NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..

అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్‌గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు. ఇక, వైసీపీ నుంచి కొంతమంది బీజేపీలోకి వస్తున్నారనేది ప్రచారం మాత్రమే.. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయన్నారు..

హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారు.. ఫిర్యాదులపై స్పందించిన సీఎం

పది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపతూ ముందుకు సాగతుంది.. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవరినీ వదలకుండా అక్రమ కట్టడాలను నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. హైదరాబాద్‌లో ముంపునకు గురవుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేసి శాశ్వత పరిష్కారం చూపేందుకే `హైడ్రా` ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ కొందరు హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం..

మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనం,వెల్నెస్ సెంటర్ పరిశీలించారు. ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములం కావాలన్నారు. ప్రపంచంలో నెలకొన్న అశాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానం.. అందుకు మానసిక పరివర్తన చెందాలి.. మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కరించారు. ధ్యానం పై దృష్టి పెట్టి నిర్మించిన కన్హ శాంతి వనం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం అన్నారు. ఏ సమస్యలు ఉన్నవారైనా కన్హ శాంతి వనంలో ధ్యానం చేసుకునేందుకు కావలసిన అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ గారి కోరిక మేరకు శాంతి వనాన్ని సందర్శించానని తెలిపారు.

సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు..

హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రాపై విమర్శలు వస్తున్నా మొదటి నుండి దూకుడుగా ముందుకు సాగుతుంది. అక్రమార్జనకు పాల్పడిన వారిపై సామాన్యులు, పేదలు, సినీ, రాజకీయ ప్రముఖులు కొరడా ఝుళిపిస్తున్నారు. పేదవారైనా, సెలబ్రిటీలైనా తనకు ఒకటేనని ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసి హైడ్రా నిరూపించుకుంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా మరో సంచలనం సృష్టించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి నోటీసులు జారీ అయ్యాయి.

తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం.. కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం..

ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఐదున్నర నెలల తర్వాత, ఆమె తన తండ్రిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ చేతికి కవిత ముద్దు పెట్టారు. కన్న కూతురిని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్న బిడ్డను ప్రేమగా గుండెకు హత్తుకుని ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. చాలా కాలం తర్వాత అధినేత కేసీఆర్ ఉత్సాహంగా కనిపించారు. పార్టీ నాయకులు, సిబ్బంది తమ అధినేత సంతోషంలో పాలుపంచుకున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా.. కవిత ఎర్రవల్లి ఫాంహౌస్‌లో 10 రోజుల పాటు ఉండనున్నారు. తనను కలవడానికి ఎవరూ రావద్దని కవిత కోరారు.

ORR పరిధిలో హైడ్రాకు ఆక్రమణల తొలగింపు బాధ్యత

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా, ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటలీజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. ఇక నుంచి ఒక్కరూపాయికే….?

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్‌తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.

త్వరలో భారత్ డోజో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత రెండేళ్లలో రాహుల్‌ గాంధీ.. ‘భారత్‌ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ పేరిట రెండు యాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చారు. తాజాగా న్యాయ్‌ యాత్ర సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ సెషన్లకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. అలాగే త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’ చేపట్టబోతున్నట్లు వ్యాఖ్యానించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. కాగా.. దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.

రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం.. కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్

సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్ధిష్ట ప్రణాళితలో ముందుకెళ్లాలన్నారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకుడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతే కానీ తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

నేను ఇప్పటికీ రాజీనామాకి కట్టుబడి ఉన్నా..

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని, రుణమాఫీ పాక్షికంగా మాత్రమే అయింది అని ఉత్తమ్ కుమార్ చెప్పారని ఆయన వెల్లడించారు. మీ మంత్రులు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు అని చెబుతున్నారని, నా ఛాలెంజ్ పంద్రాగస్టు లోగా రుణమాఫీ చేయాలని చేసానన్నారు. కానీ రుణమాఫీ పూర్తిగా జరగలేదు అనేది వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. వాల్మీకి స్కాం పట్టపగలు నిలువు దోపిడీ అని, ప్రభుత్వ డబ్బులు గోల్డ్ షాపు లు, కార్ల కంపెనీలకు వచ్చాయన్నారు. ఈ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని, ఈ కుంభకోణం పై విచారణ చేయాలని ఈడీ ని అడుగుదామన్నారు హరీష్‌ రావు.