NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా..?
ఆంధ్రప్రదేశ్‌లో రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించనున్నారు.. ఈ రోజు ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈనెల 9వ తేదీన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ.. 9వ తేదీన నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజు వారి అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు స్పీకర్‌. కాగా, త్వరలోనే రాజ్యసభ ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల లోపే రెబల్‌ ఎమ్మెల్యే అనర్హతపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే విధంగా.. స్పీకర్‌ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు అయిన విషయం విదితమే.. అయితే, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది సీఐడీ.. ఆ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో సీఐడీ పేర్కొంది.. అయితే, జనవరి 19వ తేదీన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 12వ తేదీ.. అంటే ఇవాళ్టికి వాయిదా వేసింది.. దీంతో. ఇవాళ్టి విచారణ ఎలా ఉండబోతోంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో గడిపారు చంద్రబాబు.. ఇక, మొదట మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.. దీంతో.. ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఏపీ సీఐడీ.

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామం సీతపల్లి వాగులో జరిగింది.. ఈ ఘటనతో గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో రంపచోడవరం విహారయాత్రకు వెళ్లారు. సీతపల్లి వాగులో  సరదాగా దిగి స్నానం చేస్తుండగా వారిలో ముగ్గురు వాగు లోతుల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. మిగిలిన ఇద్దరూ బయట పడ్డారు. పదహారేళ్ల వీర వెంకట అర్జున్ , అండిబోయిన దేవి చరణ్ , లావేటి రామన్ లు గల్లంతు అయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న రంపచోడవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు వెలికితీశారు.. అనంతరం పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. దీనితో రంప ఎర్రంపాలెంలో విషాదం అలముకుంది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. చిన్నారులు మృతిచెందడంతో.. వారి కుటుంబ సభ్యులను అదుపుచేయడం ఎవ్వరివల్లా కావడం లేదు.

గ్రూప్‌-1 భర్తీకి లైన్‌క్లియర్‌.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పడిన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన 503 గ్రూప్ -1 నోటిఫికేషన్ తో పాటు మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులతో పాటు ఈ 60 పోస్టులను కలిపి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్ పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 11న టీఎస్ పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా 60 కొత్త పోస్టులు మంజూరు కావడంతో గ్రూప్-1 ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.

నేడే బీహార్‌ అసెంబ్లీలో నితీశ్ కుమార్‌ ప్రభుత్వానికి బలపరీక్ష..
నేడు బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. గత నెలలో ఇండియా కూటమిని వదిలి పెట్టి ఎన్డీయే కూటమిలోకి తిరిగి చేరాడు. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జనతాదళ్-యునైటెడ్ ఎమ్మెల్యేలందరికీ ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కావాలని ఆయన విప్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నిన్న రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరు పాట్నకు చేరుకున్నారు. ఇవాళ జరిగే బలపరీక్షలో వీరందరు పాల్గొంటారు. అయితే, మొత్తం 243 మంది సభ్యులున్న బిహార్ శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 122.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 127 మంది (JDU 45, BJP 78, మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ పార్టీ హిందూస్థాన్ అవామీ లీగ్‌కు నలుగురు ఎమ్మెల్యలు) ఉండటంతో ఈజీగా గట్టెక్కుతాననే ధీమాలో నితీశ్ కుమార్ ఉన్నారు. మరోవైపు, మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు చేశాయి.

నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఉపాధి మేళాలో నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి ద‌శ‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఇక, ఇవాళ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ ఉపాధి మేళా నిర్వహించనుంది. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు ఇంధన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. అయితే, దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ జాబ్ మేళా ముందడుగు వేసింది. ఈ రోగ్ గర్ మేళా ఉపాధి కల్పనను పెంచడంతో పాటు యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి లాభదాయకమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కూడా iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆన్‌లైన్ మాడ్యూల్ శిక్షణ పొందుతున్నారు.

గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్‌ ప్రభుత్వం!
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ‘ఖతార్‌లో నిర్బంధించబడిన అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వారిలో ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఖతార్ రాష్ట్ర ఎమిర్ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము’ అని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో అల్ దహ్రా గ్లోబల్ కేసులో అరెస్టయిన ఎనిమిది మందికి విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు రద్దు చేసింది. మరణశిక్షను జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించింది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖతార్‌లో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత నేవీ అధికారులలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రగేష్ ఉన్నారు.

9 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్‌ ఓటములు.. ఆస్ట్రేలియా గండాన్ని దాటలేమా?
ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్‌లో భారత్ పరాభవాలను ఎదుర్కొంది. 9 నెలల వ్యవధిలో మూడుసార్లు భారత్‌ ఓటములకు ఆస్ట్రేలియానే కావడం విశేషం. సీనియర్‌ స్థాయిలో అయినా, జూనియర్‌ టోర్నీలో అయినా ఆసీస్‌ను గెలవలేక భారత జట్లు చేతులెత్తేశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్, అండర్‌-19 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో భారత్ విజయానికి ఆస్ట్రేలియా అడ్డుపడింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా దూకుడు ముందు భారత్‌ పూర్తిగా తేలిపోయింది. రెండు సంవత్సరాలు అద్భుతంగా ఆడిన భారత్.. ఫైనల్లో మాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేదు. సొంతగడ్డపై ఫేవరెట్‌గా అడుగుపెట్టి.. అజేయంగా వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ చేరిన భారత్.. ఆసీస్‌ గండాన్ని దాటలేకపోయింది. అన్ని విభాగాల్లో విఫలమయిన రోహిత్ సేన ఆసీస్ ఆధిపత్యం ముందు తలొంచింది. తాజాగా అండర్‌-19 ప్రపంచకప్‌ 2024లో యువ భారత్‌ ఒక్క ఓటమి లేకుండా టైటిల్‌ పోరులో అడుగుపెట్టి.. ఆసీస్ ముందు తేలిపోయింది. దాంతో 9 నెలల వ్యవధిలో భారత్ అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఆసీస్ గండాన్ని దాటలేమా? అని ఫాన్స్ బాధపడుతున్నారు. బెనోని వేదికగా ఆదివారం జరిగిన అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో టీమిండియాను ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ (55) గల్ఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్ రాజ్ లింబాని 3 వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లు మహ్లీ బార్డ్‌మాన్, రాఫ్ మాక్‌మిలన్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.