NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు కేబినెట్‌ సమావేశం.. పెన్షన్‌ రూ.3వేలకు పెంపు..!
ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఈ రోజు సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలుత 14న మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని భావించినా కొన్ని కారణాలతో ఇవాళ్టికి మార్చారు. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో మంత్రివర్గం సమావేశమవుతోంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చిస్తారు. జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాల పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల నుంచి కేబినెట్ లో ఉంచాల్సిన ప్రతిపాదనలను సీఎస్ తెప్పించారు. ఈ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది.

దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో .. సిటీవాసులు వణికిపోతున్నారు. పగటి పూట కూడా సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు పగటిపూట కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. సాదారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం సహా పలుజిల్లాలను చలి వణికిస్తోంది. ఉధృతంగా పొగమంచు కురుస్తుండడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది. పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పదిడిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పతనమవుతున్నాయి. అరకు, లంబసింగి లాంటి చోట్ల జనం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు..

నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, ఆ ఎమ్మెల్యేలు నేడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కొందరు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు కూడా పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరనున్నారు.. రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్దల సంఖ్యలో అధికార పార్టీకి చెందినవారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నాయి.. ఇక, ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్న వారిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు.. మరోవైపు, ఉదయం 11 గంటలకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు నాయుడు.

అన్నప్రసాద పథకంపై వివాదం.. అసలు విషయం తేల్చేసిన అధికారులు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్లలో అధిక శాతం స్వామి వారి అన్నదాన ప్రసాద సముదాయంలో భోజనం చేస్తుంటారు. స్వామికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలపై వచ్చిన వడ్డీతో నిత్యాన్నదాన పథకం అమలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఆరోపణలు రావడంతో చర్చనీయాంశమైంది. 1985లో అన్నప్రసాద పథకాని ప్రారంభించింది టీటీడీ. అయితే, ఈ పథకానికి భక్తులు అందించే విరాళాలు పెరుగుతు వస్తున్నాయి. దీంతో అన్నదాన పథకాని మరింత విస్తరించింది టీటీడీ. మొదట్లో ఆలయం ఎదుట అన్నప్రసాద కాంప్లెక్స్‌ ఉండేది. ఇప్పుడు శ్రీవారి పుష్కరిణికి ఎదురుగా ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద సముదాయం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక పంక్తిలో నాలుగు వేల మంది భక్తులుకు అన్నప్రసాదం వడ్డించేలా ఏర్పాట్లు ఉన్నాయి. శ్రీవారి అన్న ప్రసాదంలో నాణ్యత లేదంటు ఇటీవల సోషల్‌ మీడియాలో కొందరు భక్తులు పెట్టి పోస్టు వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకూండా భక్తుల ప్రశంసలతో ముందుకు వెళ్తున్న ఈ పథకంపై ఒక్క సారిగా ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, అన్నదాన పథకంపై వాస్తవాలను పరిశీలించినప్పుడు.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. కొంత మంది పనిగట్టుకుని శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారనే విషయం స్పష్టమైంది.

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. అక్కడి నుంచి ఎక్కడికి వెళతారంటే..
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కాగా, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయనను ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎర్రవెల్లిలోని తన ఫోమ్ హౌస్‌లో ఏ కాస్త సమయం దొరికినా గడపడం కేసీఆర్‌కు ఇష్టం. అయితే అదే ఫోమ్ హౌస్‌లో జారిపడటంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ గాయపడిన విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని నాయకులు, ప్రజలు, అభిమానులు ప్రార్థించారు. మరోవైపు కేసీఆర్‌ను పరామర్శించేందుకు పార్టీలకు అతీతంగా నేతలంతా ఆస్పత్రి వద్ద బారులు తీరారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా కేసీఆర్‌ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు. కేసీఆర్‌ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కేసీఆర్ అభిమానులు యశోద ఆస్పత్రికి తరలివచ్చారు. అయితే.. ఎవరూ ఆస్పత్రికి రావద్దని కేసీఆర్ స్వయంగా చెప్పారు.

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. సభలో ప్రసంగించనున్న గవర్నర్‌..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ మూడో అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11.30కు సభ ప్రారంభంకానుంది. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది. రేపటి నుంచి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్‌ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్‌ ఉంటుందని సమాచారం. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయంపై క్లారిటీ ఇవ్వనున్నారు.

పార్లమెంట్ భద్రతలో లోపం.. టీఎంసీ ఎమ్మెల్యే, బీజేపీ నేతలతో దాడి నిందితుడు
పార్లమెంటుపై పొగ బాంబులు విసిరిన ఘటనతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడ దాక్కున్నాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతలో, అతను కోల్‌కతాలోని బారాబజార్ ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం. లలిత్ ఝా కోల్‌కతా కనెక్షన్ వెలుగులోకి వచ్చిన తర్వాత, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్‌తో కలిసి ఉన్న లలిత్ ఝా చిత్రాన్ని ట్వీట్ చేసి టీఎంసీని కార్నర్ చేశారు. లలిత్ ఝా ఒకటిన్నర సంవత్సరాల క్రితం కోల్‌కతాలోని బారాబజార్ ప్రాంతంలో నివసించాడు. ప్రజలు ఆయనను ‘మాస్టర్జీ’ అని పిలిచేవారు. తపస్ రాయ్ గతంలో బారాబజార్ ప్రాంతం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టిఎంసి ఎమ్మెల్యేతో లలిత్ ఝా చిత్రం బయటపడిన తర్వాత, బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. దీనిపై తపస్ రాయ్ మాట్లాడుతూ సుకాంత్ మజుందార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై క్రిమినల్‌, పరువు నష్టం కేసులు పెడతామన్నారు. బీజేపీ నేతపై కోర్టులో కేసు వేస్తామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వారితో సంబంధం ఉన్నట్లయితే ఏదైనా ఏజెన్సీ దర్యాప్తు చేయాలి. విచారణకు సిద్ధమన్నారు.

బీహార్‎లో అదానీ గ్రూప్ రూ.8700 కోట్ల పెట్టుబడులు.. 10,000 మందికి ఉపాధి
బీహార్‌లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గ్రూప్ సిమెంట్ తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది. బీహార్‌లో జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో రెండవ రోజు బీహార్ బిజినెస్ కనెక్ట్ – 2023ని ఉద్దేశించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణబ్ అదానీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అదానీ గ్రూప్ బీహార్‌లో రూ. 8700 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. ఇప్పటికే బీహార్‌లో అదానీ గ్రూప్ రూ.850 కోట్ల పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే సిమెంట్ తయారీ, లాజిస్టిక్స్, ఆగ్రో ఇండస్ట్రీ వంటి అదనపు రంగాల్లో రూ.8700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని గ్రూప్ నిర్ణయించిందని చెప్పారు. బీహార్ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా అవతరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాజిస్టిక్స్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఆగ్రో లాజిస్టిక్స్ రంగాల్లో అదానీ గ్రూపు ఉందని తెలిపారు. రాష్ట్రంలో 3000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ రంగాల్లో గ్రూప్ రూ.850 కోట్ల పెట్టుబడులు పెట్టింది. బీహార్‌లో తమ పెట్టుబడులను 10 రెట్లు పెంచాలని అదానీ గ్రూప్ నిర్ణయించినట్లు తెలిపారు. తొలిరోజు 26,429 కోట్ల పెట్టుబడుల కోసం 38 కంపెనీలతో బీహార్‌ ప్రభుత్వం సమ్మిట్లో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ కంపెనీలు టెక్స్‌టైల్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, సాధారణ తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ రూ.7386.15 కోట్లు, పటేల్ అగ్రి ఇండస్ట్రీస్ రూ.5230 కోట్లు, ఇండో-యూరోపియన్ రీసెర్చ్ అండ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2000 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్ రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో సూర్య ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన సూర్య.. టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్య 57 ఇన్నింగ్స్‌ల్లో 123 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్స్‌లు కొట్టాడు. విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్స్‌లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. మూడో టీ20కి ముందు విరాట్ రికార్డును బద్దలు కొట్టడానికి సూర్యకు మూడు సిక్సర్లు అవసరం కాగా.. ఏకంగా 8 సిక్స్‌లు బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ రోహితే. మార్టిన్ గుప్తిల్ (173) మినహా ఎవరూ కూడా రోహిత్ దరిదాపుల్లో లేరు.

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
భారత్ తాత్కలిక కెప్టెన్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్య సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే అత్యధిక శతకాలు నమోదు చేశారు. ఈ ఇద్దరు నాలుగేసి శతకాలు బాదగా.. మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ వీరి సరసన చేరాడు. సూర్యకుమార్ 57 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు చేయగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు బాదాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజామ్ (3), కొలిన్ మున్రో (3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

అంత సైలెంట్ గా ఎలా కంప్లీట్ చేసావ్ అన్న?
కోలీవుడ్ పాన్ ఇండియా యాక్టర్ ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్, మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా, ఆనంద్ ఎల్ రాయ్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్… చెన్నై టు ముంబై వయా హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనని తాను కంప్లీట్ గా సినిమాలకి డేడికేట్ చేసుకునే ధనుష్… ఈ సినిమాల్లో హీరోగా నటిస్తూనే తన డైరెక్షన్ లో ఒక మూవీని కంప్లీట్ చేసేసాడు. సింగర్, రైటర్, ప్రొడ్యూసర్ అయిన ధనుష్… పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ధనుష్, తన 50వ సినిమాని సొంత డైరెక్షన్ లోనే చేస్తుండడం విశేషం. D50 అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2023 జనవరిలో ప్రకటించిన ఈ సినిమా జులై నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లింది. ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, నిత్యా మీనన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ మూవీ షూటింగ్ ని ధనుష్ కంప్లీట్ చేసేసాడు. D50 షూటింగ్ కంప్లీట్ అయ్యింది, నా విజన్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటూ ధనుష్ ట్వీట్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో అంత సైలెంట్ గా, అంత ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేసావ్ అన్నా అంటూ షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉండి కూడా తన డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం చిన్న విషయం కాదు.

హిందీలో పుష్పరాజ్ కి డైలాగ్స్ చెప్పిన హీరోకి హార్ట్ ఎటాక్…
ఓమ్ శాంతి ఓమ్, గోల్ మాల్ రిటర్న్స్, గోల్ మాల్ 3, గోల్ మాల్ అగైన్, హౌజ్ ఫుల్ 2 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు యాక్టర్ శ్రేయస్ తల్పడే. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పాడు శ్రేయస్ తల్పడే. ప్రస్తుతం వెల్కమ్ టు జంగల్ సినిమాలో నటిస్తున్న శ్రేయస్ తల్పడేకి హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ కి తరలించారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో శ్రేయాస్ తల్పడేని ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని బెల్లేవ్ ఆసుపత్రి అడ్మిట్ చేసారు. ఈరోజు యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్ చేయడంతో శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ముంబైలో ‘వెల్కమ్ టు జంగల్’ షూట్ చేసిన తర్వాత గుండెపోటు రావడంతో శ్రేయాస్ తల్పాడే కుప్పకూలిపోయాడు.

నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడంటే?
లేడీ బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు… నయన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది.. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది. చెఫ్ కావాలని కలలుకంటుంది. కానీ ఆమె కలకు తల్లిదండ్రులు అడ్డుచెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్‌ చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది.. అన్నపూర్ణికథ జనాలకు నచ్చకపోవడంతో సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేకపోయింది. ఈ సినిమా నయనతారకు నిరాశను మిగిల్చింది.. ఈ సినిమా విడుదలై నెల కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీ లోకి రానుంది.. థియేటర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.. ఇకపోతే తమిళ్ తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో అన్నపూర్ణి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..