నేడు ప.గో., విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ఈ రెండు జిల్లా టూర్ కోసం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. భీమవరం చేరుకుంటారు సీఎం జగన్.. పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ కు చేరుకుని.. వైసీపీ నాయకులు గుణ్ణం నరసింహానాగేంద్రరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకోనున్న ఏపీ సీఎం.. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే పార్టీ నేత, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.. దీంతో.. సీఎం జగన్.. రెండు జిల్లాల పర్యటన ముగియనుంది.. అనంతరం విశాఖపట్నం నుంచి సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది టీడీపీ – జనసేన కూటమి.. ఇప్పటికే ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశాయి రెండు పార్టీలు.. ఇప్పుడు తాడేపల్లిగూడెం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయ్యారు.. టీడీపీ, జనసేన ఇప్పటికే విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా… ఇప్పుడు ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఈ రోజు జరిగే సభకు 6 లక్షల మంది హజరవుతారనే అంచనా వేస్తున్నారు.. దానికి తగ్గట్టుగా సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేశాయి.. ఇక, ఈ సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ వేదికపై నుంచి నాయకులకు, పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్ధేశం చేస్తారు. ఇక, టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న జెండా సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈసభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈ సభకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టు భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏవిధంగా పనిచేయాలి.. టిక్కెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీల ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలనే విధంగా అధినేతలు పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.
రైతులకు గుడ్‌న్యూస్.. ఇవాళే ఖాతాల్లో సొమ్ము జమ
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు రైతుల వంతు వచ్చింది.. రైతులకు పెట్టుబడిసాయంగా.. వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందిస్తున్న విషయం విదితమే కాగా.. వరుసగా ఐదో ఏడాది మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించబోతున్నారు.. ఈ రెండు పథకాలకు అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు..
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న ( మంగళవారం ) సయ్యద్ అబ్బాస్ ఆలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ ముగ్గురి సెల్ ఫోన్స్ ను సైతం గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక, ఈ ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే, సెల్ ఫోన్స్ లో డేటాను, మెసేజ్ లు, వాట్సప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం పోలీసులకి అందనుంది. అయితే, కేదార్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. క్రిష్ ను పిలిచి డ్రగ్స్ పరీక్షలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలలోని ఫుటేజ్ ని డిలీట్ చేసిన హోటల్ నిర్వాహకులు.. దీంతో హోటల్ నిర్వాహకులపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో పెద్ద పెద్ద పొలిటికల్, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఎవరు ఉన్న వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.
దరువేసిన ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా..?
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ శ్రీరాముడి భక్తి గీతం పాడడంతో పాటు ఆ వీడియో గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ లోనూ, సోషల్ మీడియాలోనూ స్పందించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే, ఆ జర్మనీ గాయని తన తల్లితో కలిసి భారత్ కు రాగా.. వారిని ప్రధాని మోడీ కలిశారు. ఇక, మంగళవారం నాడు తమిళనాడులోని పల్లడం దగ్గరప్రధాని మోడీని జర్మనీ సింగర్ కసాండ్రా మే స్పిట్ మాన్ సమావేశం అయ్యారు. ఆమె ‘అచ్యుతమ్ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపిస్తుండగా.. దానికి మోడీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. అంతేకాదు, మధ్య మధ్యలో “వాహ్” అంటూ ఆమెను అభినందించారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్మించనున్నారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. ఈ కర్మాగారాల్లో ఏటా దాదాపు 15 కోట్ల మందుగుండు సామగ్రిని తయారు చేయవచ్చు, ఇది భారత సైన్యానికి అవసరమైన మొత్తంలో నాలుగో వంతు. ఇది దేశంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది. కాన్పూర్ సమీపంలో దాదాపు 500 ఎకరాల్లో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ ఈ ఫ్యాక్టరీలను నిర్మించనుంది. భారత ఆర్మీ అవసరాలను తీర్చడంలో ఈ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తాయని గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ సోమవారం తెలిపారు. చిన్న, మధ్య , పెద్ద క్యాలిబర్ మందుగుండు సామగ్రిని వీటిలో తయారు చేయవచ్చు. వీటిని సైన్యం, పారా మిలటరీ, పోలీసులకు సరఫరా చేస్తారు. డిఫెన్స్ వ్యాపారాన్ని కరణ్ అదానీ చూస్తున్నారు.
బీసీసీఐ హెచ్చరిక.. దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హెచ్చరికతో టీమిండియా ఆటగాళ్లు దారిలోకి వస్తున్నారు. వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ.. రంజీల్లో ఆడకుండా తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబై సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అతడు అలర్ట్ అయ్యాడు. వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. భారత్ ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించినా.. శ్రేయస్ విస్మరించడం భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ను బోర్డు తప్పించనుందని వార్తలొచ్చాయి. వెన్ను గాయం కారణంతో శ్రేయస్ రంజీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యాడు. అయితే శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని ఎన్‌సీఏ వైద్య బృందం బీసీసీఐ సెలక్టర్లకు లేఖ రాశారు. దాంతో బీసీసీఐ అతడిపై సీరియస్ అయింది. చివరకు శ్రేయస్ రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.
10, 11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు!
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు సంచలనం సృష్టించారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో తనుష్ కొటియన్ (120 నాటౌట్; 129 బంతుల్లో 10×4, 4×6), తుషార్ దేశ్‌పాండే (123; 129 బంతుల్లో 10×4, 8×6) సెంచరీలతో చెలగారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్ శతకం చేయగా.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 10, 11వ నంబర్ ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే. 1946లో సర్రేతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చందు సర్వటే, షుటే బెనర్జీలు 10, 11 స్థానాల్లో బరిలోకి దిగి సెంచరీలు చేశారు. తనుష్ కొటియన్, తుషార్ దేశ్‌పాండే శతకాలు చేయడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్ హార్దక్ తామోర్ (114) కూడా సెంచరీ బాదడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 569 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ (36) ఆధిక్యాన్ని కలుపుకుని బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా ఆట ముగిసే సమయానికి 121/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై సెమీస్ చేరింది.
వైరల్ గా మారిన ట్రాఫిక్ సైన్ బోర్డ్.. వాట్ ఏ క్రియేటివిటి..
ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులో బెంగుళూరు ట్రాఫిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య బెంగుళూరు ట్రాఫిక్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అసలు విషయానికొస్తే .. బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ సైన్ బోర్డు రోడ్డు వద్ద ట్రాఫిక్ రూల్స్ కోసం ఇచ్చిన ఒక బోర్డ్ అందరి దృష్టిని ఆకర్శించింది.. ఈ సైన్ బోర్డుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై పెద్ద ఎత్తున పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఈబోర్డు కు సంబందించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ట్రాఫిక్ సైన్ బోర్డులో రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో పదాలు రాశారు. ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ, ఈ సైన్ బోర్డ్ లో కామెంట్ ను రాశారు. అదేంటంటే .. ఫాలో ట్రాఫిక్ రూల్స్.. సమ్ వన్ ఈజ్ వెయింటింగ్ ఫర్ యూ.. ఎట్ హోం అనే వ్యాక్యాన్ని ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ.. రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో ప్రింట్ చేశారు.. అక్కడ ట్రాఫిక్ రూల్స్ కోసం పోలీసులు కొత్త ఆలోచన చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. ఫిబ్రవరి 25 న షేర్ చేసినప్పటి నుండి, ఎక్స్ పోస్ట్ కు భారీగా లైకులు , అలాగే అనేక కామెంట్లు వచ్చాయి. ఇక చాలామంది ఈ సైన్ బోర్డుపై తమ ప్రతిస్పందనను పంచుకున్నారు… మొత్తానికి పోలీసులు క్రియేటివిటి ఐడియా వర్కౌట్ అయ్యిందని తెలుస్తుంది..
డైరెక్టర్ క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు?
గచ్చిబౌలి డ్రగ్స్ కేసు మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంజీరా గ్రూప్ అధినేత గజ్జల వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అదే సమయంలో సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ లకు చెందిన మూడు సెల్ ఫోన్లు సైతం సీజ్ చేశారు. ఇక ఆ ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన పోలీసులు సెల్ ఫోన్ లో డేటాను,మెసేజ్ లు, వాట్సాప్ చాట్ ని రిట్రీవ్ చేయాలని చూస్తున్నారు. రిట్రీవ్ చేస్తే కనుక మరింత సమాచారం పోలీసులకి అందనుంది. ఇక కేదార్ కి చెందిన పబ్బుల్లో కూడా డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు తేలిందని దీంతో క్రిష్ ను పిలిచి డ్రగ్స్ పరీక్షలు చేయిస్తామని అంటున్నారు. అంతేకాదు ఈ కేసు ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ రాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, రాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసుపై ఎన్టీవీతో క్రిష్ మాట్లాడుతూ తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని, సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ ను కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని అన్నారు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు.