మార్చి1న చలో మేడిగడ్డ.. తెలంగాణ భవన్ నుంచి 150 మంది బీఆర్‌ఎస్ నేతలు
బీఆర్‌ఎస్ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మార్చి 1న తలపెట్టిన ప్రాజెక్టుల సందర్శనకు తమ వెంట కాంగ్రెస్ మంత్రులను తీసుకెళ్తామని.. కాళేశ్వరం ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం కలిసి వెళతామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ నుంచి 150 మంది ప్రజాప్రతినిధులం మెడిగడ్డ బయలుదేరి వెళతామన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడతామన్నారు. రాష్ట్రం ఏర్పడే దాకా నీళ్ల కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు తెలంగాణకు దక్కలేదన్నారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జల యజ్ఞం పేరుతో దన యజ్ఞం చేశారన్నారు. పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రం లో ఉన్నా కాంగ్రెస్ గోదావరి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చూపించామన్నారు. పబ్లిక్ కు కాళేశ్వరం తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతా ఈ మీడియానే చేసింది.. బీజేపీలో చేరికపై కమల్‌నాథ్ రియాక్షన్..
లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇవాళ తొలిసారి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. పార్టీ మారుతున్నట్లు నేను ఎప్పుడైనా చెప్పానా, నేనే ఏదైనా సూచన చేశానా? అలాంటిదేమీ జరగలేదు అని కమల్‌నాథ్ ప్రశ్నించారు.
ఇక, అంతకుముందు ఆదివారం నాడు కాంగ్రెస్ సమావేశానికి కమల్ నాథ్ హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ కమిటీ ఈ సమావేశం నిర్వహించింది. ఇందులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, వివేక్ తంఖా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో అభ్యర్థుల పేర్ల జాబితాను తయారు చేయాలని కమల్ నాథ్ పట్టుబట్టారు. ఏ సీటులో అభ్యర్థులను ఖరారు చేశారో వారి పేరే ఫైనల్ అని తెలియజేయాలన్నారు. దీంతో సొంతంగా టీమ్ ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతారు అని ఆయన పేర్కొన్నారు.
టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తొలి జాబితా.. కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజేస్తోంది.. తొలి జాబితాలో సీటు దక్కనివారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. ఇక తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తోన్న నేతలు.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీని వీడీసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.. రాజోలు అసెంబ్లీ ఆశించిన ఆయన.. టిక్కెట్ కేటాయించలేదని అసంతృప్తితో పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారట.. ఇక, గొల్లపల్లి సూర్యారావు ఇంటి వద్ద.. గతంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలును కూడా తొలగించారు అనుచరులు.. ఆ తర్వాత రాజోలు నుండి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారట గొల్లపల్లి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.. ఇదే సమయంలో.. వైసీపీ నుంచి ఆయన అమలాపురం పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరి రాజకీయాల్లో.. అది కూడా ఎన్నికల సమయంలో ఏదైనా సాధ్యమే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అడుగు ఎటువైపు పడతాయే.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచిచూడాలి…
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా విచారణకు ముందుకు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు జరగనున్నాయన్నారు. మోడీ సర్కార్ 3వ సారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
కాపులకు సీట్లు కేటాయించాలి.. కాపు ఉద్యమ జేఏసీ డిమాండ్
విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయాలని పేర్కొన్నారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభంకు ఎవరు సముచిత స్థానం కలిపిస్తారో వారికి మద్దతిస్తామని తోట రాజీవ్ తెలిపారు.
రూ.5.9 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం రాత్రి సాయిబాలాజీ ఆగ్రో రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 69,394 బస్తాల వరి ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.5.90 కోట్లుగా అంచనా వేశారు. 2022-2023 రబీ సీజన్‌లో 38,265 బస్తాలకు గాను 2,174 బస్తాలను మిల్లింగ్‌కు కేటాయించగా, 42,301 బస్తాలకు 42,302 బస్తాలకు గాను కేవలం 122 బస్తాలు ఇచ్చామని విజిలెన్స్ జిల్లా మేనేజర్ నరసింహులు విలేకరులకు తెలిపారు. సీజన్ మిల్లులో కనుగొనబడింది. మిగిలిన సంచులను పక్కదారి పట్టించారు.
తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం..
అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో.. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేరళలో గజరాజుల మారణహోమం.. మరొకరు మృతి
కేరళలో ఏనుగులు మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి గజరాజులు విజృంభించాయి. ఏనుగుల దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఇడుక్కిలోని (Idukki) పర్యాటక పట్టణం మున్నార్ సమీపంలోని కన్నిమల ఎస్టేట్‌లో అడవి ఏనుగు దాడిలో ఒకరు (Kerala Man Killed) మరణించారు. మృతుడు ఇడుక్కికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ కుమార్‌గా (Suresh kumar) గుర్తించారు. ఫిబ్రవరి 26, సోమవారం అర్థరాత్రి సమయంలో వాహనంపై ఏనుగు దాడి చేసింది. ఆ సమయంలో మరికొందరు ప్రయాణికులు ఆటోరిక్షాలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని యాగం చేపట్టిన యార్లగడ్డ..
విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది. ఈ సందర్భంగా.. యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి పాల్గొని వేద పండితుల ఆధ్వర్యంలో అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి సుదర్శన లక్ష్మీనారసింహ యాగంను ప్రారంభించారు. అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరికి వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘన స్వాగతం పలికారు.
