Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది. తనకు అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్‌ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్‌ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్‌ భారతీ ఉన్నారు. విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి.. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు.

 

*నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు. కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల చూపిన వివక్ష, విభజన హామీల అమలులో బీజేపీ తీరుకు నిరసనగా దీక్ష చేయనున్నారు. ఆవిధంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా విభజన హామీలను విస్మరించిందని, దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు సూటిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విభజన హామీలను విస్మరించిన బీజేపీకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగుతుందోనని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని విమర్శించారు. ప్రతి ఇంటికి రాముడు, అక్షింతల ఫొటోలు పంపడం తప్ప ప్రతి ఇంటికి ఏం చేశారో చెప్పాలని, వీలైతే బీజేపీకి రాముడి బొమ్మ కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తమ నియోజకవర్గాల్లో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ దీక్షా ప్రకటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ ఏం చేశారో, ఇప్పుడు ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని పొన్నంకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

 

*తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!
రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం కాస్త చల్లబడింది. పలుచోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శీతకన్ను వేసింది. రానున్న పది రోజుల పాటు అంటే ఏప్రిల్ 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మండుతున్న ఎండలను చూసిన జనం నాలుగు రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం చల్లబడుతోంది. మరో పది రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుపానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దడవు తెలంగాణ శనివారం మేఘావృతమై ఎండల తీవ్రత తగ్గింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడడంతో కాస్త ఆనందంగా ఉంది.

 

*ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య
ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని భావిస్తున్నామని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని తన అనుమానమని ఆయన అన్నారు. నెల్లూరు సిటీ నియోజక వర్గ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. హింస ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకుంటున్నారని.. గతంలో కూడా విశాఖపట్నంలో జగన్‌పై దాడి జరిగిందన్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. అప్పుడు చిన్న కత్తితో దాడి జరిగినా దానిపై విపరీత అర్థాలను చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. అధికారం కోల్పోయిన ఐదు సంవత్సరాలైనా.. అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకోకుండా హింసా ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరగడాన్ని ఖండిస్తున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు.

 

*నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల..
మరోసారి అధికారం చేపట్టాలన్న ధీమాతో ఉన్న బీజేపీ నేడు ‘సంకల్ప పత్రం’ పేరిట ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ‘మోడీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్‌’ పేరుతో.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేటి (ఆదివారం) ఉదయం 8:30గంటలకి కమలం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. అవినీతిపై మోడీ ప్రారంభించిన పోరాటం ఆగదని.. విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా అవినీతిని నిర్మూలించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మరిన్ని కఠినమైన చట్టాలు చేస్తుందని ఈ మేనిఫెస్టోలో ప్రకటించే ఛాన్స్ ఉంది. సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఇక, రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధతపై బీజేపీ ఎలాంటి ప్రకటన చేయబోతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంస్కృతిక, జాతీయవాద అంశాలను కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రధానంగా చేర్చినట్లు సమాచారం. రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి కోట్లాది హిందువుల కలను నెరవేర్చిన మోడీ.. భారతీయుల అస్తిత్వాన్ని, మనోభావాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచే అవకాశం ఉంది. హై స్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ రైలు కారిడార్ల లాంటి అనేక మౌలిక సదుపాయాలను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించే ఛాన్స్ ఉంది. 2019లో విడుదల చేసిన సంకల్ప్‌ పత్రంలో పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలయ్యాయో బీజేపీ తెలియజేయనుంది. జాతీయ భద్రతకు కూడా బీజేపీ కీలక ప్రాధాన్యం ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో చెలగాటమాడితే మోడీ మౌనంగా ఉండరని..ధీటుగా సమాధానమిస్తారనే హెచ్చరికను కూడా బీజేపీ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించబోతున్నాట్లు సమాచారం.

 

*ఇజ్రాయెల్‌పై రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌తో ఇరాన్‌ దాడి..
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. శనివారం నాడు అర్థ రాత్రి దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇక, ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంది. అయితే, శనివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. ఇక, ఈ డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌ గగనతలంలోకి రాగానే సైరన్‌ శబ్ధంతో అట్టుడుకుపోతుంది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చి వేసినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ తమ గగనతలాన్ని క్లోజ్ చేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అలర్ట్ చేశాయి. ఇరాన్‌లో డ్రోన్‌ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌ నుంచి వచ్చే డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యూహ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. అలాగే, ఇజ్రాయెల్ కు సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను ఆమెరికా మోహరించింది.

 

*17 మంది ఇండియన్స్ ఉన్న ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్‌ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ బిలియనీర్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సి ఎరిస్‌ కంటెయినర్‌ షిప్‌ను గల్ఫ్‌ ఆఫ్‌ హార్ముజ్‌ దగ్గర ఇరాన్‌ నేవీ స్వాధీనం చేసుకుంది. పోర్చుగల్‌ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్‌తో ఇప్పటికే సందప్రదింపులు కొనసాగిస్తుంది. కాగా, ఇజ్రాయెల్ నౌకను తీసుకెళుతున్నట్లు ఇరాన్‌ నేవీ ప్రకటించింది. నౌక డెక్‌పై ఇరాన్‌ కమాండోలు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇజ్రాయెల్‌ బిలియనీర్‌ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్‌ మారిటైమ్‌ గ్రూపు ఈ నౌక నిర్వహణ కార్యక్రమాలు చేస్తుంది. అయిత, హెలికాప్టర్‌ ద్వారా ఇరాన్‌ నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తుంది. హర్మూజ్‌ జలసంధి వైపు వెళ్తుండగా చివరి సారిగా ఎంఎస్‌సీ ఎయిరిస్‌ను గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి దీనిపై స్పందించారు. ఇరాన్‌ గార్డ్స్‌ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ కోరింది. ఇరాన్‌లో ప్రస్తుతం క్రిమినల్స్‌ పాలన కొనసాగుతోంది.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్‌ ఆపరేషన్‌లను ఆ దేశం నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్‌ సపోర్ట్ ఇవ్వడంతో మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడులు చేయగా.. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్‌ ఆర్మీ ఉన్నతాధికారులు చనిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ఇరాన్‌, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని చెప్పింది.

 

*సీఎస్కే వర్సెస్ ముంబై మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 నేడు (ఆదివారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లలో 2 గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు, CSK తన ఐదు మ్యాచ్‌లలో 2 మ్యాచ్ లు ఓడిపోయి 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలు సాధించి పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓటమి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ అంతకు ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాగా, ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడాయి. ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, చెన్నై 16 విజయాలు సాధించింది. అలాగే, వాంఖడే స్టేడియంలో ఎంఐ వర్సెస్ సీఎస్కే మధ్య 11 మ్యాచ్ లు జరగ్గా హార్దిక్ సేన 7 గెలవగా.. గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై నాలుగింటిలో విజయం సాధించింది. అయితే, వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు చాలా సహాకారిస్తుంది. ఈ స్టేడియం యొక్క బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాట్స్‌మెన్ ఈజీగా బౌండరీలు బాదే అవకాశం ఉంటుంది. టాస్ గెలిస్తే జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు.. ఎందుకంటే సెకండ్ ఇన్సింగ్స్ సమయానికి డ్యూ ( మంచు ) వచ్చే అవకాశం ఉంటుంది. ఇక, ఇవాళ (ఏప్రిల్ 14న) ముంబైలో ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ముంబైలో వర్షం కురిసే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తేమ స్థాయి 79 శాతం ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గంటకు 19 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.

Exit mobile version