NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

మూడు కీలక పథకాలపై జగన్‌ ఫోకస్‌.. నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌
మరో రెండు రోజుల్లో 2023లో గుడ్‌బై చెప్పబోతున్నాం.. 2024 ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, 2024లో ఆదిలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా జరగనున్నాయి. దీంతో ఎన్నికల ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.. జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్‌ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గననున్నారు సీఎం వైఎస్ జగన్‌.. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

కాకినాడలో మకాం వేసిన జనసేనాని.. 3 రోజులు అక్కడే
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టనున్నారు.. ఈ పర్యటనలో జనసేన పార్టీ స్థానిక నేతలతో పాటు, కార్యకర్తలతోనూ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయిని చెబుతున్నారు.. కానీ, పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను జనసేనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. ఇక, బుధవారం రాత్రి కాకినాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు.. ఈ నెల 30వ తేదీ వరకు మూడు రోజులు పాటు కాకినాడలోనే ఉండబోతున్నారు పవన్‌.. ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.. ఈ పర్యటనలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయనుంది.. ఎవరిని బరిలోకి దించుతారు అనేదానిపై క్లారిటీ రాబోతుంది అంటున్నారు నేతలు.. అయితే, పవన్‌ పర్యటనతో జనసేన వర్గాలతో పాటు ఆశావహులు, మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా పలు పార్టీల నేతలు జనసేన వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనాని పర్యటనలో ఇంకా ఎవరైనా ఆయనతో టచ్‌లోకి వస్తారా? పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం.. పోలీసులకు ఎంపీ మాగుంట ఫిర్యాదు
తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. తాను గత 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నాను.. ఈ నాలుగేళ్లలో పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం చేస్తున్నారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి వెళ్లాలని అనుచరుల నుంచి వత్తిడి వస్తున్నట్లు తనపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖ ద్వారా కోరారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కాగా, ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి.. 2024 ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఇదే సమయంలో.. పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.. ఇంకా కొందరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు.. ఒంగోలు ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.. గుర్తుతెలియని వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీంతో. మాగుంట వైపు కొందరు అనుమానంగా చూస్తున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎంపీ.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐఎన్టీయూసీ హవా.. సత్తా చాటిన ఏఐటీయూసీ
ఏడాదిన్నరగా ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, 94.15 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మణుగూరు సింగరేణి, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. బెల్లంపల్లి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీపై ఏఐటీయూసీ 122 ఓట్లతో గెలుపొందింది. ఇల్లెందు డివిజన్‌లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసి విజయం సాధించింది. ఇక్కడ సీపీఐ అనుబంధ ఏఐటీయూసీపై ఐఎన్‌టీయూసీ 46 ఓట్ల తేడాతో గెలుపొందింది. రామగుండం డివిజన్ 1, 2లో ఏఐటీయూసీ, రామగుండంలో 3లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. రహస్య బ్యాలెట్ విధానంలో బుధవారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. అయితే టీజీబీకేఎస్ ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారాన్ని మాత్రమే చేపట్టారు. ఐఎన్‌టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఏఐటీయూసీ, సీఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌ సంఘాల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మాత్రమే సత్తా చాటాయి.

శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని చూడాలనుకుంటున్నారా..?
మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్ మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు గుజరాత్ సర్కార్ పేర్కొనింది. అయితే, వచ్చే సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి పండగ సందర్భంగా సబ్ మెరైన్ యాత్ర స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పర్యాటకులను సబ్ మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే తొలి సారిగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్ మెరైన్ నుంచి భక్తులు చూడొచ్చని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందు కోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ‘మజ్ గావ్ డాక్’ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ‘రెండు గంటల పాటు సబ్ మెరైన్ యాత్ర ఉండబోతుందని ప్రకటించింది. 300 అడుగుల లోతుకు వెళ్లి.. ఆనాటి ద్వారక నగరాన్ని కనులారా చూసి రావొచ్చు అని చెప్పింద. ఒక ట్రిప్ లో 24 మంది పర్యాటకులకు ఈ సబ్ మెరైన్ లో తీసుకెళ్తామని గుజరాత్ టూరిజం శాఖ పేర్కొనింది. అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారు అని ఆ రాష్ట్ర టూరిజం శాఖ వెల్లడించింది.

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌ ఎవరు?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ అనంతరం భారత్ స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. 2024 జనవరి 11న ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరీస్‌ ఇదే. అఫ్గానిస్తాన్‌ టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పొట్టి సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌ ఎవరు అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు టీ20ల్లో భారత జట్టును నడిపించిన హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లు గాయాల బారిన పడ్డాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్‌ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దక్షిణకాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య, రుత్‌రాజ్‌ కూడా కోలుకోవడానికి సమయం పట్టనుందట. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తలలు పట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో టీ20లకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో బీసీసీఐ ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ సిరీస్‌లో కెప్టెన్‌గా ఉండాలని కోరినట్లు సమాచారం. అయితే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సమయం అడిగాడట.

అదానీ గ్రూప్ లోకి మరో కంపెనీ..
అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు. ఈ రెండు సంస్థల మధ్య కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ కంపెనీని పీఎఫ్సీ (PFC) కన్సల్టింగ్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ వార్తలు బయటకు రావటంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి 1082.40 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. కాగా, హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్.. దీన్ని పీఎఫ్సీ కన్సల్టింగ్ లిమిటెడ్ రూపొందించింది. ఫేజ్- 3 పార్ట్ ఎ ప్యాకేజీ కింద ఖవ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 7జీడబ్ల్యూ పునరుత్పాదక శక్తిని రవాణా చేయడమే దీని యొక్క లక్ష్యం.. టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది. రాబోయే 24 నెలల్లో కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనుందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.

ఫోన్ లోని ఫ్లైట్ మోడ్ వల్ల కలిగే లాభలేంటో తెలుసా?
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు కూడా టచ్ ఫోన్లను వాడుతుంటారు.. అయితే ఈ ఫోన్ల ల్లో ఫ్లైట్ మోడ్ అనే ఆఫ్షన్ ఒకటి ఉంటుంది.. అయితే దీని గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది.. విమానంలో ప్రయాణించినప్పుడల్లా మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో మాత్రమే ఉపయోగించమని సిబ్బంది తప్పనిసరిగా మీకు సూచిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్ ను వాడతారని అనుకుంటారు.. కానీ ఇతర సమయాల్లో కూడా దీన్ని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. సమయం తక్కువగా ఉండి, మీ ఫోన్‌ను వీలైనంత త్వరగా ఛార్జ్ చేయాలనుకుంటే మీరు ఫోన్‌ను ఛార్జింగ్ మోడ్‌లో ఉంచడం ద్వారా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఇది ఫోన్ యొక్క అనేక వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆపివేస్తుంది, ఫోన్‌ను వీలైనంత త్వరగా ఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.. అదే విధంగా వైర్‌లెస్ కనెక్షన్‌లు మూసివేయడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వదు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా సమయం పాటు ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఛార్జింగ్ పాయింట్‌లకు పరిమిత యాక్సెస్‌ను కలిగి ఉన్నప్పుడు ఫ్లైట్ మోడ్ మీకు సహాయపడుతుంది..

కోలీవుడ్ లో విషాదం… ‘ది కెప్టెన్’ ఇక సెలవు
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన విజయకాంత్ కరోనా సోకడంతో మళ్లీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కరోనా చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించారని MIOT ఇంటర్నేషనల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌, తమ అభిమాన హీరో ‘ది కెప్టెన్’ మరణించాడు అనే వార్త బయటకి రావడంతో తమిళనాడు మొత్తం శోకసంద్రంలో మునిగింది. గత కొన్నేళ్లుగా మృత్వుతో పోరాడుతున్న కెప్టెన్ ఈరోజు తుదిశ్వాస విడిచారని విజయకాంత్ అభిమానులు చింతిస్తున్నారు.

ఉపాసన వేసుకున్న క్రిస్మస్ డ్రెస్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
సెలెబ్రేటీలు అంటే లైఫ్ అంతా జిగేల్ మంటుంది.. అత్యంత ఖరీదైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. వాళ్లు వేసుకొనే డ్రెస్సుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ టాప్ బ్రాండెడ్ వే వేసుకుంటారు.. ఇటీవల సెలెబ్రేటీల లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది. సాధారణంగా  లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరను మనం కనీసం ఉహించలేనివిధంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన వస్తువులు, దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఉపాసన వంతు వచ్చింది. రీసెంటెగా మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలు, అల్లు హీరోలు .. వారి భార్యలతో కలిసి సందడి చేశారు.. ఆ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ కు ఉపాసన వేసుకున్న డ్రెస్సు అందరిని ఆకర్శించింది.. ఉపాసన లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించి బ్రాండ్ బట్టట్టలో మెరిసిపోయారు. అయితే వాటి ధర అక్షరాలా 3 లక్షలు అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెల్లబెడుతున్నారు. ఈక్రమంలో ఈ పార్టీలో స్టార్ హీరోల భార్యలు ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై సందడి చేశారు.. మెగా కొత్త కోడలు లావణ్య కూడా హాజరై క్రిష్టమస్ వేడుకను గ్రాండ్ గా జరుపుకున్నారు..