Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు. 50నియోజక వర్గాల నుండి  పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. సభా వేదిక ముందు ఫ్యాన్ గుర్తు ఆకారంలో వాకింగ్ వేను ఏర్పాటు చేశారు. 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై భారీ వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. బందోబస్తు విధుల్లో 3,298 మంది పోలీసులు పాల్గొననున్నారు. 50 నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు రూట్ మ్యాప్‌లో పోలీసులు తెలియజేశారు. ఏడు ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. నేడు మధ్యాహ్నం సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. ఏలూరులో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” సభ.. షెడ్యూల్‌ ఒకసారి పరిశీలిస్తే.. ఇవాళ మధ్యాహ్నం 3:20నిమిషాలకి దెందులూలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం జగన్‌. 3:30కి సభా ప్రాంగణం కు చేరుకోనున్న సీఎం జగన్‌… 3:30నుంచి 4:45 వరకు ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

 

*అర్ధరాత్రి తహసీల్దార్‌ దారుణహత్య.. ఇనుప రాడ్లతో దాడి
విశాఖలో అర్ధరాత్రి దుండగులు చెలరేగి పోయారు. విజయనగరం జిల్లా బంటుమిల్లి తహాసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డులతో తలపై కొట్టి పరారయ్యారు దుండగులు. కొమ్మాదిలోని తహశీల్దార్ రమణయ్య నివశిస్తున్న అపార్ట్ మెంట్‌లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే తహసీల్దారును అపోలో హాస్పటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్ రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వోగా రమణయ్య పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రమణయ్య చేరుకున్నారు. రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి తహసీల్దార్ కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్‌గా సంభాషణ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రమణయ్య. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు. కొమ్మాదిలో చరణ్ క్యాస్టాల్ అపార్ట్మెంట్‌ లో ఐదో ఫ్లోర్‌లో తహశీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. రూరల్ కార్యాలయంలో పని చేసినప్పుడు భూ వివాదాలలో కఠినంగా వ్యవహరించే అధికారిగా రమణయ్యకు గుర్తింపు వుంది. దీంతో దాడి వెనుక భూవివాదమే కారణం అయి వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సంఘటన స్థలాన్ని 1.30గంటల సమయంలో సీపీ రవిశంకర్ అయ్యన్నార్ చేరుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. విశాఖ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. తహసీల్దార్ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి.

 

*’గేట్ వే ఆఫ్ మేడారం’ గురించి తెలుసా..! తొలి మొక్కు అక్కడే..
తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది వస్తుండగా… ముందుగా వచ్చే భక్తులంతా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలిస్తారు. వివిధ ప్రాంతాలలో ఆలయాలు నిర్మించి పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, మేడారం వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. అందుకే అమ్మను మొదటి మొక్కుల తల్లిగా పిలుస్తారు. మేడారం వెళ్లే భక్తులతో పాటు ప్రతి వాహనం ఇక్కడే ఆగి మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతుండడంతో గట్టమ్మ ఆలయాన్ని మేడార ముఖద్వారంగా కూడా పిలుస్తారు. సమ్మక్క-సారలమ్మ చరిత్రపై వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీ.శ.12వ శతాబ్దంలో ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుడు రాజ్య కాంక్షతో పగిద్దరాజుపై దాడి చేశాడు. యుద్ధంలో పగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందగా.. ఓటమి చవిచూసిన జంపన్న సంపెంగ నదిలో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాటం చేసింది. కాకతీయ సైన్యాధిపతి యుగంధర్ వెనుక నుంచి వచ్చి కత్తితో పొడిచాడు. చిలకలగుట్ట వైపు వెళ్లిన ఒప్పందం కోసం గిరిజనులు ఎంత వెతికినా ఫలించలేదు. చివరగా, ఒక చెట్టు నీడలో పాము గూడు దగ్గర ఒక కుంకుమపువ్వు కనిపించింది. ఈ కుంకుమను శుభప్రదంగా భావించి ఆదివాసీలు అప్పటి నుంచి జాతరలు నిర్వహించడం ప్రారంభించారు. పోరులో సమ్మక్క అంగరక్షకులుగా గట్టమ్మ తల్లి, సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు ఉన్నారు. కాగా గట్టమ్మ తల్లి సామరస్యపూర్వకంగా శత్రువుతో ధైర్యంగా, ధైర్యంగా పోరాడింది. దీని వల్ల ప్రతాపరుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎందరో గిరిజన యోధులు వీరమరణం పొందినప్పటికీ గట్టమ్మ తల్లికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గాతమ్మ తల్లి సమ్మక్కకు నమ్మకమైన బంటుగా కొనసాగడం కూడా ఇందుకు కారణమైంది. ఈ నెల 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా, వచ్చే వారంలో కేకపిల్ల ఉత్సవం నిర్వహించేందుకు నాయక్ పోడులు సమాయత్తమవుతున్నారు. గట్టమ్మ తల్లికి తొలి పూజలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బంగారు దేవతగా, కన్నతల్లిగా కొలువుదీరిన గట్టమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేడారం వరకు ప్రయాణిస్తున్నారు. దీంతో గట్టమ్మ మాట్ల ఆలయంలో కొద్ది రోజులుగా రద్దీ నెలకొంది. ఈ మేరకు అధికారులు కూడా ఆలయం వద్ద ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

 

*నేడు ధరణి కమిటీ భేటీ.. వక్స్ బోర్డు, దేవాదాయ భూములపై చర్చ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ భూములపై ఆయా శాఖలతో కమిటీ ప్రతినిధులు ప్రధానంగా చర్చించనున్నారు. ఆ రెండు విభాగాలకు రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమలు ఉన్నాయి. అయితే, వీటి సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో కాలక్రమంలో వేల ఎకరాల భూమలు అన్యాక్రాంతం అవుతున్నాయి. అయితే, ఎండోమెంట్‌, వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉన్న భూములు, ఆస్తులను కాపాడుకోవాటానికి, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో ధరణి కమిటీలో చర్చించనున్నారు. సర్వే, సెటిల్మెంట్‌ విభాగం ద్వారా రికార్డుల నిర్వహణ, భూ భారతి కార్యక్రమం, ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌లు, ధరణి పోర్టల్‌ కింద తీసుకున్న మ్యాప్‌ల తాజా పరిస్థితిపై ఈ కమిటీ ఆరా తీయనుంది. ఈ సమవేశంలో సీసీఎల్‌ కమిషనర్‌, కమిటీ కన్వినర్‌ నవీన్‌ మిట్టల్‌, సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్‌ పీటర్‌, వి. లచ్చిరెడ్డి, సునీల్‌, మధుసూదన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

 

*నేడు ఒడిశా పర్యటనకు ప్రధాని మోడీ.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం..
నేడు ఒడిశాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్‌పూర్ కు ఆయన వెళ్తారు. ఈ సందర్భంగా జగదీష్‌పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్‌)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద 2,450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. ఇక, అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,660 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా- మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడుతుంది. అలాగే దాదాపు 28,980 కోట్ల రూపాయల విలువైన ప‌లు విద్యుత్ ప్రాజెక్టుల‌కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

 

*సిరియా, ఇరాక్ లోని ఇరాన్ స్థావరాలపై అమెరికా బాంబు దాడి.. ఆరుగురు మృతి
కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్‌లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. యూఎస్‌ దళాలు 85 స్థావరాలపై 125కు మించిన యుద్ధ సామగ్రితో దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో ఆరుగురు మృతి చెందారు.. చాలా మంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మరణించారని ఆయన తెలిపారు. నిన్న (శుక్రవారం) డోవర్ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో జో బైడెన్‌ పాల్గొన్నారు. ఇక, గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. ఈ ఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు చేస్తుంది.

 

*శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
మహారాష్ట్రలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్ర గాయల పాలయ్యాడు. ఈ ఇష్యూ మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు తెలిపిన ప్రకారం.. గత కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌, బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గణ్‌పత్‌ గైక్వాడ్‌.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మహేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్‌ పాటిల్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే పోలీసులు స్పందించి గాయపడిన వారిని థానేలోని జూపిటర్‌ హాస్పిటల్‌కు తరలించారు. గణ్‌పత్‌ గైక్వాడ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక, శివసేన మద్దతుదారులు ఆస్పత్రి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

*భారత్ లో 14 లక్షల మందికి క్యాన్సర్.. WHO హెచ్చరిక..
ఇండియాలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారు. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్కయ సంస్థ వెల్లడించింది. పెద‌వి, నోరు, ఊపిరితిత్తులు క్యాన్సర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో వస్తుంది. నోటి క్యాన‌ర్స్ 15.6 శాతం, శ్వాస‌కోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు నమోదు అయ్యాయి. ఇక, మ‌హిళ‌ల్లో రొమ్ము, స‌ర్వైక‌ల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, రొమ్ము క్యాన్సర్ 27 శాతం, 18 శాతం స‌ర్వైక‌ల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ డ‌బ్ల్యూహెచ్ క్యాన్సర్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తుంచిన ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇండియాలో ప్రాణాల‌తో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉందని ఆ నివేదికలో తేల్చింది. ప్రతి ఐదుగురిలో ఒక‌రికి క్యాన్సర్ వస్తుంది.. 9 మంది పురుషుల్లో ఒక‌రు, 12 మంది మ‌హిళ‌ల్లో ఒక‌ మహిళకు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలాగే, 115 దేశాల‌కు చెందిన క్యాన్సర్ రిపోర్టును డ‌బ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. కేవ‌లం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవ‌గాహ‌న కల్పిస్తున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్ ను గుర్తించారు. 97 లక్షల మంది ఈ క్యాన్సర్ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు.

 

*ఐదు రోజుల్లో ఎన్నికలు.. ఎన్నికల సంఘం ఆఫీసు వెలుపల బాంబు పేలుడు
దాయాది దేశం పాకిస్థాన్ నుంచి ఓ షాకింగ్ వార్త బయటకు వస్తోంది. పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల బాంబు పేలింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు లేవు. పేలుడు పదార్థాన్ని కరాచీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం సమీపంలో షాపింగ్ బ్యాగ్‌లో ఉంచారు. ఈ ఘటన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. బాంబు నిర్వీర్య దళాన్ని పేలుడు స్థలానికి రప్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గత కొన్ని రోజులుగా వరుసగా పేలుళ్ల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దేశంలో పెరుగుతున్న హింస, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల సంఘం గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8 న ఎన్నికలు సకాలంలో నిర్వహించబడతాయని చెప్పారు. భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం పూర్తిగా సిద్ధంగా ఉంది. నాలుగు-ఐదు రోజుల క్రితం పిటిఐ నాయకుడి ఇంటి వెలుపల భారీ బాంబు పేలుడు జరిగింది. మాలిక్ షా మహ్మద్ ఖాన్ ఇంటి బయట ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు పీటీఐ సభ్యులతో సహా నలుగురు చనిపోయారు. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండాలని మాలిక్ షా మహ్మద్‌ను బెదిరించారు. అదే సమయంలో బలూచిస్థాన్‌లో పీటీఐ ఎన్నికల ర్యాలీలో బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

 

*బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. మార్కెట్ లో ధరలు ఎప్పుడు, ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా ధరలు పెరిగాయి.. శనివారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150లు పెరిగి, రూ.58,300లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.160లు పెరిగి రూ.63,600ల వద్ద కొనసాగుతోంది.. ఇక వెండి కూడా అదే దారిలో వెండి కూడా నడుస్తుంది.. వెండి ధరలు భారీగా పెరిగాయి.. కిలో పై రూ. 200 పెరిగి రూ.76,500లుగా కొనసాగుతోంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,750 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు, అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,900లు, 24 క్యారెట్ల ధర రూ.64,250లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300 ఉండగ, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600 వద్ద కొనసాగుతుంది.. ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో రూ. 200ల మేర పెరిగి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,000లు, విశాఖపట్నంలో రూ.78,000లు, చెన్నైలో రూ.78,000ల వద్ద కొనసాగుతోంది. ఇక మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి ..

Exit mobile version