NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమల నడకమార్గంలో కలకలం.. చిన్నారిని చంపేసిన చిరుత
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కలకలం రేగింది.. తిరుపతి నుంచి తిరుమలకు నడక మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.. అప్పుడప్పుడు కొన్ని దురదృష్ట ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. ఈ మధ్యే ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది.. అయితే, ఆ బాలుడు ప్రాణాలతో భయటపడ్డారు. కానీ, తిరుమలలో తొలిసారి చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని చిరుత చంపేసింది.. అలిపిరి నడకమార్గంలో నిన్న రాత్రి బాలిక తప్పిపోయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్‌.. అయితే, ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులకు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బాలిక ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇవాళ ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారు.. చిరుత దాడిలో బాలిక మృతిచెందిన ఘటన ఇప్పుడు తిరుమలలో కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనతో అలెర్ట్‌ అయిన టీటీడీ.. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లవెద్దని హెచ్చరించింది.. భక్తులు గుంపులుగా మాత్రమే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవాలని సూచించింది. మొత్తంగా ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడంలో తిరుమలలో విషాదాన్ని నిపిందింది.. నెల రోజుల క్రితమే ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది.. అదే ప్రాంతంలో ఇప్పుడు బాలికపై దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే, నడక మార్గంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలో చాలానే ఉన్నాయి.. కానీ, చిరుత దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విషాధాన్ని నింపింది.

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఆగస్టు 15 తర్వాత వర్షాలకు ఛాన్స్..!
తెలంగాణ రాష్ట్రాన్ని గత వారంలో వర్షాలు అతలా కుతలం చేశాయి. జూలై నెలాఖరున ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వానలు జిల్లాలు, గ్రామాల్లోని ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది. వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఇళ్లల్లోకి నీరు చేరి నానాయాతన పడ్డారు. చాలామంది ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగులు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు మరొ కొంతమంది నీళ్లలో కొట్టుపోయిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని నదులు, వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. కాగా.. ఇప్పుడు మూడు రోజుల తరువాత వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని మేఘాలు కమ్ముకునే అవకాశాలున్నాయన్నారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా. ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఆర్‌ఎంపీ డాక్టర్లు ఫార్మా కంపెనీలతో సంబంధాలు పెట్టుకోరాదు.. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు
రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) వైద్యులు ఫార్మా కంపెనీల నుంచి ఎటువంటి కానుకలు తీసుకోరాదని, వారి ఆతిథ్యంను స్వీకరించరాదని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) పేర్కొంది. రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. దౌర్జన్యకరమైన లేదా హింసాత్మక ప్రవర్తనను ప్రదర్శించే రోగులకు లేదా వారి బంధువులకు చికిత్సను నిరాకరించవచ్చని ఎన్‌ఎంసీ తెలిపింది. వైద్యులపై హింస, నైతిక ప్రవర్తన మరియు రోగుల సంరక్షణలో పారదర్శకతతో సహా వైద్య వృత్తిలో కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన నిబంధనలను ఎన్‌ఎంసీ ప్రవేశ పెట్టింది. గెజిట్ నోటిఫికేషన్‌లో జారీ చేయబడిన నిబంధనలు, భారతదేశంలో ఆర్‌ఎంపీల ప్రవర్తనను నియంత్రించడానికి అనేక క్లిష్టమైన అంశాలను ఎన్‌ఎంసీ కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి ఆర్‌ఎంపీలు చేయకూడదని పేర్కొంది. ఆర్‌ఎంపీలు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ నిబంధనల్ని జారీ చేసింది. ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తున్నట్టు ఆర్‌ఎంపీలు ప్రకటనలను కూడా ఇవ్వరాదని నిబంధనల్లో స్పష్టం చేసింది.

ఇంటర్ అర్హతతో 1207 జాబ్స్.. పూర్తి వివరాలు..
ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్స్ అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు చెందిన నోట్స్‌ను త్వరితగతిన, సమర్థవంతంగా చూసిరాయడం వీరి ప్రధాన విధి. అంతేకాకుండా డ్రాఫ్ట్ స్పీచ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నోట్ ప్రిపేర్ చేయడం, వ్యవస్థీకృత ఫైలింగ్ సిస్టమ్‌లను నిర్వహించడం, మంత్రులు, ఇతర అధికారులకు అసిస్టెంట్‌గా వ్యవహరించడం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేయాల్సి ఉంటుంది. గ్రేడ్-సీ స్టెనోగ్రాఫర్స్ మూల వేతనం(బేసిక్ పే) రూ.14,500గా ఉండవచ్చు. ఇక గ్రేడ్-డీ వారికి రూ.7,600గా ఉంటుంది. బేసిక్ పేతో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు డియర్‌నెస్ అలవెన్స్ , ఇంటి అద్దె అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్‌తో సహా వివిధ ప్రయోజనాలు పొందడానికి అర్హులు…

హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం.. 67కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలో హవాయి ద్వీపంలో ఏర్పడిన భీకర కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మౌయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వేల ఇళ్లు అగ్నికి బూడిదయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికి గాలులు తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. లహైనా రిసార్టు నగరంలో ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్చిచ్చుకు ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హవాయి గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ తెలిపారు. ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు రోడ్లను మూసివేశారు. 1960లో 61 మందిని బలిగొన్న సునామీని అధిగమించిన ఈ అడవి మంటలు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. 1946లో సంభవించిన ఘోరమైన సునామీ కారణంగా 150 మందికి పైగా మరణించారు.

బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్
స్కూలు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత పలుమార్లు బాలికను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇలంగోనగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంటి సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. స్థానికులు ఆ ఆవును అదరకొట్టే ప్రయత్నం చేశారు. కానీ, సులువుగా ఆ బాలికను వదిలిపెట్టలేదు. అసలేం జరిగిందంటే.. ఆ బాలిక గాంధీనగర్‌లో నివసించే ఆయేషా బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం తన తల్లి, సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వారి ముందున్న రెండు ఆవుల్లో ఒకటి వెనక్కి తిరిగి బాలికను కొమ్ములతో ఎత్తిపడేసింది. ఆవు దాడిలో ఆ బాలిక కిందపడిపోయింది. అనంతరం ఆవు వెనక్కి తగ్గకుండా పలుమార్లు బాలికపై దాడి చేసింది. తన కొమ్ములతో పలుమార్లు దాడి చేసింది. ఆ బాలికపై కాళ్లు వేసి దాడి చేసింది. దాంతో ఏం చేయాలో పాలుపోని తల్లి ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేసింది. అరుపులు విని వెంటనే అప్రమత్తమైన స్థానికులు రాళ్లు విసిరి ఆ జంతువును నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. పలుమార్లు పొడిచిన తర్వాత పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

తిరిగొచ్చిన పేటీఎం, జొమాటో, పాలసీబజార్ స్టాక్‌లు.. 2023లో 130శాతం లాభాలు
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2023 పేటీఎం, జొమాటో, పాలసీబజార్ స్టాక్‌లు పెట్టుబడిదారులకు కలిసొచ్చింది. చాలా స్టాక్‌లు 2023లో తక్కువ స్థాయిల నుండి పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించాయి. ముందుగా ఫుడ్ డెలివరీ కంపెనీ Zomato గురించి తెలుసుకుంటే… కాబట్టి జనవరి 25, 2023న Zomato షేర్ రూ. 44.35కి పడిపోయింది. కంపెనీ జూలై 2021లో ఐపీవోలో ఒక్కో షేరుకు రూ.76 చొప్పున డబ్బును సేకరించింది. కానీ రూ. 44.35 కనిష్ట స్థాయి నుండి స్టాక్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఆగస్ట్ 7, 2023న స్టాక్ గరిష్టంగా రూ.102.85కి చేరుకుంది. అంటే కేవలం 6 నెలల్లో జొమాటో స్టాక్ పెట్టుబడిదారులకు 131 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం జొమాటో స్టాక్ దాని ఐపీవో ధర రూ. 93.45 వద్ద ట్రేడవుతోంది. పేటీఎం స్టాక్ ప్రయాణం సవ్యంగా సాగింది. అదే సంవత్సరంలో జనవరి 2, 2023న పేటీఎం స్టాక్ రూ.532 వద్ద ట్రేడవుతోంది. ఇక జూన్ 19న షేరు రూ.914 స్థాయికి చేరుకుంది. అంటే 2023లో స్టాక్ దిగువ స్థాయి నుండి పెట్టుబడిదారులకు 72 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేరు రూ.865 వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మొత్తం 63 శాతం రాబడిని ఇచ్చింది. కానీ పేటీఎం దాని ఐపీవో ధర రూ. 2150 కంటే చాలా తక్కువగా ట్రేడవుతోంది. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు రూ.1285 నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 2న పాలసీబజార్ అంటే పీబీ ఫిన్‌టెక్ షేర్ రూ.452 వద్ద ట్రేడవుతోంది. ఇది ఆగస్టు 8, 2023న గరిష్టంగా రూ.818కి చేరుకుంది. ప్రస్తుతం ఈ షేరు రూ.727 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 63 శాతం రాబడిని ఇచ్చింది. అయినప్పటికీ, పాలసీబజార్ స్టాక్ ఇప్పటికీ దాని ఐపీవో ధర రూ. 980 కంటే దిగువన ట్రేడవుతోంది. అయితే దిగువ స్థాయిల నుంచి షేరు మంచి రికవరీని కనబరిచింది. అయితే ఈ ఏడాది నైకాకు బాగాలేదు. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 6శాతం ప్రతికూల రాబడిని ఇచ్చింది.

ఎస్బీఐ కార్డ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక, అవన్నీ ఈజీగా..
ఎస్బీఐ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త.. రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐతో లింకింగ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది ఎస్బీఐ.. దీని వల్ల ఎస్‌బీఐ రూపే కార్డుదారులు తమ క్రెడిట్‌ కార్డు నుంచి సులువుగా యూపీఐ చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.. అయితే, దీని కోసం చేయాల్సిందల్లా.. రూపే క్రెడిట్‌ కార్డ్‌ను యూపీఐ యాప్‌లతో అంటే పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్‌లతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ కస్టమర్‌లు రూపేలో జారీ చేయబడిన వారి క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI లావాదేవీలు సులువుగా చేసుకోవచ్చు.. థర్డ్-పార్టీ UPI యాప్‌లతో క్రెడిట్ కార్డ్‌ను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇది పొందవచ్చు.. క్రెడిట్ కార్డ్ జారీచేసే SBI కార్డ్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. SBI క్రెడిట్ కార్డ్‌లను రూపే ప్లాట్‌ఫారమ్‌లో UPIతో లింక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇది UPI వ్యాపారులపై రూపే ప్లాట్‌ఫారమ్‌లో SBI కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు మార్గాలను మరింత మెరుగుపరుస్తుంది. తద్వారా మెరుగైన, అనుకూలమైన మరియు అతుకులు లేని చెల్లింపుల అనుభవాన్ని సులభతరం చేస్తుంది.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మీ స్క్రీన్‌ను ఇతరులతో షేర్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఇది సరికొత్త అప్‌డేట్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా, వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్‌లో సహాయపడే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ గతంలో బీటా టెస్టింగ్‌లో విజయవంతమైంది. ఇప్పుడు వాట్సాప్ స్టేబుల్ అప్‌డేట్ ద్వారా స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో మీరు వీడియో కాల్‌లు చేస్తున్నప్పుడు అందరూ చూసేలా మీ స్క్రీన్ ఫోన్ లేదా PC డిస్‌ప్లేను షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ సమావేశాలలో PCలు లేదా ల్యాప్‌టాప్‌లలో స్క్రీన్ షేరింగ్ మరియు సమాచారాన్ని పంచుకోవడం సాధారణ జ్ఞానం. అయితే ఇప్పుడు వాట్సాప్ యాప్‌లో కూడా అలాంటి ఆప్షన్ వచ్చింది. మీ ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలలో whatsappని ఉపయోగించి స్క్రీన్ షేరింగ్ చేయవచ్చు. మీరు WhatsApp వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌ను షేర్ చేస్తే మీ ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని ఇతరులు చూడగలిగేలా ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్ మీటింగులకు ఇదో చక్కటి సాధనం అని చెప్పొచ్చు. అంతేకాకుండా, మీరు చూస్తున్న కంటెంట్‌ను మీ బంధువులు మరియు స్నేహితులతో పంచుకోవచ్చు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను స్పష్టం చేశారు. ఈ కొత్త ఫీచర్ కారణంగా, వాట్సాప్ గూగుల్ మీట్ మరియు జూమ్ వంటి యాప్‌లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చాలా మంది కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఎంత వసూల్ చేస్తుందో తెలుసా?
హనీ రోజ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.. ఆ సినిమా అమ్మడు కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో డిమాండ్ పెరిగింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హనీ రోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఈ అమ్మడు తన అందంతో కట్టిపడేసింది. మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన హనీ రోజ్ అక్కడ మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె అందానికి ఫిదా అయ్యారు.. ఈ సినిమా తర్వాత సినిమాల్లో అయితే కనిపించలేదు కానీ షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ లతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది. ఎప్పుడూ ఎదో ఒక షాపింగ్ మాల్ ను ఓపెన్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు ఎంత రెమ్యునరేషన్ అందుకుంటుందో తెలుసా.. అమ్మడి డిమాండ్ చూస్తే మతిపోవాల్సిందే.. ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు 60 లక్షల నుంచి 70 లక్షల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. హనీ రోజ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకొని అంత మొత్తంలో ఇవ్వడానికి షాపింగ్ మాల్స్ యాజమాన్యం కూడా ఆసక్తి చూపించడం విశేషం.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఓ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.