Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

విద్యార్థులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. నేడు కీలక ఒప్పందం..
విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు.. రాష్ట్ర విద్యార్థులను జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా చర్యలకు పూనుకుంటున్నారు.. ఏపీ విద్యార్థులకు ప్రపంచ యూనివర్సిటీ అధ్యాపకుల బోధనకు సిద్ధం అవుతున్నారు.. సుమారు 2 వేలకు పైగా వరల్డ్‌క్లాస్‌ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు అందించనున్నారు.. దీని వల్ల ఏకంగా రాష్ట్రంలోని 12 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భా­గంగా ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందానికి సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు.

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం 7 వాహనాలపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.. ఇక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈరోజు, రేపు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. ఇక, ఈ రోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు.

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. అసరవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు వేదపండితులు. వేదపారాయణoతో ఆదిత్యుని మూలవిరాట్ కి క్షీరాభిషేకo నిర్వహించారు ఆలయ పండితులు.. క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌరం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేకపూజలు నిర్వహించారు.. మాఘమాసం రథసప్తమి సందర్బంగా నిజరూపదర్శనంలోభక్తులకు కనువిందు చేస్తున్నారు సూర్యభగవానుడు. ఏడాదికి ఒక రోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు రాత్రి ఎనిమిది గంటల నుండే క్యూ లైన్లలో వేచివున్నారు భక్తులు.. సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మేల్యేలు గోర్లే కిరణ్, విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో పాటు తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహా పలువురు వీఐపీలు సూర్యదేవుడిని దర్శించుకున్నారు. ఇక, రథ సప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో.. ఆధిత్యుని నామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయ పరిసర ప్రాంతాలు..

మేడారం వెళ్లే భక్తులకు‌ గుడ్‌న్యూస్.. హనుమకొండ నుంచి హెలికాప్టర్‌
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించే విగ్రహ రహిత జాతర. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది. మేడారం జాతరను ఈసారి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాలినడకన, ఎడ్ల బండ్లలో వెళ్లేవారు. ఆ తర్వాత బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు భక్తులకు హెలికాప్టర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గత మూడు జాతరల నుంచి భక్తులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలోహెలికాప్టర్ ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణికులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కూడా ఉంది. తమ బకాయిలు చెల్లించి తిరిగి వస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ జాయ్‌రైడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాలను పక్షుల వీక్షణతో ఆస్వాదించవచ్చు. గతంలో తమకు సేవలందించిన ప్రైవేట్ సంస్థతో ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.రెండు రోజుల్లో ధరలను ఖరారు చేయనున్న సంగతి తెలిసిందే.

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను కలిసి ఆటో బంద్‌కు సంబంధించి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ బంద్‌కు క్యాబ్‌లు, డీసీఎం, లారీ డ్రైవర్లు కూడా మద్దతు తెలిపారని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు ఎక్కువగా జీరో టికెట్‌ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. ప్రయాణికులు లేక రోజువారి ఆదాయానికి గండి పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం (ఫిబ్రవరి 16) నాలుగో రోజుకు చేరాయి. ఢిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ భారత్‌ బంద్‌ నేపథ్యంలో నొయిడాలో 144 సెక్షన్‌ విధించారు. నోయిడా పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) కింద గురువారం అర్థరాత్రి సెక్షన్ 144 విధించారు. గ్రేటర్ నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీకి ఆనుకుని ఉన్న అన్ని సరిహద్దులలో ఢిల్లీ పోలీసులు, గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఇంటెన్సివ్ చెకింగ్ చేస్తారని అధికారులు తెలిపారు. చెకింగ్ కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని, కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లించబడుతుందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లే ప్రజలు వీలైనంత వరకు మెట్రోను ఉపయోగించాలని పోలీసులు కోరారు. నొయిడా, గ్రేటర్ నొయిడా, సిర్సా, పారి చౌక్, సూరజ్‌పూర్‌ వాహనదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు.

సానుకూలంగానే చర్చలు.. రైతు సంఘాలతో ఆదివారం మరోసారి సమావేశం!
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చే చట్టం సహా పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడానికి మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. అంతకుముందు ఫిబ్రవరి 8, 12 తేదీలలో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చండీగఢ్‌లో గురువారం రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్​, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చర్చలు జరిపారు. సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగిన సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు.. దాదాపు 5 గంటల పాటు కొనసాగాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సీఎం భగవంత్‌ మాన్‌ చెప్పారు.

డ్రోన్ డెలివరీ వల్ల ఎయిర్ ట్రాఫిక్‌పై ఎంత ప్రభావం ఉంటుంది? దాన్ని ఎదుర్కొనే మార్గాలేంటి ?
సైన్స్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు విదేశాల్లోని రెస్టారెంట్‌లో రోబోలు ఆహారాన్ని వండి వడ్డించడం.. ఏదైనా పెళ్లి లేదా ఇతర ఫంక్షన్‌లో డ్రోన్‌లు ఫోటోలు తీయడం లేదా వీడియోలు చేయడం వంటివి కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆ డ్రోన్‌లు మీకు వస్తువులను కూడా చేరవేస్తాయి. ఈ వార్త విన్నప్పుడు వస్తువులు ఎలా డెలివరీ చేయబడతాయని ఆశ్చర్యపోతున్నారా. ఆకాశంలో అదే మొత్తంలో ట్రాఫిక్ ఉండదా వంటి అనేక ఆలోచనలు మీ మదిలోకి వచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ముందుగా డ్రోన్ ద్వారా ఎలాంటి పని జరుగుతుందో తెలుసుకుందాం. డ్రోన్‌లు వస్తువులు, మందుల డెలివరీ, వాతావరణ సర్వేలు, హైవేలు రైలు మార్గాల కోసం సర్వేలు, శాంతిభద్రతలు, వ్యవసాయ సర్వేలు, టోపోగ్రాఫికల్ అధ్యయనాలు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో సహాయం చేయడానికి ఉపయోగించబడతాయి. మూడు రకాల డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. అవి నానో డ్రోన్లు, మైక్రో డ్రోన్లు, పెద్ద డ్రోన్లు. నానో డ్రోన్లు 15 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి.. ఇవి 250 గ్రాముల బరువును ఎత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మైక్రో డ్రోన్లు 60 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయి. రెండు కిలోల బరువును ఎత్తగలవు. పెద్ద డ్రోన్లు 60 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఇవి రెండు కిలోల నుండి 350 కిలోల వరకు బరువును ఎత్తగలవు.

స్వలింగ పౌర వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్..
ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సేమ్‌-సెక్స్‌ మ్యారేజీని లీగల్‌ చేసిన జాబితాలలో గ్రీస్‌ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు.. ఈ బిల్లు ఆమోదం LGBT సమాజం గ్రీస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. అయితే, స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్‌ నిలిచింది. యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్యదేశాల్లో 15 దేశాలు ఇప్పటికే ఈ వివాహాన్ని చట్టబద్ధం చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దీనికి పర్మిషన్ ఉంది. స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. 300 స్థానాలున్న పార్లమెంటులో 176 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఇది చట్ట రూపం దాల్చింది.

పొరపాటున కూడా ఈ 5 లావాదేవీలు చేయకండి.. చేశారో ఐటీ నోటీసులు తప్పవు
తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి పనిని ఆన్ లైన్లోనే చేస్తున్నారు. అలాగే పలు బ్యాంకింగ్ లావాదేవీలు ఆన్‌లైన్ లోనే జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నగదు లావాదేవీల ఎంపికను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా లావాదేవీ పరిమితికి మించి ఉంటే, ఆదాయపు పన్ను అధికారులు ఇంటికి నోటీసు పంపుతారు. ఈ రోజు కథనంలో మనం ఎంత వరకు లావాదేవీలు చేయగలమో తెలుసుకుందాం. దాని పరిమితి ఎంత? మించిపోయినప్పుడు ఐటీ నోటీసులను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే, దానిని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. ఈ డబ్బు ఒకే ఖాతాదారునికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేయబడి ఉండవచ్చు. ఎవరైనా నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తున్నందున, ఆదాయపు పన్ను శాఖ డబ్బు మూలానికి సంబంధించిన సమాచారం కోసం మిమ్మల్ని అడగవచ్చు.

టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై జై షా కీలక ప్రకటన!
టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ 2024 వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్‌తో రెండేళ్ల ఒప్పందం 2023 వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే ప్రపంచకప్‌ అనంతరం జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ హెడ్ కోచ్‌గా కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే రాహుల్ పదవీ కాలం ఎప్పటివరకు అన్నది మాత్రం బీసీసీఐ చెప్పలేదు. తాజాగా ద్రవిడ్‌తో మాట్లాడి.. టీ20 ప్రపంచకప్‌ 2024 వరకు ఒప్పందాన్ని పొడిగించినట్లు జై షా వెల్లడించాడు. రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గురువారం మొదలైన మూడో టెస్ట్‌కు ముందు జై షా మాట్లాడుతూ… ‘2023 వన్డే ప్రపంచకప్‌ ముగిశాక రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదు. మెగా టోర్నీ అనంతరం ద్రవిడ్‌ భాయ్‌ వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్వదేశంలో అఫ్గాన్‌తో సిరీస్‌తో బిజీ అయ్యాడు. రాజ్‌కోట్‌ టెస్ట్‌కు ముందు ద్రవిడ్‌తో నేరుగా మాట్లడే అవకాశం దొరికింది. టీ20 ప్రపంచకప్‌ 2024 వరకు కోచ్‌గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్‌ సానుకూలంగా స్పందించాడు. టీమిండియాను ద్రవిడ్ సమర్దవంతంగా నడిపించగలడు. అతని మార్గనిర్దేశకంలో టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా రాణిస్తుందన్న నమ్మకం ఉంది. సహాయక కోచింగ్‌ సిబ్బంది కూడా టీ20 ప్రపంచకప్‌ వరకు యధాతథంగా కొనసాగుతారు’ అని జై షా స్పష్టం చేశాడు.

గోవాలోని లగ్జరీ హోటల్ లో రకుల్ పెళ్లి.. ఒక్కో రూమ్ రెంట్ ఎంతో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు వరసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపించింది.. ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతోంది. ఫారెన్ కంట్రీస్ లో పెళ్లి చేసుకోవాలని రకుల్ అనుకున్న ఇప్పుడు గోవాలో చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.. గోవాలోని ఓ లగ్జరీ హోటల్ లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌ హోటల్‌ వీరి పెళ్లి వేదిక అయింది. గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ ఇది.. విశాలవంతమైన ఈ హోటల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది.. అంతేకాదండోయ్ ఈ అందమైన హోటల్ లో ఒక్కో రూమ్ కూడా భారీగానే ఉంటుంది.. ఒక్కో రూమ్ కు రూ. 19 వేల నుంచి 75 వేల వరకు రెంట్ చెల్లించాల్సిందే అట. రకుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భగ్నానీ జంట తమ వెడ్డింగ్ కోసం మొత్తం మూడు రోజుల పాటు ఐటీసీ హోటల్ ను బుక్ చేసుకున్నారట. ఇందుకుగానూ వారు భారీగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం.. ఈ నెల 19 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి.. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది.

Exit mobile version