Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడే ఇంటర్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనున్నీ ఏప్రిల్‌ 10న మధ్యాహ్నంతో పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. దాదాపు 10లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 20 తో ఎగ్జామ్స్‌ ముగిశాయి. ఈనెల 4నాటికి స్పాట్‌ వాల్యుయేషన్ పూర్తిచేశారు. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తోంది విద్యాశాఖ. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈసీ అనుమతి కూడా తీసుకున్నారు. కోడ్ కారణంగా రాజకీయనాయకుల ప్రమేయం లేకుండా ఇంటర్‌బోర్డ్ ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇక, పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాల తేదీ ప్రకటన కావడంతో ఇంకా కొద్ది గంటల్లోనే తమ భవిష్యత్ తేలనుందన్న టెన్షన్‌లో విద్యార్థులున్నారు.

13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయన్ను చూసేందుకు జనం పెద్దయెత్తన రోడ్లపైకి వస్తూ ఎదురుచూస్తున్నారు. ఇవాళ 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభవుతోంది. రంజాన్ తో నిన్న ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. 12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు సీఎం జగన్‌. ఇక, ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్‌ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా యాత్ర సాగుతుంది. నంబూరు బైపాస్ దగ్గర బస చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

27 ఏళ్లుగా విచారణ.. నేడు శిరోముండనం కేసులో కీలక తీర్పు
1996 డిసెంబర్ 29.. రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో దళితయువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో ఇద్దరికి గుండుకొట్టించి, కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈకేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు.. మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు.. ఇక ఈకేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. 1997 జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/1997గా ఎఫ్ఐఆర్ నమోదయింది.. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు.. అయితే, 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.. ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్ లు గా పని చేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు.. అయితే ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈనెల మూడు వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది.. ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని ప్రకటించింది.. దాంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది..

కాసేపట్లో కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కవిత.. కస్టడీ కోరనున్న సీబీఐ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరు పరచనుంది సీబీఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకీ తీసుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత కీలక పాత్ర పోషించారంటున్న సీబీఐ ఆమెను ప్రశ్నిస్తేనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటోంది. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 6న తీహార్‌ జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటు సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. జడ్జ్ ఆదేశాలతో ఈ ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయనున్నారు ఆమె లాయర్లు. పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. లిక్కర్‌ కేసులో ఆమె పూర్తిగా ఈడీ, సీబీఐ చట్రంలో చిక్కుకుపోయారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది, విచారణ తర్వాత ఆమెను తీహార్‌ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేశారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ కేసుతో ఆమె జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికొస్తారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. గతంలో చాలా కేసుల్లో నెల తరబడి నిందితులు జైలులోనే ఉన్నారు.ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే.. నెలల తరబడి జైలులో ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు
2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని, ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని, ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి రుద్రారంలోని సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ఈరోజు హరీష్ రావు ప్రారంభించారు. సంగారెడ్డిలో లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటాడు. నువ్వు సీఎంవా? లేదా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా? రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు నోసిటితో వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉంది. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయింది’ అని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసింది. ఇక ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది’ అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెదక్ లోక్‌సభ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

బాలికపై తల్లి స్నేహితుడు అత్యాచారం, చిత్రహింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరితో సహజీవనం చేస్తోంది. అయితే మహిళ లేని సమయంలో 10 ఏళ్ల కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. అంతేకాకుండా ఆ బాలిక సోదరుడి(13)పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విషయాన్ని పిల్లలు తల్లికి చెబితే.. కామాంధుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. ఆ కసాయి తల్లి పిల్లల్నే చిత్రహింసలకు గురిచేసింది. దీంతో ఆమె బాధల్ని తట్టుకోలేక పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లిని, ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించలేం
సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అనంతరం ఎన్నికల కమిషన్.. తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తిరస్కరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వ్యక్తిగతమని.. వాటిని ఆర్‌టీఐ కింద ఇవ్వలేమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్‌ రూపంలో అందించాలంటూ కమొడోర్‌ లోకేశ్‌ బాత్రా గత నెల 13న ఎస్‌బీఐకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు అందజేశారు. అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం.. ఆర్‌టీఐలో మినహాయింపులు ఉన్న సెక్షన్‌ 8(1)(ఇ), సెక్షన్‌ 8(1)(జె) పరిధిలోకి వస్తుందని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ఆ సంస్థ కేంద్ర ప్రజా సమాచార అధికారి తెలిపారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించడం విచిత్రంగా ఉందని లోకేశ్‌ బాత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టకుండా ఉండేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఎస్‌బీఐ తరఫున ఎంత రుసుము చెల్లించారో తెలియజేయాలని కూడా బాత్రా కోరారు. ఆ వివరాలనూ బ్యాంకు వెల్లడించలేదు. ఎస్‌బీఐ నిర్ణయంపై బాత్రా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అతడే మా కొంపముంచాడు: డుప్లెసిస్‌
ముంబై ఇండియన్స్‌పై ఓటమిని తాము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ తెలిపాడు. ఈ వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం అంత ఈజీ కాదని, పవర్‌ప్లేలో తాము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడని, అతడు ఎక్కువ పరుగులు చేయడకుండా అడ్డుకున్నాడని డుప్లెసిస్‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ముంబై కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాప్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ… ‘ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మంచుతో కూడిన పరిస్థితులు అయితే, రెండోది టాస్‌ గెలిచి ఉండాల్సింది. అంతేకాదు ముంబై ప్లేయర్స్ బాగా ఆడి మాపై ఒత్తిడి తెచ్చారు. ఈ మ్యాచ్‌లో మేము కూడా చాలా తప్పులు చేశాము. పవర్‌ ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని మాకు తెలుసు. మేం 250 పైగా పరుగులు చేయాల్సింది. కానీ 196కే పరిమితం అయ్యాము’ అని తెలిపాడు. ‘రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముంబై ప్లేయర్స్ బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించారు. రజత్ పాటిదార్‌, నేను క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్‌ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. డెత్‌ ఓవర్లలో సూపర్‌ బౌలింగ్‌ చేశాడు. బుమ్రాలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి. ఒత్తిడిలో కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. అతడిని ఎటాక్‌ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ మార్గదర్శకత్వంలో అతను మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. బుమ్రా లాంటి క్లాస్‌ బౌలర్‌ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్‌ అంత పటిష్టంగా లేదని తెలుసు. కాబట్టి వచ్చే మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించాలి’ అని డుప్లెసిస్‌ చెప్పుకోచ్చాడు.

హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?
ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు స్టార్ హీరోయిన్ గా పేరును అందివ్వలేదు.. దాంతో ఐటమ్ గర్ల్ గా మారింది.. తన అంద చందాలతో కుర్ర కారును తనవైపు తిప్పుకుంది.. స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించింది.. ఇప్పుడు తెలుగులో మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.. రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా జనతాబార్.. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్‌ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.. జనతా బార్ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు.. ఆ ట్రైలర్ కొత్తగా ఉంది.. సినిమా పై ఆసక్తిని పెంచుతుంది.. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కుస్తీ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పే కథగా రాబోతుంది… బార్ గర్ల్ గా మొదలైన అమ్మాయి. కుస్తీ పోటిల్లో ఎలా రానిస్తుంది.. సమాజంలో ఆమె ఎలా రానిస్తుంది.. సినిమా మొత్తం సరికొత్తగా ఉండబోతుందని డైరెక్టర్ చెబుతున్నారు.. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’.. తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న మలయాళీ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’. ఈ చిత్రంకు గిరీశ్‌ ఎడి దర్శకుడు కాగా.. నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమలు సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. దాదాపు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో అందుబాటులో ఉంది. గురువారం అర్ధరాత్రి (ఏప్రిల్ 12) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షన్‌ మాత్రమే ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయిన వారు ఈ సినిమాను ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.

Exit mobile version