Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌పైనా క్లారిటీ ఇచ్చారు. తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నారు. ఆ రోజు (ఫిబ్వరి 27న) ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

*నేడు సమ్మక్క- సారలమ్మ వన ప్రవేశం.. అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు
నాలుగు రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగియనుంది. నేటి సాయంత్రం పూజారులు గద్దెల దగ్గరకు వచ్చి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వన దేవతల వన ప్రవేశం స్టార్ట్ అవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారం జాతరకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో వేచి ఉన్నారు. గద్దెల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని వస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపి వేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. అలాగే, ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా.. దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

*నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. ఇవాళ టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు – పవన్ విడుదల చేయనున్నారు. 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు – పవన్ ప్రకటించనున్నారు. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ – జనసేనలు ప్రకటించనున్నాయి. ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా అందుబాటులో ఉండాలని పలువురి నేతలకు చంద్రబాబు సూచించారు. నాదెండ్ల సహా ఇతర ముఖ్య నేతలతో పవన్‌ భేటీ కానున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక రెండో విడత అభ్యర్థుల జాబితాను కూటమి పార్టీలు ప్రకటించనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ – జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్‌ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

 

*తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..
తెలంగాణ ప్రజలకు చల్లని వార్త..పగలంతా ఎండవేడి, ఉక్కపోత ఉంటే,.. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది. ఇలాంటి టైమ్‌లో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించబోతున్నాయి.. నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి జల్లులుతో పాటు మోస్తారుగా వర్షాలు కురవనున్నాయి.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. అలాగే రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి.. అదే విధంగా హైదరాబాద్,నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.. ఒకవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కూడా ప్రజలు సీజనల్ వ్యాధులు మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.. ఈ వర్షాలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, చిన్న పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోదక శక్తి పెరగడానికి పరిశుభ్రతను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

 

*రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌, భటిండా, రాయ్‌బరేలి, కల్యాణి ఎయిమ్స్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, భారతీ పవార్‌లు హాజరుకానున్నారు. అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు నాలుగు మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్‌ నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. అప్పటి టీడీపీ సర్కారు మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. రూ.1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్రమే ఎయిమ్స్ నిర్మించింది. ఇక్కడ వైద్యకళాశాల, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్లతోపాటు, ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్సియల్ బ్లాక్, గెస్ట్ హౌస్ , అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ తోపాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. 2019 మార్చి నుంచే రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేలమంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా.. మరో 20 వేల మంది ఇన్‌పేషెంట్‌గా జాయిన్ అయి చికిత్సలు పొందారు. మరో 12 వేల మందికి అత్యవసర చికిత్సలు అందించారు.

 

*నేడు లారా థర్మల్‌ ప్లాంట్‌ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్‌టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. అలాగే, రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, మొదటి దశ స్టేషన్‌ను దాదాపు 15,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. రెండో దశ ప్రాజెక్టుకు మరో 15,530 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్‌టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుంచి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్‌) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని చెప్పారు. తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది. కాగా, అదే విధంగా ఛత్తీస్‌గఢ్‌లో 600 కోట్ల రూపాయల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Aiims) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. వీటిలో మంగళగిరి (ఏపీ), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రారంభించనున్నారు.

 

*గోవాలో ఆరేళ్ల బాలికపై దారుణం.. నిందితులు దేశం నుంచి పరార్
గోవాలో 6 ఏళ్ల బాలికపై విదేశీ టూరిస్ట్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర గోవాలో రష్యన్ పిల్లల కోసం నైట్ స్టడీ క్యాంప్ నడిపిన వ్యక్తి ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి ఆరేళ్ల బాలికను తన కామానికి బలిపశువును చేశాడు. పోలీసు వర్గాలు నమ్మితే, ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు భారత్‌ నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడు రష్యా వాసి అని తెలిపారు. నిందితులను చేరుకోవడానికి పోలీసులు రష్యా రాయబార కార్యాలయం నుంచి సహాయం తీసుకుంటున్నారు. బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక మాటలు విని కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు. ఆమె వెంటనే గోవా పోలీసు మహిళా, శిశు సంరక్షణ యూనిట్‌ను సంప్రదించి నిందితుడిపై ఐపిసి సెక్షన్ 376, జిసి చట్టంలోని సెక్షన్ 8 (2), పోక్సో చట్టంలోని సెక్షన్ 4,8 కింద కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుడు గోవా నుంచి పరారీలో ఉన్నట్లు విచారణలో తేలింది. గోవా పోలీసులు ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరు. కానీ వారి ప్రకారం, నిందితుడిని ఇలియా వాసులేవ్‌గా గుర్తించారు. అతను గోవాలో ఎక్కువగా విదేశీ పౌరుల పిల్లల కోసం ఇటువంటి అధ్యయన శిబిరాలను నిర్వహిస్తున్నాడు. నిందితులపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసేందుకు ఎంబసీతోపాటు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం గోవా పోలీసులు రష్యా అధికార సహకారం తీసుకుంటున్నారు. గోవా ఎప్పుడూ విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉంటుంది. అందుకే ఈ సంఘటన తర్వాత.. శాంతిభద్రతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పరిపాలనపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. తాజాగా నార్త్ గోవా ఎస్పీతోపాటు ఆయన డిప్యూటీ కూడా బదిలీ అయ్యారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఎస్పీని నియమించలేదు. మరో అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీ మహిళా పర్యాటకుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2023 సంవత్సరంలో నిర్వహించిన ఒక సర్వేలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2020-2021 సంవత్సరాల్లో పర్యాటక సంబంధిత నేరాలు 15 శాతం పెరిగాయి. కోవిడ్‌కు ముందు సంవత్సరాలతో ప్రస్తుత సమయాన్ని పోల్చి చూస్తే, అంతకుముందుతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 12 శాతం తగ్గుదల నమోదైంది. శాంతిభద్రతలు క్షీణించడం వల్ల గోవా ఇకపై సురక్షితమైన పర్యాటక ప్రాంతం కాదా అనే ప్రశ్నను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. పర్యాటకుల కొరత కారణంగా స్థానిక ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది.

 

*మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.. 10 గ్రాముల బంగారం పై రూ. 10 రూపాయలు తగ్గింది.. అలాగే కిలో వెండి పై రూ.100 తగ్గింది.. ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.74,400 లుగా ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,940, 24 క్యారెట్ల ధర రూ.63,210, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. అదే విధంగా కకోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,400 గా ఉంది. ముంబైలో రూ.74,400, చెన్నైలో రూ.75,900, బెంగళూరులో రూ.72,600, కేరళలో రూ.75,900, కోల్‌కతాలో రూ.74,400 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,900గా ఉంది.. ఈరోజు మార్కెట్ లో తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version