NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్క తోక పటాకులు పేలుతాయా లేక సూతిల్ బాంబులు పేలుతాయో చూడాలన్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తామన్నారు. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

వారంలో ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్న జేపీసీ.. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు గురించి కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును జేపీసీకి పంపగా అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. గత కొద్ది రోజులుగా వక్ఫ్ సవరణ బిల్లు వార్తల్లో నిలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో చాలా రచ్చ జరిగింది. జెపిసి సమావేశానికి ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ అశ్విని కుమార్‌ను పిలవడంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అతను వచ్చిన వెంటనే సభ్యులు గందరగోళం సృష్టించడం, నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వక్ఫ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వారంలో ఐదు రాష్ట్రాల్లో పర్యటించి వాటాదారులతో సమావేశాలు నిర్వహించనుంది. వక్ఫ్ సవరణ బిల్లు 2024పై ప్రజా సంప్రదింపుల కోసం కమిటీకి ఇదే చివరి పర్యటన. ఈ కారణంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9 న అస్సాం రాజధాని గౌహతి నుండి తన పర్యటనను ప్రారంభించనుంది. దీని తర్వాత నవంబర్ 11న కమిటీ ఒడిశాలోని భువనేశ్వర్‌లో పర్యటించనుంది.

ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలి..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉండాలని.. ఈ పథకాలు అమలు చేయలేం అని చెప్పాలన్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయలేకపోతే ప్రజలను క్షమించమని అడగాలన్నారు. ఆలస్యం అయినా పర్వాలేదు కానీ కచ్చితంగా అమలు చేయాలన్నారు.

ఉచిత గ్యాస్‌పై కన్ఫ్యూజ్ వద్దు.. ఆ కార్డులకు ఆధార్‌ లింక్‌ ఉంటే అర్హులే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధం అయ్యింది.. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ప్రీ గ్యాస్ సిలిండర్‌ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు‌. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. కానీ, ఈ పథకంపై ఇంకా కొందరిలో అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్‌.. దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు..

కులగణన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి..

కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు.

కుల గణనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

గాంధీ భవన్ లో నిర్వహించిన కుల గణన మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందన్నారు. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం అని చెప్పుకొచ్చారు. రేవంత్ కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది..పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం.. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ మీద ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ఆ కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారు

రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ఇవాళ మీడియాతో మాజీమంత్రి హరీష్‌ రావు చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి భాష చూసి పిల్లలు చెడిపోతారు అని.. టీవీ లు ఆపేస్తున్నారని, హైదరాబాద్ లో సముద్రం, బకారానంగళ్ ప్రాజెక్టు తెలంగాణ లో ఉంది అనే లాంటి మాటలు చెబుతున్నారన్నారు. మల్లన్న సాగర్ లో యాభై వేల ఎకరాల భూమి ముంపు కు గురి అయింది అన్నారని, అక్కడ 17 వేల ఎకరాలు మాత్రమే ముంపు గురి అయిందన్నారు. ఇలా ప్రతిసారి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ దయతో సీఎం అయ్యావు… కేసీఆర్ పై మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్.. అంతమాత్రాన కేసీఆర్ పని అయిపోయింది అంటావా అని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, expiry మెడిసిన్ అంటే రాహుల్ గాంధీ ని అంటున్నవా అని హరీష్‌ రావు సెటైర్‌ వేశారు.

వరంగల్ రీజియన్‌లో త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) త్వరలో వరంగల్ ప్రాంతంలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను స్థూల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సుల నిర్వహణను నిర్వహిస్తున్న వరంగల్-2 డిపోలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కేటీఆర్, హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారు

సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్దికోసం ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని, మంత్రిగా ఉన్న నేనే మూసీ రివర్ బెల్ట్ లో ఉన్నాను ఏసీలో ఉన్న నాకే పరిసరాలు కంపు కొడుతుందన్నారు మంత్రి జూపల్లి. మూసీ పరివాహక ప్రాంతాల్లో దుర్బర జీవితం అనుభవిస్తున్న వాళ్ళు మంచి గాలి ఆస్వాదించవద్ద అని ఆయన అన్నారు. పది నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.. మీ హయాంలో డీఎస్సీ వేశారా అని ఆయన ప్రశ్నించారు.

మురుగు నీటిని గోదావరికి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది..

రాజమండ్రిలో గోదావరి స్నాన ఘట్టాలు అస్థవ్యస్తంగా తయారయ్యాయి.. మురికి నీటిని గోదావరిలోకి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది అని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. నవంబర్ రెండో తేదీ నుంచి కార్తీక మాసం మొదలవుతుంది.. ఈ సందర్భంలో స్నాన ఘట్టాలు బురదమయంగా మారిపోయి.. మురికి నీటితో కంపు కొడుతుందన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరిస్తారు అని చెప్పుకొచ్చారు. అలాగే, రాజమండ్రిలోని పవిత్రమైన పుష్కర ఘాటు కోటిలింగాలు, మార్కండేయ ఘాటులతో పాటు గౌతమి ఘాట్ లోనూ ఇదే దుస్థితి నెలకొంది అన్నారు. ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు.