NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు చిత్తూరు జిల్లా బంద్‌
చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల్ని రాజేసింది. చంద్రబాబు స్పీచ్‌తో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. చిన్నపాటి నిరసనగా మొదలైన ఆందోళన కాస్తా.. పోలీసులపై దాడి, పోలీసుల వాహనాల దగ్ధం వరకు వెళ్లింది. తబంళ్లపల్లె డి.కొత్తకోట నుంచి అంగళ్లకు వెళ్తున్న చంద్రబాబును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు గో బ్యాక్‌ నినాదాలు చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్ల దాడికి దారి తీసింది. ఆ తర్వాత అంగళ్లకు చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలకైన గాయాలు చూసి తరిమికొట్టండి.. వదలకండి అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. పోలీసులపైనా విమర్శలు చేశారు. పెద్దరౌడీ పుంగనూరులో ఉన్నాడు.. అక్కడే తేల్చుకుందాం అంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుండగానే.. టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వైపు పరుగులు తీశారు. పుంగనూరులో టీడీపీ నేతలు ప్లాన్ మార్చి గొడవ చేశారని, గవర్నమెంట్ సర్వెంట్‌లను చంపడానికి ప్రయత్నించారని అన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. కేడర్‌ను నేతలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఇక, పుంగనూరులో జరిగిన అల్లర్లు, టీడీపీ శ్రేణుల నిరసిస్తూ ఇవాళ చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది వైసీపీ. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు పుంగనూరులో పోలీసులు భారీగా మోహరించారు.

తెలంగాణలో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు..
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వార్ కొనసాగుతుంది. ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం బిల్లుపై కొన్ని వివరణలు కోరారు గవర్నర్‌ తమిళి సై. 2023 TSRTC బిల్లులోని నిబంధనలను పరిశీలించిన గవర్నర్‌ తమిళిసై… అస్పష్టతలపై ప్రభుత్వం నిర్ధిష్టమైన వివరణలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పష్టత కోసం ప్రభుత్వ వివరణ కోరుతున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణ ప్రత్యుత్తరాన్ని గవర్నర్ కోరారని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు గవర్నర్‌ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఉదయం రెండు గంటలపాటు 8 గంటల వరకు బస్సుల నిలిపివేత కొనసాగుతుంది. ఆ తర్వాత రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉదయం 11గంటలకు పీవీమార్గ్ నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరతారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెచ్చిన బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.

కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్.. మధ్యలో ఈమెవరు..?
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ. పోలీసుల విచారణలో వెలుగులోకి సరికొత్త విషయాలు బయటపడ్డాయి. పైడమ్మే రామారావుతో కలవడానికి కారణమని శివాని పోలీసులకు తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు ఎంవీపీ పోలీసులు. పైడమ్మా, శివానీ, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్ళేవాళ్ళమని తెలిపిందామే. దీంతో శివానీని A4 గా చేర్చే అవకాశం ఉంది. మరోవైపు తనకు అసలు సంబంధం లేదంటుంది శివాని అక్క పైడమ్మ. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని చెబుతోంది పైడమ్మ. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పైడమ్మను విచారిస్తున్నారు పోలీసులు. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివానీ, A2 ప్రియుడు రామారావు, A3 నీలా.. ఉన్నారు. ఇవాళ వారిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. కాగా, కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఆయన భార్య శివానిని హంతకురాలిగా నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టుతో రమేష్‌ది హత్యగా తేలిందన్నారు. ఊపిరి ఆడక చనిపోయినట్లు రిపోర్టు రావడంతో.. భార్యను విచారిస్తే నేరాన్ని అంగీకరించిందని తెలిపారు పోలీసులు. ఇక, పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి..

జమ్మూలో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు మృతి.. ఉగ్రవాదుల కోసం గాలింపు
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు. శుక్రవారం రాత్రిపూట సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగో వార్షికోత్సవం జరుపుకున్న తొలి రోజు రాత్రి ఉగ్రవాదులతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు, శ్రీనగర్‌లో, లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద హ్యాండ్ గ్రెనేడ్లు లభించాయి. ఆర్టికల్ 370ని తొలగించి నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్న శనివారం నాడు ఈ ముగ్గురు ఉగ్రవాదులు భారీ ఘటనకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. దీంతో కాశ్మీర్ లోయలో భద్రతను పెంచారు. కుల్గామ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6.39 గంటలకు కాశ్మీర్ జోన్ పోలీసులు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు తెలియజేశారు. కుల్గామ్‌లోని ఎత్తైన పర్వతాలపై ఉన్న హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఆర్మీ, కుల్గాం పోలీసుల బృందాలు ఉన్నాయి. దాదాపు 20 నిమిషాల తర్వాత, మరో ట్వీట్‌లో, భారత ఆర్మీకి చెందిన ముగ్గురు సైనికుల గాయాల గురించి తెలియజేశాడు. కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు సైనికులు గాయపడ్డారని ఆయన ట్వీట్‌లో రాశారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల దిగుమతిపై నిషేధం లేదు.. కొత్త రూల్స్ జారీ
మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిని నిషేధించాలని ఒక రోజు ముందు అంటే 2023 ఆగస్టు 3, గురువారం నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతికి సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్టు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో నమ్మకమైన హార్డ్‌వేర్ వ్యవస్థలను నిర్ధారించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కేటగిరీల ఉత్పత్తుల్లో దేశీయంగా తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. దిగుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వవచ్చు. ట్విటర్‌లో ఒక వినియోగదారుకు స్పందిస్తూ, ఇది లైసెన్స్ కు సంబంధించిన విషయం కాదని, దిగుమతులను నియంత్రించే విషయమని అన్నారు. దీనికి ప్రతిగా నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే దిగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంపెనీలు, వ్యాపారులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఐటీ హార్డ్‌వేర్‌లను దిగుమతి చేసుకోవచ్చు.

విల్లు ఎక్కుబెట్టిన తెలుగమ్మాయి.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం!
ఎట్టకేలకు భారత్‌ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్‌ ప్లేయర్ పర్ణీత్‌ కౌర్‌ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్‌ భారత జట్టు 235-229 తేడాతో టాప్‌ సీడ్‌ మెక్సికోపై గెలిచింది. తమకంటే బలమైన జట్లను ఓడిస్తూ ఫైనల్ దూసుకెళ్లిన భారత అమ్మాయిలు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించారు. ప్రత్యర్థి మెక్సికో పటిష్ఠంగా ఉన్నా.. గాలి తీవ్రత అధికంగా ఉన్నా.. ఏ మాత్రం పట్టు వదలకుండా అద్భుత ఆటతో స్వర్ణం గెలిచారు. డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్‌, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై భారత అమ్మాయిలు తొలి రౌండ్‌ నుంచే ఆధిపత్యం చెలాయించారు. తొలి రౌండ్‌లో 60కి 59 స్కోరు చేశారు. 2, 3 రౌండ్లలోనూ 59 చొప్పున పాయింట్లు సాధించిన భారత అమ్మాయిలు.. చివరి రౌండ్‌కు ముందు 177-172తో ఆధిక్యంలో నిలిచారు. చివరి రౌండ్‌ చివరి సెట్‌కు ముందు భారత్‌ 207-199తో ముందంజలో నిలిచింది. చివరి సెట్‌లో మెక్సికో ఆర్చర్లు ముగ్గురు పదేసి చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 237కు చేరింది. ఆ దశలో భారత అమ్మాయిలు పర్ణీత్‌ 10 పాయింట్లు సాధించగా.. అదితి 9 పాయింట్లు సాధించింది. ఇక మరో 5 పాయింట్లు గెలిస్తే భారత్‌ ఖాతాలో స్వర్ణం చేరుతుంది. ఈ సమయంలో బాణం చెరపట్టిన తెలుగమ్మాయి సురేఖ 9 పాయింట్లు సాధించింది. దీంతో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

కంటతడి పెట్టిస్తోన్న ఉల్లి.. కిలో ఎంతకు అమ్ముడవుతుందో తెలుసా?
దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉల్లి ధర ప్రజలను కంటతడిపెట్టించేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు నాటికి రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతాయని.. వచ్చే నెలలో కిలో రూ.60-70కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అక్టోబరు నుంచి ఖరీఫ్ రాక ప్రారంభం కాగానే ఉల్లి సరఫరా మెరుగ్గా ఉంటుందని.. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. డిమాండు-సరఫరా అసమతుల్యత ప్రభావం ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలపై కనిపించవచ్చని అంచనా. సెప్టెంబరు ప్రారంభం నుంచి రిటైల్ మార్కెట్ లో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కిలో రూ.60-70 వరకు చేరవచ్చని గ్రౌండ్ లెవల్ చర్చల ద్వారా అందిన సమాచారం. అయితే ధర మాత్రం 2020లో ఉన్న గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉంటుంది.

వేగంగా వ్యాప్తి చెందుతోన్న కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి కేసులు గత ఏడాదికి పైగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌-19లో ఒమిక్రాన్‌ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్‌ కేసులు బ్రిటన్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయట. ఒమిక్రాన్‌ ఈజీ.5.1 వేరియంట్‌ను తొలుత జులై నెలలో గుర్తించారు. ఇంగ్లండ్‌లో నమోదవుతున్న కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 14.6 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎరిస్ అనే మారు పేరుతో ఉన్న ఈజీ.5.1 ఏడు కొత్త కోవిడ్-19 కేసులలో ఒకటిగా ఉందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. అంతర్జాతీయంగా కూడా ఒమిక్రాన్‌ ఈజీ.5.1 కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వేరియంట్‌ తీరును గమనిస్తోంది. ప్రజలు టీకాలు వేసుకున్నప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈజీ.5.1 వేరియంట్‌తో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనే సూచనలు ఏమీ లేవని తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మూడేళ్లలో ఆరుసార్లు పెరిగిన ధర… అప్పుడు రూ.55 ఇప్పుడు రూ.325
టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన కార్పొరేట్ సంస్థలలో ఒకటి. స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న అనేక కంపెనీల జాబితాలో ఇదొకటి. చిన్న కంపెనీల షేర్లు కూడా టాటా బ్రాండ్ చెబితే చాలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతాయి. టాటా పేరుకున్న క్రేజ్ అలాంటిది. ఉదాహరణకు Sakar Healthcare Ltd వాటాను చూడవచ్చు. టాటా ఇటీవలే సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌లో పెట్టుబడిని ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ హెల్త్‌కేర్ ఫండ్ ఈ కంపెనీలో 10.82 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ షేర్లు టాటాకు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ఇవ్వబడతాయి. ఈ వార్త బయటకు రాగానే సకార్ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభించిన వెంటనే 20 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 20 శాతం లాభంతో రూ.324.65 వద్ద ముగిసింది. ఈ డీల్‌కు ముందు కూడా సాకర్ హెల్త్‌కేర్ స్టాక్ మల్టీబ్యాగర్‌గా ఉంది. ఇది చాలా చిన్న కంపెనీ అయినప్పటికీ, దీని మార్కెట్ క్యాప్ కేవలం రూ.620 కోట్లు. ప్రస్తుతం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ చిన్న కంపెనీ 2004లో స్థాపించబడింది. ప్రస్తుతం 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. గత 5 రోజుల్లో ఈ షేరు ధర దాదాపు 26 శాతం బలపడింది. గత 1 నెలలో 27 శాతానికి పైగా, 6 నెలల్లో 40 శాతానికి పైగా, ఏడాదిలో 62 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.