Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.. ఉదయం 10.25 గంటలకు రాజుపేట్, రామకుప్పం మండలం హెలిప్యాడ్‌ చేరుకోనున్న ఆయన.. 10.40 గంటలకు హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమం చేస్తారు.. 10.45 గంటలకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల చేస్తారు.. 11.25 గంటలకు శాంతిపురం మం, గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన.. ఉదయం 11.40 గంటలకు గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం తన పర్యటనలో.. తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..
చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజాకు సొంత పార్టీలోనే రోజు రోజుకు అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను మంత్రి రోజా త్వరలోనే ప్రారంభించాలనుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న రోజా వ్యతిరేకవర్గం నేత, వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాలను తన పేరుతో శిలా ఫలకాలు ఏర్పాటు చేసి మరీ అనుచరులతో కలిసి ప్రారంభించడం విశేషం. గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవనం ప్రారంభానికి మంత్రి రోజా ఏర్పాట్లు చేసుకోగా, తనకు బిల్లులు ఇవ్వ నిదే ప్రారంభం చేయకూడదంటూ మురళీధరరెడ్డి తాళం వేశారు. ఇటీవల జడ్నీ సమావేశంలోనూ జడ్పీటీసీ సభ్యులు రోజాకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా మంత్రి రోజా నియోజకవర్గ పరిధిలో అసమ్మతి నాయకుడు ఒకే పర్యాయం మూడు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడం, అధికారులు చూసి చూడనట్లు వ్వవహరించడం చర్చగా మారింది.

కాకినాడ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి
కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.. ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. పంక్చర్‌ అయిన లారీ టైర్‌ను నలుగురు వ్యక్తులు మారుస్తుండగా.. ఈ క్రమంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు.. ఆ టైర్‌ మారుస్తున్నవారిని ఢీకొట్టింది.. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.. మృతులను దాసరి ప్రసాద్‌, దాసరి కిషర్‌, క్లీనర్‌ నాగయ్య, స్థానికుడు రాజుగా గుర్తించారు.. మృతుల్లో ముగ్గురు బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందినవారు కాగా.. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడుగా గుర్తించారు. ఇక, సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పొన్నూరులో అర్ధరాత్రి హైటెన్షన్‌.. పీఎస్‌ ఎదుటే..!
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.. ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది.. అయితే, అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్ద బాహబాబీకి దిగాయి.. అయితే, పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత పరస్పరం రాళ్లు, సీసాలతో దాడులకు దిగారు.. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలోని ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఫ్లెక్సీ విషయంలో ఈ వివాదం మొదలైంది.. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న రెండు వర్గాలు.. పీఎస్‌ ఎదుటే వాగ్వాదానికి దిగడంతో పాటు.. అక్కడే పరస్పరం రాళ్లు, సీసాలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేగింది.. ఊహించని ఘటనలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఏకంగా పీఎస్‌ ఎదుటే.. వాగ్వాదం, పరస్పరం దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్ విద్యార్థులు అలర్ట్‌.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!
ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఎవరైనా వచ్చి పరీక్ష రాసినా… మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా… వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అటువంటి అభ్యర్థులు పరీక్ష నుండి డిబార్ చేయబడతారు. అంతేకాదు ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు లేదా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరగనున్నాయి. పై హెచ్చరిక ఈ పరీక్షలకు వర్తిస్తుంది. ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,109 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,450 మంది విద్యార్థులు మొత్తం 30 కేంద్రాల్లో 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతిస్తారు.

కూల్‌ కూల్‌ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. అందువలన ఇది మరాఠ్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. జంటనగరాల్లో సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక..రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 0.5 నుంచి 31.8 మి.మీ వరకు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 16.8, రంగారెడ్డిలో 15.7, నారాయణ పేటలో 15 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.

లోకో పైలెట్ లేకుండానే 70 కి. మీటర్లు వెళ్లిన గూడ్స్ ట్రైన్.. విచారణకు ఆదేశం
లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్సు రైలు దాదాపు 70 కిలో మీటర్లు మేర పరుగులు తీసింది. ఆదివారం నాడు ఉదయం 7.25- 9.00 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలో మీటర్లు ప్రయాణించినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు అందరు ఊపిరి పీల్చుకున్నారు. 53 వేగన్లతో చిప్‌ స్టోన్స్‌ను మోసుకుని జమ్ము నుంచి పంజాబ్‌ వైపు రైలు వెళ్లింది. డ్రైవర్‌ చేంజ్‌ కోసం జమ్ములోని కథువా రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. అయితే, ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికే ట్రైన్ నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో రైలులో లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఎవరూ లేరని అధికారులు చెప్పుకొచ్చారు. నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు స్టేషన్‌లను దాటి చివరకు పంజాబ్‌లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ లో పట్టాలపై ఇసుక బస్తాలను, చెక్క దిమ్మెలు అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఇక, ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని రైల్వే అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్టు జమ్ము డివిజినల్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రతీక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా! సర్ఫరాజ్‌పై రోహిత్ ఫైర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఫీల్డింగ్‌కు సిద్దమైన సర్ఫరాజ్‌ ఖాన్‌పై మండిపడ్డాడు. ‘హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని సర్ఫరాజ్‌ను మందలించాడు. ఈ ఘటన రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటలో చోటుచేసుకుంది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేయర్స్ పట్ల రోహిత్‌కు ఉన్న జాగ్రత్త చూసి హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. అయితే ఓవర్ మధ్యలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషనల్‌లో ఉంచాడు. అది ఫీల్డర్లకు ప్రమాదకరమైన ప్లేస్. అక్కడ ఫీల్డింగ్ చేసే ఏ ఆటగాడైనా హెల్మెట్ పెట్టుకుంటాడు. అయితే సర్ఫరాజ్ మాత్రం హెల్మెట్ లేకుండానే ఫీల్డింగ్‌కు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన రోహిత్.. సర్ఫరాజ్‌పై సీరియస్ అయ్యాడు. ‘హే తమ్ముడు.. నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని మందలించాడు.

ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
ఇటీవలి రోజుల్లో త్రిష కృష్ణన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు మన్సూర్‌పై మండిపడ్డారు. అతడిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడంతో ఆమెకు మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా త్రిషపై అన్నాడీఎంకే లీడర్ ఏవీ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషకు ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ డబ్బులిచ్చి రిసార్ట్‌కి తీసుకెళ్లాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్నిత్రిష తీవ్రంగా ఖండించారు. త్రిష అతడికి నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో హీరో విశాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్‌, సముద్రఖని, నాజర్‌ ఆమెపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ త్రిష పేర్కొన్నారు.

రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌.. మాస్టర్‌మైండ్‌ సినీ నిర్మాత!
భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడట. అంతర్జాతీయ స్థాయిలో సూడోఫెడ్రిన్‌కు భారీగా డిమాండ్‌ ఉంది. మెథాంఫేటమిన్‌ తయారీలో సూడోఫెడ్రిన్‌ను వినియోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, మలేషియాలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో సూడోఫెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం తెలిసింది. సూడోఫెడ్రిన్‌ను హెల్త్‌ మిక్స్‌ పొడులు, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది. సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ అధికారులు ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో సోదాలు నిర్వహించి 50 కిలోల సూడోఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేసియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటి వరకు 3500 కిలోల సూడోఫెడ్రిన్‌ ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేసిందని, వాటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తేలింది. డ్రగ్స్ అక్రమ స్వాధీనం, వ్యాపారం చేయడంతో నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Exit mobile version