Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేడు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లలో ఛాయాచిత్రాలు, సంతకాలు ఇతర సవరణలను కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకునే సౌకర్యం ఉంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఆ తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్ష తేదీలు..

ఫిబ్రవరి 28 – పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1)

మార్చి 1 – పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-1)

మార్చి 4 – పార్ట్ 3 (గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1)

మార్చి 6 – మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మార్చి 11- ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1

మార్చి 13 – కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1

మార్చి 15 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (BIPC విద్యార్థుల కోసం)

మార్చి 18 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష తేదీలు..

ఫిబ్రవరి 29 – పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2)

మార్చి 2 – పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-2)

మార్చి 5 – పార్ట్ 3 (గణితం పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2)

మార్చి 7 – మ్యాథమెటిక్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2

మార్చి 12 – ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2

మార్చి 14 – కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2

మార్చి 16 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (BIPC విద్యార్థుల కోసం)

మార్చి 19 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2.

 

*ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు తప్పిన ప్రమాదం
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణహాని లేదని… వారందరికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ నిన్న (ఆదివారం) హైదరాబాద్ లో పని ముగించుకుని అర్థరాత్రి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటు మరికొందరు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే కారు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది. కారు మంచి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులోని ఎయిర్‌బ్యాగ్‌ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్‌తో పాటు మరికొందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. లక్ష్మణ్ తలకు గాయాలు కావడంతో వెంటనే కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని… స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న ధర్మపురి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించని సభకు హాజరైన లాస్య నందిత తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సభ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ఆటోను ఢీకొట్టింది. కారు ముందుభాగం కుడివైపు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయమైంది. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతోపాటు ఆమె చెల్లెలు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

 

*మేడారం జాతర మార్గంలో క్యాంపులు.. అందుబాటులో క్రేన్లు
మరో నాలుగు రోజుల్లో తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో భక్తులను మేడారం తరలించడంలో ఆర్టీసీదే ప్రధాన పాత్ర. ఇందుకు ఆర్టీసీ తగిన విధంగా సన్నద్ధమైనా బస్సులకు నిర్వహణ సమస్యలు తప్పవు. దీంతో అడపాదడపా బస్సులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అయితే జాతరకు సర్వం సిద్ధం చేసుకున్న ఆర్టీసీ బస్సులు సైతం మొరాయిస్తే క్విక్ యాక్షన్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. మొరాయిస్తున్న బస్సులను వెంటనే గాడిలో పెట్టేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు వీరంతా ఇప్పటికే వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేశారు. జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు నలుగురు మంత్రుల బృందం మేడారానికి వెళ్లనుంది. అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు మెకానిక్ బృందాలుగా ఏర్పడిన అధికారులు జాతర జరిగే మార్గంలో పలుచోట్ల నిర్వహణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ, గూడెప్పాడు, గట్టమ్మ, పస్రా, తాడ్వాయి, జంగాలపల్లి, గణపురం, కాటారం, నార్లాపూర్, కమరం, కొండపర్తి, మేడారం 12 చోట్ల అందుబాటులో ఉంచనున్నారు. బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని చోట్ల ఇబ్బందులు తలెత్తితే ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా బృందాల సభ్యులకు నిర్దిష్ట పరిధిని కేటాయించి విధులు కేటాయించారు. తమ పరిధిలోని బస్సుల్లో లోపాలుంటే వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసి బస్సును తిరిగి రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిర్వహణ శిబిరాల్లో ఉన్న సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేస్తే వెంటనే బస్సులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్య కారణంగా నిలిచిపోయిన బస్సును తరలించేందుకు ప్రత్యేక క్రేన్, ట్రాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి పైకి లేపుతున్నారు. ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మేడారం మార్గంలో బస్సులు ఆగకుండా చూసుకోవడంతో పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలను వెంటనే తరలించేందుకు గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ గస్తీ బృందాలు మేడారం రూట్‌లో నిత్యం గస్తీ తిరుగుతూ తమ పరిధిలోని బస్సులు, ఇతర వాహనాలపై దృష్టి సారిస్తాయి. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పక్కా ప్రణాళికతో మేడారం మహాజాతరకు సిద్ధమయ్యామని అధికారులు చెబుతుండగా.. వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

 

*నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్‌ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, వర్చువల్‌ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు.
వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మే నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మ ధ్యాహ్నం 2 గంటల కు పరకామణి సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్‌ లైన్‌లో విడుదల చేయనున్నారు.

 

*రైతుల ఆందోళనకు బ్రేక్.. ఎంఎస్‌పీ ప్రణాళికను ప్రకటించిన కేంద్రం..
పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని డిమాండ్ చేస్తూ రైతులు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు దేశ రాజధానిని ముట్టడించాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హర్యానా-ఢిల్లీ బార్డర్‌లో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వారం రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఎస్‌పీతో సహా మొత్తం 12 డిమాండ్లను రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్రమంత్రులు రైతు సంఘాల నేతలతో మూడు సార్లు సమావేశం కాగా, ఆదివారం నాలుగోసారి మంత్రులు వారితో చర్చించారు. ఎంఎస్‌పీ కోసం కేంద్రం ఒక ప్రణాళికను ప్రకటించింది. దీంతో రైతులు తమ నిరసనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై మరో రెండు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు ప్రకటించారు. అప్పటి వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఎమ్‌ఎస్‌పికి చట్టబద్ధమైన హామీతో సహా తమ డిమాండ్లపై ఆదివారం ఇక్కడ రైతు నాయకులతో నాలుగో విడత చర్చలు జరిపారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటకలు ప్రభుత్వ సంస్థల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్యానెల్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్) మరియు నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వంటి సహకార సంఘాలు పప్పు ధాన్యాలు పండించే రైతులో ఒప్పందం కుదుర్చుకుంటాయని, వచ్చే ఐదేళ్ల పాటు తమ పంటలను ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలుపై ఎలాంటి పరిమితి ఉండని ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదనపై ఫిబ్రవరి 19-20 తేదీల్లో మా ఫోరమ్‌లలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.

 

*సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ మేయర్ రాజీనామా..
చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కుల్దీప్ కుమార్‌ను ఓడించడం ద్వారా ఇండియా కూటమికి వ్యతిరేకంగా సోంకర్ గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్-ఆప్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్‌కి 12 ఓట్లు వచ్చాయి. అయితే, 8 ఓట్లు చెల్లనవిగా ప్రకటించడంతో రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే, ఆప్‌కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పూనమ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. 35 సభ్యుల ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, ఆ తర్వాత పలువరు బీజేపీలో చేరడంతో 17కి చేరింది. శిరోమణి అకాళీదళ్ నుంచి ఒక అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. చండీగఢ్ ఎంపీ, బీజేపీకి చెందిన కిర్రోన్ ఖేర్‌కి ఎక్స్-అఫిషియోగా ఓటు హక్కు ఉంది. దీంతో బీజేపి మ్యాజిక్ ఫిగర్ 19గా ఉంది. జనవరి 30న ఫలితాలు వెలువడిన వెంటనే, కాంగ్రెస్ మరియు ఆప్ కౌన్సిలర్లు బిజెపి మోసం చేసిందని, ఎన్నికల ప్రక్రియను అనుసరించడం లేదని ఆరోపించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారని సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోని కోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. ఈ కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

 

 

*హౌతి రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..
యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా ఆర్మీ మరోసారి దాడులు చేసింది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. హౌతీ రెబల్స్ కు చెందిన యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్లు పేర్కొనింది. ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీ తిరుగుబాటుదారుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హౌతీ రెబల్స్ తొలిసారిగా మానవరహిత జలాంతర్గాములను సైతం వాడుతున్నారు. ఇక, ఎర్ర సముద్రంలో రవాణాను రక్షించేందుకే హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేశాం అని అమెరికా సెంట్‌కామ్‌ అధికారులు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్‌ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా వరుసగా దాడులు చేస్తుండటం వల్ల ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

*అలెక్సీ నవల్నీ తల, ఛాతీపై గాయాలు.. పుతిన్ పై విమర్శలు..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రముఖ విమర్శకుడు అలెక్సీ నవల్నీ శుక్రవారం నాడు జైలులో మరణించాడు.. అయితే, అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, తాజాగా, అలెక్సీ తల, ఛాతీపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రష్యన్ వార్తాపత్రిక నోవాయా గెజిటా యూరోప్ తెలియజేసింది.. 47 ఏళ్ల అలెక్సీ నవల్నీ ఆర్కిటిక్‌లోని పోలార్ వోల్ఫ్ పెనాల్ కాలనీలో అతను మూడు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు.. కాగా, శుక్రవారం నాడు ఉదయం వాకింగ్ చేస్తుండగా స్పృహ కోల్పోయి మరణించాడు.. అయితే, అస్పత్రికి తరలించగా, అప్పటికే మణించినట్లు డాక్టర్లు చెప్పడంతో అతడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, సాధారణంగా జైలులో మరణించిన వ్యక్తుల మృతదేహాలను నేరుగా గ్లాజ్‌కోవా స్ట్రీట్‌లోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తీసుకువెళతారు.. కానీ, అలెక్సీ నవల్నీ మరణం తరువాత, అతని మృతదేహాన్ని మొదట సమీపంలోని పట్టణమైన లాబిట్‌నాంగికి తీసుకెళ్లారు.. ఆ తరువాత ప్రాంతీయ రాజధాని సలేఖర్డ్‌లోని జిల్లా క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల దానిని క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అని పారామెడిక్‌ని ఉటంకిస్తూ వార్తాపత్రిక పేర్కొంది. ఇక, అలెక్సీ నవల్నీ తీవ్రంగా గాయపర్చడంతో మూర్ఛ వచ్చి మరణించినట్లు రష్యన్ వార్తపత్రిక ఆరోపించింది. అయితే, నవాల్నీని కొట్టి చంపారనే వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. అతను సహజ కారణాల వల్ల మరణించాడని పేర్కొంది. అలెక్సీ మరణం తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు.. అక్కడ ఇద్దరు పోలీసులను భద్రత కోసం ఉంచారు. దీంతో అతడి మృతిపై ఏదో మిస్టీరియస్ జరుగుతోంది! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

*థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..
ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది. థాయ్‌లాండ్ ఫుకెట్ నుంచి ఇజ్రాయిల్ బెన్-గురియన్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం కమ్యూనికేషన్ నెట్వర్క్ దాడికి గురైనట్లు ఇజ్రాయిల్ మీడియా ఆదివారం నివేదించింది. దాడి చేసిన వ్యక్తుల విమాన సిగ్నలింగ్ వ్యవస్థను స్వాధీనం చేసుకుని దాని గమ్యాన్ని మార్చేందుకు యత్నించారు. అయితే, ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం గమ్యస్థానానికి చేరుకుందని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. దాని వెనక శత్రువులు ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనను ఇప్పటి వరకు ఇజ్రాయిల్ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగబాటుదారులు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. అనుమానాస్పద ఆదేశాలతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, వారి ఆదేశాలను పాటించలేదు. గత వారం ఇలాగే బ్యాంకాక్ వెళ్తున్న విమానాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు.

 

*పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. నేడు ఇరుపక్షాలు నాలుగో విడత భేటీ
పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు ముగిసి దాదాపు 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది. ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజారిటీ రానందున సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ – నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ముందుకు వచ్చాయి. అధికార పంపిణీపై ఈ రెండు పార్టీల మధ్య శనివారం నాడు జరిగిన మూడో విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిసినట్లు సమాచారం. ఇరు పార్టీల నాయకులు మాత్రం తమ చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నట్లు ప్రకటించారు. నేడు (సోమవారం) మళ్లీ జరిగే భేటీలో అధికార పంపిణీపై ఓ అంగీకారానికి వస్తే బలమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలన్నదే రెండు పార్టీల ముఖ్య ఉద్దేశంగా సంయుక్తి ప్రకటనలో తెలిపింది. ఇక, 265 స్థానాలున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ 75 స్థానాలు గెలుచుకుని.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి షెహబాజ్‌ షరీఫ్‌ పేరును ప్రతిపాదించగా.. 54 స్థానాలు గెలిచిన పీపీపీ, 17 సీట్లు కైవసం చేసుకుని ఎంక్యూఎం-పీ పార్టీతో జత కలిసి సంకీర్ణం ఏర్పాటుకు రెడీ అయింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ)కు మద్దతుగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచి మద్దతు ఇస్తామంటున్న బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పీపీపీ దేశాధ్యక్ష స్థానం, స్పీకర్‌ వంటి రాజ్యాంగ పదవులను కోరుతున్నారు. ఇక, మనసు మార్చుకొని ప్రభుత్వంలో చేరాలని పీఎంల్‌-ఎన్‌ ఒత్తిడి తీసుకోస్తుంది.. ప్రావిన్సుల అభివృద్ధి నిధుల కేంటాయింపుపైనా ఇరుపక్షాల నేతలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని పాక్ మీడియా తెలిపింది.

 

*పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్‌.. 10 ఏళ్ల విరామం!
టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాల‌ ఫేం సుజిత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఓజీ కథ విషయంలో క్రేజీ అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మాఫియా డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కథ రీత్యా మాఫియా డాన్‌ అయిన పవన్‌.. కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట. 10 ఏళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి.. శత్రుమూకను అంతం చేస్తాడట. ఇదే ఈ సినిమా ప్రధాన స్టోరీ అని నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్‌ వరకు ఆగాల్సిందే. ఇప్పటికే ఓజీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయగా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌, షాన్‌ కక్కర్‌, హరీశ్‌ ఉత్తమన్‌, అభిమన్యు సింగ్‌, అజయ్‌ఘోష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్ఎస్ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

Exit mobile version