గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు
గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు. బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి రూ.6 వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని.. ఇవి రెండు విడతలుగా చెల్లిస్తారన్నారు. రెండోసారి ఆడబిడ్డ అయితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కానీ ప్రస్తుతం ఈ పథకం కుంటుపడిందని.. దీనికి నిధులే లేవని ఆరోపించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలుకు రూ.12,000 కోట్లు అవసరం అన్నారు. కానీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించారని సభ దృష్టికి సోనియా తీసుకొచ్చారు. ఇక గర్భిణీ స్త్రీలకు రెండు విడతలుగా అందాల్సిన నగదు అందడం లేదన్నారు. 2022-23లో 68 శాతం మందికే ఒక విడత డబ్బులే అందాయని.. అనంతరం ఆ నిష్పత్తి బాగా తగ్గిపోయిందన్నారు. క్రమక్రమం ఆ నిష్పత్తి పూర్తిగా పడిపోతూ వచ్చిందని తెలిపారు.
కేబినెట్ నిర్ణయంతో రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం..
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యంతో ఒక మాఫీయా నడిపిస్తున్నారు.. కేబినెట్ నిర్ణయం మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం.. ఉగాది రోజు సన్న బియ్యం పథకం ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డు హోల్డర్లకు 6 కిలోల సన్న బియ్యం ఫ్రీగా అందజేస్తాం.. సన్న బియ్యంపై సభ్యులు ఏమైనా సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటాం.. ఏప్రిల్ మాసంలో కొత్త రేషన్ బియ్యం వస్తుంది.. ఈ పథకంతో 84 శాతం మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.. సన్న బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు కూడా త్వరలో ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇక, గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ఇరిగేషన్ బడ్జెట్ లో పెట్టామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట అప్పులు తీసుకున్నారు కానీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, ఆయకట్టు పెరగలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదు అని తేల్చి చెప్పారు. కేటగిరి బేస్ గా ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్నాం.. అలాగే, SLBC ఘటన చాలా బాధాకరం.. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నేను అక్కడ ఉన్నాను.. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తున్నాం.. ఇప్పటికీ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు నేను అన్నాను..
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేటీఆర్ కి సభలో నిరసన తెలిపే హక్కు ఉంది.. అయినా లాబీలో షో చేశారు.. అసెంబ్లీ లాబీల్లో సభ నడుస్తున్నప్పుడు ఫోటో, వీడియో తీయొద్దు.. తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేశారు. ఇలా అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం మంచి సంప్రదాయం కాదు.. బీఆర్ఎస్ నేతలు నిరసన చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు అని ఆది శ్రీనివాస్ తెలిపారు.
లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ గరం గరం
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో గరం గరం అయ్యారు. బుధవారం సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తుండగా స్పీకర్ ఓం బిర్లా పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతుండగానే సభను స్పీకర్ వాయిదా వేసేశారు. దీంతో స్పీకర్ తీరును రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. సభలో తనను మాట్లాడటానికి స్పీకర్ అనుమతించడం లేదని.. సభా కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదంటూ ఓం బిర్లాపై రాహుల్ ధ్వజమెత్తారు. స్పీకర్ తీరు కారణంగా మాట్లాడకుండా ఆగిపోవల్సి వచ్చిందని ఆరోపించారు. రాహల్ మీడియాతో మాట్లాడారు. సభలో ఏం జరుగుతుందో తనకు తెలియదు అన్నారు. తనను మాట్లాడనివ్వమని స్పీకర్‌ను సమయం కోరాను. కానీ అందుకు తనకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సభను నడిపేందుకు ఇది సరైన మార్గం కాదని తెలిపారు. అనవసరంగా స్పీకర్ వాయిదా వేసుకుని వెళ్లిపోయారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడటానికి సమయం ఇవ్వడం ఆచారం.. కానీ తాను మాట్లాడేందుకు లేచినప్పుడల్లా స్పీకర్ అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో తాను నిశ్శబద్దంగా కూర్చోవల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సభలో మహా కుంభమేళా, నిరుద్యోగం గురించి మాట్లాడేందుకు సమయం అడిగాను.. కానీ స్పీకర్ మాత్రం వాటి గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. సభలో ప్రజాస్వామ్యానికి చోటేలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కుటుంబంలో అఘోరీ అలజడి.. అసలేం జరిగింది..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను మాయమాటలు చెప్పి అఘోరీ తీసుకువెళ్లాడని యువతి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు నెలల క్రితం అఘోరీ మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చినా పోలీసులు లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో అఘోరీ హైవేపై గందరగోళం చేయటంతో విషయాన్ని అఘోరీ గురువుకు చేరవేశారు. దీంతో ఈ విషయాన్ని వెంటనే అఘోరీ డ్రైవర్ ఆమె గురువుకి చెప్పటంతో అఘోరీకి సాయం చేయాలని తనకు పరిచయం ఉన్న శ్రీవర్షిని అన్నలకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే శ్రీవర్షిణి అన్నలు ఇద్దరు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కబెట్టారు.
రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి.. మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ పీసీసీ పదవి రూ. 50 కోట్లకు కొన్నడని కోమటి రెడ్డి అన్నడని చెప్పాడు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డ రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం లేకుండా చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు అని ఎద్దేవ చేశారు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. మీకు నాయకుడే లేడు.. సభకు రావడమే మానేశారని తెలిపారు. ప్రజల సమస్యలు చెప్పడానికి సభకే రావడం లేదు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే నిన్నటి నుంచి ఒకలెక్కా.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉండేది.
ఆన్ లైన్ బెట్టింగ్ పై సీఎం రేవంత్ సీరియస్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది కానీ, అది అమలు కాలేదని అన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. విమర్శల జోలికి పోను.. ఆన్‌లైన్ రమ్మి.. బెట్టింగులపై కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం నేల కూలింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆరు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
రాష్ట్రా ఆదాయం తగ్గింది.. మంత్రుల ఆదాయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఒక్క ఏడాది పాలనలోనే తెలంగాణ అభివృద్ధిని నిలిచిపోయిందని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. అయితే, మంత్రుల ఆదాయాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతల పని దోచుకోవడం, దాచుకోవడమేనని ఆయన మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇవ్వాల్సిన మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు చేస్తుంటే, ఎండిన పంటలను పరిశీలించేందుకు మాత్రం సమయం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలోని నేతలు రైతులను తీవ్రంగా అవమానిస్తున్నారని, వారి బాధను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో ఉపఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా ప్రకటించిన సీఎం, అసెంబ్లీ సభ్యులు ఎవరూ ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ, ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం మేలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చినా, మళ్లీ వెనక్కి వెళ్లినా, వాటితో సంబంధం లేకుండా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి తన ప్రాధాన్యత అని స్పష్టం చేసిన సీఎం, ఉపఎన్నికల గురించి చర్చించేందుకు తన సమయం వృథా చేసుకోవడం లేదు అని చెప్పారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చిన తర్వాత తాము దానిని స్వీకరిస్తామని చెప్పారు. ఇక, బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఆ వ్యవహారం హైకోర్ట్, సుప్రీంకోర్టుకు వెళ్లడం, త్వరలో కోర్టు తీర్పు రాబోతుందన్న వార్తలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.