Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలో సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం.. ఇక, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొనబోతున్నారు. కర్నూలు పర్యటన కోసం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలుకు చేరుకోనున్న సీఎం జగన్‌.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.. మరోవైపు.. నేడు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.. ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఫిరంగిపురం మండలం రేపుడిలో ప్రత్యేక హెలిపాడ్ నిర్మాణం చేశారు.. అదే ప్రాంతంలో భారీ సభా వేదికను సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ఇక, ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకోనున్న సీఎం జగన్‌.. వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు.. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి.

పవన్‌ కల్యాణ్‌ పర్యటన రద్దు.. కారణం అదేనా..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు.. దాని కోసం హెలీకాప్టర్‌ సిద్ధం చేసింది జనసేన.. ప్రతీ జిల్లాలో మూడు సార్లు జనసేనాని పర్యటించేందుకు వీలుగా ప్లాన్‌ చేసినట్టు.. వార్తలు వచ్చాయి.. అయితే, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో జనసేన చీఫ్ పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ కల్యాణ్ పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటను రద్దు చేసుకున్నారు.. పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అవరోధాలు సృష్టించారని.. అందుకే పవన్‌ కల్యాణ్ పర్యటన రద్దు అయినట్టు జనసేన పార్టీ ప్రకటించింది. భీమవరంలో చేసినట్లుగానే అమలాపురం, కాకినాడలోనూ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతులు ఇవ్వలేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.. కాకినాడలో హెలీప్యాడ్‌ కోసం అనుమతి కోరితే.. 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి కలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని జనసేన నేతలు చెబుతున్నారు.. అయితే, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు జనసేనాని.. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వని కారణంగా పవన్‌ పర్యటన రద్దు కాగా.. షెడ్యూల్‌ ప్రకారం.. అక్కడి జరిగిన సమావేశాలను జనసేన కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు.. భక్తులకు కీలక సూచనలు
తిరుమ‌లలో రేపు రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఈ సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమ‌ల‌లో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు.. దీనినే ఒక్క రోజు బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు.. ఇక, ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండగా.. భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి వేడుకల సందర్భంగా శుక్రవారం రోజు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.. మొత్తం 7 వాహనాలపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.. ఇక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు.

తెలంగాణలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో వేసవి ప్రారంభం కాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతుండగా, మధ్యాహ్నానికి ఎండ తీవ్రత పెరుగుతోంది. నేటి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయని.. హైదరాబాద్‌లో 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతేడాది ఎండలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోయారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎండ వేడిగా ఉంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. స్టీల్ కాస్టింగ్ ప్రారంభమవుతుంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ఎండలు కాస్త ముందుగానే చెమటలు పట్టిస్తున్నాయి. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో ఇదే గరిష్ఠ పెరుగుదల అని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చివరి వారంలో 36 డిగ్రీలకు చేరుకుంది. ఖమ్మంలోనూ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 3.7 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రేపు ఆటోలు బంద్‌.. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీ
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. దీంతో బస్సుల్లో సీటు దొరకడం లేదు. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు ఎక్కువగా జీరో టికెట్‌ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. ప్రయాణికులు లేక రోజువారి ఆదాయానికి గండి పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. మద్దతు కోరేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రేపు (16న) ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.. ఆ రోజు ఒక్క ఆటో కూడా రోడ్డెక్కకూడదని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

నేడు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌.. నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమిపూజ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నిలయమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైల్వే అధికారుల సమక్షంలో శంకుస్థాపన జరగనుంది. ప్రతి సంవత్సరం, వేలాది మంది యాత్రికులు ప్రసిద్ధ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి, దేవుడి ఆశీస్సులు కోరుకుంటారు. ఈ ఆలయ పట్టణం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ సెంట్రల్ తెలంగాణలోని కొమురవెల్లిలో హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఆమోదించింది. కొత్త హాల్ట్ స్టేషన్ మొదటిసారిగా రైలు కనెక్టివిటీని అందిస్తుంది, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఈ స్టేషన్ మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైలు మార్గంలో ఉంది. నిబంధనల ప్రకారం కొత్త స్టేషన్ భవనంలో టిక్కెట్ బుకింగ్ విండోతో పాటు కవర్ ప్లాట్‌ఫారమ్, సరైన లైటింగ్ సౌకర్యం, ఫ్యాన్లు, వెయిటింగ్ హాల్స్ వంటి ఇతర ప్రయాణికుల సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. కొమురవెల్లిలోని హాల్ట్ స్టేషన్ ప్రయాణీకులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రైలు ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రతిపాదిత స్టేషన్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది యాత్రికుల ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది. యాత్రికులకే కాకుండా విద్యార్థులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రయాణికులు, రోజువారీ కూలీలకు కూడా ఈ స్టేషన్ ఉపయోగకరంగా ఉంటుంది.

నేడు ఎలక్టోరల్ బాండ్ల అమ్మకంపై సుప్రీం కోర్టు తుది తీర్పు..
రాజకీయ పార్టీలకు డబ్బు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్ 2న తీర్పును రిజర్వ్ చేసింది. అదే సమయంలో సీల్డ్‌ కవర్‌లో 2023 సెప్టెంబర్‌ 30 వరకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సైతం ఆదేశించింది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ చేయాలని సీనియర్‌ లాయర్ ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ పిటిషన్లపై మూడు రోజుల పాటు విచారణ చేసిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్‌ 2వ తేదీన తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఈ కానిస్టిట్యూషన్‌ బెంచ్‌లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలు సభ్యులుగా ఉన్నారు.

ఇరాన్ మెయిన్ గ్యాస్ పైప్‌లైన్‌లో విధ్వంసం.. సరఫరాపై చమురు మంత్రి ప్రకటన
ఇరాన్ ప్రధాన దక్షిణ-ఉత్తర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో బుధవారం రెండు పేలుళ్లు సంభవించాయని ఇరాన్ చమురు మంత్రి ప్రకటించారు. కొన్ని ప్రావిన్సులలోని పరిశ్రమలు, కార్యాలయాలకు ఈ సంఘటన గ్యాస్ కోతలకు కారణమైందన్న వార్తలను రాష్ట్ర మీడియా నివేదించింది వీటిని అధికారులు ఖండించారు. దేశంలోని రెండు ప్రాంతాలలో జాతీయ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ పైప్‌లైన్‌ల నెట్‌వర్క్‌లో బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు (GMT రాత్రి 9.30 గంటలకు) తీవ్రవాద విధ్వంసక చర్య జరిగిందని మంత్రి జవాద్ ఓవాజీ తెలిపారు. దెబ్బతిన్న పైప్‌లైన్ సమీపంలోని గ్రామాలకు మాత్రమే గ్యాస్ కోతలు ఉన్నాయని, వాటిని తరువాత మరమ్మతులు చేస్తామని ఓజీ చెప్పారు. నిర్వహణ కోసం తాత్కాలిక ఆంక్షలు ప్లాన్ చేసినట్లు రాష్ట్ర మీడియా నివేదించింది. ఓవూజీ 2011లో ఇదే విధమైన సంఘటనను ఎత్తి చూపారు. ఇది విధ్వంసక చర్య అని ఆయన అన్నారు. ఇది దేశంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం కలిగించింది.

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గురువారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 దిగొచ్చి.. రూ. 56,990కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 62,170కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. వెండి కూడా బంగారం బాటలోనే సాగుతోంది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది.. రూ. 75,400కి చేరింది.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720గా ఉంది.న్యూఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 57,140 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300గా ఉంది. అదే విధంగా భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగరాం ధర రూ. 62,170గా ఉంది..

భారత్‌, ఇంగ్లండ్‌ మూడో టెస్ట్‌.. ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం!
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా నేడు భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో కెప్టెన్స్ రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్‌లు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు. అయితే మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. భారత వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్​ ఆండర్సన్‌, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు రాజ్‌కోట్‌ టెస్ట్ చాలా ప్రత్యేకం. ఈ ముగ్గురు అత్యంత అరుదైన మైలురాయిని చేరువలో ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో వికెట్‌ తీస్తే.. టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని అందుకుంటాడు. అప్పుడు టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారతీయుడు, 9వ బౌలర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) టెస్టుల్లో అత్యధిక వికెట్స్ తీశాడు. షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (695), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోర్ట్నీ వాల్ష్ (519), నాథన్ లియాన్ (517) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ కెరీర్‌లో ఇప్పటివరకు 97 టెస్టు మ్యాచ్‌లు ఆడి 499 వికెట్లు తీశాడు. జేమ్స్ ఆండర్సన్‌ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) జిమ్మీ కంటే ముందు ఉన్నారు. టెస్టు చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ నిలవనున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 184 టెస్టులు ఆడి.. 343 ఇన్నింగ్స్‌లలో 695 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version