NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

5వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు ఇలా సాగనున్న జగన్ టూర్‌..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని మరోసారి చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మళ్లీ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజుకు చేరుకుంది.. యాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌.. శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన యాత్రను ప్రారంభిస్తారు.. బత్తల­పల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకోనుంది బస్సు యాత్ర.. ఇక, పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకున్న తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం బయలుదేరి కదిరి చేరుకోనున్నారు.. స్థానికంగా ఉన్న పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో రంజాన్‌ను పురస్కరించుకుని.. మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు సీఎం జగన్.. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరోవైపు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు..

నేడు జనసేన గూటికి టీడీపీ సీనియర్ నేత.. అవనిగడ్డ నుంచి బరిలోకి..!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి.. కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు జనసేన పార్టీలో చేరనున్నారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్.. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చర్చలు పూర్తి అయినట్లు సమాచారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి తరపున జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ బరిలోకి దిగుతారంటూ స్థానికంగా ప్రచారం సాగుతోంది.. అయితే, 1999, 2004, 2014 సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు బుద్ధ ప్రసాద్.. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించింది టీటీడీ.. దీంతో, ఈ సారి మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి టికెట్‌ దక్కలేదు.. ఇక, గత కొన్ని రోజులగా టీడీపీకి ఈ టికెట్ కేటాయించి బుద్ధ ప్రసాద్ ని బరిలోకి దింపాలంటూ ఆయన వర్గం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది.. కొందరు ఆయనకు మద్దతుగా టీడీపీకి రాజీనామాలు కూడా చేశారు. అయితే, అవనిగడ్డ సీటును ఇప్పటి వరకు పెండింగ్‌లోనే పెట్టారు పవన్‌ కల్యాణ్‌.. జనసేనలో బుద్ధ ప్రసాద్ చేరిన తర్వాత అభ్యర్ధిగా రేపు లేదా ఎల్లుండి.. ఆయనే పేరునే ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.. మరోవైపు.. టీడీపీలో ఉన్న బుద్ధ ప్రసాద్ కు పొత్తులో టికెట్ దక్కకపోవడంతో పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

అర్ధరాత్రి యాసిడ్‌ దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ముందుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు, స్థానికులు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. లక్కవరం గ్రామానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో యాసిడ్ దాడి చేశారు.. ఈ యాసిడ్ దాడిలో నాగేశ్వరరావు శరీర భాగాలు తీవ్రంగా గాయపడ్డాయి. బాధితుడుని వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. నాగేశ్వరరావుపై యాసిడ్‌ దాడికి అసలు కారణం ఏంటి అనే కోణంలో విచారణ చేపట్టారు.. అయితే, నాగేశ్వరావుకు బంధువుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు ఆ క్రమంలోనే ఎవరైనా బంధువులే ఈ యాసిడ్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెగిన నిజాంసాగర్‌ కెనాల్‌ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. నిద్రలో వున్న కాలనీ వాసులకు ఒక్కసారిగా ఇండ్లలోకి నీల్లు చేరడంతో.. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తెగిపోయింది. దీంతో జర్నలిస్ట్ కాలనీ అంతా నీట మునిగింది. దీంతో కాలనీవాసులు అందరూ ఇంటి నుంచి పరుగులు పెట్టారు. అయితే ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికుల ఆరోపించారు. సహాయక చర్యలు మొదలుపెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిజాంసాగర్ ప్రధాన కాల్వలు మురికి కాలువలుగా మారి చెత్తాచెదారంతో నిండిపోయిందని, ఇరిగేషన్ అధికారుల పనితీరుపై స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ప్రజలకు తాగునీరు అందించి రైతులకు సాగునీరందించారు. కాలువ తెగిపోవడంతో జర్నలిస్టు కాలనీలోకి నీరు చేరి కాలనీవాసులను భయాందోళనకు గురి చేసింది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని పేర్కొంటూ ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక.. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న వాయిదా వేసారు. అయితే ఈరోజు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే దానికిపై ఉత్కంఠ నెలకొంది.

జ్ఞానవాపి మసీదులో పూజలు నిలిపివేయాలి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
జ్ఞాన్‌వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ సవాలు చేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుగా పిలవబడే అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. ఫిబ్రవరి 26వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్‌లో పూజలపై నిషేధం విధించాలని మసీద్ కమిటీ డిమాండ్ చేశారు. ఇక, జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేసిన కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదులోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేయాలనే నిర్ణయాన్ని సవాలు చేసినట్టు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 31వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులో వారణాసి కోర్టు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని వ్యాస్ జీ నేలమాళిగలో ప్రార్థనలు చేయడానికి హిందూ భక్తులకు అనుమతి ఇచ్చింది. అలాగే, తన ముత్తాత సోమనాథ్ వ్యాస్ డిసెంబర్ 1993 వరకు ఈ నేలమాళిగలో పూజలు చేసేవారని కాశీ విశ్వనాథ ఆలయం తరపున నామినేట్ చేయబడిన హిందూ పూజారి, పిటిషనర్ శైలేంద్ర కుమార్ పాఠక్ తెలిపారు. అయితే, 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేలమాళిగలో పూజలను నిలిపివేశారు. అయితే, నేలమాళిగలో ఎప్పుడూ విగ్రహం లేదని ముస్లిం పక్షం ట్రయల్ కోర్టు ముందు పేర్కొంది.

నేటితో ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు.. హాజరు కానున్న ప్రధాని మోడీ
నేడు (సోమవారం) ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడనున్నారు. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా పాల్గొంటారు. ఈరోజుల్లో ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన నిరంతరం బహిరంగ సభలు నిర్వహిస్తూ తన ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1 ఏప్రిల్ 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 ప్రకారం స్థాపించబడింది. ఇక, 1 జనవరి 1949న జాతీయం చేయబడింది. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అయితే, రూపాయి మారకం విలువ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆర్బీఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశ సభ్యత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వివిధ రకాల అభివృద్ధి, ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఇవి కాకుండా, రిజర్వ్ బ్యాంక్ భారత ప్రభుత్వ రుణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అలాగే, భారతదేశంలో ఒక రూపాయి నాణేలు, నోట్లు కాకుండా ఇతర కరెన్సీని జారీ చేసే ఏకైక అధికారం రిజర్వ్ బ్యాంక్‌కి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా, రిజర్వ్ బ్యాంక్ ఒక రూపాయి నోట్లు, నాణేలతో పాటు ప్రభుత్వం జారీ చేసే చిన్న నాణేలను కూడా చెలామణి చేస్తుంది.

ఒక్క క్యాచ్.. ముగ్గురు ఫిల్దర్స్.. అయినా కానీ..?!
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ – శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను కొద్దిసేపు బాగా నవ్వించారు. దీనికి కారణం శ్రీలంక ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే సమయంలో ఏకంగా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ ను నేలపాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 121 వ ఓవర్ చివరి బాల్ కు శ్రీలంక ఆటగాడు ప్రభాత్‌ జైసూర్య కవర్స్ వైపు డ్రైవ్ చేయగా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్ లో ఉన్న ఫిల్టర్ చేతికి వెళ్ళింది. అయితే అక్కడే అసలైన సినిమా మొదలైంది. క్యాచ్ పట్టే సమయంలో మొదట తొలి స్లిప్ లో ఉన్న ఫిల్టర్ చేతిలో నుంచి బాల్ జారిపోగా.. దాన్ని జారీ విడిచే సమయంలో రెండవ స్లిప్పులో ఉన్న ఫీల్డర్ క్యాచ్ కోసం ప్రయత్నించి., అతడి చేతిలో నుంచి జారిపోయి విజయవంతంగా మూడో స్లిప్పులో ఉన్న ఫిల్టర్ కూడా పట్టేందుకు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ నేలపాలు చేసేసారు. ఇక ఇదే మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శ్రీలంక బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో బాల్ బ్యాట్ కు క్లియర్ గా తగిలినా కూడా ఎల్బీ కోసం రివ్యూ కోసం వెళ్లి సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యాడు. ఇక ప్రస్తుతం రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన మొదటి ఇనింగ్స్ లో భారీ స్కోరు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఆటగాళ్లు ఏకంగా 6 మంది అర్ధ సెంచరీలు సాధించడం విశేషం.

ఈసారైనా ‘ముంబై’ బోణి కొట్టేనా..?
ఏప్రిల్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ముంబై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాక పోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు RR, రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. మార్చి 27న జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR) మొదట మార్చి 24న జరిగిన తమ మొదటి మ్యాచ్‌ లో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG)ని 20 పరుగుల తేడాతో ఓడించింది. తర్వాత, మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని 12 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఇరుజట్లు ముంబై, రాజస్థాన్‌ లు ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో ముంబై 15, రాజస్థాన్ 12 గెలిచాయి. ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ టైగా ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ పై ముంబై అత్యధిక స్కోరు 214, అలాగే ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 212. ఇక నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నమన్ ధీర్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, షమ్స్ ములానీ గా అంచనా వేయవోచు.

పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ రష్మీ.. అబ్బాయి ఎవరంటే?
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ గ్లామర్ డోస్ పెంచుతున్న రష్మీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. దాదాపు దశాబ్దం కాలం పాటు ఇండస్ట్రీలో రానిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. తన డ్యాన్స్ లతో మాటలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. అందుకే ఈ అమ్మడుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఈ అమ్మడు నటిగా కెరీర్ ను ప్రారంభించినా యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.. మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు.. జబర్దస్త్ షో ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి.. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటి ఇచ్చేసారు.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోవార్త వినిపిస్తుంది.. అమెరికా అబ్బాయితే పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది.. రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాతకాలు చూపించారట.. త్వరలోనే పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..

ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ తో దొరికిన పూజాహెగ్డే…ఫోటోలు వైరల్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. పెద్దగా సినిమాలో కనిపించలేదు.. కాగా,ఇప్పుడు ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడుకు గత ఏడాది పెద్దగా కలిసిరాలేదు.. అందుకే ప్రతి సినిమా కూడా జనాలను మెప్పించలేక పోయింది.. వరుస చిత్రాలతో, బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి అలరించింది. వెండితెరపై సందడి చేసింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. వెండితెరపై మాత్రం మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇదిలా ఉండగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఈ అమ్మడు కారులో వెళ్తున్నప్పుడు ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… ఆ కారులో ఆమెతో పాటు ఎవరో ఉన్నారు.. అతను పూజా హెగ్దే బాయ్ ఫ్రెండా? అంటూ పుకార్లు లేచాయి. చివరిగా పూజా కూడా సీక్రెట్ గా ఈ విషయాన్ని దాచేస్తోందా? అంటున్నారు.. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసింది.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది..