NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు.. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ క్రికెట్ వీక్షించడంతో పాటు కొంత సేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది.. ఇక, రాత్రి 8.35 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం విదితమే.. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగుతూ వచ్చాయి.. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను అందించింది వైఎస్‌ జగన్‌ సర్కార్..

జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై అభ్యంతరం.. నేడు హైకోర్టులో విచారణ
జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్.. జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడాన్ని తన పిటిషన్‌లో తప్పుబట్టారు.. ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, హైదరాబాద్ లోని జనసేన పార్టీ అధ్యక్ష/కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్‌.. ఆ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.. అయితే, గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని అంటున్నారు పిటిషనర్ . ఆర్‌పీసీ ధరఖాస్తు పట్టించుకోకుండా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, తమకే గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు పిటిషనర్‌.. అయితే, ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు ఎలాంటి విచారణ సాగనుంది.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి మరి.

నేడు చంద్రబాబుతో వైసీపీ ఎంపీ భేటీ..? పార్టీకి గుడ్‌బై..!?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు ఇంకా కాకపుట్టిస్తూనే ఉన్నాయి.. కొందరు సిట్టింగ్‌లకు ఈ సారి సీటు లేదంటూ పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో.. వారు పక్కపార్టీల వైపు చూపుస్తున్నారు.. ప్రకాశం జిల్లా వైసీపీలో తాజా పరిణామాల నేపథ్యంలో.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సమావేశం కానున్నట్టు ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్ లో నేడు చంద్రబాబుతో ఎంపీ మాగుంట భేటీ కానున్నట్లు సమాచారం.. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు మాగుంట.. ఇప్పటికే మాగుంట సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు మాగుంట సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యి.. టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. పార్టీ అధినేతతో చర్చలు, సీటుపై హామీ తదితర అంశాలు తేలిన తర్వాత.. రేపు ఒంగోలు వెళ్లి అధికారికంగా టీడీపీలో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచరులు చెబుతోన్న మాట.. కాగా, ఎంపీ మాగుంట కోసం చివరి కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. ఈ విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసిన ఆయన.. ఇక, సాధ్యం కాదనే సంకేతాలు రావడంతో.. పార్టీకే నిర్ణయాన్ని వదిలేరు. మరి.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. టీడీపీలో చేరతారా? మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

నేడు మేడిగడ్డకు సర్కార్ టూర్.. సీఎంతో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరిస్తారు. ఇక, ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఖర్గే పరిశీలించారు. ఇక, నేటి ఉదయం 10.15గంటలకి తెలంగాణ అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరుతారు. మధ్యహ్నం 3.30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5గంటల నుంచి 5.30 వరకు సీఈ సుధాకర్ రెడ్డి ప్రజెంటేషన్ ఉంటుంది.. 5.30 నుంచి 6గంటల వరకు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ప్రెసెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే, సాయంత్రం 6 గంటల నుంచి 6.30గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరానున్నారు. 8.30 నుంచి 9గంటల వరకు పరకాలలో భోజనం చేయనున్నారు. ఇక, 9.30గంటలకి పరకాల నుంచి బయలుదేరుతారు.. అర్థరాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది.

ఒకేసారి రైతు రుణమాఫీ.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. దీంతో పాటు త్వరలోనే 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతుంది. అయితే, కాంగ్రెస్ సర్కార్ రైతులకు మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది. అయితే, రైతు భరోసా కింద ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని తెలిపింది. అలాగే రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా రుణమాఫీ చేస్తామని రైతన్నలకు హామీ ఇచ్చింది. ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాల్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని త్వరలోనే క్లీయర్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే, రైతు రుణ మాఫీపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాలు విడుదల!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ఉదయం విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, డేట్ ఆఫ్ బర్త్ లేదా పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ప్రాథమిక కీ, తుది కీ మధ్య భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. 17 ప్రశ్నలకు కీ మారగా.. గణితంలో 3 ప్రశ్నలు, రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నలను తొలగించారు. పేపర్ 1 పరీక్షలు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా.. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది. ఈ సంవత్సరం మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ యొక్క రెండు పేపర్లకు నమోదు చేసుకున్నారు. అందులో 11.70 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఓ విద్యార్థి జేఈఈ మెయిన్ పరీక్షలను క్లియర్ చేస్తే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవగా.. ఏప్రిల్‌లో పరీక్ష ఉంటుంది.

నేటి నుంచి రెండు రోజుల పాటు యూఏఈలో ప్రధాని మోడీ పర్యటన
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని రేపు ఆయన ప్రారంభించనున్నారు. అయితే, అంతకుముందు ఇవాళ అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు కూడా జరగే అవకాశం ఉంది. ఇక, ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు అబుదాబికి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అబుదాబికి చేరుకుంటారు. ఇక, సాయంత్రం 4 ఉంచి 5.30 గంటల వరకు అబుదాబిలో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఈ ద్వైపాక్షిక భేటీలో ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఓడరేవుల రంగాలలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. అలాగే, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు అహ్లాన్‌ మోడీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూఏఈ టూర్ తరువాత ఖతార్ కు రేపు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్తారు. దోహాలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. నావి మాజీ అధికారులను విడుదల చేసినందుకు ప్రధాని మోడీ ఖతార్‌కు కృతజ్ఞతలు తెలిపనున్నారు.

నేడు రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌.. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు!
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో హస్తినలో ప్రస్తుతం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని.. ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు నిర్మించారు. మరోవైపు ఢిల్లీలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీ’కి అనుమతి లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోరా సోమవారం స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. హస్తినలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైన నిషేధం విధిస్తున్నట్లు సంజయ్‌ అరోరా స్పష్టం చేశారు. ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం పైనా నిషేధం ఉందన్నారు. దాంతో ఢిల్లీలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో చెప్పిన ఆర్బీఐ గవర్నర్
మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి మూలధన లభ్యత పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అన్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది.. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మార్కెట్ ప్రారంభ అంచనాల కంటే ఈ ఏడాది రుణాలు తక్కువగా ఉన్నాయని దాస్ చెప్పారు. తక్కువ రుణాల పరిమాణం అంటే ప్రైవేట్ రంగ అవసరాలను తీర్చడానికి బ్యాంకులకు మరిన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. తక్కువ ప్రభుత్వ రుణాలు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఒక అడుగు అని, ఎందుకంటే ఇది ప్రైవేట్ రంగానికి వారి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ రుణాలను అందజేస్తుందని ఆయన అన్నారు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం స్థాయిని అదుపు చేయడంలో తోడ్పడాలని దాస్ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్‌లో ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటును తీర్చడానికి నిర్ణీత వ్యవధిలో మెచ్యూర్ అయ్యే దీర్ఘకాలిక సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ. 14.13 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదించారు.

పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రతి రోజు హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు తాజా కేసులో పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి కంపెనీ డైరెక్టర్ రాజీనామా చేశారు. ఇది కంపెనీ ధృవీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసిన సమాచారం ప్రకారం.. పేటీఎం పేమెంట్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న మంజు అగర్వాల్ ఫిబ్రవరి 1న ఆయన తన రాజీనామాను బోర్డుకు సమర్పించారు. ఆర్బీఐ నిషేధం కారణంగానే మంజు అగర్వాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, జనవరి చివరి వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త కస్టమర్లను జోడించకుండా పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ను నిషేధించింది. ఇందుకోసం ఆర్‌బీఐ కంపెనీకి ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా చేశారు. కంపెనీ ధృవీకరించింది. ఇంతకుముందు, చైనాతో ఈ కంపెనీ సంబంధాలపై భారత ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో చైనా విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.