NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

6వ రోజుకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు మదనపల్లెలో జగన్‌ భారీ బహిరంగసభ
మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది.. సోమవారం రోజు సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మానుపల్లెలోని విడిది కేంద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకోనుంది బస్సు యాత్ర.. ఇక, సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనుంది వైసీపీ.. ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె చేరుకోనున్నారు.. అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం దగ్గర రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

పిఠాపురంలో నాల్గో రోజు జనసేనాని పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్‌ పిఠాపురం అసెంబ్లీ నియోజకర్గం పైనే ఉంది.. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ సారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే.. ఇక, తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన చీఫ్.. పిఠాపురంలో ఆయన పర్యటన నాల్గో రోజుకు చేరుకుంది.. ఈ రోజు ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జనసేనాని.. బషీర్ బీబీ దర్గాను సందర్శించనున్నారు.. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్నారు పవన్‌ కల్యాణ్.

సీఎం జగన్‌ టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?
ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.. ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది.. ఓవైపు ప్రజల నుంచి సీఎం జగన్‌ యాత్రకు అపూర్వ స్వాగతం లభిస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం సైడైపోతున్నారు.. సోమవారం రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది.. అయితే, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి. నిన్న కదిరిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రోడ్ షోలో కదిరి ఎమ్మెల్యే కనబడలేదు.. అయితే, కదిరి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు సిద్ధారెడ్డి.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనకు మరోసారి టికెట్‌ వస్తుందని ఆశించిన ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌ షాకిస్తూ.. మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డిని కాదని మగ్భూల్ అహ్మద్ పేరును ప్రకటించింది.. ఇక, ఈ పరిణామాల అనంతరం పార్టీతో అంటీముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు సిద్ధారెడ్డి.. కనీసం, సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకైనా ఆయన వస్తారని అంతా భావించారు.. కానీ, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. దీంతో, సిద్ధారెడ్డి మనసులో ఏముంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీకి రాజీనామా చేసిన వెళ్లిపోయిన తరుణంలో.. సిద్ధారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

నేడే బండిసంజయ్ రైతు దీక్ష.. డిమాండ్లు ఇవే..
రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై బండిసంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో రైతు దీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా నిన్న సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.

చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి…ముగ్గురికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ప్రయాణికులతో నిండిన ఆటో రిక్షాను వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు 5 మరణాలు నిర్ధారించబడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం, నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్ ప్రాంతం సమీపంలో వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మందిని జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా, అందులో ఐదుగురు మరణించారని జిల్లా ఆసుపత్రి సిఎంఎస్ డాక్టర్ ఆర్‌బి లాల్ తెలిపారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

డీజిల్‌, పెట్రోల్‌ కార్లను పూర్తిగా బంద్ చేస్తాం..
భారత దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరో సారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ.. అసాధ్యం మాత్రం కాదని తెలిపారు. ‘100 శాతం’ సాధ్యమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు, పరిశ్రమల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను ఇందుకు ఉదహరణగా చెప్పుకొచ్చారు. ఇందుకోసం హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. ఇక, దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు. ఇంధన దిగుమతుల కోసం దేశం 16 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే, మన పక్క ఇళ్లో ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్‌ కార్లు కనిపిస్తున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇది అసాధ్యం అనుకున్న ప్రజలే తమ ఆలోచనను మార్చుకున్నారు అని పేర్కొన్నారు. టాటా, అశోకా లేల్యాండ్‌ కంపెనీలు హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశ పెట్టాయి.. ఎల్‌ఎన్జీ లేదా సీఎన్జీతో నడిచే ట్రక్కులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే పెట్రో వాహనాలకు పూర్తిగా స్వస్తి పలకడం ఎప్పుడు సాకారమవుతుందో అనేది మాత్రం నితిన్ గడ్కర్ కచ్చితంగా చెప్పలేకపోయారు.

భారత్ను రెచ్చగొట్టేలా చైనా కవ్వింపు చర్యలు..
భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదే అంటూ ఇటీవలే డ్రాగన్ కంట్రీ పేర్కొనింది. ఈ క్రమంలో చైనా మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ నిన్న ( సోమవారం ) ఈ కొత్త పేర్లను విడుదల చేసింది. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్ లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని వెల్లడించింది. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?.. అరుణాచల్‌ ప్రదేశ్ కూడా భారత్‌లో ఒక రాష్ట్రం మాత్రమే అని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు.. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాలకు పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను సైతం ప్రకటించింది.

రిషబ్ పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు.. మనుషులే కాదు!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు నిజమైన మనుషులే కాదు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. పంత్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం అని, అందులో ఎలాంటి అనుమానమే లేదన్నాడు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగలిగే సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే అని వాట్సన్‌ పేర్కొన్నాడు. ఏడాదిన్నర క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. కోలుకుని ఐపీఎల్ 2024లో ఆడుతున్న విషయం తెలిసిందే. 2022 చివరలో రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. పంత్‌ను మళ్లీ మైదానంలో చూడగలమా?, మునుపటిలా ఆడగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. కానీ సంకల్ప బలంతో నిలబడ్డ పంత్‌.. మైదానంలోకి తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి ఒకప్పటిలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో రిషబ్‌ పంత్‌ పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్‌పై 18 రన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 28 పరుగులు చేశాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చూసిన షేన్‌ వాట్సన్‌ ఫిదా అయ్యాడు. ‘రిషబ్ పంత్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం. అందులో ఎలాంటి అనుమానమే లేదు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగలిగే సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే. పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు.. మనుషులే కాదు. లయ అందుకునేందుకు అతడికి కొంచెం సమయం పట్టింది. ఒక్కసారి లయ అందుకున్నాక తనదైన శైలిలో షాట్లు ఆడాడు’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

ముంబై ఇండియన్స్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ముంబై ఇండియన్స్‌ జట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచ్‌లు ఆడిన మొద‌టి జ‌ట్టుగా ముంబై రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 1) వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ ఫీట్ అందుకుంది. ఐపీఎల్ 17 ఎడిషన్లలో ముంబై జట్టు 250 మ్యాచ్‌లు ఆడింది. ముంబై ఇండియన్స్‌ తర్వాత ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. బెంగళూరు ఇప్పటివరకు 244 మ్యాచ్‌లు ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్ (241), కోల్‌కతా నైట్ రైడర్స్ (239), పంజాబ్ కింగ్స్ (235), చెన్నై సూపర్ కింగ్స్ (228) మ్యాచ్‌లు ఆడాయి. 2016, 2017 ఎడిషన్లలో ఐపీఎల్‌కు చెన్నై దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్‌ జట్టు 2013లో తొలి టైటిల్ అందుకుంది. రోహిత్ నేతృత్వంలోనే 2015, 2017, 2019 మరియు 2020లో ముంబై ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ముంబై ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడింది. అయితే గత మూడు సీజన్లుగా ముంబై పెద్దగా రాణించడం లేదు. ఐపీఎల్ 2024లో కూడా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో ఓడింది.

మహేష్ బాబు స్టైలిష్ లుక్ మాములుగా లేదుగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.. మహేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. లేటెస్ట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు మహేష్‌.. రాజమౌళి సినిమా కోసం మహేష్ వర్కౌట్స్ చేస్తున్నారు.. అలాగే రాజమౌళి స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు.. ఇక రెండు మూడు నెలల్లో షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయని తెలుస్తుంది.. ఇంటర్నేషనల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు తొమ్మిది రకాల గేటప్స్ ను ట్రై చేశారట.. భారీ అడ్వంచర్ కథతో రాబోతున్న ఈ సినిమా కోసం ఒక లుక్ ను ఫైనల్ చేశారట.. ఆ సినిమాను ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఓపెనింగ్‌ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..

ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ మూవీ..
కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు.. ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్‌, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్లో కరుంగాపియమ్ పేరుతో విడుదల అయ్యింది.. అదికాస్త తెలుగు కాజల్ కార్తీక పేరుతో వచ్చింది.. హారర్ ఎలివెంట్స్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. జనాలకు కథ పెద్దగా నచ్చలేదు దాంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది.. దాంతో ఎక్కువ రోజులు సినిమా ఆడలేదు.. కథలో హారర్ డోసు తగ్గడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఏడాది క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది.. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమా చేస్తోంది కాజల్ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ పోలీసుగా కనిపిస్తుంది.. అఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..