒకేసారి వివరణ తీసుకోనున్నారు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఇప్పటికే తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు రెబల్‌ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి.. అయితే, తనకు నోటీసులు అందలేదని చెప్పిరా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయానికి మెమోరూపంలో తెలియజేశారు కోటంరెడ్డి.. ఇక, ముగ్గురు ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వగా.. తన ఫిర్యాదుపై ఆధారాలు సమర్పించారు చీఫ్ విప్‌ ప్రసాద్‌రాజు.. ఇవాళ వివరణ అనంతరం స్పీకర్‌ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమపై ఉన్న అనర్హత పిటిషన్లు రద్దుచేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్‌ ఎమ్మెల్యేలు.. తమకు ఉద్దేశ్యపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని.. తమ వాదన వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ రోజు వెలువడనుంది.. ఎన్నికలకు ఒక్కరోజు ముందే కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. కోర్టు తీర్పునకు ముందే.. రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్స్ మరింత ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైనే పడింది. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు గుప్పిస్తునే దూకుడుగానే ముందుకు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేతల కౌంటర్లకు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశ పెడుతుంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగనుంది. ఇక, బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం (ఫిబ్రవరి 10న) అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాలు వారం నుంచి 10రోజులు జరిగే ఛాన్స్ ఉంది.

నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌
రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, 16వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలను అందించనున్నారు.. లేకుంటే ఈ నెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్‌, సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగిసిపోతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షం కలిపి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. రెండు ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కనుంది.

ఇమ్రాన్ ఖాన్ లేదా నవాజ్ షరీఫ్… పాకిస్థాన్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
ఇమ్రాన్‌ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడు. బ్యాట్, బంతితో ఎప్పుడైనా ఆట గమనాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. రిటైర్మెంట్ తర్వాత బంతికి దూరమైన ఆయన నుంచి బ్యాట్‌ను బలవంతంగా లాక్కుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌లో ఆట పూర్తిగా మారిపోయింది. దాదాపు దాని ఆటగాళ్లందరూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్నవారే, కానీ మారిన పాత్రలతో. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంపైర్ ఇప్పటికీ పాత వారే, పాకిస్థాన్ ఆర్మీ. రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గత ఏడాది నవంబర్‌లో ఎన్నికల తేదీని తెలియజేసింది. సాధారణంగా ఎన్నికల తేదీ తెలిసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నప్పటికీ పాకిస్థాన్‌లో మాత్రం ఇతరత్రా సన్నాహాలు మొదలయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పీటీఐ సీనియర్ నాయకులపై బిగింపు మొదలైంది.

యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?
యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, మంత్రిత్వ శాఖలోని విభాగాలు వారి స్థాయిలో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వైరల్ బ్రోన్కైటిస్, తక్కువ-స్థాయి జ్వరం కోసం యాంటీబయాటిక్స్ వాడకంతో సహా సాధారణ సిండ్రోమ్ చికిత్స కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. యాంటీబయాటిక్స్ డ్రగ్ రూల్స్-1945లోని షెడ్యూల్ H, H1లో చేర్చబడ్డాయి. రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే వీటిని విక్రయించవచ్చు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అమలు చేయడానికి వివిధ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. షెడ్యూల్ H1లో చేర్చబడిన మందులను సరఫరా సమయంలో ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సుమారు 20 ఆసుపత్రుల్లో చేరిన 9653 మంది అర్హులైన రోగులపై సర్వే నిర్వహించిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ సర్వేలో 71.9% మంది రోగులకు యాంటీబయాటిక్స్ ఇవ్వబడ్డాయి.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. మరోసారి బాబర్ కే ఆ ఛాన్స్
పాక్ క్రికెట్‌ బోర్డు కొత్త చైర్మెన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఎంపికయ్యారు. గత నెలలో పీసీబీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొవడంతో జకా అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు. అతడు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అయితే పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నఖ్వీ.. ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాట్లు టాక్. మరోసారి పాకిస్తాన్‌ జట్టు పగ్గాలని తిరిగి బాబర్ ఆజంకు అప్పజెప్పాలని నఖ్వీ చూస్తున్నట్లు సమాచారం. కాగా, వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్‌ జకా అష్రఫ్.. పాక్‌ టెస్టు కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించాడు. అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్‌ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త కెప్టెన్‌లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలకు వెళ్లిన పాక్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్‌ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌(3 టెస్టులు) కాగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో చేజార్చుకుంది.

మరోసారి 100బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించిన అదానీ
వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ పూర్తిగా కోలుకుంటున్నారు. ఈ దిశలో బుధవారం ఒక ముఖ్యమైన మైలురాయి వచ్చింది. ఏడాదికి పైగా విరామం తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించగలిగాడు. బుధవారం గౌతమ్ అదానీ నికర విలువ 2.7 బిలియన్ డాలర్లు పెరిగి 100.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ నికర విలువ 100 బిలియన్ డాలర్లు దాటడం ఇదే తొలిసారి. జనవరి 2023 నాటికి అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అతను ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. అదే సమయంలో హిండెన్‌బర్గ్ నివేదిక పెద్ద నష్టాన్ని కలిగించింది. జనవరి 2023 చివరిలో వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. నివేదిక వెలువడిన తర్వాత అదానీ షేర్లు పతనమయ్యాయి. గ్రూప్‌లోని వివిధ షేర్లు నిరంతరం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీని కారణంగా ఒకప్పుడు టాప్-త్రీకి చేరుకున్న అదానీ, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్-30 నుండి బయటపడ్డాడు. ఇప్పుడు 100 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ నికర విలువ 97.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అతని సంపద గత 24 గంటల్లో 1.30 బిలియన్ డాలర్లు. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 13.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఈ ఇండెక్స్‌లో ప్రస్తుతం అతను 14వ స్థానంలో ఉన్నాడు.

యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ.. ఆ ఒక్కటే సినిమాకు హైలెట్..
వివాదాస్పద దర్శకుడు వర్మ నుంచి వచ్చిన సినిమా యాత్ర2.. యాత్ర 2 చిత్రం ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. కొంత మంది ప్రజా ప్రతినిధులకు బుధవారం రోజున షోలు వేశారు. అలా యాత్ర 2 టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.. ముఖ్యంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ఈ సినిమా టాక్ ఎలా ఉందో,జనాలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం పదండీ.. మహి వీ రాఘవ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ జానర్ అయినా సరే ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీయడం ఆయన ప్రత్యేకత. ఆనందో బ్రహ్మా తీసినా.. యాత్ర తీసినా ఆయన ఆడియెన్స్‌ను మెప్పించాడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా తీసుకొని యాత్ర2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే ఈ సినిమా రాజకీయాలకు సంబంధించినది కాదని, ఎవరిని కించపరిచే విధంగా తీసిన సినిమా కాదని, ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట.. ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అంటూ మహి వీ రాఘవ్ ముందు నుంచి చెబుతూనే వచ్చాడు. ఇక ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. నెట్టింట్లో టాక్ బాగానే వస్తోంది.. ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్.. పుల్లిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులే సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట.. జగన్ పాత్రలో జీవా, రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టిలు జీవించారని తెలుస్తుంది.. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా కూడా మరోవైపు సినిమా మాత్రం బాగుందని మెజార్టీ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ తో దూసుకుపోతుందని తెలుస్తుంది..

Exit mobile version