NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక..

కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణంలోనే ఉండనున్నారు.

పెట్రోల్ పంపులో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్” అని వివరణ ఇచ్చారు. కానీ, అక్కడి వాహనదారులు దీనిని ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనదారులు, పెట్రోల్ బంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం

అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాఠశాలల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు!

కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి వేటు వేశారు. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి.. అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు కడప డీటీసీపై ఆరోపణలు ఉన్నాయి.

కడప డీటీసీ చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం మహిళా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటికి వెళ్లి వేధించాడు. దీంతో మహిళా ఉద్యోగి కుటుంబసభ్యులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కడప డీటీసీపై బదిలీ వేటు వేసి రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. కడప డీటీసీపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. బాపట్ల, శ్రీకాకుళంలో పని చేసిన సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ ఇన్‭ఫ్లూయెన్సర్లను ఏం చేయాలి?

తెలంగాణ ఆర్టీసీ ఎమ్‭డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయన విశేషాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పై అవగహన కోసమై పలు కీలక పోస్టులను చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితంలో నాశనం చేసుకోవద్దని ఆయన పలుమార్లు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూనే.. మరోవైపు సోషల్ మీడియా ఇన్‭ఫ్లూయెన్సర్లకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ట్రావెలింగ్ ఇన్‭ఫ్లూయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ మరోమారు బెట్టింగ్ యాప్స్ సంబంధించి సూచనలు చేశారు.

చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్న‌త స్థానాల్లో తెలుగు వారు!

సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్ర‌పంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యార్థులు పారిశ్రామిక‌వేత్తలుగా మారి.. ఇత‌రుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే స్థాయికి ఎద‌గాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎన‌ర్జీదే ప్ర‌ముఖ పాత్ర అని పేర్కొన్నారు. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌రిశోధ‌న‌ల ద్వారా విద్యార్థులు కొత్త వాటిని క‌నుగొనాలని మంత్రి చెప్పుకొచ్చారు. విజ‌య‌వాడ సిద్ధార్థ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు.. సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు‌‌. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. ‌‌రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి… ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు. జగన్ హయంలో శాంతి భద్రతలు బాగున్నాయి‌.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. రోడ్డు మీదే ప్రజలను నరికేస్తున్నారని రోజా తెలిపారు.

కాసేపట్లో అమరావతికి సీఎం.. రాగానే కీలక సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్‌ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల దావోస్‌ పర్యటన సందర్భంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సుల్లో బిజీబిజీ గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన అధికారిక నివాసంలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. గేమ్‌ ఛేంజర్‌గా తెలంగాణ మారబోతుంది

రాష్ట్రానికి ఏడాది కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ గా మారిందన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, గతంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు… పనులు కూడా ప్రారంభించాయన్నారు. ఫోర్త్ సిటీ లోకి పెట్టుబడులు రాబోతున్నాయి.. గేమ్ ఛేంజర్ గా తెలంగాణ మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి… సంక్షేమమని, 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్… ఫాం హౌస్ కి పరిమితం అయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు 25 వేల కోట్లే అని, రెండేళ్లలోనే లక్ష 78 వేల కోట్లు తెచ్చింది మా ప్రభుత్వమని ఆయన ఉద్ఘాటించారు. కళ్లు ఉండి చూడలేని పార్టీ ప్రతిపక్షం అని ఆయన మండిపడ్డారు.

గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది?

ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనమని, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని, తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని, దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైందని ఆయన పేర్కొన్నారు.