NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఫోకస్‌.. వైఎస్‌ షర్మిలకు కీలక బాధ్యతలు..! నేడు ఫైనల్..!
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్‌ పెడుతోంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక, నిర్వహించనున్న బాధ్యతలపై చర్చించనట్టు తెలుస్తోంది.. “స్టార్ కాంపైనర్”గా షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక, ఇవాళ్టి భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు, ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు రాహుల్‌ గాంధీ కూడా హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమైందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరితే “స్టార్ కాంపైనర్” గా ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఆయేషా మీరా కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు ఆమె తల్లిదండ్రులు శంషాద్‌బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా.. తమ కుమార్తె హత్య కేసులో మళ్లీ విచారణ జరపాలని, విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వెనుక ఎవరున్నారో తేల్చాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తూ 2018లో ఉమ్మడి హైకోర్టు తీర్పు వచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. సీబీఐ దర్యాప్తు సరిగా లేదని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. సీబీఐ దర్యాప్తు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షన చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు అయేషా తల్లిదండ్రులు.. దర్యాప్తుపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఐదేళ్లు అవుతున్నా సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదని పిటిషన్ లో తెలిపారు ఆయేషా తల్లితండ్రులు.. ఇక, ఆయేషా మీరా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ హైదరాబాద్‌ సీబీఐ, విశాఖపట్నం సీబీఐ అదనపు ఎస్పీ, కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పురుషులకు ప్రత్యేక బస్సులు?.. ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఆర్టీసీ
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. మహిళలు ముందు వరుస నుంచి చివరి వరకు ఉంటున్నారు. ఈ పరిణామం పురుషులకు కాస్త ఇబ్బందిగా మారింది. స్కూలు పిల్లలు కూడా ఒక సవాలుగా ఎదుర్కొన్నారు. చాలా చోట్ల బస్సు రద్దీగా ఉండడంతో పాఠశాల విద్యార్థులు బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నారు. పురుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ బస్సులు చూసిన మహిళలతోనే నిండుగా ఉండటమే కాకుండా.. ఒకవేళ పురుషులు వున్నా వారు నిలబడటానికి చోటుకూడా లేకుండా పోతుంది. దీంతో గత్యంతరం లేక చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ సంస్థ ఎండీ ఎదుట ఆర్టీసీ సిబ్బంది ప్రస్తావించినట్లు సమాచారం. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపడం ఎలా? ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.

ఢిల్లీలో తీవ్ర పొగమంచు.. భారీ సంఖ్యలో విమానాల దారి మళ్లింపు
డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శీతాకాలం పూర్తి స్వింగ్లో ఉంది. రాజధాని ఢిల్లీలో చలి విపరీతంగా ఉంది. ఉదయం, రాత్రి దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. దాని కారణంగా రోడ్లపై నడవడమే కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. గతంలో వాహనాలు రోడ్డుపై స్పీడ్‌గా నడిచేవి ఇప్పుడు నెమ్మదించాయి. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. బుధవారం ఈ సీజన్‌లో మొదటిసారిగా అనేక ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ కనిపించింది. దట్టమైన పొగమంచు ట్రాఫిక్‌పై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీంతో రైళ్ల రాకపోకలు, విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాల మార్గాలు దారి మళ్లించబడ్డాయి. శీతాకాలం దృష్ట్యా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ ఒకరోజు ముందుగానే అంచనా వేసింది. పొగమంచు కారణంగా ఢిల్లీ మొత్తం తెల్లటి పొగమంచుతో కప్పబడి ఉంది.

ముస్లింలను రెచ్చగొడుతున్న పన్ను.. అయోధ్యలో రచ్చ సృష్టించాలని ప్లాన్
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. డిసెంబర్ 30 న అయోధ్యలో జరగనున్న రోడ్ షోను లక్ష్యంగా చేసుకోవాలని పన్ను ‘యుపి ముస్లింలను’ కోరాడు. ఇది మాత్రమే కాకుండా ముస్లింల కోసం కొత్త దేశం ‘ఉర్దుస్తాన్’ని సృష్టించాలని కోరాడు. త్వరలో భారతదేశంలో నమాజ్‌ను కూడా నిషేధిస్తారని ఆరోపించారు. విశేషమేమిటంటే అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో పన్ను ఇలాంటి ప్రకటన చేయడం విశేషం. ఇందుకు సంబంధించి అమెరికా, బ్రిటన్‌, కెనడా దేశాలతోనూ ఇన్‌పుట్‌లను పంచుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అధికారికంగా ఏమీ చెప్పలేదు. 2020లో భారత్‌ పన్నూను ఉగ్రవాది జాబితాలో చేర్చింది. ఇంతకు ముందు కూడా, అతను భారతదేశంలో అనేకసార్లు దాడి చేస్తానని లేదా అల్లకల్లోలం సృష్టిస్తానని బెదిరించాడు. గత వారం కూడా, పన్ను తనను కాశ్మీర్-ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ ప్రతినిధిగా అభివర్ణించుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో భారత ఆర్మీ సైనికులపై దాడికి కూడా ఆయన మద్దతు తెలిపారు. ఈ దాడి ‘కాశ్మీరీలపై భారతదేశం చేస్తున్న హింసాకాండ ఫలితం’ అని అన్నారు. కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా పన్నూ అభివర్ణించారు. పరిష్కారానికి రెఫరెండం మాత్రమే మార్గమని చెప్పారు.

39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో (డిసెంబర్ 25 వరకు) రూ. 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ. 63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ. 96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ. 12.38 కోట్లు వచ్చినట్లు టీడీబీ తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే.. ఆదాయం మరింత పెరుగుతుందని టీడీబీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 25 వరకు శబరిమలను 31,43,163 మంది దర్శించుకున్నారని.. 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు. 40 రోజుల్లో 208 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. జనవరి 15న మకరవిలక్కు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.

సల్మాన్ ఖాన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఫ్యాన్స్ ఫిదా..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఒక్క నార్త్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్లూభాయ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు యాక్షన్ హీరోగా మాత్రమే అందరికీ పరిచయం.. కానీ చాలా మందికి తెలియని ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు.. అద్భుతమైన కళాకారుడు. పెయింటింగ్ పట్ల అతనికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇప్పటివరకు అనేకరకాల పెయింటింగ్స్ వేసి శభాష్ అనిపించుకున్నాడు.. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. కేవలం చేతివేళ్లతోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తుంటారు సల్మాన్. పన్వెల్ లోని తన ఇంటిలో ఎన్నోరకాల పెయింటింగ్స్ వేశాడు సల్మాన్.

ప్రియుడితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పెళ్లి?
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన లేడీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఈమె గట్టి పోటీని ఇవ్వడం గమనార్హం.. ప్రతి టాస్క్ లలో అబ్బాయిలతో పోటీ పడి ఫిజికల్, మెంటల్ టాస్క్ లలో సత్తా చాటింది. చాలా టాస్క్స్ లో ప్రియాంక చివరి వరకు వచ్చింది. ఒకసారి కెప్టెన్ అయ్యింది. ఎక్కువగా కెమెరాల ముందు కనిపించకుండా ఉండటమే ఆమెకు మైనస్ అయ్యింది.. అమర్, శోభ, ప్రియాంక ఒక టీమ్ గా ఆడారు.. మొత్తానికి బాగానే రెమ్యూనరేషన్ అందుకుంది.. అయితే ఇప్పుడు ప్రియుడితో పెళ్లికి రెడీ అవుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఈ విషయం పై ప్రియాంక స్పందించింది.. బిగ్‌బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ రావడంతో అందరికి తన ప్రేమ గురించి చెప్పి, నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్. అలాగే శివ కుమార్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, నిన్ను మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయి అడిగింది ప్రియాంక జైన్. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మొదటిసారి తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి గురించి వీడియో పోస్ట్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక 2024 లో కచ్చితంగా చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం అనే డీటెయిల్స్ కూడా మేమే చెప్తామని చెప్పింది.. అలాగే ప్రియాంక బిగ్‌బాస్ లో ఓ టాస్క్ లో భాగంగా తన జుట్టు కట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడుతూ జుట్టు బాగా పెరిగాక పెళ్లి చేసుకుంటాను సరదాగా చెప్పుకొచ్చింది.. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో బిజీ కానుందని సమాచారం..