Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మూసివేత
తూర్పు గోదావరి జిల్లా నేటి నుంచి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ మూసివేయనున్నారు.. మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేస్తున్నట్టు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు యూసివేసి ఉంచుతారు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు చేపట్టారు అధికారులు.. బ్యారేజ్ పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.. ఇక, ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మరమ్మత్తులు కొనసాగనుండగా.. అనంతరం యథావిథిగా రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మత్తు పనుల నిమిత్తం 10 రోజుల పాటు మూతపడనుండగా.. ఇరిగేషన్ అధికారుల కోరిక మేరకు పోలీస్ అధికారుల ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు.. కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా ప్రయాణాలు సాగించేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత.

ముచ్చటగా మూడోసారి మారిన వైసీపీ అరకు ఇంఛార్జ్‌.. విషయం ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు కాకరేపుతున్నాయి.. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. బుధవారం రోజు ఐదో లిస్ట్‌ను ప్రకటించింది.. ఏడుగురు అభ్యర్థుల పేర్లతో ఇదో ఐదో లిస్ట్‌ వచ్చింది.. అయితే, అరకు అసెంబ్లీ సీటులో వైసీపీ ముచ్చటగా మూడోసారి కో-ఆర్డినేటర్ ను మార్చేసింది. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ రచ్చ రచ్చగా మారడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ మాధవి స్థానంలో రేగం మత్స్య లింగం పేరును తెరపైకి తెచ్చింది. ఇక్కడ కొండ దొర సామాజిక వర్గం ఓటు బ్యాంకు కీలకం. మొత్తం ఓటర్లలో సుమారు 90వేలకు పైగా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. దీంతో మాధవి అభ్యర్థిత్వాన్ని అరకు అసెంబ్లీకి ఖరారు చేసింది. అయితే, స్థానికత వివాదం చెలరేగడంతో కొంత కాలంగా అరకు వైసీపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైసీపీ ముద్దు – మాధవి వద్దనే నినాదం కేడర్ లో బలంగా వెళ్లిపోయింది. దీంతో స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించింది. కొత్త కో ఆర్డినేటర్‌గా మత్స్య లింగం పేరును ప్రకటించింది.. ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీగా వున్నారు మత్స్య లింగం. టీచర్ వృత్తిని వదిలి 2018లో వైసీపీలో చేరారు. గిరిజన ఉపాధ్యాయుల సంఘంతో పాటు ఆదివాసీ సంఘాలతో సత్సంబంధాలు కలిగిన నేతగా మత్స్య లింగంకు మంచి గుర్తింపు ఉంది.

తెలంగాణలో మేడారం జాతర సందడి.. ఈ రూట్స్‌లో స్పెషల్‌ బస్సులు
తెలంగాణలో మేడారం జాతర సందడి మొదలైంది. భక్తుల ఒడిలో బంగారంలా విరాజిల్లుతున్న సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి వెళ్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వనదేవతలను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి పోటెత్తారు. సమ్మక్క సారక్కలను వనదేవతలుగా భక్తులు ఆపద కాపలాగా పూజిస్తారు. మేడారం జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. వనదేవతలను దర్శించుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందని భక్తులకు వనదేవతలపై అపార విశ్వాసం. మేడారంలో ప్రత్యేక దేవాలయం లేదు. ఈ ఏడాది జరిగే జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. ప్రకృతి మాతకు నివాళులు అర్పించారు. మీరు కూడా మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి 6 వేల బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 25 వరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం డిపోల నుంచి 400 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల వరకు 24 బస్సులు, మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేటకు 20 బస్సులు, కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లికి 155 బస్సులు, మదిర డిపో నుంచి పాల్వంచ, ఖమ్మం నుంచి 35 బస్సులు, ఖమ్మం నుంచి 35 బస్సులు. భద్రాచలం నుండి 128 బస్సులు. డిపో నుంచి మేడారం వరకు 38 బస్సులు నడపనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా మేడారం జాతరకు ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఏయే ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారనే వివరాలను రవాణా శాఖ మంత్రి త్వరలో వెల్లడిస్తారన్నారు.

నేడే కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
లోక్ సభ ఎన్నికల ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనుంది. అయితే, ఇది పూర్తిస్థాయి పద్దు మాత్రం కాదు.. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో విధాన పరమైన కీలక నిర్ణయాలు ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ ఉవ్విళ్లూరుతుంది. అందులో భాగాంగానే.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో- 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా.. మౌలిక వసతుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారతదేశ ప్రగతికి మరింత మెరుగైన బాటలు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక, బడ్జెట్‌ను వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టనుంది. మోడీ ప్రభుత్వం-2కు ఇవే చివరి బడ్జెట్. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేస్తూ.. ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటునేది సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించే ఛాన్స్ ఉంది.

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్‌ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జమ్మూలోని కిష్త్వార్‌లోని మార్వాన్ ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనుల్లో ఉన్న స్నో కట్టర్‌ మిషన్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.

నేడు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం..
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానం పలికారు. నేడు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స చేశారు. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ మెల్లిగా నడుస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేశారు. కానీ ఈ సారి మాత్రం కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కాబోతున్నారు.

వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో ముస్లిం పక్షం సవాలు
ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదంలో బుధవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మసీదు బేస్‌మెంట్‌లోని వ్యాస్‌ టిఖానా దగ్గర ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకొనేందుకు వారణాసి జిల్లా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారంలోగా పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఏకే విశ్వాస్‌ ఉతర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇక్కడ కాశీ విశ్వనాథ్‌ ఆలయ ట్రస్టు పూజలు చేస్తుందని తీర్పు ఆదేశించారు. ఈ తీర్పుపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని ముస్లిం పక్షం నిర్ణయించింది. ముస్లిం తరపు న్యాయవాది ముంతాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. హిందువులకు పూజలు చేసుకునే హక్కు కల్పిస్తూ జిల్లా జడ్జి తుది నిర్ణయం ఇచ్చారు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అలాగే, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పట్ల ఖచ్చితంగా నిరాశ ఉంది.. అయితే ఉన్నత న్యాయస్థానాలకు మార్గం ఇంకా తెరిచి ఉంది.. సహజంగానే మా న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తారు.. జ్ఞానవాపి సమస్య అయోధ్య సమస్యకు భిన్నమైనదని ఆయన అన్నారు.

నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్‌ అగర్వాల్‌
విమానంలో నీరు అనుకొని యాసిడ్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కర్ణాటక రంజీ క్రికెట్‌ జట్టు కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్‌ సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని తెలిపాడు. నేడు కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అందరికీ ధన్యవాదాలు అని మయాంక్‌ పేర్కొన్నాడు. మయాంక్‌ చేసిన ఈ పోస్ట్‌ను క్రికెట్ అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని క్రికెట్‌ ఆడాలని ఫాన్స్ ఆకాంక్షించారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను మయాంక్‌ తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడడం కోసం కర్ణాటక టీమ్ అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి ఇండిగో విమానంలో బయలుదేరాడు. సీటు ముందున్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే మయాంక్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం అగర్తాలకు వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది.

బడ్జెట్‌కు ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర
బడ్జెట్‌కు కొన్ని గంటల ముందు ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఫిబ్రవరి 1 నుండి ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో ఈ పెంపుదల చేశారు. గృహోపకరణాల వంటగ్యాస్ అంటే సబ్సిడీతో కూడిన 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.14 పెరిగి రూ.1769.50కి చేరింది. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.18 పెరిగి రూ.1887కి చేరుకుంది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 పెరిగి రూ.1723.50కి చేరుకుంది. చెన్నైలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.12.50 పెరిగి రూ.1937కి చేరింది.

బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో ఊర్వశి రౌటేలా..
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 109 సినిమాలో ఈ అమ్మడు నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ఊర్వశి ధృవీకరించింది. బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి కూడా ఈ యాక్షన్-ప్యాక్డ్ వెంచర్‌లో నటిస్తున్నారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా కావడంతో.. ఈ చిత్రాని NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. బాలయ్య బాబు, బాబీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందుతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించునున్నారు..

Exit mobile version